Sunday 25 March 2018

“వైద్య రంగం – మారుతున్న సమీకరణాలు


“వైద్య రంగం – మారుతున్న సమీకరణాలు

శా.     సర్వశ్రేష్ఠభవంబు మానవునకున్ జన్మాంతరోత్కర్షచే
నుర్విం గల్గుటచేత నేర్పడినదౌ యుత్సాహ భాగ్యంబు నా
దుర్వారంబులు రుగ్మతాగణము లస్తోకంబులై గూల్చగా
బర్వన్ రక్షణ చేయు మాధవుడగున్ వైద్యుండు భావించగన్.              1.

శా.     సేవాభావము మానసంబున సదా  చెన్నొంద త్యాగాత్ముడై
యావంతైనను స్వార్థమూనక మహత్వాకాంక్షతో నందరన్
జీవం బేగతి నిల్పి గాచు  నుడై శ్రీమంతుడై వైద్యు డా
దేవుం డీతడుగా నొకప్పుడు భళా! దీప్తిన్ గనెన్ దా నిలన్.                  2.

శా.     వ్యాపారంబుగ వైద్యరంగము కటా! వర్ధిల్లె నేడంతటన్
శాపం బయ్యె చికిత్స గోరుటనగా, సర్వ ప్రయత్నంబునన్
దీపిల్లెన్ ధన కాంక్ష తద్గత మదిన్ తీవ్రంబుగా నిచ్చటన్
పాపం బెంచని రీతి, పూర్వపు గతుల్ పాడయ్యె వైద్యంబునన్. 3.

శా.     రోగం బొక్కటి దీర్ప వైద్యుల కెడన్ రోదించు దీనప్రజన్
రాగాత్మన్ దరిజేరి సాంత్వనముగా రమ్యోక్తులన్ నిల్పి సే
వాగంధంబును బంచు నట్టి ను లెవ్వా రీ యుగంబందునన్
త్యాగం బన్నది సన్నగిల్లెను గదా  తథ్యంబు వైద్యంబునన్.                4.

శా.     వైద్యం బన్నది ప్రాణిసంము నిలన్  బాధించరా దేవిధిన్
సద్యశ్శక్తిని గల్గజేయవలయున్ సమ్యగ్విధానంబునన్
విద్యావంతులు వైద్యసత్తములు సర్వేశస్వరూపంబుతో
హృద్యంబౌ విధి సేవచేయవలె సౌహిత్యంబుతో నంతటన్.                 5.

No comments:

Post a Comment