Friday 31 August 2018

నా భాష


నా భాష

కం.
శ్రీకరమై హర్షంబుల
కాకరమై వెలుగు భాష యాంధ్రం బగుటన్
చేకురును సౌఖ్యసంపద
లేకాలము పలుకుచుండ నిమ్మహిలోనన్.                                             1.
ఆ.వె.
పలుకు పలుకులోన నలఘు మాధుర్యంబు
నిలిపియున్నభాష నిశ్చయముగ
భాషలందు లెస్స బహుసుందరం బౌచు
నిలిచియున్న భాష తెలుగుభాష.                                                       2.
మ.
అలఘుస్వాదు రసాయనంబు పగిదిన్ హర్షాతిరేకంబు నీ
యిలలో బంచుచునుండి, సర్వవిధసాహిత్యానుకూలంబుగా
నిలువం జాలిన శక్తి గల్గి, సుమహన్నిష్ఠన్ బ్రదర్శించు నా
తెలుగున్ మించిన భాష లేదనిన సందేహంబు లేదేయెడన్.                         3.
శా.
ప్రేమన్ జూపును కన్నతల్లి యగుచున్, విజ్ఞత్వమున్ నేర్పుచున్
క్షేమం బెల్లవిధాల పాఠకులకున్ జేరంగ యోచించు, నీ
భూమిన్ శ్రేయములందు కార్యములకై పూనున్, విశేషంబుగా
నామౌన్నత్యము గూర్చు భాష యిదియే నానాప్రకారంబుగన్.                   4.
శా.
నీనాభేదము చూపబోదు మనుజానీకంబు కోరంగ స
న్మానంబే యని యన్ని వాఙ్మయములన్ నవ్యానురాగంబుతో
వేనోళ్ళన్ నతులందురీతి తనలో విజ్ఞత్వముం జూపుచున్
లీనం బందగ జేయు తెల్గున కిలన్ లేదీడు వేరేదియున్.                             5
చం.
చదువరులైన వారలకు చక్కని మానస మందజేయుచున్
సదమల భావజాలమును సన్నుతవర్తన మెల్లరీతులన్
ముదమును గూర్చుచుండునది ముత్తెములన్ సరిపోలు వర్ణముల్
పదిలముగాగ దాల్చు మనభాషకు దీటిల లేదు చూడగన్.                         6.
చం.
నవలలు వ్రాయ నెంచినను, నాటకముల్ రచియించ బూనినన్
వివిధములైన కావ్యములు విస్తృతరీతిని సాహితీకృతుల్
జవమున జేయ బూనినను సర్వవిధంబుల యోగ్య యౌచు యీ
భువిపయి నాంధ్రభాష తెలుపున్ దన దక్షత సర్వకాలమున్                       7. 
ఉ.
కష్టము పెట్టబోదు పలుకన్ యతనంబును జేయువారికిన్,
తుష్టిని నింపు చిత్తమున, తోరపు సత్త్వము జూపు, సభ్యతా
సృష్టిని జేసి సత్కృతులు చేసెడి ధైర్యము నిచ్చి పల్కులం
దిష్టము గూర్చు తెన్గునకు నెన్నగ తుల్య మొకండు లేదిలన్.                      8.
ఉ.
నేను తెలుంగువాడ, ననునిత్యము భాషణమందు, వ్రాతలన్
జాను తెనుంగునే నిలిపి సద్యశ మందెద, నన్యభాషలన్
జ్ఞానము గోరి నేర్చినను సర్వజగంబున నా తెనుంగు స
న్మానము జాటుచుండెదను సత్యము గట్టి ప్రతిజ్ఞ బూనెదన్.                       9.

హ.వేం.స.నా.మూర్తి.
31.08.2018

Tuesday 28 August 2018

విద్యార్థి


విద్యార్థి

సీ.      చెలిమిచేయుచునుండి కలిమి బంచుటె గాని
చీకు చింతల గోల లేకయుండు
ఆటపాటలలోన హర్షమందుటె గాని
కలిమి లేముల యూసు కలుగకుండు,
తలపులో నున్నట్టి పలుకు లాడుటె గాని
జంకు గొంకుల వైపు సాగకుండు,
సర్వకాలములందు సంతసించుటె గాని
దుఃఖంబు మదిలోన దొరలకుండు
తే.గీ.   సత్యనిష్ఠను దృఢచిత్త సహితుడగుచు
జ్ఞానమార్గానుసారియై సాగుచుండు
వాడు ఛాత్రుండు సద్భావవైభవమును
సురుచిరంబుగ నందిన నిరుపముండు.

మ.     ఒకటే లక్ష్యము విద్య నేర్చుట వరీయోత్సాహ సంపత్తికై
ఒకటే భావము దేశరక్షకునిగా యోగ్యత్వముంగాంచి యీ
సకలంబున్ దనకార్య కౌశలముచే సౌఖ్యాబ్ధిలో ముంచుటల్
ప్రకటానందము గూర్చ నీ పుడమిలో ప్రజ్ఞానముం బొందుటల్.

సీ.      సమరస భావంబు స్వాంతమందున దాల్చు
ఛాత్రున కెవ్వారు సములు కారు,
సుమధుర వాక్యంబు లమలుడై వచియించు
విద్యార్దికిని సాటి వేరు లేరు
తమకుటుంబమె యంచు ధరవారి నెంచెడి
చదువరి కెవ్వారు సాటి రారు
జ్ఞానార్జనములోన మాన మెంచెడునట్టి
యధ్యేత తుల్యు లీ యవని లేరు
తే.గీ.   చదువు కొనువాని నంటదు గద యఘంబు
ముదము, సహకార భావంబు, సదమలమగు
హృదయ వైశాల్య మనిశంబు  పదిలమౌచు
మదిని హర్షింప జేసెడి పదము దప్ప.

Tuesday 21 August 2018

సార్థకజీవి


సార్థకజీవి
చం.
అమలిన సాధుభావమున నన్నివిధంబుల సత్యనిష్ఠతో
క్రమము నెరింగి నిత్యశుభకార్యములందున శక్తియుక్తులన్
శ్రమ యనకుండ దాల్చుచును సాటిజనంబుల సౌఖ్యవృద్ధికై
సుమధుర వర్తనం బిచట జూపెడు వానిని సన్నుతించెదన్.                       1.
మ.
తనలాభంబుల నెంచకుండ భువిలో ధన్యత్వముం గాంచగా
ననుమానంబును వీడి దీనజనులం దత్యంత ప్రేమంబుతో
ధనధైర్యంబులు బంచుచుండు పనిలో దైవంబునుం జూచు నా
నచారిత్రుని సద్గుణాఢ్యుని శుభాకారున్ బ్రశంసించెదన్.                      2.
చం.
తనపరభేదముల్ గొనక ధర్మము దప్పక జాకరూకుడై
యనుచిత వర్తనంబునకునై మనమందున స్థానమీయ కీ 
మనుజుల నెల్ల సోదరుల మాడ్కి దలంచుచు నిత్యకర్మలం 
దనయము సద్ధితంబు గను నాశుభవర్తను సంస్తుతించెదన్.                      ౩.
చం.
లలితములైన శబ్దములు, లక్షణయుక్తములైన వాక్యముల్
కలిమిని బంచు భావనలు కల్గిన దానికి దృప్తి చెందుటల్ 
మలినము లంటనట్టి బహుమాన్యచరిత్రము లందియుండి స
జ్జనహితకాంక్షియై వెలుగు సార్థకజీవిని బ్రస్తుతించెదన్ .                           4.
మ.
తనకీ జన్మము నందజేయు నులన్ ధర్మప్రకారంబుగా 
వినయంబున్ బ్రకటించి సన్నుత మతిన్ విశ్వాసముం దెల్పుచున్
ధనముం జూడక సేవచేయ జను నా ధన్యాత్ము నత్యున్నతున్
గనినం జాలును సత్వమందగల దాకర్మణ్యు గీర్తించెదన్.                        5.
మ.
తనజన్మంబున కాస్పదం బయిన యీ ధాత్రిన్ ప్రపంచంబునం
దనయం బగ్రగయై వెలుంగు నటు లత్యౌన్నత్యముం గూర్చుటల్ 
మును సల్పందగు కర్మ మంచు మదిలో మోదంబునుం బొందు నా 
మనుజాగ్రేసరు ధన్యజీవిని జగన్మాన్యున్ సదా యెంచెదన్.                      6.

హ.వేం.స.నా.మూర్తి
21.10.2018.


Saturday 11 August 2018

హితవాక్యములు.


హితవాక్యములు.

ఉ.
నిండుమనంబు, సంతతము నిర్మలభావపరంపరాయుతిన్,
మెండగు గౌరవంపు బలిమిన్ భువనంబులలోన మన్ననల్
దండిగ గల్గు, సత్యమిది, ధర్మమునందు చరించుచుండ బ్ర
హ్మాండమునందు సన్నుతుల నందగ వచ్చును శంక యేలనో?                    1.
శా.
దాసోహమ్మను నిత్య మీ జగము శ్రద్ధాసక్తులం బూనుచున్
ధ్యాసన్ నిల్పిన దీనులం, దతులమౌ ధైర్యంబు సత్కార్యముల్
భాసిల్లంగను జేయజూపుటయు,  సద్భాగ్యంబుగా నెంచుచున్
వాసింగాంచిన యార్యవిజ్ఞ జన సంవాసంబు కాంక్షించినన్.                           2.
చం.
సదమలమైన వర్తనము, సర్వవిధంబుల మానవాళికిన్
ముదమును దాల్చి నిత్యసుఖముల్ టియింపగ జేయు చిత్తమున్,
పదిలములైన వాక్యములు పల్కుట, ప్రేమను బంచుచుండుటల్,
వదలకనుంట ధర్మమును వాస్తవ జీవన సూత్రముల్ భువిన్.                        ౩.
చం.
కలియుగ నైజమంచు పలు కారణముల్ ప్రకటించుచుండి యీ
యిలపయి తోచినట్టులుగ నెల్ల విధంబుల నాత్మ సౌఖ్యమే
దలచుచు సాటివారలకు దైన్యము గల్గిన సంతసించుచున్
బలిమిని జాటువారలకు భావిసుఖంబులు చేరవచ్చునే?                    4.
శా.
లేరెవ్వారలు సాధులైన మనుజాళిన్ దుష్టభావంబుతో
చేరంబోయి యనేక పీడల కెడన్ చేర్చంగ యత్నించి స
ర్వారాధ్యంబగు సౌఖ్యమందగలవా రన్నింటినిన్ గాంచి య
వ్వారిన్ దైవ ముపేక్షసేయ దిది సద్వాక్యంబు తథ్యంబుగన్.                         5.

హ.వేం.స.నా.మూర్తి.
11.౦౮.2018.