Sunday 25 March 2018

సర్కారు బళ్ళు-చదువుల గుళ్ళు.


సర్కారు బళ్ళు-చదువుల గుళ్ళు.
చం.
సదమలమైన జ్ఞానమును చక్కగ బంచెడి చోటు లిద్ధరన్
చదువులశాల లెల్లెడల సర్వవిధంబుల మానవాళికిన్
ముదమును గూర్చి యజ్ఞతను మొత్తముగా నశియింప జేయు
త్పదములు  దేవళంబులతి పావనముల్ సకలార్థదంబులున్.                   1.
సీ.
మన ప్రభుత్వముచేత ఘనతరంబుగ నేడు
నడిపించ బడుచున్న బడులలోన
సౌకర్యముల లేమి ప్రాకటంబుగ నుండ
గురుజనంబుల లోటు నిరత ముండు
నరకొర నిధులచే హాస్యంబుతో నిండి
పోయె నా మధ్యాహ్న భోజనంబు
జాతి నిర్మాణంపు సల్లక్ష్యయోగ్యమౌ
కాంక్ష యిందెచ్చటం గానరాదు
.వె.
ఎల్ల జనులలోన నేరీతి నైనను
పిల్లవాండ్ర కిచట ప్రేమమీర
విద్య నేర్పు నట్టి విస్తృతంబగు వాంఛ
సాగకుండె లేదు సందియంబు.                                                               2.
సీ.
సర్కారు బడులలో చదువునేర్పెడునట్టి
యొజ్జల యిబ్బందు లుర్వి గనుడు
ఎన్నికల్ జరుపంగ నెంతేని నిష్ఠతో
నూరూర తిరుగాడు వారు వీరు
జనుల నీదేశాన జంతుజాలము నైన
వరుసగా లెక్కించు వారు వీరు
ఏవేళ నాదేశ మేరీతి జేసిన
నారీతి తలయూచు వారు వీరు
తే.గీ.
విద్య బోధించు చుండెడి వేళ లందు
ప్రభుత సూచించు పనులకై వ్యగ్రు లగుచు
పరుగు పెట్టెడి గురువుల కురుతర మగు
చదువు నేర్పుట నేడు నసాధ్య మయ్యె.                                                   3.

కం.
పరిపాలించెడి నేతలు
నరయంగా భూమిపతులు నధికారులు
త్పరులై కనిపించరుగా
సరియని చదివించ నిందు సంతానంబున్.                                               4.

శా.
సారం బింతయు లేదనంగ దగునా సర్కారు విద్యాలయా
లేరీతింగన నున్నతోన్నతములై యెంతేని నొప్పారవే
ధీరాగ్రేసరు లెందరో యిచటనే దీప్తిన్ బ్రదర్శించినా
రౌరాయం చన లోక మెల్లగతులన్ హర్షాతిరేకంబునన్.                              5.
                                    


No comments:

Post a Comment