Tuesday 9 November 2021

భారతభూమి

 

భారతభూమి

(అష్టోత్తరశతపాదాత్మకోత్పలమాలిక)

 

శ్రీరమ నిత్యవాసమును జేయుచునుండెడి దేశరాజ మీ

భారతభూమి సత్యమిది పావనతన్ దన భాగ్యరాశిగా

దోరపు సంతసంబు మది దోపగ దాల్చిన దివ్యసీమ స

త్కారపు టర్హతన్ బహువిధంబుల విశ్వమునం దనాదిగా

గూరిమి బంచుచున్ దనకు గూడెడు పుణ్యము చేసికొన్న దా

శౌరికి, దేవరాజికిని స్థానముగా వెలుగొందు చుండి సం

స్కారము, శీలసంపదల చక్కని చోటుగ ఖ్యాతిగన్న, దా

ధారముగా వెలింగినది దానగుణంబున కెల్లవేళలన్,

మేరలులేని ధైర్యమున మీరిన దన్నిట నన్నిచోటులన్

నీరజపత్రనేత్రలకు, నిష్ఠ జరించెడి సజ్జనాళికిన్,

ధీరుల, కార్యవర్యులకు, దీనుల గాచు మహాత్మకోటికిన్

శూరులకున్, విధేయులకు, సూనృతవర్తననుండువారికిన్,

బౌరుషపూర్ణులై యతులవైభవమందిన దీప్తిమంతులౌ

వారికి పుట్టినిల్లు శుభ భావము నిండిన వేదభూమియై

వైరులకైన సత్కృతులవారితరీతిని జేయుచుండు, తా

నేరికినైన గాని కలహించుచు గీడొనరించ బూన ది

వ్వారలు బాంధవుల్ హితులు, వారలు శత్రు గణంబులంచు నె

వ్వారిని భేదభావమున బల్కగ జూడ దనేకతాస్థితుల్

మీరిన నైకమత్యమును మేదినిపై బ్రకటింపజేయు దా

నారయ భారతావనికి నందున నిందున నెందునైన నే

ధారుణి యైన తుల్యమయి తా నగుపించదు శ్వేత జాతులన్

గోరికదీర బొండనుచు గూళలనున్ గని శాంతమూర్తియై

దూరక హింస గైకొనక తొల్గగ జేసిన ధర్మరూప, దు

ర్వారమహోగ్రరుగ్మతల ప్రాభవమున్ దన యుక్తిచేత ని

స్సారము చేయగల్గిన స్వశక్తిని నమ్మిన యోగ్యభూమియై

పేరుకు దగ్గ రీతి నిట విస్తృత దీప్తుల నెల్ల వేళలన్

గోరక యంద జేయుచును, గోపమెరుంగక చేరదీయుచున్

జీరుచు వత్సలత్వమున శ్రేయము లందరు పొందునట్లుగా

వేరొక టాత్మ నెంచకయె విజ్ఞత దెల్పుచు నుండునట్టిదీ

భారతమాత నిచ్చలును బాడికి, బంటకు దాను వాసమై

పేరు గడించి యుండినది వేదచతుష్టయమున్, బురాణముల్,

సౌరులు చిమ్ము కావ్యములు, శాస్త్ర సమూహము, లాదరార్హమౌ

తీరును లోకమంతటికి దెల్పుచునుండ, మమత్వ గంధముల్

చేరగ బంపు దిక్కులకు, శ్రేష్ఠములై వెలుగొందు బంధముల్,

గౌరవమందజేసి, శుభ కామనలన్ సమకూర్చుచుండి సం

సారము లోని మాధురిని సన్నుత రీతిని జూపుచుండు నా

భారత గోత్ర యెల్లెడల భవ్యభవంబున కైన యోగ్యతల్,

కారణముల్ దురుద్ధతులు కల్గుటకున్ విశదంబుచేసి స

త్తారకపద్ధతుల్ దెలుపు, దైవము తోడను బ్రేమబంధముల్

దారయి దాల్చు వారలకు దారులు నేర్పును, పాపమందునన్

గూరుకు పోయి మానవుడు కుందుచు నుండిన నుద్ధరింపగా

గోరుచు సద్ధితం బెపుడు క్రోధము చూపక తెల్పుచుండు నా

భారత ధర్మముల్, గతులు భాగ్యదముల్, సుఖదంబు లీయెడన్

నీరము, నిప్పు, వాయువులు, నేలయు, నింగియు, వృక్షసంతతుల్,

క్రూర మృగాదులున్, బహుళ రూపము లందిన జంతుజాలముల్,

చారుతరంబులౌ గిరులు, సంద్రములున్, నదులున్ సమస్తమున్

బ్రేరణ నిచ్చు దైవపదవిన్ గొని నట్టివి, యేదియైన నీ

భారతమందు గన్పడిన భాసిలు చూడగ నన్యభూమిలో

జేరగ బోవ వేవియు విశేషము లీభువి పైనలేనిచో

వీరత కాశ్రయం బగుచు వేల్పులకైన జయంబు గూర్చగా

పారము లేని దక్షతను భాసిల జేసిన చక్రవర్తులన్,

వైరిసమూహభీకరశుభప్రద నిర్మలచిత్త శోభితా

కారుల గన్నభూమి, వరకామ్యద, సౌమ్యగుణప్రభావ, నా

నారుచిరాచ్ఛభావయుత, నవ్య పురాతన సంస్కృతీప్రభా

 

పూరితదివ్యదేహ, రసపూర్ణసుధామయసవ్యవాగ్ఝరీ

సారమహత్వశోభిత, యజస్ర సహస్రసుకర్మ ధర్మ దీ

క్షారత నాదుభారతము, సన్నుతి చేసెద జేలు పల్కుచున్

నారికి నున్నతత్వమును నైజ మతంబుగ నిల్పుచుండు, దా

నీ రమణీయభూమి సతతేచ్ఛను జూపును నమ్రతాస్థితిన్

మీరని రీతి బౌరుల కమేయ బలంబును నింపు కార్యమం,

దోరిమిలోన నీ భువికి నొక్కటి తుల్యముగాదు, సభ్యతా

సౌరభ మెల్లకాలమును సర్వజగంబున నిండునట్లు వి

స్తారమహత్ప్రయత్నమును దానొనరించును, సోదరత్వసం

స్కారముతోడసర్వమత సామ్యత దెల్పుచు, హర్షదీప్తులన్

బౌరులలోన దేశమున భక్తిని బెంచెడి రీతి నిల్పుచున్,

సూరి జనంబులన్ గొలుచు సుస్థిరసద్వ్రత నిష్ఠనందరున్

గారవ మిం దటంచు గొను కాంక్షను బూనుచు బ్రత్యహమ్ము సం

చారము చేయు సత్వమును చక్కగ నింపుచు నుండుచోటు నా

భారత మాస్తికత్వవిభవంబున నున్నతి నంది యున్న దా

మారహరున్ భజించు జనమాన్యుడు మాధవు డీధరాస్థలిన్

మీర నధర్మ మాగతిని మించిన శౌర్యముతోడ ద్రుంచుచున్

గూరిమి తోడ ధర్మమును గూలగ నీయక యుద్ధరింపగా

చారు దశావతారములు సంతస మందుచు దాల్చియుండె, దే

వారులు వేల్పులిచ్చట సుధార్థము గూడిరి పాలసంద్రమున్

గోరిక దీర ద్రచ్చగను, గూలి రధర్మము నందియుండుటన్

గౌరవు లీధరాస్థలిని, గైటభ మర్దను డీస్థలంబునన్

గ్రూరుల ద్రుంచె, స్వాస్త్రమున రుద్రుడు క్రీడి ననుగ్రహించె, వా

ణీరమణుండు నర్థులకు నిత్యవరంబుల నందజేసె, నా

భారతియున్ గవిత్వఝరి పారగ జేసెను, పార్వతీరమల్

పారము లేని హర్షము లవారితరీతిని బంచి రిందు, బృం

దారకబృంద మందరకు దానిట గూర్చును హాయి భారతం

బీ రమణీయతా గరిమ, యీ మహనీయత, లీ శుభాశయ

ప్రేరణ, లీపరాక్రమము, విస్తృతవాగ్విభవాతిరేకముల్

కారణ జన్మయౌ భరత ఖండగురుత్వమహత్వతత్వమున్

జేరగ జేసె నగ్రమున, శ్రేష్ఠతరంబిది మార్గదర్శియం

చారయు చుండె విశ్వ మెపు డాయతకాంక్షల, నిందు జన్మమున్

వారసులౌచు గాంచు శుభభావులు, ధార్మిక సత్వయుక్తులౌ

భారత పౌరు లందరును బాయని దీక్షను మాతృభూమి స

ద్గౌరవ వృద్ధికై సతము కర్మఠులై చరియించగావలెన్

మీరక ధర్మ పద్ధతిని మేలు దలంచుచు నార్యులార! నే

డూరక యుంట కా దుచిత మొప్ప దుపేక్షయు స్వీయధర్మమం

దౌరసబాధ్యతల్ మరువ మంచు ప్రతిజ్ఞల నాత్మసాక్షిగా

ధీరవరుల్ కొనందగును దేశము నందవినీతి కార్యముల్,

నారిని గృంగజేయుటలు, నమ్మిన వారిని మోసగించుటల్,

పోరుట లన్యసంపదలు పొందగగోరుచు, సాధుకర్మలన్

దూరుట, లన్నికోణముల దోరపు స్వార్థము బూనియుండుటల్,

మేరలు లేని దౌష్ట్యములు మిక్కిలి సత్వము నందియున్న, వా

చారములన్ని మారినవి, సన్మతి నేడిట సన్నగిల్లె, సం

స్కారవిహీనతల్ బలిసి సాగుచునున్నవి, కల్మషంబు లే

పారుచు విస్తరించినవి హాస్యము కాదిది యిప్డు నిమ్మకున్

నీరము నెత్తి నట్లుగ మనీషను వాడక చూచుచుండినన్

దోరపు హాని కల్గునిట దుఃఖము గూడు టవశ్యమందు నో

భారత మాతృ పుత్రులగు భాగ్యవిశేషఫలాఢ్యులార! యీ

ధారుణికన్ని రీతులను దన్మయతన్ గలిగించుకృత్యముల్

మారని దీక్ష జేకొనుచు మాన్యత నందగ రండు సచ్చుభం

బీ రఘురామ రాజ్యమున నెల్లవిధంబుల నిండియుండు, సా

కారములౌను స్వప్నములు గ్రన్నన యంచును విశ్వసించు డీ

భారత మాతకత్యతుల వత్సల పూర్ణకు మ్రొక్క నిల్చుచున్.

 

హ. వేం. స. నా. మూర్తి.

09.11.2021

 

Tuesday 28 September 2021

దైవలీల

 

దైవలీల

చం. 

నన మొసంగు, బెంచు, నిల సౌఖ్యములన్ ఘటియింపజేయుచున్

నకనకాదిసంపదలు న్మయతన్ గలిగించు రీతిగా

నుపమవత్సలత్వమున నందగ జూపుచు మోహమందునన్

నుని మునుంగ జేయుచును న్నుతులన్ సమకూర్చి వానితో

నుదిన హర్షసంతతుల నందగజేయుచు దైవ మన్నియున్

నవను భావజాలమును దాల్చి నరుండిట సంచరించుటల్

ని వలదంచు దెల్పుటకు గారణ మెద్దియొ చూపి యిచ్చటన్

నగల కాల మేగెనిక మందుడ పొమ్మని తెల్పి ప్రాణముల్

గొనును, దయాసముద్రుడని, కూర్మిని నిత్యము బంచుచుండి దీ

వెనల నొసంగు వాడనుచు వేదపురాణము లన్ని శాస్త్రముల్

నమగు రీతి బల్కు, శుభకారకుడై వెలుగొందు వాడిటుల్

నుజునితోడ నీగతిని మాయలు చేయుట లేల? యర్థముల్,

వినుతిని గాంచు బంధములు విస్తృతరీతిని జుట్టనేల? జీ

నగతభాగ్యసంచయము బాయుచు నొంటరివౌచు మానవా!

ను మననేల? చిత్రమిది, శాశ్వతు డాయత శక్తి మంతుడా

మునిసురవంద్యు డేయెడల మోక్షము నిచ్చునొ, జన్మబంధముల్

నుమని త్రోయుచుండునొ,కారణ సౌఖ్యము లంటగట్టునో

గొనకొని యెవ్వ డేగతిని గోరి యెరుంగ సమర్ధుడో యిటన్

నుజులలోన? దేవగణమాన్యు నఘాపహు గొల్చుచుండి పా

నమగు జ్ఞానభిక్షనిడ బ్రార్థన జేయుటకన్న నన్యమై

నదగు మార్గ మొం డెపుడు కానగ రాదు ధరిత్రి లోపలన్.

 

హ.వేం.స.నా.మూర్తి,

29.09.2021.

Monday 27 September 2021

జయ హనుమ

 జయ హనుమ

మ.
హనుమా! నీదయజూపుమా! ధరణికి ప్డంటెం గదా రుగ్మతల్
గనుమా! వీని విజృంభణంబు జనులన్ గాంక్షించి భక్షించుటల్
వినుమా! మామొర లన్నిరీతుల మహద్భీతిన్ స్వకీయాసువుల్
గొని ముష్టిన్ వసియించుచుండిన స్థితిన్ కూర్మిన్ బ్రసాదించుమా! 1.
శా.
రామస్వామి కనుంగుసేవకుడవై రక్షస్సమాజంబులన్
నీమం బొప్పగ ద్రుంచి యాక్షణమునన్ నీశౌర్య దక్షత్వముల్
క్షేమాకార! యెరుంగ జేసితివి నిన్ సేవించు లోకమ్మునన్
బ్రేమన్ బంచుచు ద్రుంచవేల యిపుడీ వేళన్ గరోనా నిటన్. 2.
శా.
నీ వేస్వామిని గొల్తువో కపివరా! నిత్యమ్ము మే మీయెడన్
దైవం బంచు దలంచి మ్రొక్కెదమయా! తద్రామునిన్ భక్తితో
దేవా! నీవును మేము సోదరులమే దివ్యానురాగమ్ముతో
యీవేళన్ మము గావ వేల హనుమా! యీనిస్తులాపత్స్థితిన్. 3.
మ.
చిరజీవంబును గాంచినాడ వనుచున్ జెప్పంగ విన్నార మీ
ధరపై చేయుచునుండి రామజపమున్ దాదాత్మ్యభావంబుతో
గరుణాత్మా! చరియింతువందు రిచటన్ గ్రౌర్యమ్ము జూపించు నీ
యురుకష్టంబును గాంచ వేల యిపుడీ యున్మాదియౌ భూతమున్. 4.
మ.
హనుమంతా! కరుణారసార్ద్రహృదయా! హర్షప్రదా! శాశ్వతా!
దనుజానీకమదాపహా! ధరసుతాధైర్యప్రభాకారకా!
వనచారీ! జగదేకవీర! యతులప్రహ్లాదభావాన్వితా!
కొనుమీవేళ నమశ్శతంబులు హరీ! క్షుద్రారిసంహారకా! 5.

వాస్తవము

 

వాస్తవము

మ.

ధరపై జన్మము మానవాళికి గనన్ దథ్యంబుగా నెంతయో

స్థిరపుణ్యంబును జేసియుండ గలుగున్ శ్రీమంతమౌ దేవతా

కరుణాసంఘముచేత, నిక్కముగదా! కళ్యాణముల్, హానులున్,

వరసౌఖ్యంబులు నబ్బుచుండు నిచటన్ భాగ్యానుసారంబుగన్                        1.

మ.

జననం బందుట జీవితాశయములన్ సంకల్పమం దుంచుటల్,

ఘనతన్ బొందుట, కామితార్థములకై కార్యంబులన్ సల్పుటల్,

మనగా యత్నము చేయుచుండుటలు, సన్మార్గంబునన్ నిల్చుటల్,

కొనుటల్ మృత్యువు, దైవనిర్ణయములై కూడున్ ధరిత్రీస్థలిన్.                          2. 

ఉ.

నాటకరంగతుల్య మిది నమ్ముడు జీవన, మిందు జీవి కా

మేటి మహత్వదర్శకు డమేయ వసుప్రదుడైన దైవ మే

పాటిగ పాత్రలన్ దెలుపు వానికి కాలము చెల్ల దేహు లీ

దీటగు కాయమున్ విడుట, దీప్తి త్యజించుట సంభవించెడిన్.                        3.

ఉ.

అన్నలు, దమ్ములున్, పడతి, యాత్మజులున్, జనకుల్, స్వకీయులున్,

మన్నన లందజేయుచును మైత్రిని జూపు హితైషి వర్గముల్

క్రన్నన దూరమౌదు రిట గాయము కూలగ, నాదియన్న దే

మున్నను వెంటరా దనుట యొప్పగు వాక్యము లోకమందునన్.                      4.

ఉ.

సత్యము కాదు జీవితము, సౌఖ్యనికాయము, బాంధవత్వముల్

నిత్యము కావు, నష్టమగు, నిక్కము, దీని నెరుంగలేక తా

నత్యతిమోహముం గొని యహర్నిశ లిచ్చట దేహధారి సాం

గత్యము శాశ్వతం బని యకారణ బంధము దాల్చు నీ యిలన్.                        5.  

అద్దె యిల్లు

 అద్దె యిల్లు

చం.

ధరపయి జీవనంబునకు దప్పనివై కనిపించు మూడు సు

స్థిరతను జూపునట్టి వయి దీప్తిని గూర్చెడి కూడు గూడులున్

వరమగు వస్త్రసంచయము వాస్తవ మియ్యది వీని యందునన్

నిరుపమధైర్యసౌఖ్యములు నింపు గృహం బిల మానవాళికిన్.                          1.

చం.

గృహమది స్వర్గతుల్యమయి  క్షేమదమై విలసిల్లు సీమయై

యిహమున సన్నుతుల్ గొనుచు నెల్లవిధంబుల హర్షదాయియై

యహరహ మున్నతంబయిన హాయిని గూర్చుచు నుండి స్వీయమౌ

మహిమను జూపి కాచుగద మానవకోటిని సంతతమ్ముగన్.                           2.

చం.

మనుజున కన్నిరీతులను మాన్యత గూర్చును గేహ, మందుచే

ఘనమగు స్వీయసద్గృహసుఖంబును గాంచగ లేనివారికై

యనుపమమైన వత్సలత నందగ జూపుచు నాదరించు దా

ననుదిన మద్దెయిల్లనుట లక్షరసత్యము లోకమందునన్.                                3.

చం.

తరతమభేద మెంచకయె తన్మయతన్ గలిగించునట్లుగా

నరులు వసించ స్థానమును నైజశుభాశయ మెల్లదెల్పుచున్

ధరపయి నద్దెయిల్లు సుఖదంబయి చూపుచునుండు దీని కెం

దరయగ దుల్య మొక్కటియు  నన్యము లేదిది సత్య మెప్పుడున్.                       4.

ఉ.

దీనులకున్ భయంబు విడ దెల్పుచు రక్షణ చేయునట్టి యా

మౌనిజనస్తుతుండయిన మాధవు భంగిని నద్దెయిల్లు స

న్మానము మధ్యవర్గజుల మానసమందున జూపి కాచుచున్

తానిట నండయై నిలిచి ధైర్యము నింపుచునుండు నిచ్చలున్.                          5.

Saturday 4 September 2021

ఉపాధ్యాయదినోత్సవము

 

కం.    

ఒజ్జల పర్వంబందున 

ముజ్జగములు మేలుకొలిపి ముదమున విద్యల్ 

సజ్జయము శిప్యకోటుల 

పజ్జకు చేర్పించెడి గురువరునకు బ్రణతుల్.



శ్రీకృష్ణాయ నమః

 శ్రీకృష్ణాయ నమః


కం.

శ్రీదేవకీజ! దేవా!

వేదస్తుత! యాదవేశ! విశ్వాధారా! 

మోదప్రాపక! భయహర!

నీదయ నామీద సతము నిలుపుము కృష్ణా!  1.


కం.

భవహర!  యఘనాశంకర! 

స్తవనీయా! వాసుదేవ! శౌరి! మురారీ!

వివిధాసురమదహారీ!

నవనీతప్రియ!  కొనుమయ! నతులివె కృష్ణా! 2.


కం.

విజయసఖా! కంసారీ! 

నిజజనసద్విజయదాత! నిఖిలత్రాతా! 

భజియించెద నిను సతతము 

సుజనోద్ధారక! కరుణను చూపుము కృష్ణా! 3.


కం.

భగవద్గీతాచార్యా!

నిగమాగమశాస్త్రవినుతనిస్తులశౌర్యా ! 

జగదవనామలకార్యా!

తగునార్యా! నతులు గొనుట  దండము కృష్ణా! 4.


నందయశోదానందన!

వందారుజనాఖిలాఘవారక! స్వామీ! 

యెందున్నను నిను దలచెద 

నిందందు ద్వదీయభక్తి నిమ్మయ కృష్ణా! 5.


కం.

లోకంబున నేడంటిన 

చీకాకుల బారద్రోల జేరు మటంచున్ 

నీకొనరించెద వినతులు

చేకొని దయజూపుమయ్య! శీఘ్రమె కృష్ణా! 6.


మందారమూలమందున

సుందర వేణువును దాల్చి శోభిల్లెడి ని 

న్నందములవాని గోపీ

బృందంబులనున్నవాని వేడెద కృష్ణా! 7.


వందనములు కౌస్తుభధర! 

వందనములు యాదవవర! భాగ్యాపారా!

యందుము ధర్మాకారా!

వందనములు దేవదేవ! వరదా!కృష్ణా! 8.


Friday 16 April 2021

అంబేడ్కర్

 అంబేడ్కర్

సీ.

ఎవ్వాడు గ్రంథంబు లెన్నియో పఠియించి 

యలఘువిజ్ఞానియై నిలిచినాడు

ఎవ్వాడు నిమ్నులై యిట నిందలం గాంచు

వారి యుద్ధర్తయై వరలినాడు

ఎవ్వాడు దక్షుడై యీ పుణ్యభూమికి

నున్నత రాజ్యాంగ మొసగినాడు

ఎవ్వాడు మదిలోన నీజన్మభూమికై కమనీయస్వప్నముల్ గాంచినాడు

తే.గీ.

ఆత డంబేడ్కరాఖ్యతో నఖిలజగతి

ఖ్యాతి నార్జించి యున్నట్టి జాతిరత్న

మతడు సంస్కారకాంక్షులం దగ్రగుండు

నతని కనుపమచరితున కంజలింతు.

Monday 12 April 2021

శ్రీ ప్లవనామ సంవత్సర స్వాగత శతకము

 

"స్వాగతించుచుంటి ప్లవను భువికి"

(ఆటవెలదులలో)

 

శ్రీలు పంచు చుండి చిద్విలాసస్థితిన్

మనుజు లందు నిల్పి యనవరతము

క్షేమమందజేసి కీర్తుల నందంగ

స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.                   1.

 

అయనములును రెండు నారుకాలంబులు

పదియు రెండు నెలలు ముదముగూర్చ

సదమలత్వమంది సాగుమా నీవంచు

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  2.

 

చీడపురుగు వోలె చేరి యీ జగతిని

మ్రింగివేయుచుండి మిక్కిలిగను

హాని గూర్చు నీకరోనను గూల్చంగ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  3.

 

 

భూతలంబులోని నేతల మదులలో

సాధుభావ సహిత సత్వదీప్తి

కలుగజేయు కొరకు ఘనతరాదరముతో

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  4.

 

పెరుగుచున్న ధరల నరికట్టి దీనుల

బ్రతుకులందు వెల్గు పంచి ముదము

గూర్చి జగతి గావ కూర్మితోనీవేళ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  5.

 

కులమతాలభేద మిలలోన పోవుట

సాధ్యమనుట కల్ల సర్వ జనుల

స్వాంతమందు నిలుప సమరసభావమ్ము

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  6.

 

కష్టమందు మునిగి కనలుచునున్నట్టి

దీనజనుల కొరకు నైన సాయ

మందజేయు భావ మందించ జనులకు

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  7.

నమ్మి చేరువారి నమ్మకమ్ములనన్ని

వమ్ముచేసి మోసపరచునట్టి

జనుల స్వాంతశుద్ధి సలుపంగ రమ్మంచు

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  8.

 

స్వార్థమందకునికి సాధ్యమా జనులకు

నెదుటివారిపైన నింపుమీర

ప్రేమభావ మందు విధమును నేర్పించ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  9.

 

నన్నుబోలువారె నాసము లందరు

బాధపెట్టదగదు వారి ననెడి

మంచి భావమిలను మనుజులలో నింప

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  10.

 

నేను సుఖములంది నిత్యమీ భువిలోన

విభవ పంక్తి గాంచు విధిని జనులు

బ్రతుకవలయు ననెడి భావంబు కలిగించ

స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.                   11.

వసుధయందజేయు ఫలదీప్తి కిచ్చటి

వారలందరెంచ వారసులను

భవ్యమై వెలుంగు భావంబు కలిగించ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  12.

 

సాటివారు తనను సమ్యగాదరముతో

చూచుచుండునట్టి శుద్ధమతిని

పొందగలుగు శక్తి నందించ జనులకు

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  13.

 

క్రమము తప్పకుండ తమలోని దొసగుల

నెరుగ గలుగు శక్తి నరులలోన

కలుగజేసి బహుళ కల్యాణముల్ బంచ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  14.

 

మాతృభాషపైన మమకారమును నిల్పి

మసలగలుగునట్టి మహిత శక్తి

మనుజులందు గూర్చ ఘనతరంబగురీతి

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  15.

సాటివారి మాట సంయమనంబుతో

వినెడి శక్తి సకల జనులలోన

నిలుపబూను కార్య మలయక చేయంగ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  16.

 

దేశభక్తి గలిగి దివ్యమౌభావంబు

లెదలలోన జేర్చి యిలకు మేలు

కలుగజేయు బుద్ధి కలిగించ జనులలో

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  17.

 

పుడమిపైన తాను పుట్టుటలోనున్న

యంతరార్థ మెరిగి సంతతమ్ము

సాగ నరున కిందు సామర్ధ్యమందించ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  18.

 

సర్వగతుల జనులు సామాజికములైన

యాస్తులందు నిలిపి యమల దీక్ష

రక్ష చేయగలుగు దక్షత చేకూర్చ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  19.

తనగృహంబు వీధి తనయూరు దేశముల్

స్వాస్థ్యమందజేయు స్థలము లగుచు

నిలుపగలుగు శక్తి యిలవారి కందించ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  20.

 

పచ్చదనములోన బ్రహ్లాదసౌఖ్యంబు

కలదు గాన వృక్ష కులము నిందు

బెంచు వాంఛ జనున కంచితంబుగ గూర్చ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  21.

 

జ్ఞానధనము గలుగు మానవాళిని జేరి

యహము వీడి బుద్ధి నహరహమ్ము

వృద్ధి చేసుకొనెడి విధమును నేర్పంగ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  22.

 

ధార్మికంబులైన కర్మలీ జగతిలో

సంతతమ్ము దలచి జరుపునట్టి

యోగ్యతలను జనుల కొప్పార నందించ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  23.

పెద్దలందుభక్తి పిన్నలందనురక్తి

సాటివారిపైన మేటి ప్రేమ

చూపగలుగు శక్తి దీపిల్లగా జేయ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  24.

 

భారతీయ భవ్య పర్వంబులందున

జేరి యుండినట్టి శ్రేష్ఠతలను

తెలియగలుగు బుద్ధి యిలవారికిని జూప

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  25.

 

చెప్పుచుండి మృషలు చీటికి మాటికి

తోటివారి సుఖము తొలగద్రోచు

భావములను గూల్చి ప్రజలను గావంగ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                   26.

 

ఆధునికతయంచు నడ్డగోలుగ వస్త్ర

ధారణమ్ము చేయు వారిలోన

సద్వివేకబలము సమకూర్చ నీవేళ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  27.

స్వేచ్ఛ దొరికె నిచట నిచ్ఛానుసారంబు

సంచరింతు నంచు జనుడు హద్దు

దాటకుండునట్టి తాలిమి నందించ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  28.

 

నదులలోన గోరి నానారకంబులౌ

కల్మషములు కలుపు కరణి వీడు

నట్టి తలపు జనుల కందజేయుమటంచు

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  29.

 

తినుటకొరకు గోరి యనిశంబు ప్రాణులన్

జంపునట్టి వాంఛ స్వాంతమందు

జనుడు చేర్చకుండు సత్వంబు సమకూర్చ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  30.

 

వినయమనయమంది విస్తృతాదరముతో

సకలజనులతోడ నకలుషమతి

యగుచు బలుకు శక్తి నందించ జనునకు

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  31.

ఈ కరోన మరల యెంతేని వేగాన

విస్తరించుచుండె విధము దెలిపి

దాని కందకుండ మానవు గాపాడ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  32.

 

పరుల నింద చేసి నిరతసౌఖ్యంబందు

భావమందు మునుగు వారలకును

స్వాంతశుద్ధిచేసి సత్పథంబును జూప

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  33.

 

అనిశ మెల్ల గతుల నాడంబరాలకు

పోక మానవుండు లోకమందు

నాత్మ శక్తి నెరుగ నైన పద్ధతి నేర్ప

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  34.

 

నరుడు బాంధవులను  బరివారజనులను

మిత్రకోటి నఖిల ధాత్రిలోని

వారి నాదరించు బలిమిని గూర్చంగ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                  35.

పిన్న పెద్ద యనెడిభేదభావము జూప

కుండ మమత జూపు చుండ గలుగు

భాగ్య మిలను నేటి పౌరుల కందించ

స్వాగతించుచుంటి "ప్లవను"  భువికి.                   36.

 

ప్రకృతిలోన నున్న పావనత్వంబును

పాడుచేసి నరుడు కీడు గాంచ

కుండునట్టి భావ ముదయింపజేయంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    37.

 

మద్యపానులౌచు మర్యాదలను వీడి

మనుజు లాపదలను మునుగకుండు

జ్ఞానమందజేసి యానందమును జూప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    38.

 

అహరహమ్ము జనుడు సహవాసదోషాన

గతులు దప్పి తిరుగు మతిని మార్చి

సవ్యమార్గమందు సంచరింపగ జూడ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    39.

వాదులాటలేల సోదరత్వముతోడ

మెలగుచున్న మీకు గలుగు సుఖము

లనుచు దెలుప జనుల కాదరంబున నేడు

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    40.

 

నేను సైనికుండ నీనేల కేరీతి

హాని కలుగ నీయ ననెడి భావ

మందజేయ నరున కాదరంబున నిందు

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    41.

 

ధర్మమాచరించు ధరలోన మానవా!

లేని యెడల దుఃఖ మౌనటంచు

బలికి భ్రాంతులన్ని తొలగజేయుట కిప్డు

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    42.

 

సకల సృష్టిలోన సర్వేశ్వరుని గాంచి

సంచరించ గలుగు సత్వదీప్తి

కలుగజేయ జనుల కిలకు హర్షము తోడ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    43.

మంచిమాటలాడ మాన్యముల్ తరుగవు

మిత్రకోటి చేరు మేలు కలుగు

సంశయింప కనుచు జనునకు తెలుపంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    44.

 

పంచదారకన్న, మంచి తేనియకన్న,

చెరకురసముకన్న సురుచిరమ్ము

మాతృభాష కనుక మరువకుడని తెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    45.

 

మాతృభాషలోన మాటలాడుట మాను

టదియె గొప్ప యనుచు నహరహమ్ము

సంచరించ గలుగు సర్వ కష్టము లనన్

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    46.

 

కష్టపడుటలోన కలదు సౌఖ్యము గాన

నిష్టపడుచు చేయు డిలను కర్మ

లనుచు తెలుప వలయు ననుచు నీవేళను

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    47.

స్వీయధర్మమెపుడు  క్షేమంకరంబౌచు

మహిని వెలగ నన్య మతముల కయి

యరుగువారి కాంక్ష లణచంగ బ్రార్థించి

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    48.

 

బహుళపద్ధతులను పైపైని మెరుగులన్

జూపుచుండి మతము పాప మనక

మార్చువారి బుద్ధి మరలించ గోరుచు

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    49.

 

నీటిబుడగ బ్రతుకు నిరత మసూయతో

సంచరించ నేల? స్వాంత మందు

మమత దాల్చి నరుడ! మసలుమాయని తెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.                   50.

 

పుట్టువేళ లేదు పోవునాడును రాదు

ధనము, దాని మదము దాల్చనేల?

నరుడ! సత్యమెరిగి నడువుమా యని తెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.                   51.

నేనె ఘనుడనంచు నిరుపమాహంకృతిన్

బొంది యుండనేల? పుడమి నీదు

సృష్టి కాదటంచు చెప్పగా నరునకు

స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.                   52.

 

మంచిపనులలోన మనసు నిల్పకయున్న

చేయువారినైన చెరుపకుండ

మసలుచుండి నరుడ! మాన్యత గనుమనన్

స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.                   53.

 

జగములందు సుఖము లగణితంబుగ బంచు

రైతు కష్టమందు బ్రతుకుచుండె

సాయపడుట జనుడ! సద్విధి యని దెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.                   54.

 

దేహమందు శక్తి దీపిల్లునందాక

కర మహంకరించి, కరుగ  బాధ

పడుట యేల యనుచు బాధ్యతలను దెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.                   55.

నీతి దప్పి యెపుడు జాత్యవమానమ్ము

కలుగజేయు కర్మ లలఘుగతిని

జేయవలదు జనున కేయెడ యని పల్క

స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.                   56. 

 

వేదశాస్త్రచయము వివరించియున్నట్టి

విషయ మెరిగి మనుట విజ్ఞత యగు

మరువబోకు మోయి మానవా! యని తెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.                   57.

 

వృత్తివిద్యలందు చిత్తంబులను జేర్చి

యార్థికంబులైన హర్షములను

బొందగలుగు శక్తి యిందు జూపించంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    58.

 

గురులపట్ల భక్తి తరిగిపోవుచునుండె

వారిలోన నట్లె పావనతయు

నరసి సవ్యభావ మందించ గోరుచు

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    59.

నాది నేనటన్న వాదులాటలలోన

శాంతి జగతిలోన క్షయము నందె

దాని నుద్ధరించి తథ్యంబునుం జూప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    60.

 

పలుకులోన గలదు బహువిధసౌఖ్యంబు

తలపులోన నట్లె యలఘు సుఖము

తెలిసి నడువు మనుచు దెలుపంగ నరునకు

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    61.

 

కట్టుకున్న సతిని, గనిన సంతానమున్

సిరులలోన ముంచ సేవ యగునె?

ధర్మ మెరిగి నరుడ ధన్యత గను మనన్

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    62.

 

అందనట్టివాని కర్రులు చాచుచు

చెంతనున్న వాని చింతలేక

మసలవల దటంచు మనుజునకుం దెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    63.

శిష్టజనులతోడ జేరుము సతతమ్ము

దుష్టకోటియందు దూరుటేల?

యనుచు జ్ఞానబోధ జనున కందించంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    64.

 

ఇల్లు, పిల్లలంచు నెల్లకాలంబును

మోహమందు నరుడ మునుగ దగవె?

దైవమును దలంచి ధ్యానించు మని తెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    65.

 

ఎల్లవేళలందు నితరుల సాయమ్ము

కోరుటేల జనుడ? ధీరుడ వయి

స్వీయయత్నమింత చేయుమంచును దెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    66.

 

పలుకులోన గలదు భాగ్యోదయం బిందు

బలుకులోన గలదు విలయ మనుచు  

తెలియ జేసి నరున కిలను సౌఖ్యము గూర్చ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    67.

నిత్య మిచట జనుడ! సత్యదూరంబైన

మాటలాడి హితుల మానసములు

దుఃఖమందు గడగి త్రోయకుమని తెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    68.

 

జనుల మానసములు సత్కార్యములయందు

లగ్న మౌచు హర్షమగ్నులగుచు

సాగుచుండగలుగు సత్వంబు చేకూర్చ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    69.

 

ఎదుటివారి కలిమి నెల్లవేళల నెంచి

యోర్వలేక మనుట యొప్పుకాదు

సత్య మెరుగు డనుచు సభ్యత నేర్పంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    70.

 

సాధుజనుల మంచు బోధనల్ సేయుచు

జనుల దోచుకొనెడి ఘనులపట్ల

సావధాను లగుచు సాగుడంచును దెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    71.

నేడు కూడియుండి నిన్నెట్లు వీడునో

ధనము, తెలుప తరమె? కనుక దాని

వెనుక పరుగులేల వినుమంచు దెలుపంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    72.

 

ఒక్క మంచి మాట యొప్పిదంబగురీతి

బలుకజాలియున్న నలఘు సుఖము

లందగలవటంచు నవనివారికి దెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    73.

 

వాస్తవమ్ము వినుడు పుస్తకపఠనమ్ము

వాంఛితార్థదాయి వరము కాన

దానివలన గనుడు జ్ఞానసంపద యనన్

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    74.

 

దొరికినంతలోన పరమహర్షము గాంచు

జనుడె యున్నతుండు సర్వగతుల

ననుచు దెలుప నరున కత్యాశ వలదని

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    75.

ఆర్తుడైనవాని కాత్మీయతను బంచి

సాయపడుట యౌను సత్యముగను

మానవత్వమనుచు మనిషికి దెలుపంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    76.

 

స్వర్గ మనెడి చోటు బ్రహ్మాండ మందున

నెందు గలదొ యెవ్వ రరయలేదు

మంచి తలచి కనుడు మహిని స్వర్గంబనన్

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    77.

 

ధర్మపథమునందు కర్మఠులౌచును

సంచరించువారి సత్కృతులకు

నోర్వలేమి తగదు సర్వత్ర యనుటకు

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    78.

 

ప్రజ్ఞచూపుటన్న ప్రశ్నించుటా కాదు

సవ్యకర్మలందు సహకరించి

సత్ఫలంబు గనుట జనుల కంచును దెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    79.

అజ్ఞు డీతడంచు ననవసరంబుగా

దూరుటేల యొరుని తోరమైన

వత్సలత్వ మెదవ పలుకుట సరియన

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    80.

 

తినుట కొరకు కాదు మనుట యీ జగతిలో

బ్రతుకు నిలుచు కొరకు మెతు కటంచు

తెలిసి సంచరించ కలుగు సౌఖ్యం బనన్

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    81.

 

వీడు వా డటంచు భేదంబు లెంచక

సమత నిలుప గలుగ జనుడు గాంచు

సత్సుఖంబు లనెడి సత్యమ్ము తెలుపంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    82.

 

మాటలందు నొకటి, మనసులో మరియొక్క

టరయ జేతలందు నన్యమొక్క

టిట్టులుండ దగునె యిక మారు డనుటకై

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    83.

చదువు ముఖ్య, మయిన సంస్కారహీనమౌ

విద్య వ్యర్థ మనెడి విజ్ఞవాక్కు

తెలిపి నరున కతుల దీప్తిని గలిగించ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    84.

 

దానకార్యమన్న దైవస్వరూపంబె

యయిన చిత్తమందు నమలభావ

మందు ముఖ్యమంచు సుందరంబుగ దెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    85.

 

దైవపూజలెన్ని దారులలో జేయ

నేమి ఫలము పేద కింతయేని

సాయపడక యంచు సత్యంబు తెలుపంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    86.

 

చెప్పుధర్మములను చేయకుండిన నాడు

సభల బలుకు టెల్ల సత్యముగను

అరచు టౌనటంచు నర్థమ్ము దెలుపంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    87.

జలము వ్యర్థపరచి యలఘుతరానంద

మందజూతువేని యదియె భావి

కష్టసంతతులకు గారణమౌనన

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    88.

 

దైవపూజలకయి ధనమును వెచ్చించు

నరుడ! దేవుని మన మరసి నడువ

బ్రతుకు ధన్యమౌను క్షితిపయి యని తెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    89.

 

దేశరక్షణమున ధీరులై ప్రాణముల్

పణము పెట్టు భటులు వాస్తవముగ

ధన్యజీవులనుచు మాన్యత నేర్పంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    90.

 

మనప్రవర్తనమ్మె ఘనతగూర్చును గాని

ధనము వస్తుచయము ధరణిలోన

యశము గూర్ప వనెడి యాశయంబును నేర్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    91.

ఇతడు యోగ్యు డంచు నింపార పదిమంది

పలుక గలుగు రీతి పావనమగు

వర్తనమున నరుడ వసియించు మని బల్క

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    92.

 

తెలిసియున్న విద్య దివ్యానురాగాన

బంచగలుగువాడె పండితుండు

వాడు ధన్యు డంచు బలికి మేలొనరించ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    93.

 

క్షణములోన గూలు గనుక జీవనమందు

నున్నతత్వ మొంద నొప్పటంచు

ననిశ మమలు రగుట కావశ్యకత దెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    94.

 

పిన్నవారలైన విజ్ఞులైయున్నచో

చేరి మ్రొక్క దగును సిగ్గుపడక

ప్రజ్ఞముఖ్యమిందు వయసు కాదని తెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    95.

ప్రకృతి తలచుచుండు బహువిధ సౌఖ్యంబు

జనున కందజేయ గనుక నందు

కల్మషములు నింప కాదు ధర్మంబనన్

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    96.

 

ప్రాకులాట లేల పరుల సంస్కృతి నంద

స్వీయ మిచట నుండ శ్రేయద మయి

యర్థరహిత మిట్టి యాకాంక్ష యనుటకై

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    97.

 

కవికి కార్య మిందు జవసత్వముల్ గూల్చు

వానిపైన జేయ వాక్సమరము

మరువబోకు డనుచు నరులకు తెలుపంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    98.

 

కాలమందు దోష మేలనో ఘటియింప

స్వీయభావనములె చేటు గూర్చు

ననుచు నెరుగు డంచు జనుల బోధించంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    99.

సత్యవాది యౌచు సన్నుతాచారుడై

మసల గలుగు వాడు దెసలనిండు

యశము లంద గలుగు నరయు డంచును దెల్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    100

 

అదియు నిదియు నంచు ననవసరంబైన

హేతువులను జూపి జాతిధర్మ

మనుసరించకుండు టనుచితమని చెప్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    101

 

వేదమహిమ దెలిసి విపుల ప్రచారంబు

లితర దేశభూము లెల్ల జేయ

మనకు దగునె యిట్లు మానబూనుట యనన్

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    102

 

ఇతరు లెట్టులున్న నేమి నాసౌఖ్యమే

ముఖ్యమంచు నెంచు మూర్ఖతలను

బొందియుండు టుచిత మిందు కాదని చెప్ప

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    103

అఘము చేయకున్న నది చేయువారిని

బ్రోత్సహించు వాని బొందు కలుష

మనుచు నరుడెరుంగ నందు సౌఖ్యం బనన్

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    104

 

తారతమ్య మెరిగి యూరివారలతోడ

సంఘ మిది యటన్న సత్య మరసి

మెలగుచుండు డనెడి మేటి యబ్దంబుగా

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    105

 

సర్వభూములందు సస్యవృద్ధిని జూపి

జనుల మానసముల సంతసంబు

నింపబూని యిటకు నీవు రావలెనంచు

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    106

 

స్వాస్థ్యదీప్తి జూపి శాంతి యందించుచు

క్షేమ మొసగి యిచట ప్రేమ బంచి

నిలువ రమ్మటంచు నిస్తులానందాన

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    107

 

విజయసిద్ధి యిచట విరివిగా జూపించి

ఇతర దేశములకు నెల్లగతుల

మమత బంచ గలుగు మహిమను నిలుపంగ

స్వాగతించుచుంటి "ప్లవను"భువికి.                    108