Saturday 21 March 2020

మిరియాల గూడ "ప్రజ-పద్య" సమావేశము (15.03.2020)

శ్రీరామ
కం.
శ్రీకరమయి సత్కవులకు
నాకరమగునట్టి చోట నాపద్యసుధా
శీకరము హాయి నొసగెను
ప్రాకట "మిరియాలగూడ""ప్రజ-పద్య"సభన్. 1.
శా.
"కాటేపల్లి"శుభాన్వయాబ్ధిభవులున్ గల్యాణభావాఢ్యు ల
వ్వీటన్ సద్ద్విజవంశజన్ములు, కవుల్, విద్యావయోవృద్ధుల
చ్చోటం జేరిరి సాహితీకృషకులై శుభ్రాచ్ఛచారిత్రులై
యాటోపమ్మొకయింతలేని ఘనులా యార్యాళికిన్ సన్నుతుల్ 2.
మ.
చిరకాలమ్ము స్మరించురీతిని వచశ్శ్రీమంతు లవ్వార ల
వ్వరసిద్ధీశ్వరనందనానుగులు సద్బ్రహ్మణ్యు లవ్వేళలో
పరమానందకరమ్ముగా కవులకున్ భవ్యానురాగమ్మటన్
వరమౌ రీతిని బంచినారు ప్రణతుల్ పల్రీతులన్ జేసెదన్. 3.
చం.
సురుచిరమైన భావములు సుందరశబ్దములందు నిల్పి యీ
ధరగల సాంఘికామయవిధంబుల నందముగా వచించువా
రురుతరహర్షపూర్ణులయి యున్నతలీల బఠించి పద్యముల్
నిరుపమమైన దీప్తినట నింపిరి నాటి సభాంగణమ్మునన్. 4.
మ.
కవివర్యుల్ సుమనోహరార్థకవితాకల్యాణసద్గంధ మీ
యవనిన్ బంచెడివారు, సద్బుధవరుల్, హర్షాఢ్యులై యొప్పు న
య్యవధానుల్, సువిమర్శకుల్, ప్రతిదినం బాసక్తితో నావలెన్
కవనాభ్యాసము చేయు వారలచటన్ గన్పట్టి రవ్వేళలోన్. 5.
శా.
కావ్యస్రష్ట లనేకు లింపలర లోకశ్రేయమున్ గోరుచున్
దీవ్యద్భావసుధాసమన్వితములై దీపిల్లు గ్రంథమ్ములన్
నవ్యత్వమ్మున వ్రాయువానిని జనానందంబునుం గూర్చ నా
భవ్యస్థానమునందు నిల్పిరి మహద్భాగ్యమ్ముగా నెంచుచున్. 6.
సీ.
వరసిద్ధి విఘ్నేశు కరుణార్ద్రదృక్కులా
సభలోన బ్రసరించి శుభము లొసగ,
ప్రార్థనాకృత్యమ్ము బహుళార్థదాయియై
యాధ్యాత్మికత నింప ననుపమముగ
హృద్యమై వెలుగొందు పద్యగానమ్మందు
సరసమై రుచిరమై యరుస మొసగ
నావిష్కృతములైన యానూత్నకావ్యంబు
లందరి హృదయాల నందుకొనగ
తే.గీ.
"భళిర,భళి"యంచు సభ్యులా ప్రాంతమంత
గూర్మి గొనియాడ “మిరియాల గూడ”లోన
వాస్తవంబుగ ప్రజ-పద్య పండితసభ
దీప్తి వెదజల్లె సాహితీవ్యాప్తి గోరి. 7.
ఉ.
అచ్చటి భోజనాదికము లచ్చటి నిర్మల భావగంధముల్
హెచ్చగు స్నేహదీధితులు నెన్నివిధంబుల స్వాంతశుద్ధితో
మెచ్చిననైన చాలదని మిత్రసమాజమునందు చెప్పెదన్
నిచ్చలు సద్యశం బొదవు నిక్కముగా “మిరియాలగూడ”కున్. 8.
సీ.
"ప్రజ-పద్య"మనుపేర “పచ్చని పద్యమున్
బ్రేమించ రండంచు"బిల్చుచుండి
బృందమ్ము సమకూర్చి యంద మొప్పెడిరీతి
నిర్వహించుచునున్న నిర్మలురను,
సభను జేసినయట్టి స్వచ్ఛమానసులైన
“కాటెపల్ల్యన్వయ”కవివరులను
సహకార మందించి సన్నుతాశయులౌచు
వెన్నంటి నిలిచిన విజ్ఞతతిని
ఆ.వె.
సూరి జనములైన సూలూరిశుభవంశ
జార్యకోటి నతుల కార్యదీక్ష
వరల జేరియుండి “మిరియాల గూడ”కు
ఖ్యాతి గూర్చువారి నభినుతింతు. 9.
కం.
అచ్చటి మహిళా మణులకు
సచ్చరితుల కతిథిజనుల సద్గౌరవమే
యచ్చపు భాగ్యం బనుకొను
మచ్చరికము లేని వారి మాన్యతకు నతుల్. 10.

No comments:

Post a Comment