Thursday 30 April 2020

"వాగ్దేవి"

"వాగ్దేవి"

శా.
శ్రీవాగ్దేవి! సరస్వతీ! శుభకరీ! శ్రేయఃప్రదా! భారతీ!
ధీవైదుష్యవిధాయినీ! సురనుతా! దీప్తిప్రదా! శారదా!
భావప్రాభవభాగ్యలబ్ధసుమహత్ప్రహ్లాదభక్తాస్పదా!
హేవాణీ!భవదీయకింకరుడనై యేవేళ నిన్ గొల్చెదన్. 1. 
చం.
పలుకులతల్లివై మధురభావము లందగజేయు మాతవై
తలచినవారి వాక్కులవిధానమునందున సౌమ్యతాస్థితిన్
నిలుపుచు గాచుదానవయి నిత్యము లోకమునందు హర్షముల్  
గలుగగ జేయు నీకిచట గాటపు భక్తిని వాణి! మ్రొక్కెదన్. 2.
శా.
భాషాయోష! నమస్కృతుల్ సలిపెదన్ బ్రాహ్మీ! జగద్వ్యాపినీ!
పాషాణత్వము నిండె మానసమునన్ భక్తుండ నీదాసుడన్
రోషావేశమణంగజేసి సుజనప్రోక్తామలాదర్శమీ 
పాషండున్ నను జేర జూడుమని నిన్ బ్రార్థింతు నెల్లప్పుడున్. 3.

హ.వేం.స.నా.మూర్తి.
27.04.2020.