Tuesday 31 March 2020

సమస్యాపూరణం-13



అతుల సుందరాంగు డత్యంతసరసుడై
ముదము గూర్చు వాని నదను జూచి
ప్రణయ పరవశానఁ బ్రాణేశుఁ జంద్ర శే
ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె.                                                             ౧౧౫౧.

వావి వరుసలు లేవయ్యె పావనమగు
భావ మొకయింత  లేదయ్యె స్వార్థ మునను
ధర్మమును వీడి చరియించు తగునటంచు
కనగ నరుడు చతుష్పాద గామి యయ్యె.                                                     ౧౧౫౨.

సూర్య గణము లైదు చూపించు మెటులుండు
నాట వెలదిపాద మందటన్న
గురున కనియె శిష్యు డరయ నీరీతిగ
ఏడు మారె డియ గోడు వినక                                                               ౧౧౫౩.

నేరకపోయి చిక్కితిని, నిత్యము దుఃఖమె గూర్చుచుండె నె
వ్వారికి చెప్పుకోగలుగువాడను నాస్థితి యంచు సన్నుతా
కారు డొకండు దుష్టయగు కాంతను గూర్చి తలంచె నిట్లు "నాం
చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతంబుగా".                                            ౧౧౫౪.

నీరములోన దింత్రిణిని నిత్యము మిశ్రణ మీవు చేసి యీ
తీరున వేడిచేసి సుఖదీప్తి కలుంగును త్రాగు మంచు నో
చారుమతీ! వచించుటలు చాలిక నంచు మగండు దెల్పె నీ
చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతంబుగా.                               ౧౧౫౫.


నిండు దీక్షను బూని నిత్యము నేటిమానవు డిచ్చటన్
దండిగాగొని జ్ఞానసంపద తాను చిత్రము లెన్నియో
మండితంబుగ జూపుచున్ బహు మాన్యతల్ గనుచుండగా
దొండతీగకు బెండ గాయుట దుర్లభంబెటులౌనురా                                                    ౧౧౫౬.

శ్రీలందున్, సమకూరు సౌఖ్యచయముల్, శ్రేయంబులుం గల్గు, నే
వేళన్ క్షేమములందు మానవులకున్ విజ్ఞానసంపత్తియున్, 
మేలైనట్టి యశంబు గూడు నిట సామీప్యంబునం జేరు కో
పాలన్ దూరమునందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్.                                     ౧౧౫౭.

ఆలున్, బిడ్డలు, మిత్రు లాత్మహితులై యానంద సంధాతలై
మేలున్ జేయగ జూచువా రనుచు సామీప్యంబునం జేర నే
వేళన్ బ్రేమను బంచ సౌఖ్యములు రావే? వారిపై కోప తా 
పాలన్ దూరమునందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్                                      ౧౧౫౮.

అనుపమ హర్షసంతతుల కాస్పదముల్ సుఖదీప్తిదంబులై
నతర బుద్ధివైభవవికాసము గూర్చుచు జీవనంబునన్
జనులకు సత్పథానుగమశక్తి నొసంగెడి వౌను  సాహితీ
కనకవనంబులో విరియు కాంతుల దీపము లెల్లపద్యముల్.                               ౧౧౫౯.

పదిలమటంచు దెల్పె గద బ్రహ్మము నాడు కలిప్రభావమున్
సదమల చిత్తముల్ విమల సన్నుత వర్తన లీధరాస్థలిన్
ముదమును గూర్చబో వటులె మోటగు ధర్మము లెందు జూచినన్
చదువనివాఁడు పండితుఁడు శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ                        ౧౧౬౦.

భాసుర భావ బంధుర శుభప్రద శబ్ద విరాజితంబు మీ
వాసర భారతీ ప్రణుతి పాఠకసంతత హర్షదాయి యై 
భాసిలుచుండి సన్నుతు లపారముగాగొను మీ వచస్సుకున్
జేసెదవందనంబు లివి  చేకొనుడో కవిచంద్ర! నేడిటన్.

భాసుర భావ బంధుర శుభప్రద శబ్ద విరాజితంబు మీ
వాసర భారతీ ప్రణుతి పాఠకసంతత హర్షదాయి యై 
భాసిలుచుండి సన్నుతు లపారముగాగొను మీ వచస్సుకున్
జేసెదవందనంబు లివి  చేకొనుడో కవిచంద్ర! నేడిటన్.

పుత్రుని విద్యలందు పరిపూర్ణుని జేయ విదేశమందునన్
శ్రోత్రియు డొక్కరుండు బహు సుందరమంచు పఠింపజేయ ని
ద్ధాత్రిని విస్మరించిన యతండు వచించె వివేక శూన్యుడై
చైత్రమునందు వచ్చు రథసప్తమి గొల్వవలెన్ గణేశునిన్.                                  ౧౧౬౧.

సదమలమైన భావ మొకసారియు వీడక సత్యనిష్ఠతో
నదనున కృత్యముల్ సలుప నందును సత్ఫల మన్నిరీతులన్
ముదములు గూడు నిక్కమిది మోదము గూల్చి యఘంబు నింపినన్
బెదరుచు కార్యముల్ విడుటె విజ్ఞత, కల్గు జయంబు లెల్లెడన్.                                       1162.

శుద్ధములైన భావములు, సూక్తులు నిండిన వాక్యసంపదల్,
పద్ధతి గల్గు వర్తనము భాగ్యవిధాతలు జీవనంబునం 
దిద్ధరణిన్ యశఃప్రదము లింగిత మందలి పాపరాశిపై
యుద్ధము శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్.                                     1163.

గిరులున్ నిమ్నగ లీమహీస్థలముపై క్షేమస్వరూపంబులై
వరలం గల్గిన యట్లు శాశ్వతముగా బ్రహ్మాండమం దంతటన్
స్థిరమై వెల్గును రామనాయకము సత్ శ్రీదాయి యన్నింటిలో
వరమౌ, భారత! గాథ వ్రాసెనుగదా వాల్మీకి ధన్యాత్ముడై                                            1164.

మహదనుకంపతో నిలిచి మాధవు డచ్చట మోహినీద్యుతిన్
విహితసురాళిరక్షణపవిత్రశుభాశయు డౌచు చేతిలో
నిహితము జేయ నాసుధను నిస్తుల హర్షముతోడ తత్ పరి
గ్రహణమువేళ నత్యధికకాంతి వెలింగిరి సూర్యచంద్రముల్                                1165.

కోరికమీర నేర్చితి వకుంఠితదీక్షను జూపి ఛందముల్
రార, యుదాహృతిన్ దెలుపరా, యిపు డుత్పలమాలకంచు నా
పోరని జీర యొజ్జ యటుపోయి యతండు వచించె నీగతిన్
"జారుని సత్కృపన్ సుకవిజాలము వర్ధిల వాంఛ చేసెదన్".                               1166.

(దత్తపది పికము, బకము, శుకము, వృకము ఉగాది గురించి)

"పికములు" చూతభక్షణ పవిత్ర కలస్వనముల్ రచించ శా
"బకముల"తోడ హర్షము లపారముగా జనియింప జేయగా
"శుకము" "లుగాది" వచ్చె నవశోభలు నింపుచు లోకమందు నా
"వృకములు", ప్రాణిసంములు వేడుకతోడ సుఖించ నెంచగన్.                                     1167.

మావా డొకండనియె మానవ లోకమందున్
పోవాయె మోసములు పూజ్యుల లోన నైనన్ 
రావాయె సౌఖ్యములు రమ్యత నిండ గానన్ 
కావాలి క్రూరులు జగమ్మున శాంతి నిల్పన్.                                                 1168.

బళ్ళారిసీమస్థను భామ నోర్తున్
కళ్ళంబువద్దన్ గని కైపు చేతన్ 
త్రుళ్ళంగ చిత్తం బట దూరి దానిన్ 
పెళ్లాడ మూణ్ణాళ్ళకు పిల్లి నైతిన్.                                                                         1169.

ఇల్లాలితో హాస్యము లెప్పట ట్లా 
యెల్లయ్య యాడం జని ఇంటి బైటన్
మెల్లంగ దాగంగ సమీపమందున్
కల్లాపితోనే జలకమ్ము లయ్యెన్!                                                                           1170.

అధిక విజ్ఞాన సంపత్తి యందు జనుడు
మించి యద్భుతములు సృజియించుచుండె
నేడు వాడిట గాంక్షించ నిజముగాను
కన్య మిథునము జేర మకరము గాదె.                                                          1171.

సదమలమతులౌచున్ సర్వకాలంబులందున్
త్రిదశుల సములౌటన్ దీప్తులన్ జిమ్ము బాలల్
మెదలగ గృహమందున్ మించు హర్షంబు లందున్
మొదలుతుదలు లేకన్ ముచ్చటల్ ముద్దు లొల్కున్.                                                1172.

వరగుణుడగు మిత్రున్ పావనాత్మున్ పవిత్రున్
ధరనొకడుఖలుండై దానవత్వంబు నిండన్
చెరచెడిమతి తోడన్ చెప్పె నీరీతి నోరీ!
పరుల హితము గోరన్ పాపమై కాటువేయున్.                                                         1173.

నవీనయత్నంబున న్యాయమార్గం
బవశ్యమై యొప్పుట లందునిందున్
రివాజుగా జేయ బరిష్కృతంబౌ
వివాదమే శాంతికి వేయు బాటన్.                                                                         1174.

వాదేల సత్యమిది ప్రస్తుతకాలమందున్
వేదోక్తమయ్యె పతిపీడన మెల్లచోటన్
వేదాద్రి మెట్లపయి వేడుచు దీనుడౌచున్
పాదమ్ము లొత్తినను భర్తను భార్య తన్నెన్.                                                   1175

జ్ఞానప్రదా! సకల సంపద లిచ్చి మమ్మున్
దీనాత్ములన్ బహుళ తేజము గూర్చి కావన్ 
మీనాదిరూపధర! మేదినియందు నుంటన్
నీనామమే పలుక నేర్వగ విద్య లబ్బున్.                                                                 1176.

ఔరా! మహామూర్ఖత నాత్మకుక్షిన్
పేరాశతోనింపెడి పెద్దవారల్
తారీవిధిన్ బల్కరె ధాత్రిలోనన్
వైరాగ్యమే దక్కును స్వార్థబుద్ధిన్!                                                               1177.

శ్రీకంఠుడున్ నిర్జర సేవితుండున్
లోకైకనాథుండు త్రిలోచనుండున్
చీకాకులంద్రుంచెడి శ్రీప్రదుండా
యాకాశకేశుండగు సాంబమూర్తే!                                                                          1178.

అరయగ నీకాలంబున
ధరపయి ఛాత్రులను మీరు దండించుపనుల్
సరియా? యని ప్రశ్నింతురు
గురువుల, శిక్షింపకున్న కూలును జాతుల్.                                                   1179.

తండ్రి యొక్కరుండు తనయున కిట్లనె
పాలెగానివద్ద పంట గలదు
వాని పశువు నీవు పట్టినా వేమిరా?
పట్టి! విడువకున్న పుట్టి మునుగు.                                                               1180.

సరియగు పని యంచున్ సంపదల్ దీనులందున్
నిరుపమగతి బంచన్ నిష్ఠ తా జూపడేనిన్
ధరపయి గన భావిన్ తథ్యమెందేగి యున్నన్
సిరిగల నరుడైనా చేయు భిక్షాటనమ్మే!                                                                   1181.

అమానుషత్వంబున నన్ని చోట్లన్
ప్రమోదముల్ ద్రుంచెడి వాని కందున్
రమాపురంబందున రమ్యభూమిన్
సమస్యలే లేక విచార మయ్యెన్.                                                                           1182.

నాకున్న కల్యాణమునాటి హారా
లీకాలమం దిచ్చటి యీతిబాధల్
చీకాకులన్ దాటగ జేయు గానన్
తాకట్టు పెట్టాలని దార చెప్పెన్!                                                                             1183.

పోతులూరి బ్రహ్మ మాతండు వచియించె
భావికాలమందు పాపి యగును
ధర్మవర్తనుండు, తథ్యంబుగా జూడ
పనికిరాని మనిషి పండితుండు !                                                                           1184.

దృగ్జాలమ్మును సంస్కరించి మదులన్  దీపిల్ల జేయంగ, తి
ర్యగ్జన్మంబుల కీయుగంబున నిటన్ న్యాయంబు చేకూర్చగా
వాగ్జాడ్యమ్మువరించె భూస్థలిని, దివ్యత్వమ్ము నాశించుచున్
త్వగ్జాతాములన్ దలంపరు నరుల్ తథ్యంబు యోచించినన్.                          1185.

ఇలపయి దీప్తినంది సుఖియించుట కర్థ మవశ్య మెంచగా
నలయక ధర్మమార్గమున నార్జన చేయుట యొప్పు, దీనినిన్
దలపక నీతిమాలుట సదా పరిహార్యము, కష్టదాయి యా
కలిమి తొలంగినప్పుడె సుఖమ్ము లభించును మానవాళికిన్.                       1186.

కవి లోకమ్మున ధార్మికప్రభవమున్ గాంక్షించు, సర్వంబునన్
నవచైతన్యశుభప్రభావరుచులన్,  నైర్మల్యతావైభవం
బవనిం గాంచగ నెంచు, మానవులయం దానందముల్ గూడ శో
కవినాశంబును గోరి వ్రాయునట సత్కావ్యమ్ము సంప్రీతుడై.                       1187.

శర్మా! వినుమని పలికెను
ధర్మజ్ఞుడు సద్గురుండు "తనధర్మమునన్
నిర్మల సుఖ మిల నన్యుల
ధర్మాచరణము జనులకు దైన్యము పెంచున్".                                           1188.


అణుమాత్రాహము దాల్చకుండ, మనమున్ హర్షాతిరేకంబుతో
గణుతింపందగు రీతినింపుచు, జగత్కల్యాణమున్ గోరుచున్,
గుణహైన్యంబున కంటకుండ మనుచున్  క్రోధాది షడ్వర్గవా
రణమే శాంతికి మూలమౌ ననుచు ధర్మజ్ఞుండు బుద్ధుం డనెన్                     1189.

బుద్ధిని స్వార్థభావముల పోడిమితో సతతంబు నింపుటల్,
శ్రద్ధనుజూపి సంఘమున రాక్షసకృత్యము లాచరించుటల్,
పద్ధతిలేక ప్రేలుటలు, వంచన లిద్ధర దుష్టకోటికిన్
వృద్ధిని గాంచుమార్గములు, విజ్ఞులకున్ పరి తాపహేతువుల్.."            1190.

ముదమున సర్వమానవసమూహము స్వీయకుటుంబమంచు నే
యదనుననైన నెంచుచు సమాదరభావము తోడ నంతటన్
పదిలముగా జరింత్రు తనవారలు వీరలు, వారలన్యులన్
హృదయములేని మానవులె యీమహనీయ మహీప్రకాశముల్.                                   1191.

భూపతి కోసలేశ్వరుడు పుత్రులు లేని భవంబు శూన్యమై
ప్రాపును గాంచకుండునను బాధను చెంది మునీంద్రబోధితుం
డాపరి యాగమున్ సలుప నాతని భాగ్యము పండె సత్య మా
దీపము లేని యింట నవదీప్తులు నిండె మనోహరమ్ముగన్.                                 1192.

కోరికమీర నేర్చితి వకుంఠితదీక్షను జూపి ఛందముల్
రార, యుదాహృతిన్ దెలుపరా, యిపు డుత్పలమాలకంచు నా
పోరని జీర యొజ్జ యటుపోయి యతండు వచించె నీగతిన్
"జారుని సత్కృపన్ సుకవిజాలము వర్ధిల వాంఛ చేసెదన్".                               1193.

ముదమున ధనసంచయమును
పదిమందికి బంచగోరి బహుయత్నములన్
వెదకిన దీనుని కొరకై
సదయుఁడు, గంటం బడఁడు విశాఖనగరిలోన్.                                          1194.


నిరతానందము నందగోరి ధనమున్ నిష్ఠాగరిష్ఠాత్ముడై
పరమాత్మప్రియులందు బంచుటకునై బల్రీతులన్ యత్నముల్
నెరపన్ దీనజనాల కోస మచటన్ నిత్యంబు సద్బుద్ధితో 
కరుణాత్ముండు విశాఖ పట్టణములోఁ, గన్పట్ట డొక్కం డయో.                             1195.

ఆత డజ్ఞాని మూర్ఖుడై యచట జేరి
ప్రముఖ దీపావళీశుభపర్వమందు
వ్యర్థమౌ తైల మీకాంతి వలదనె, కట!
దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె.                                                            1196.

'శివము' వాని మిత్రు డవతలి గదిలోన
చేరి నిద్రనుండ జీరదలచి
పలికె నిట్టు లొకడు పలుకులు తడబడ
'
శవమ' లేచి రమ్ము సంతసమున.                                                                     1197.

బుడు గొక్కడు చదువుటకై
బడి జేరగ దిశలపేర్లు పంతులు నేర్పెన్
తడబడి వాడనె చూడుడు
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్.                                                                   1198.

సందర్భోచితరీతిని
నందంబుగ పద్యసుధల నందరి కిచటన్
వందితమతియై పంచుచు
తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్.                                                                1199.

కవి లోకమ్మున ధార్మికప్రభవమున్ గాంక్షించు, సర్వంబునన్
నవచైతన్యశుభప్రభావరుచులన్, నైర్మల్యతావైభవం
బవనిం గాంచగ నెంచు, మానవులయం దానందముల్ గూడ శో
కవినాశంబును గోరి వ్రాయునట సత్కావ్యమ్ము సంప్రీతుడై.                                 1200.

పారిపోవు నాదు ఘోరాఘసంఘంబు
కావ్యసృష్టిచేత ఘనత కలుగ
గలదటంచు నొకడు తలచి వ్యధలను
కలము విడిచి మేటి కవిగ వెలిగె.                                                                        1201.

దుష్టులు వారు వంచకులు తోరపుబాధల ముంచుచున్ సదా
నష్టము తోటివారల కనంతముగా ఘటియించు యత్నమం
దిష్టము గల్గువారు పొరుగింట వసించెడి వారికీయెడన్
కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్.                                            1202.

ముల్లై భారతమాత చిత్తమునకున్ మోదంబు పోకారున
ట్లుల్లాసంబును గూల్చుచున్న గతికిన్ యోచించి యీనాడు వీ
రెల్లన్ చట్టముచేసినారలవురా యీధైర్యకృత్యంబుచే 
కల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్.                                     1203.
కల్లోలము = సంతోషం
మల్లయ్య పత్ని కిట్లనె
వల్లీ! రాజ్యాంగగతిని వారలు మార్చన్
పెల్లుబికిన దుత్సాహము
కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్.                                                            1204.
కల్లోలము = సంతోషం
నాడా మాంత్రికశేఖరుండు సభలో నానాప్రకారంబులై
యేడం జూపని వింతలన్ దెలిపె తా నింపార నవ్వానిలో
వాడా చేతను గల్గు దండమును త్రిప్పన్ శీఘ్ర మచ్చోట నా
మూఁడేఁడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రుం గనెన్ బ్రీతిమై.                                   1205

వాడొక మాంత్రికు డచ్చట
చూడుండని వింతలెన్నొ చూపగ నందున్
చేడియ కాదది సత్యము
మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్.                                                       1206.

ఆతతసద్యశోవిభవు నాద్యుని శంకరు నాశుతోషునిన్
ఖ్యాతిగడించి లోకమున గాంక్షలు తీర్చెడి చంద్రశేఖరున్
బూతచరిత్రు నీశ్వరుని భూతగణాధిపు నాదితేయ
న్మాతను భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్.                                 1207.

ఆతడు దేవదేవు డతులాయత హర్ష సుఖప్రదాత నా
కాతడె తండ్రి జీవనమహత్వము నేర్పుచునుండునట్టివా
డాతడె తల్లి సద్గురుడు నాతని శంకరు నెంచిచూడ
న్మాతను భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్"                                 1208.

భూలోకంబున నొక్క నాస్తికుడు తా బూర్వంబునన్ రాజుగా
నేలాగైనను గాదలంచి పలికెన్ హీనాత్ముడై "స్వామినై
యేలం జేసెద చట్ట మేను వినుమోయీ! మిత్రమా యిచ్చటన్
స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్"                                      1209.

ఇలపయి దీప్తినంది సుఖియించుట కర్థ మవశ్య మెంచగా
నలయక ధర్మమార్గమున నార్జన చేయుట యొప్పు, దీనినిన్
దలపక నీతిమాలుట సదా పరిహార్యము, కష్టదాయి యా
కలిమి తొలంగినప్పుడె సుఖమ్ము లభించును మానవాళికిన్.                                 1210.

ధీమతీ! విను కాంత నెప్పుడు దెప్పుచుండుట యుక్తమా
సేమముండగ పాదసీమను జేరు, కాదన పృష్ఠమం
దామిషంబును గుడ్చి కర్ణమునందు దూరును దోమ యీ
భామకంటెనుచిన్న దోమ ప్రభావ మెక్కువ చూడగన్.                                          1211.
కాక - తాత - పాప - మామ
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో


కై(కా )డు దుఃఖంబగు
నాకో ముది(తా )నయుని నాప్రాణంబున్
లే కావ కృ(పాప)రవయి
నీకై కొను(మా )రియొక నిరుపమ వరమున్.                                                    1212.

అవ్వాడలోన నొక్కం
డవ్వా! వర్తకము చేయు నాకాగితపుం
బువ్వులతో నొకపరి యా
పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్.                                                       1213.


అవ్వా! దీపావళికిన్
జువ్వలు పువ్వొత్తులొకడు సురుచిరముగ తా
నవ్విధి జేయుచు నుండగ
పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్.                                                       1214.
అంశము - స్వాతంత్ర్య దినోత్సవము
నిషిద్ధాక్షరము - సకారము ('', దాని గుణితములు, సంయుక్తాక్షరములు)
ఛందము - మీ యిష్టము.
ముక్తి దొరికె నాడు మూర్ఖులై పాలించు
ప్రభుల నుండి భవ్య భారతి కిట
దాన జరుగుచుండె నానాటినుండి యీ
పర్వ మంద మొప్ప భారతాన.

గురుడు ప్రశ్నించ నొకఛాత్రు డురుతరమగు
వేగ మొప్పార క్షణమైన నాగకుండ
పలికె నీవిధి నజ్ఞానకలితు డగుట
గాధిసుతునకు మేనక కన్నతల్లి                                                                         1215.

చాలముదంబుతో నచట జక్కగ విద్యలు నేర్చునంచు నా
బాలుని స్వీయనందనుని వారలు పంపగ నాంగ్లసీమ కా
నేలను మిత్రకోటికనె నిక్కము వాడొక మందబుద్ధియై
"
మేలుగ గాధిసూనునకు మేనక తల్లి యగున్ నిజంబుగన్".                                   1216.

సంగములు వీడి సద్భక్తజనుల గూడి
నియమముల నెంచి నిష్ఠలో దృఢత గాంచి
యొకడు చిత్తంబు శివునిపై నునిచి, ముక్తి
కాంతను వలచి యోగిగా గణుతి కెక్కె.                                                    1217.

సంతోషమ్మున ధర్మపాలుడచటన్ సమ్యగ్విధానంబునన్
గాంతుల్ నిండిన మంటపంబు పయినన్ గాంక్షించి పెండ్లాడి యా
చెంతం జేరిన ధర్మపత్ని కనియెన్ శ్రీమంతుడౌ మిత్రు డో
కాంతా! "లోలుఁడు" యోగిగా గణుతికెక్కెన్ సాత్త్వికుల్ మెచ్చఁగన్ 1218.

అద్రిసుతానుగుండొకరు డాయతభక్తియుతుండు మిత్రుడౌ
రుద్రునితోడ నీవిధి గురుత్వము జూపి చమత్కరించె నో
భద్రుడ! రామదాసుడను భక్తుని కష్టము జూచినామిటన్
"
భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా"                              1219.

కొండలు మ్రింగువా డతడు కూరిమి మీర నధీశుజేయ నా
గండరగండడన్నియును గైకొని మెక్కుచునుండె చింతలే
కుండగ, చాలవయ్యె భువినున్న సిరుల్, ఘను వాని నెంచినన్
దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో.                                     1220.

అంఘ్రులపై బడి వేడగ
నంఘ్రిని నదిబుట్టజేయు నాతనిగృపచే
నంఘ్రిజకులమం దచ్చట
నంఘ్రిద్వంద్వమ్ము లేనియాడుది యాడెన్.                                              1221.

కోరిక దీరె మోదికి నకుంఠితయత్నము జేసి చట్టమున్
మారిచివేయ బూనుట నమానుషకృత్యము లంతరించు నం
దారయ గా నిమేషమున నచ్చట గాశ్మిరదేశమందు నన్
వారిజ! పత్రమే తగిలి వజ్రము రెండుగ జీలె చిత్రమే.                                  1222.

అకలుషభావనాపటిమ నందుచు హర్షముగాంచు టొప్పగున్
సకలురు నస్మదీయులను సభ్యత సత్వద మౌను చూడ నా
కొకనికి సౌఖ్య మబ్బవలె, నొడ్లెటులుండిన నేమియన్న దు
ష్ప్రకృతి వినాశనంబె కడు పావనకార్యము మానవాళికిన్.                          1223.


ప్రజ్ఞావంతులు లోకరక్షణకునై భవ్యానురాగమ్ముతో
విజ్ఞానమ్మును ఖర్చుచేయవలయున్ విశ్వాసమున్ జాటి
ర్వజ్ఞుల్ మెచ్చెడిరీతి, దేశసుఖమున్ భంజించు దుర్నీతులం
దజ్ఞానమ్ము వికాసదాయకమహో హ్లాదమ్ము పండించెడిన్.                          1224.

జ్ఞానసుఖప్రదుం డగుచు సర్వజగంబున సత్వదీప్తి సం
ధానము చేయుచున్ బహువిధంబుల నున్న చరాచరంబులన్
దానయి నిల్పు దైవత ముదారత నాజ్ఞను చేయకున్నచో
నేనుఁగు చంపజాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్                           1225.

నీరజపత్రనేత్రుడగు నిత్యసుఖప్రదు నచ్యుతున్ సదా
కోరికతో భజింతునని కూరిమిమీరగ నిర్మలాత్ముడై
చేరి తదీయసన్నిధికి శ్రేష్ఠజనంబులు తీర్చియున్నదౌ
బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్.             1226.

పడయగగోరి సద్యశము పాటుపడందగు సర్వవేళలన్
గడగి మహత్కృతుల్ సలుపగాదగు దుష్టుల వాక్యజాలమం
దడలక ముందుకేగవలె నన్నిట లోకహితంబు నెంచినన్
విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్.                     1227.

ఆపరమేష్ఠియున్ సురవరాదులు గొల్తురు భక్తియుక్తులై
చూపక భేదభావమిట జూపిన చో శివకేశవద్వయిన్
పాపమె దక్కు నెల్లెడ, శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్
శ్రీపతి నెంచువారయిన శీఘ్రమె కల్గును సౌఖ్యసంపదల్.                           1228.


కోరిక దీరె మోదికి నకుంఠితయత్నము జేసి చట్టమున్
మారిచివేయ బూనుట నమానుషకృత్యము లంతరించు నం
దారయ గా నిమేషమున నచ్చట గాశ్మిరదేశమందు నన్
వారిజ! పత్రమే తగిలి వజ్రము రెండుగ జీలె చిత్రమే.                                  1229.

అపుడు దశకంఠు డవ్వాని కనియె నిట్లు
వినుము మారీచ! నామాట విందువేని
యభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు
కాదటన్నను యమపురి గనెద వోరి!.                                                                 1230.

సభనొక దానవుండు హరుసంబున దైత్యజనాళి కిట్లనెన్
ప్రభువులపైని భక్తిగొని వర్తిలు డన్నిట మీకు నిత్యమున్
విభవము లందు సత్యమిది వీరిని మించినవారు లేరు మీ
కభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు రావణ కుంభకర్ణులే.                        1231.

తలపై త్రాణము దాల్చబోవు యువకా! తాళన్ బ్రయత్నించ బో
విలపై నంతట శీఘ్రగామి వయి నీకెవ్వారు బోధించినన్
బలుకంజాలవు వాహనంబుపయినన్ బర్వేల జాగ్రత్తరా
తలపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్.                       1232.

ఒకపరి సద్గురుం డొకరు డొప్పు శిష్యుని జీరి సత్కథల్
ప్రకటిత భక్తిభావమున భవ్యగతిన్ వినిపించుచుండి బా
లక! వినుమంచు దెల్పె సకలంబున నిండిన చక్రపాణి యా
మకరినిఁ జంపి సత్కృప నుమాపతి! గాచెఁ గరీంద్రు ప్రాణమున్.                 1233.
'వి - నా - - కా'
పై అక్షరాలు వరుసగా పాదాంతంలో వచ్చే విధంగా 
వినాయకుని స్తుతిస్తూ 
కందం లేదా ఏదైనా వృత్తపద్యం వ్రాయండి
సదమలచరితా! వినుము(వి)
శదమయ త్వచ్ఛక్తి సుముఖ!శంకరసుత! (నా)
మదికిన్ సంతస మిడుమ()
వదలను నీపాదసేవ వరమిడ నలు(కా)?

నీవు శుంఠ వోయి! నీకెవ్వ డర్పించు
భామనన్న మేనమామతోడ
పలికె నొకడు చూడు కులశేఖరుడు నాకు
పెండ్లి కాని మామ! పిల్ల నిచ్చె.                                                       1234.

తాత చెప్పునట్టి చేతంబు లలరించు
పొడుపుకథలు నేర్వ బూని యొకడు
నిష్ఠతోడ జేరి నిర్మల చిత్తుడై
వేయి వ్రాయ మిగిలె వేనవేలు.                                                                 1235.

అద్దిర ప్లాస్టిక్ భూతము
వద్దన్నను జెరచుచుండ వస్తు గణంబున్
ముద్దుగ నశనము గొనుమన
నొద్దని పరుగిడె గణపతి యుండ్రాళ్ళైనన్ !                                               1236.

తడబడకుండ వ్రాసెదను తథ్యముగాగ పరీక్షలందు నే
డడిగిన ప్రశ్నలన్నిటికి నంచు వచించిన మందబుద్ధి యా
యెడ నొకదాని కొప్పయిన యుత్తర మంచు దలంచి వ్రాసె నా
పడమటి దిక్కులో బొడిచె భానుడు క్రుంకెను తూర్పు దిక్కులో.            1237.

ప్రజ్ఞావంతులు లోకరక్షణకునై భవ్యానురాగమ్ముతో
విజ్ఞానమ్మును ఖర్చుచేయవలయున్ విశ్వాసమున్ జాటి
ర్వజ్ఞుల్ మెచ్చెడిరీతి, దేశసుఖమున్ భంజించు దుర్నీతులం
దజ్ఞానమ్ము వికాసదాయకమహో హ్లాదమ్ము పండించెడిన్.                      1238.

అకలుషభావనాపటిమ నందుచు హర్షముగాంచు టొప్పగున్
సకలురు నస్మదీయులను సభ్యత సత్వద మౌను చూడ నా
కొకనికి సౌఖ్య మబ్బవలె, నొడ్లెటులుండిన నేమియన్న దు
ష్ప్రకృతి వినాశనంబె కడు పావనకార్యము మానవాళికిన్.                      1239.

అనుపమకష్టసంతతుల నందుచు కుందుచు నున్నవా డొకం
డనియెను మిత్రునిం బిలిచి "యంతట దౌష్ట్యము లీభువిన్ ధరల్
కనుమిదె యాకసంబునకు నంటుచునున్నవి" దీనికంటె నా
వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా.            1240.
కోరిన విద్యలన్నియును గూరిమి మీరగ నేర్పుచుండి నా
వారసు డీతడంచు బహుభంగుల ప్రేమను జూపి జ్ఞాన సం
స్కారము లందజేయు హితకారి గురూత్తము డౌట నాశుభా
కారముఁ జూచి దేవుఁడని గట్టిన నమ్మెను చిత్ర మెట్టులౌ"                            1241.
కడగి ప్రభుత్వ మెల్లెడల గాయల బండ్లను గోళ్ళ గుక్కలన్
తడబడకుండ నాపయిని తన్మయతన్ మనుజాళి సంఖ్యలన్
వడివడి నెంచి రమ్మనిన, వాని గణించుచు నిష్ఠతోడ నే
బడికిఁ జనంగలే ననెడి పంతులె ప్రాభవమొందు మెండుగన్.                        1242.
దిగ్దంత్యాభులు సత్కవీంద్రగణముల్ ధీశాలినౌ నాకిటన్
వాగ్దర్పంబున సాటిరారనుచు గర్వంబున్ ప్రదర్శించు వి
ష్వగ్దంభుం డొక డన్యదేశగతుడై పల్కెన్ దిశల్ పోల్చకే
ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్ బ్రత్యూషకాలమ్మునన్.                               1243.
శ్రీయుతమైన భావమును జేర్చుచు లోకమునందు దీప్తికై
న్యాయము దప్పకుండ కడుహర్షముతోడ నిరంతరమ్ముగా
స్వీయ బలంబు జూపవలె విజ్ఞతలేక సమాజహానికై
యాయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్.                         1244.
భారత పౌరు డొక్కరుడు పల్కెను శాత్రవకోటి కీవిధిన్
మీరలు తుచ్ఛమానవులు మ్లేచ్ఛులు దుర్మతు లాకతాయులై
చేరితి రీధరాస్థలిని శ్రేయములందరు సత్యమిద్ది మా
భారతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే?                         1245.
రాతిరి స్వప్నమందు రఘురాముడు మారుతి జూచి మెచ్చుచున్
నాతి సువర్చలన్ బిలిచి నమ్మగ బల్కుచు చెప్పెనిట్టు లీ
భూతలి నీతనిన్ గెలుచు బూరుషు డొక్కడు లేడు సత్య మీ
కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో.                                      1246.
శ్రీదుండై యనిశంబు భక్తతతికిన్ చిత్సౌఖ్య మందించు
వ్వేదారాధ్యుడు శంకరుండు గిరిజన్ వేదోక్తసద్రీతిలో
నేదంపూర్వవిధాన నందునని తామెంతేని హర్షంబుతో  
మోదీ! పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!                      1247.

స్వర్గప్రాంతము, భూరసాతలములున్ బాపాత్ముడౌ వాని దు
ర్మార్గున్ దైత్యుని జంపుటన్ దలచుచున్ మాతా! ముదంబందె నో
దుర్గా! నీవలనన్, జగద్వలయ మెంతో దుఃఖమందెన్ గదా
సర్గవ్యాపిని! వాని దౌష్ట్యములకున్ సంతోషముల్ గూలుటన్.                              1248

దుర్గంధంబులు స్వీయకార్యములచే దుష్టాత్ముడై యెల్లెడన్
మార్గంబందున జిమ్ముచుండు సఖునిన్ మాతంగి గూల్చంగ నా
భర్గార్ధాంగికి నొక్కదైత్యు డెదురై పల్కెన్ విచారంబునన్
దుర్గా! నీవలనన్ జగద్వలయ మెంతో దుఃఖమందెన్ గదా                        1249

కోరికదీర బుత్రునకు గొప్పగ విద్య విదేశమందునన్
నేరిపినారు వార లిది నిక్కము వాడు స్వదేశసంస్కృతీ
దూరుడు భక్తురాలి నొకతొయ్యలి నింగని పల్కె యీమె యా
శ్రీరఘురాము పెద్ద సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్.                                      1250.

No comments:

Post a Comment