Saturday 21 March 2020

జనని


జనని
చం.
జననికి వందనమ్ములని సన్నుతి సేయుచు జెప్పినంతనే
కననగునేమి పృథ్విపయి గామ్యములైన శుభప్రవాహముల్
నతరసౌఖ్యసంపదలు కర్మలలో విజయంబు లెన్నడున్
గొనకొని యామెకోసమయి కూర్మిని సేవలు చేయకుండగన్.                                       1.
శా.
మాతౄణమ్ము నిరంతరార్ద్రహృదితో మన్నించుచున్   సేవలన్
ఖ్యాతిం గాంచెడిరీతి యీభవమునన్ గాటంపు సద్భక్తితో
బ్రీతిం జెందుచు జేసినన్ దరుగునా? శ్రీమంతమౌ జన్మమా
చేతశ్శుద్ధమమత్వపూర్ణదయచే సిద్ధించె నీధారుణిన్.                                       2.
ఉ.
ఆయమసేవకై యనిశ మన్నిటిలో శుభధర్మదీక్షయున్,
శ్రేయదమైన వర్తనము, చిత్సుఖమున్ గలిగించు భావముల్,
న్యాయము దప్పకుండుటయు, నైష్ఠికతన్ సతమందియుండుటల్
స్వీయగుణంబులై నిలువ జేయుట లొప్పును మానవాళికిన్.                              3.
మ.
జననీసేవను విస్మరించు నరు డేజన్మంబునందైన దా
ననుమానం బొకయింతలే దిటనటన్ హర్షంబులం జూడ  డెం
చిన ధన్యత్వము బొందలే డిలపయిన్ క్షేమంబులం గాంచుచున్
మనలే డన్నది తథ్య మెల్లగతులన్ మాన్యుండుగా వెల్గుచున్.                             4.
కం.
జననిని సేవించుటయే
తనభాగ్యమటంచు నెంచు ధన్యుండిలలో
ధనకనకవస్తుసంతతు
లనుపమయశమంది గాంచు నార్యత్వమ్మున్.                                               5.

No comments:

Post a Comment