Tuesday 31 March 2020

సమస్యాపూరణం-15


బిడియ మొకింత లేకయును విస్తృతరీతిని దుర్మదాంధు లీ
యెడ జనమానసంబులకు నెల్లెడ  కష్టము గూర్చుచుండి రీ
జడులనెదుర్కొనం దలతు మేనియు నమ్ముడు నిక్కువమ్ముగా 
చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్.             1321.


వడిగొని రమ్మురా! సతము పాఠము లందువు క్రీడలాడినన్
కడుముదమందు, దేహము సుఖత్వముగాంచును, హాయి చేకురున్
బిడియ మదేల?యంచొకడు స్వీయమతంబును నిల్ప నిట్లనెన్
"
బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్"                              1322.

కడుముదమందు భూతలిని కామనలున్ ఫలియించు నంతటన్
వడిగొని చేరు సౌఖ్యములు వాస్తవమియ్యది విష్ణుభక్తులై
తడబడకుండ గొల్వగల ధన్యుల కన్నది స్పష్ట మెట్టు లే
పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్?                1323.

స్తవనీయుండను నన్ను గొల్వుడనుచున్ సంధించి యాహార్యమున్
కవినంచున్ జరియించువాని విధమున్ గన్గొన్నవారచ్చటన్
భవదీయప్రభ జూపు మీ సభననన్ వాడాత్మ నిట్లెంచె "నా
కవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్"              1324.

సంతసమందుచున్ భువిని సన్నుత సచ్ఛుభ హర్షదీప్తు లా
శాంతము నింపు నూత్నతమ హాయనమున్ గని స్వాగతించ స్వీ
యాంతము జూడబోయెడి మహద్ద్యుతి దాయినియైన యీ శర
త్కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్"              1325.

ఇలపయి నన్ని ప్రాంతముల నీసమయమ్మున జీవనమ్మునన్
వలసిన వస్తుసంతతు లవారితమూల్యములై దివంబునన్
నిలబడి యందకుండినవి నిక్కము మోక్షము గోరుచుండినన్
"
గలిమి నంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్"                      1326.

కలుములనందు కార్యమున గాంచక తృప్తి యొకింత నిత్యమున్
దలచినరీతి ధర్మమును దప్పి చరించెడి స్వీయసంతతిన్
బిలుచుచు జన్మదుల్ భయము పెట్టుచునుండిరి వారియందునన్
విలువలు మృగ్యమౌటఁ, గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్"             1327.

చేతము లుల్లసిల్లుగతి శ్రీప్రదుడై శుభమందజేయు నా
భూతగణాధినాయకుని బూజ్యుని గొల్చుచు దీనదేహులన్
బ్రీతిగ సాకుచున్ ధనము విజ్ఞత జూపుచు బంచు టొప్పగున్
నూతనవత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో?                       1328.

నాకులకాంత యొక్కెడను నాథ! వినుండని పల్కె నీగతిన్
మీకును బిల్లవాండ్రకు నమేయముదాకరమన్నిరీతులన్
జేకొన విశ్రమం బిటను జెప్ప దరంబె త్వదీయసేవచే
నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో"                       1329.

అది పాశ్చాత్యధరిత్రి యక్కడి కొకం డత్యాశ నర్థంబులన్
మది పొంగంగను గూర్చనేగి యచటన్ మాతృస్థిరాధర్మముల్
వదిలెన్ మూర్ఖుడు వానిపత్ని యడుగన్ వాడాడె నజ్ఞానియై
"
ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్"            1330.

వరగర్వంబున నొక్కరక్కసు డిటుల్ పాపాత్ముడై యంతటన్
సురలం దూరుచు సంచరించుచు ననెన్ "శూరుండ నన్నిచ్చటన్
సిరి తానై వరియించుచుండె కనరే ఛీ మీరు భీతాత్మకుల్,
పరకాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే"                                      1331.

వరగర్వంబున నొక్కరక్కసు డిటుల్ పాపాత్ముడై యంతటన్
సురలం దూరుచు సంచరించుచు ననెన్ "శూరుండ నన్నిచ్చటన్
సిరి తానై వరియించుచుండె కనరే ఛీ మీరు భీతాత్మకుల్,
పరకాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే"                                       1332.

నమ్ముడు మీరటంచు నొక నాయకు డిట్లనె సభ్యకోటితో
"
నిమ్మహి విప్లవమ్మె మన కెల్లసుఖంబులు గూర్చు భాగ్యముల్
గ్రమ్మగ సాగు డుద్యమ మఖంబున వేగిర ముత్సహించుచున్
సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్"                          1333.

మందున్ వానిని జేదిరాజును సభామధ్యంబునన్ ద్రుంచవే
వందారుప్రియ! చక్రపాణి! యనఘా! భాగ్యప్రదా! నిన్ను వా
డందున్ దూరగ మోక్షదాయకుడవై, యార్యాళిపై జేసినన్
నిందారోపణముల్, హితమ్ము లొసగున్ నీరేజపత్రేక్షణా!                         1334.

రాగలకాలమున్ దెలియ వ్రాసిన బ్రహ్మము తెల్పె నీగతిన్
సాగు మనోరథంబులిట సంపద లందవు వస్తుమూల్యముల్
వేగమె తాకునభ్రమును విస్తృతవాంఛలతాడనంబునన్
"
భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్"                 1335.

'సకార' ప్రయోగం లేకుండా
సంక్రాంతి పర్వదినాన్ని గురించి
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి. 
తే.గీ.
మకరరాశికి మార్తాండు డకలుషమతి
యరుగుదెంచెడి కాలమీ యవనిలోన
పర్వములయందు ముఖ్యమై బహుళగతుల
హర్షమును నింపు మదులందు ననవరతము.

అనిశం బిచ్చట నీపదద్వయికెడన్ హర్షంబులందించుమా
యనుచున్ శంకర!చేరియుంటిని కదా యాపోభిషేకమ్ముతో
నిను సేవించుచునున్నవాడ నయినన్ నీవేల స్పందించవో
కనుమా నీకనుమానమా కనుమ నన్గాంచంగ జాగేలనో                                      1336.

హరిపై యెపుడున్ కడుహర్షముతోన్
స్థిరతన్ మనమున్ మనజేసినచోన్
ధర యే యెడలన్ శుభధర్మమునం
దిరవై ఇరవై మురిపించు ప్రజన్!                                                                  1337.

వడివడి వచ్చుచు నుండగ
గడియారము మూలఁ బడెను, 'కరవాణి' దయన్
బుడిబుడి నడకలవానిని
నొడినిడి కన్నీరు తుడిచె నురుమక నచటన్.                                         1338.

'
కరవాణి'ని పేరుగా గ్రహించుట జరిగినది.

అధికమైన శ్రమయు నావశ్యకంబైన
చోట నలతి యనెడి చొప్పునేర్పు
సందియమ్ము లేదు సర్వత్ర జగతిలో
దవ్వు దగ్గ రౌను దాహ మున్న!                                                                 1339.

మండన మిద్దియే నిజము మాన్యతయందును దీనిలోనె మా
కండయు దండయౌచు బహుహర్షము గూర్చెడి రీతియిద్దియే
పండును భాగ్యమిందెయని పశ్చిమ సంస్కృతినంద నీప్రజల్
పండుగ నాడు విందులకు బారులు తీరెను మద్యపాత్రలే !*                     1340.

పిలిచి గురుడు పలికె వృత్త్యనుప్రాసతో
వత్స! చెప్పు మొక్క పాద మనుచు
నంత శిష్యు డాడె నానందమున దేవ!
"
భోగి రోగి యైన యోగి యగును"                                                   1341.

కలకాలపుహాయికి కారణమై
యిలవెల్గెడు పద్దియ మేయెడలన్
కలుషంబుల ద్రుంచుచు గన్పడగన్
తలనొప్పికి మాత్రలు దండుగలౌ !                                                    1342.

సదమలభావనాబలము స్వాంతమునందు ననంతదీప్తులన్
ముదమును గూర్చుచుండ బహుమూల్య సుఖప్రద మోక్షసిద్ధి కా
స్పదమగు మార్గముంగొని శుభంకరసన్నుత యోగదీక్షతో
నిదురను మున్గువారలకు నిశ్చల సంపదలబ్బు నెన్నగాన్.                                1343.

సంస్కారంబును లోక రక్షణకునై సర్వత్ర బోధించు నా
సంస్కారస్థితుడైన బ్రహ్మము భవిష్యద్జ్ఞానమున్ దేల్పె నే
సంస్కారంబులు లేని వాడె ప్రభుడై శాసించు నీ భూమినిన్
సంస్కారం బిసుమంతలేని నరుడే సత్పూరుషుండై మనున్.                     1344.

నిండుమనంబుతోడ కడు నిష్ఠను బూనుచు బ్రాణనాథ! వే
దండముఖాధిసేవితుని దన్మయతన్ శివరాత్రి యౌటచే
దండములంచు గొల్వదగదా? యుపవాసము చేసి కాన నా
పండుగనాఁడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా.                                              1345

నాయజ్ఞానము కాదు సత్య మనుచున్ నమ్మించ వాడిట్లనెన్
న్యాయం బియ్యది చూచినారము గదా నాడా సముద్రంబునం
దాయీశుం డది ద్రావి శాశ్వతునిగా నందెన్ యశం బందుచే
నాయుర్వృద్ధికి రోగి కీయఁగఁ దగున్ హాలాహలంబున్ వడిన్.                                  1346.

పలికెను తీవ్రవాదగణపాలకు డొక్క డదృశ్యరూపియై
యిలపయి శాంతి సౌఖ్యముల నెప్పుడు గాంచగ నెంతురేని నా
వలసిన వస్తుసంచయ మవశ్యము గూర్చుడు కాదటన్నచో
న్గలతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్"                                             1347.

వారలు గానకోవిదులు, వైభవయుక్తులు, విజ్ఞసత్తముల్
వారిని బోలువారలిట వాస్తవ మియ్యది లేరటన్న న
వ్వారు సభాస్థలంబునకు వచ్చిన వేళ వినమ్రభావముల్
జార, కళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్"                                         1348.

నందనతుల్యుడన్ నిజము నమ్ము మటంచును బల్కుచుండి యా
క్రందన జేయురీతి నరరాజిని బీడల ముంచుచుండి నా
కిందు సహాయకారివయి యెంతయు శక్తిని గూర్చుచుండుమా
వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్                               1349.

స్తవముల నందె హైమవతి తల్లిగ, నమ్మలగన్నయమ్మగా,
భవుని శరీరమందు సగభాగముపొందెను భాగ్యశాలియై
ధవుని శిరమ్మునందు నొకతన్వి వసించిననైన గాంచమే
సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే.                                              1350.

ప్రకటితశక్తి యుక్తు డయి బహ్వతిచిత్ర విచిత్ర కృత్యముల్
సకలుర కిందు జూపుచును సన్నుతు లందెడి మాంత్రికుండు తా
నొకపరి మంత్రదండమును హుమ్మని త్రిప్పినవేళ నా పిపీ  
లిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్                                                 1351.

ప్రకటిత కోపవేగమున బాలకు డొక్కడు కట్టివేసి ఘో
టకమును కిమ్మటన్న విని డంబమునన్  జెలరేగ రామునిన్
జకచక శిష్ట సైనికులు స్వామిని జేరి వచించిరా పిపీ
లిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్.                                      1352.

తెలుగు దనమునిండి వెలుగుచుండెడిపద్య
మందమైనగతికి నాటపట్టు
మహితమైనయట్టి మమకారపరిమళం
బాటవెలది గర్భమందు గలదు.                                                                                     1353.

ధనము విద్యయు శక్తియున్ ధరణిలోన
దుష్టమతులౌచు బడుగులన్ గష్టపెట్టు
కొరకు వాడుచు జ్యేష్ఠత్వ మరయు ఖ్యాతి
పరులతోడను వైరంబు పాడియగును.                                                                             1354

లోన గలయట్టి బహువిధ లోపములను
జూపి బోధించు మనుజుండె సుహృదు డగుట
నట్లు గాకుండ నిచ్చక మాడెడి స్తుతి
పరులతోడను వైరంబు పాడియగును.                                                                    1355

పాపపుణ్యంబు లెంచక ప్రత్యహమ్ము
పొట్టనింపుట విధియంచు భూమిపైన
భయము లేకుండ జరియించెడియవినీతి
పరుల తోడను వైరంబు పాడి యగును.                                                                           1356.

స్వపరభేదంబు లెంచక బహుళగతుల
 నాత్మ సౌఖ్యమ్ము గోరి యీ యవనివారి
ననిశమును జేరి పీడించు నట్టి స్వార్థ
పరుల తోడను వైరంబు పాడి యగును                                                                            1357.

మాన్య యొకర్తె పుత్రికకు మంగళ రూపుని నొక్కవాని సౌ
జన్యగుణాకరున్ వెతికి సన్నుత రీతిని బెండ్లి చేసి తా
నన్యులతో వచించి నది యల్లుడు సౌమ్యుడు సుందరాంగుడున్
ధన్యుఁడు పూజ్యుండున్ గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్.                                    1358.

ఎండయు వానయంచనక యెల్లెడ యాచకుడైభ్రమించుచున్
నిండిన వేదనన్ బ్రతుకు నిక్కముగా బహుభారమౌట నా
కండ యొకండు లేడనుచు నార్తిని గ్రుంగిన దీనుడిట్లనెన్
"
గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ"                                1359.

స్వాంతశ్శుద్ధిని ఘోరమైనతపమున్ సమ్యగ్విధానమ్మునన్
చింతల్ వీడి తదేకదీక్ష సలిపెన్ జిత్సౌఖ్యమందంగ నా
వింతన్ మింటను నిర్జరాళి గములై వీక్షించ నద్దేవతా
సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై"                                    1360..


దిగ్దంత్యార్య సమాజమున్ మదముతో దిట్టన్ బ్రయత్నించుచున్
వాగ్దాక్షిణ్యలవంబు లేక ఖలుడై వర్తిల్లుచున్ దౌష్ట్యముల్
దిగ్దైవంబుల సాక్షిగా సలుపుచున్ "దేవీ! నమో" యంచు నా
వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా                                              1361.

ఖగరాడ్వాహనశంకరాది దివిషత్కారుణ్యముం గాంచి నె
వ్వగలం దాటుట యుక్తమౌ ననుచు సద్భక్తిప్రభావంబు నా
నిగమోక్తంబగు రీతి దెల్పి హితుడై నిత్యప్రమోదంబు చూ
పగ వానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా.                                              1362.

మించు శక్తిని గొప్పవారయి మేదినిన్ వెలుగొందినన్
బంచుచుండిన ప్రేమభావము పావనత్వము నందినన్
సంచితంబగు పూర్వపాపము ఛాయయై విడకుండినన్
మంచివారల కెంచిచూడగ మంచిరోజులు రావులే                                                          1363.

కీడ్పడునేమి ధర్మమున క్రిందగునేవిధి న్యాయమచ్చటన్
చేడ్పడునేమి సత్యమును క్షేమము గూలి ప్రజాసమూహ మ
ట్లేడ్పున నుండునేమి సుఖియించక దీనికి కారణంబుపో
తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్"                                   1364.

ఇలపయి నున్న క్షేత్రముల నెల్లను జూడ మహత్వదీప్తితో
వెలుగుచునుండు కాశి యది విశ్వమునందు మహాశ్మశాన మా
స్థలముననుండు వారొకరు స్వాత్మజ జూడ వరానుసారులన్
బిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్.                                         1365.
వరానుయాయులన్

ఇలలో జన్మధరిత్రికన్న ఘనమా యింకొక్కటన్యంబు మీ
రలసత్వంబును జూపబోకుడు జనుల్ హర్షంబు చేకూరు ని
ర్మలచిత్తంబున నేడు నావచనముల్ మన్నించుచున్ వీడి శం
కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్.                              1366.

రండిట మీకు యోగ్యమును రమ్యతరంబగు త్రోవ జూపెదన్
దండిగ స్వాస్థ్య మందునని తానొకయోగి వచించ చేలలో
పండిన శాకముల్ గొనుచు వండిన వాని భుజించకుండగా
తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్                                                 1367.

కష్టము లెన్నియో గలుగు కాలము మారగ లోకమందు నా
డిష్టముగా వెలుంగు నిట నెల్లెడ కల్మష మార్యకోటికిన్
జేష్ట లుడుంగు భావినని చెప్పెను బ్రహ్మము సూక్తులీగతిన్
దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద రెల్ల మానవుల్                                            1368

అంగీకారము జూపి రండు సతతం బత్యంతహర్షంబు మీ
కుం గల్గించగ రోగనామకమహత్క్రూరారులన్ గూల్చు స
ద్భంగిన్ జూపెద నంచు యోగివరు డవ్వాడన్ సుయోగాఖ్యమౌ
బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్"                               1369.

కన్నియ, సద్గుణప్రకర, కల్మషశూన్య, శుభాశయాది సం
పన్న, 'యుమా'ఖ్య స్వీయపరివారమువారలు నిర్ణయించ దా
నన్నులమిన్నయై వరగుణాఢ్యత యందము లేనివాడనౌ
య న్నను బెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చఁగా భువిన్.                                     1370.

నావలె జ్ఞానసంపదకు నట్టగువా డొకడుండునా భువిన్
ధీవిభవంబునం దెరుగ దెల్పెద నేను శకారవంశ్యుడన్
చేవలు గల్గువాడనని చెప్పె నొకండు సభాంతరమ్మునన్
రావణునిన్ దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు సంపె నల్కమై"                                1372.
నట్టు=స్థానము

పండితు లిట్లు పల్కెదరు వాస్తవ మియ్యది జీవనంబు నే
డుండిన నేమి యేనిమిష ముర్విని గూలునొ చెప్ప శక్యమే?
దండుగ కాదె దీనికయి తన్మయతన్ జరియించు టెల్ల దా
నుండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో"                                     1373.

బ్రహ్మాండంబగు బెండ్లికై యడుగ నవ్వాడందు సత్కాలమా
బ్రహ్మజ్ఞానులు తెల్పి రాపడతియున్ వాంఛించ వేరొక్కనిన్
బ్రహ్మాఖ్యున్ సఖియోర్తు జేరి పలికెన్ భంజించ నుద్వాహ మో
బ్రాహ్మీ! లగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చున్ గదా.                              1374.

న్యాయము ధర్మముల్ విడిచి నమ్మినవారిని జన్మదాతలన్
బాయుచు స్వీయసంస్కృతిని బాతర బెట్టుచు జంటలౌట దా
నీయెడ మెచ్చలేని యొక డీవిధి నాడెను క్రోధమూర్తియై
"
రోయక నేఁడు ప్రేమికుల రోజని పిండముఁ బెట్టఁగాఁ దగున్"                                  1375.

వినుడిది విశ్వమందు గన విస్తృత మౌచు "గరోన"నేడు దా
ననుపమరీతి మానవుల నంతము జేయుచునుండె భూతమై
మనుటయె కష్టమయ్యె ననుమానములేదు దురాత్మ చూడు డీ
కనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో.                                           1376.
విశ్వమం దవుర!

తామొక కూడలిన్ గలిసి తన్మయు లౌచును సాంఘికంబులన్
సేమములన్ బరస్పరము చెప్పుకొనంగను బూని యచ్చటన్
ధీమతియైన నెచ్చెలికి దెల్పిరి స్నేహితురాలి సంగతుల్
భామయు భామయున్ గలువ బాలుఁడు పుట్టెను సత్యభామకున్                                     1377.

అన్నా వింటివె నీవిది?
మన్నించక గురులమాట మసలుచునుండన్
నిన్ననె జనకుని చెంతను
తన్నులుదిన కన్నె, బుద్ది తన్నుకు వచ్చెన్.                                                                1378.

అణుమాత్రంబును వీడకుండ బహుళాహంకార భావమ్ములన్
క్షణికానందమె శాశ్వతమ్మనుచు లోకంబందు బాంధవ్యముల్
తృణతుల్యమ్ముగనెంచి కుందు జనులన్ దెల్పంగ సౌజన్య పూ
రణసంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్.                               1379.

వాగమృతమ్ము బంచుచును వాస్తవ మెల్లజగంబునందునన్
రాగమయాత్ముడై తెలిపె రమ్యతరమ్ముగ పద్యమందు స
ద్యోగము నన్ జరించుచు  మహోన్నత భావము తోడ గావునన్
యోగులలోన వేమనయ, యోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్.                        1380.

వసుధన్ "దిండికి హద్దులేని యెడలన్ భవ్యంబులౌ గారెలే
మెసవన్ జేదగు" నన్నరీతి నతిగా మెక్కన్ సుఖశ్వాసకున్
వెస నిబ్బందిగమార నందుచు గసన్ భీతిల్లి యొక్కండనెన్ 
"రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్"                        1381.

పరమసౌఖ్యద మౌచు దీప్తికి పాదు శ్రావణమౌటచే 
వరగుణాఢ్యలు భర్త్రధీనలు వైభవప్రదయైన యా
హరిసతిన్ వరలక్ష్మి నంబను హర్షరూపిణినిన్ శుభం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో.                                                      1382.

చేరిరి యందరచ్చటకు శీఘ్రముగా నొక మాంత్రికోత్తముం
డౌర! యనంగ జేయు మహదద్భుతముల్ గన, వానిచేతిలో
గోరినరీతి మారగల కొబ్బరి కాయ, విచిత్రమౌగతిన్
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై.                                     1383.

భవమొసగెన్ మహేశ్వరుడు భాగ్యచయంబును గాంచుచుండు మీ
యవనిని దీనులందు బరిహాసము లాడకు పంచు మర్థముల్
స్తవముల నందుమా యనెను ధన్యత గల్గును దానిచే, ధృతా
శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా"                                             1384.

సుమధుర వర్ణశోభితము సుందరవస్త్రము నొక్కదాని దా
నమలినమైన ప్రేమమున నందగ జేసెను ప్రాణనాథు డా
యమ ధరియించె జూడనగు నందలి చిత్రములైన చిత్రముల్
రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్"                                  1385.

అలఘుప్రేమను జూపుచుండి సతతం బత్యంత సన్మిత్రుడై
ఛలహీనుండగు వాద్యకారు నొకనిన్ సమ్యగ్విధానమ్మునన్
కలియం జేరి యొకండు బల్కె వినుమో కల్యాణభావాన్వితా!
లలితంబై వినసొంపుగన్ నవరసాలం జిల్కు నీపేటియే                                                         1386.

పలికిన దొక్కకాంత తనభర్త మహాకవిశేఖరుండుగా
వెలుగుచు నాపెకున్ గవిత విజ్ఞత మీరగ నేర్పుచుండి "నీ
పలుకులు దోషయుక్తములు ప్రాసలు దప్పెను చూడుమా" యనన్
"
జెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్"                                  1387.

సరఘకు కన్ను గప్పి సరసంబగు తేనెలపట్టు బట్టుచున్
బరుగున వచ్చి యింటికి కవాటము మూయుచు మంచమెక్కి తా
నురుగతి బిండి చేకొనుచు నుండెడి వానికి దానిమాధురుల్
పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటక పూర్ణమైనచో                                         1388.

పానుపుకు+అంటక

పలికెన్ దానొక చట్టు స్వీయగురునిన్ భక్తిన్ సమీపించి యీ
యిలలో మీకెన యెవ్వరిచ్చట గురూ? యివ్వానితో నేనిటన్
జెలిమిం జేయుచునుంటి యజ్ఞుడనయా శ్రీమంత! వీడెంతయున్
దులువా? వందనమయ్య నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా.                                 1389.

కలికాలంబిది ధర్మపాలనమిటన్ గాంక్షించగా నౌనె తా
నలఘుఖ్యాతిని బొంది సజ్జనునిగా నందెన్ ప్రభుత్వంబు వా
డిలనొక్కండధికారపీఠమహిమాహిన్ జిక్కి దర్పంబుతో
"
విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్"                                         1390.
జవముం బూనుచు పృచ్ఛకాళి యెదుటన్ శక్తిన్ బ్రదర్శించుచున్
కవనక్రీడను జేయువాని సుమహత్కౌశల్యమున్ మెచ్చి యా
యవధానిన్ గని యొక్క డిట్టులనియెన్ హర్షాతి రేకమ్మునన్
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?                                1391.

చెండాడున్ గద శత్రుకోటి నెదురన్ జీల్చున్ గదా దేహముల్
ఖండించున్ గద దుర్మదాంధులను శోకంబంద దుష్టాత్ములన్
దండించున్ గద మొక్కవోని దగుచున్ తథ్యంబుగన్ మిత్రమా
గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే?                             1392.

అవ్విధి మాంత్రికోత్తము డహర్నిశ లేకము చేసి చూపెదన్
దవ్వున నేల రండనుచు దగ్గర కందరి జీరి తెల్పుచున్ 
జివ్వున గాలిలోన దన చేతిని ద్రిప్ప నదేమి చిత్రమో
దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండె చీకటుల్                                      1393.

మందుల్ నేటిసమాజమందు మతముల్ మార్చంగ యత్నించునీ
చందంబుంగన స్పష్టమౌను హితుడా సందేహమేలేదిటన్
హిందూత్వమ్ము వహించుటౌను కుకృతం, బీనేలపై భక్తితో
వందే భారత మాతర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్                            1394.


సందేహించక దేశభక్తులపుడా స్వాతంత్ర్య సంగ్రామమం
దిందీనేల బ్రభుత్వదౌష్ట్యగతులన్ హింసన్ విమర్శించు నా
చందంబున్ గని యాంగ్లపాలకు లిటన్ జాటించి రీరీతిగన్
"
వందే భారత మాతర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్"                         1395.

కష్టసమయానను "కరోన" కారణమున
వద్దు వద్దన్న వినకుండ బహుళగతుల
సంచరించుచునిందందు జనుడొకండు
నిష్ట సఖులను గూడంగ నిడుములొందె                                            1396.

పద్మ యుమను జూచి పరిహాసమున బల్కె
కనుము నీదు సుతుడు గజముఖుండు
భుజగకులము కంఠ భూషణంబులు చూడ
వల్లకాడు నేలు వల్లభుండు                                                          1397.


పుడమిన్ సజ్జనకోటి చెంత నిలువన్ భూవాసి కేమౌను? తా
నిడుముల్ గూర్చునదేది? తెల్పు మనగా నెంతేని సంతోష మా
యెడగల్గంగను ఛాత్రు డాగురునితో నిట్లాడె నమ్రాంగుడై
కడు లాభంబగుఁ గాదె, నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్.                      1398.

ఉర్వీతలమున బర్విన
దుర్వార మహోగ్ర రూప దుష్ట 'కరోన'న్
సర్వవిధంబుల ద్రుంచక
'శార్వరి'ని బిలువ వలదట సజ్జన తతికిన్.                                  1399.

అవనిన్ నేడు సమస్తదిక్కుల గనన్ హర్షంబులం గూల్చి దా
నవభావంబున మానవాళి గతుల న్దర్జించుచున్ ద్రుంచె తా
మెవరైనన్ గృహసీమదాటని విధం బెంచంగ నన్పించు నీ
నవవాసంత శుభాగమంబిదె కరోనానామ నూత్నాబ్దమౌ.                        1400.