Sunday 25 March 2018

గుంటూరు - శిక్షణ


ది.21.08.2017వ తేదీ నుండి 25.08.2017 వరకు నవోదయ నేతృత్వ సంస్థ వారు గుంటూరు బ్రాడీపేటలో గల సిందూరీ హోటలులో Guidance & Counseling అను అంశముపై  నిర్వహించిన హౌస్ మాస్టర్ల ఐదు రోజుల శిక్షణ సందర్భముగా
వ్రాసుకున్న  పద్యములు.

సీ.      గుంటూరు నగరాన కొలువైన న.వి.స.దౌ నేతృత్వ సంస్థలో నేర్పుమీర
మార్గదర్శన పేర మహితమై యొప్పారు భావనాజాలంబు బహుళ గతుల
రమణార్య వర్యు సంరక్షణమున రావాఖ్యుండు సత్కార్య ధుర్యు డనగ
నిర్వహించుచు నుండ నిత్య మిచ్చట జేరి విజ్ఞ వర్యులు కనన్ విస్తృతముగ
తే.గీ.                      సదన విద్యార్థి సంఘాల యెదలలోన
మెదలుచుండెడి భావాల నదను జూచి
తెలియ దగినట్టి మార్గాల నలఘు ఫణితి
బోధ చేసిరి కౌశల్య పూర్ణు లనగ.                                                            1.

తే.గీ.                      రావార్యుండు మొదటగా రమ్య గతిని
పరిచయాదులు జరిపించి వక్తలౌచు
వచ్చు వారల వివరాలు వరుస నొసగి
శిక్షణారంభ మొనరించె లక్షణముగ.                                                         2.

కం.                        శివనాగేశ్వరు డిచ్చట
నవిరళ గతి సాయ మొసగె నానందమునన్
స్తవనీయుడు నుతగుణు డయి
నవ తేజము గూర్చు శిక్షణంబున తానున్.                                                3.

సీస మాలిక.
శిక్షణకాలాన శ్రీమతి విమలార్య మార్గదర్శన పేర మానవునకు
జీవన నిపుణతల్ చేతంబులో గల్గు వివిధంబులైనట్టి వికృతులకును
లైంగిక విషయాన సంగతం బైనట్టి వ్యవహార విషయముల్ వివరముగను
తెలియ జెప్పెను తాను ధీశాలి యటమీద విజయబాబార్యుండువిపులముగను
ఒత్తిళ్ళు నవ్వాని కుపయుక్తమైనట్టి పరిహారమార్గాలు సురుచిరగతి
చెప్పి ప్రవృత్తులం దొప్పిదం బైన సకారార్ద్రయోచనల్ నత బలుక
కోటేశ్వరార్యుండు కూర్మితో బోధించె సత్ప్రభావాఢ్యులౌ జనులలోని
యేడు లక్షణముల నింపైన రీతిలో క్షిప్ర మా క్రమములో శ్రేష్ఠ యనగ
వరలక్ష్మి విదుషి తా నురుతరోత్సాహాన లక్ష్య నిర్మాణంబు లలిత గతిని
భావి జీవనములో చేవను సృష్టించు పద్దతుల్ వివరించి వరుసనంత
పిల్లల విషయాన నెల్ల లోకంబున ప్రత్యక్ష మగుచున్న బహువిధమగు
హింసను జూపించి యేరీతి నద్దాని నరికట్ట గలమంచు ననుపమముగ
చర్చలన్ జరిపించి సన్నుతుల్  తానందె నటులనే లక్ష్మ్యార్య హర్ష మొదవ
ఆరోగ్యకరమౌచు, నానంద మొసగుచు పుష్టి వర్ధకమౌచు తుష్టి గూర్చు
సమతులా హారంపు క్రమత నద్భుతరీతి విశదంబుగా దెల్పె విజ్ఞ యామె
సదనాధిపతులౌచు ఛాత్రవర్గముగాచు నధ్యాపకుల పాత్ర ననవరతము 
వైయక్తికముగాను పారస్పరముగాను వలసిన తద్రీతి నలఘు గతిని
వరుస "ప్రభాకర" వర్యుండు బోధించ "రావయ్యార్యు"డా లైంగికమగు
వేధింపులను ద్రుంచి బాలల రక్షించు మార్గంబు లటులనే మాన్యుడనగ
విద్యాలయాలలో వివిధంబుగా గల్గు కష్ట నష్టము లన్ని క్రమముగాను
చర్చలరూపాన సవ్యంబుగా దెల్పె దివసత్రయంబున దిట్ట యగుచు
"పవనకుమారుండు" భావనాత్మకమైన బుద్ధికై యుపయోగ్య పద్ధతులను
క్లిష్ట భావనలోని స్పష్టమౌ గతులను తడయక విస్తృతిన్ దాను తెలిపె
తే.గీ.                      "రమణ వర్యుండు" దక్షు డీ క్రమమునందు
పాఠశాలల విషయాన  బహుళములగు
మార్గదర్శక సూత్రాలు మహిత గుణుడు
తాను వివరించె యనుపమ జ్ఞాన మొదవ.                                                 4.

కం.    ఈరీతిగ బహు విషయము
లారంభము నుండి చేరి యంతము దనుకన్
తీరుగ బోధన చేసిన
వారికి నొసగంగవలయు ప్రణతులు శ్రద్ధన్.                                                                   5.

కం.    వరమగు నభ్యాసంబులు
సురుచిరగతి నిచట జరిగె సుజన వరేణ్యుల్
సరసులు జ.న.వీసంస్థల
గురుజనులతి విజ్ఞులగుచు కూడుట చేతన్.                                                                  6.

కం.    సిందూరీ భవనంబున
సుందరమగు వసతి గూర్చి సురుచిరగతి మా
కందర కరుసము బంచుట
వందనముల మాల "రమణ"వర్యున కిపుడున్.                                                             7.

కం.    ఇచ్చటి శిక్షణ భావిని
నిచ్చలు విద్యార్థి హితము నిష్ఠగ గను నీ
సచ్చరితులైన గురులకు
హెచ్చగు లాభంబు గూర్చు నెల్లవిధాలన్.                                                          8.

తే.గీ.   ఇట్టి శిక్షణ లనుదినం బెంతయేని
నుపకరించెడి వనుటలో నుండబోదు
సందియం బింత కాదేని సమితివారు
జరుపవలయును సరియైన సమయ మరసి.                                                                 9.

తే.గీ.   పర్వదినముల నివ్వాని నిర్వహించ
దెబ్బతినుచుండె హృదయంబు లుబ్బు లణగి
యట్లె దేశభాషల నివి యందెనేని
లాభ మదిగల్గు నత్యంత లక్షణముగ.                                                                          10.

వివిధ విషయాలు బోధించిన వారికి ప్రశంసలు.
కం.    "విమలార్య" విస్ఫుటంబగు
క్రమమున బోధించు రీతి ఘనతరము భళా!
విమలము విస్తృత మనదగు
నమలిన హృదయాన జేతు నాయమకు నతుల్.                                                  1.

ఆ.వె. ధన్యవాద శతము మాన్య "లక్ష్మీ వర్య"!
చక్కనైన రీతి నక్కజముగ
క్రమము దప్పకుండ సమతులాహారంపు
గతులు దెల్పినారు నతరముగ.                                                                              2.

కం.    "కోటేశ్వర రాయార్యుని"
మాటలు మహిమంబు గల్గి మనుజులలోనన్
పాటవము జీవనంబున
చాటుట కనువైన వగుట శతవందనముల్.                                                           3.




ఆ.వె.  "విజయబాబు"వర్య! విస్తృతంబగు రీతి
మనుజు లెల్ల యెడల మసలు గతులు
చూపి చెప్పినారు సుందరంబగునట్టు
లందు కొనుడు తమరు వందనములు.                                                                        4.

కం.    "వరలక్ష్మీ" విదుషీమణి
వరుసను బోధించినారు బహుమార్గములన్
సురుచిరమగు లక్ష్యంబుల
నరయుటకై వందనంబు లాయమ కిచటన్.                                                                   5.

చం.    "పవనకుమార"వర్య! బహుభవ్యవచో విభవంబు నందుటన్
స్తవమున కర్హులై తమరు తథ్య యశంబుల గాంచుచుందు రీ
యవని నటంచు బల్కదగు నద్భుతరీతిని హావభావముల్
వివిధవిధాల జూపితిరి విజ్ఞవరేణ్య! కృతజ్ఞతాంజలుల్.                                                    6.



No comments:

Post a Comment