Monday 3 October 2022

స్వాతంత్ర్య అమృత మహోత్సవము

సీ.మా.

శ్రీలకు నిలయమై చిత్కళావాసమై

ప్రఖ్యాతిగాంచిన భవ్య భూమి

వేదశాస్త్రాలలో విస్తృతవిజ్ఞాన

మవనికందించిన యట్టి భూమి

పౌరాణికములౌచు సారవంతములైన

శుభకర్మలకు తీరు చూపు భూమి

సంస్కారమును నేర్పు సంస్కృతీ విభవంబు

బహుళవాత్సల్యాన పంచు భూమి

ధర్మస్వరూపమై నిర్మలానందంబు

కూర్మిజూపుచు గూర్చు కర్మభూమి

మునిజనస్థానమై యనిశంబు పరహిత

మాత్మ నెంచెడి దివ్యమైన భూమి

ఆధ్యాత్మికతతోడ నఖిలప్రపంచాన

భాగ్యమ్ము నిత్యమ్ము పంచు భూమి

పాడిపంటలతోడ పైరుపచ్చలతోడ

కలిమిని విఖ్యాతి గాంచు భూమి

స్వపరభేదములేక భాతృభావంబును

పరులకైనను గోరి పంచు భూమి

తే.గీ.

యగుచు నుతులంది వెలుగొందు నట్టి నాదు

భరతఖండంబు స్వాతంత్ర్య మరసి నేడు

డెబ్బదైదేండ్లు నిండిన వబ్బురంబు

గొలుపు నమృతోత్సవంబున వెలుగుచుండె

భరతమాతకు జేజేలు పలుకరండు

మనత్రివర్ణ పతాకము ననుపమముగ

నెగురజేయగ కదలుడీ జగతిలోన.

శా.

స్వాతంత్ర్యంబున కయ్యె సప్తతిపయిన్ పంచాబ్దముల్ నేడిటన్

చేతోమోదము సంఘటించినది సత్ క్షేత్రంబుగా వెల్గుచున్

ఖ్యాతింగాంచిన భారతావనిపయిన్ గల్యాణభావోన్నతిన్

బ్రీతిన్ సోదరులారరండు సమతన్ విశ్వంబునన్ జాటగన్.

సీ.

శాంతిసౌఖ్యంబుల చల్లని గాలులే

వేళనీ నేలపై వీచవలయు,

నిర్మలానందంబు ధర్మకర్మములందు

నిత్యమీ భువిపైన నిలువవలయు,

హర్షానుభవముల వర్షంబులిచ్చోట

నిరతమ్ము సర్వత్ర గురియవలయు,

స్వపరభేదంబుల ఛాయలీ భూమిపై

నిలువక శీఘ్రమ్ము తొలగవలయు

తే.గీ.

ఇట్టి భాగ్యంబు చేకూర్చ నెల్లవారు

ప్రతిన బూనుడు భారత పౌరులార! 

హర్షదంబైనయ మృతోత్సవాఖ్యపర్వ

మమరె నిచ్చోట స్వాతంత్ర్యమందు నేడు. 

రేపల్లె గురువందనము

 

మ.

తమలో నిండిన పాండితీవిభవమున్ తత్తద్విధానమ్మునన్

శ్రమయం చెంచక శిష్యకోటికి సదా సన్మార్గదంబౌ గతిన్

క్రమ మొప్పంగను బంచిరీ బుధజనుల్ కారుణ్యపూర్ణాత్ములై

"నమ" యంచీగురు పాదపద్మములపై నాశీర్షమున్ జేర్చెదన్

శా.

ఛాత్రస్థాయినెరింగి బోధనకునై సర్వానుకూలంబుగా

మైత్రిం జూపుచు మార్గమెంచి యెపుడున్ మాన్యుల్ లసద్విద్యలన్

స్తోత్రార్హంబగునట్లు బంచిరి వరాస్తోకానురాగాన మ

ద్గాత్రంబీభువి జేర్చి మ్రొక్కెద మహద్భావాఢ్యులన్ నిచ్చలున్.

చం.

వరగుణులౌచు శిష్యులను స్వాత్మజులన్నవిధాన నెంచుచున్

సురుచిరభావనాబలము జూపుచు యోగ్యములైన మార్గముల్

ధరణిని గాంచు శక్తినిడి తామొనరించిరి బోధనంబు నీ

గురువులు భక్తితో నతులు కూర్చెద  పద్యసుమంబులందునన్.

ఉ.

వీరికి సాటిరాగలుగు విజ్ఞులు లోకమునందు జూడగా

లేరను మాట సత్యమగు లేఖులతోడ సమానులైన యీ

కారణజన్ములన్ గొలుచు కాంక్షను జూపుచునుందు నిత్యమున్

జేరిచి వీరి పాదమున శీర్షము శిష్యుడనౌట వీరికిన్.

సీ.

రేపల్లె నిలయమై దీపిల్లె కళలకు

సాహితీభూమియై స్తవములందె

శ్రీశంకరాఖ్యతో శ్రీప్రదంబౌచును

విద్యాలయం బందు వెలుగులీనె

నచ్చోట సద్విద్య లరయంగజేరిన

వారికీ గురుజనుల్ తోరముగను

వాత్సల్యమును జూపి బహుళవిజ్ఞానమ్ము

పంచినారనిశమ్ము వరదులనగ

తే.గీ.

అట్టి గురువుల ఋణము నీ యవని లోన

నేమి యొసగిన దీర్చంగ లేము కనుక

వారు నేర్పించి యున్నట్టి వాక్యచయము

లందు నర్పించుచుంటిని వందనములు.

కం.

గురుచరణమె శిష్యులకిల

శరణము సర్వార్థదంబు జ్ఞానప్రదమై

నిరతము వరలును నేనా

చరణములకు మ్రొక్కువాడ సద్భక్తి నిటన్.

Wednesday 13 July 2022

శ్రీ గురుభ్యో నమః

 

శ్రీ గురుభ్యో నమః

 

కం.

శ్రీకరమగు భావంబున

కాకరమగు వత్సలత్వ మనునిత్యంబున్

ప్రాకటముగ బంచెడి జ్ఞా

నాకృతి గురుడౌట భక్తి నర్పింతు నతుల్.                        1.

కం.

మనమందలి యజ్ఞానం

బును గూల్చుచు సంతతంబు పూర్ణప్రేమన్

ఘనతరవిజ్ఞానోన్నతి

గొనుమని శిష్యునకు నొసగు గురునకు బ్రణతుల్.          2.

కం.

తనకన్న గొప్పవాడయి

జనమాన్యుం డగుచు భువిని ఛాత్రుడు వెలుగన్

విని కని సంతోషాబ్ధిని

మునిగెడి గురువునకు నతులు మునితుల్యునకున్.         3.

కం.

సురుచిర శుభకర పథముల

నరయగదగు విధము దెలిపి యతులిత యశమీ

ధరపయి గొనుడను గురువర

చరణములకు బ్రణతు లిడుదు జయజయ యనుచున్. 4.

కం.

అనఘత్వము తనశిష్యుల

కనుపమభూషణము పగిది నమరెడిరీతిన్

తనవిధిగ జూపుచుండెడి

ఘనుడగు గురువరుని యెదుట గరములు మోడ్తున్.      5.

కం.

నడిచెడి గ్రంథాలయమన

గడు దక్షతతోడ ఛాత్ర గణములశంకల్

విడిపోవ జేసి మనముల

జడతను దొలగించు గురుని సరణికి బ్రణతుల్.              6.

కం.

ధాతగ, నారాయణునిగ

చేతంబుల నిండియుండు శ్రీకంఠునిగన్

భూతలమున ననుపమమగు

ఖ్యాతిని గొను గురున కిప్పు డర్పింతు నతుల్.                 7.

కం.

అక్షయమగు విజ్ఞానం

బక్షరరూపమున జూపి  యన్నివిధాలన్

శిక్షణ నొసగును ఛాత్రున

కక్షీణ బలంబు గూర్చ నా గురు గొలుతున్.                     8.

కం.

వందనములు గురుజనులకు

సుందరభావప్రకాశ శోభితులగుచున్

నందనులని శిష్యావళి

నందరిని దలంచు వారి కర్పింతు నిటన్.                         9.

 

హ.వేం.స.నా.మూర్తి

13.07.2022.

 

 

Saturday 9 July 2022

శ్రీ విష్ణవే నమః

 శ్రీ విష్ణవే నమః


శా.

శ్రీమత్పావననీలమేఘరుచితో జిన్ముద్రతో సంతత

క్షేమంబుల్ జగమందు నిల్పుచు మహచ్ఛ్రేయంబులం గూర్చుచున్ 

స్వామీ! కావుమటన్న జేరుచు సదా భక్తాళినిన్ బ్రోచుటే

నీమం బంచు దలంచుచుందువు గదా నిన్గొల్తు నో శ్రీహరీ!


మ.

శుభదశ్రేష్ఠము శంఖచక్రయుగమున్ సొంపారు నా శార్ఙ్గమున్

బ్రభుతన్ దెల్పు గదాయుధంబు, నతుల ప్రహ్లాదముం గూర్చి స 

ద్విభవంబున్ బ్రకటించు కౌస్తుభమణిన్ విశ్వైకవంద్యుండవై 

యభయం బంచు ధరించు నీకు నతులె ప్డర్పింతు నోశ్రీహరీ!


మ.

జగతీస్థానమునందు దుర్మదముతో సర్వప్రయత్నంబుతో 

వగపున్ నింపుచు ధర్మకార్యములకున్ బహ్వార్తి గల్గించుచున్ 

నిగమౌన్నత్యము గూల్చబూను ఖలుల న్విశ్వప్రభుత్వంబుతో

దెగటార్చన్ బ్రభవించు నీకు నతులో దేవేశ్వరా!శ్రీహరీ!


శా.

క్షీరాబ్ధిన్ జగమెల్ల గాచుకొరకై శేషాహియే శయ్యగా

ధీరాగ్రేసర! చేరియుండెడి నినున్ దీప్తిప్రభావస్ఫురత్

కారుణ్యామృతవారిధిన్ గొలిచెదన్ గల్యాణ భావంబు నన్ 

జేరం జూడుము దేవదేవ! ప్రణతుల్ క్షేమప్రదా! శ్రీహరీ!


మ.

కమలానాయక!  కామితార్థవరదా! కైవల్యసంధాయకా! 

విమలైశ్వర్యవిధాయకా! విధినుతా!విశ్వైకసంరక్షకా!

అమరప్రాభవకారణా! యఘహరా! హర్షస్వరూపా! నినున్ 

సుమమాలాధరు సన్నుతించెదను సుశ్లోకా! యిటన్ శ్రీహరీ!


హ.వేం.స.నా.మూర్తి.

10.07.2022


Thursday 7 July 2022

నా రచనల పీ. డీ. ఎఫ్. లకు లింకులు

నా రచనల  పీ. డీ. ఎఫ్. లకు లింకులు

1.          శ్రీ వేంకటేశ్వర శతకము

https://drive.google.com/file/d/1wgRfoRCBT7hKV0cmXtvcVN86QdzxHvac/view?usp=sharing

2.         జీవనయాత్ర – సామాజిక పద్య ప్రబంధము

https://drive.google.com/file/d/1TvNGSkZpQQ_lZ5K9Mb_zK2qurlmRWHlH/view?usp=sharing

3.         శ్రీ సత్యనారాయణ వ్రతకథ – తెలుగు పద్య కృతి

https://drive.google.com/file/d/1aAamdSq5pOjlioeL0J41YFLa80u4u9WV/view?usp=sharing

4.         కవితాకదంబము - 1

https://drive.google.com/file/d/1L4hJ6iJo51IHDYggF88dxD708LKXY6Jx/view?usp=sharing

5.         కవితా కదంబము - 2

https://drive.google.com/file/d/1oULJcYFqvWZa8o-Z4CI9rsYDc0ox0flF/view?usp=sharing

6.         కవితా కదంబము – 3.

https://drive.google.com/file/d/1ZZl9Cde48EBlgjQoZPOFFRsNYWcn8Ieo/view?usp=sharing

7.         శ్రీ సుందరకాండము – తెలుగు పద్యకృతి

https://drive.google.com/file/d/10i3cGhHPN-c44i2Se1H4g0wpqYl9663y/view?usp=sharing

8.         సమస్యా పూరణలు

https://drive.google.com/file/d/1my4Tm9o0MGPrU0KEYdigbEnfwzX9brd5/view?usp=sharing

9.         దత్తపదులు – నిషిద్ధ,న్యస్తాక్షరులు

https://drive.google.com/file/d/1IMAPzDZkJCoj7ZZdaGBHzPiJUIzIMjkK/view?usp=sharing

10.       జ్ఞాపకాలు-శుభాకాంక్షలు

https://drive.google.com/file/d/1qr37uX3Nde85t6fvIDo0RoqCjiRoN_67/view?usp=sharing

11.        శ్రీ ఏటూరి సోమేశ్వర శతకము

https://drive.google.com/file/d/1zjdQBO0Grm6g0YWaAit7cjf84llon17N/view?usp=sharing

12.       శ్రీ సర్వేశ్వరీశతకము

https://drive.google.com/file/d/1mcSBj47zVtm2AucJJSgEHMDAsgv_IVub/view?usp=sharing

13.       శ్రీ గణేశ శతకము

https://drive.google.com/file/d/1qincBZ3w8k2RfUYWJXL3w1K1Qaq52Chv/view?usp=sharing

14.       శ్రీ కసాపుర హనుమచ్ఛతకము

https://drive.google.com/file/d/1o-q_1tXGTSlnJ0r8xFfX2_p37gh-1Gty/view?usp=sharing

15.       శ్రీ రామచంద్రపుర హనుమచ్ఛతకము

https://drive.google.com/file/d/1PTKMTofvTmp3QDa6LnDwXyLjbV5S_WLN/view?usp=sharing

16.       శ్రీ సీతాపతి శతకము

https://drive.google.com/file/d/1tgKE1iRQBQ7M5HID6I3Wh_ZYg9kNZGA0/view?usp=sharing

17.       శ్రీ హరి శతకము

https://drive.google.com/file/d/1yQ5jaLjMAa5LFd7kSPiPVmvakZBOpIna/view?usp=sharing

18.       శ్రీ దుర్గా శతకము

https://drive.google.com/file/d/1AMg2TSDM_BaQ6yGAV4PhZMMJJzMTrfVf/view?usp=sharing

19.       శ్రీ శివశతకము

https://drive.google.com/file/d/1aZc5p4zk_aIrKlphsXyD5Ie0apefNxuZ/view?usp=sharing

20.      వేంకటసత్యాలు (నీతి శతకము)

https://drive.google.com/file/d/17YPsPiQRlyO1uobiqvyitnXXWj2y9ZUy/view?usp=sharing

21.     భవ్యభారత శతకము

https://drive.google.com/file/d/1VGCa3D9Zwk3hBRdOUdDKwqhzbXg7hu1U/view?usp=sharing

22.      సమర శతకము

https://drive.google.com/file/d/1qSA5wF6Yuq7O9E_lS4-KAgRXClUhflrA/view?usp=sharing

23.      సౌందర్య శతకము

https://drive.google.com/file/d/1iIzq4VnNzcput0QcwGDwLyDELhXHdD1o/view?usp=sharing

24.      కార్తికమాహాత్మ్యము – తెలుగు పద్యకృతి

https://drive.google.com/file/d/1GJYggXTociwbf8-hKMU4oztZ15VY3EPu/view?usp=sharing

25.      శ్రీ మాఘ పురాణము – తెలుగు పద్యకృతి

https://drive.google.com/file/d/1Blct8lueOD36sPa28lfbFKIPGXBbmIoz/view?usp=sharing

26.      ప్లవ స్వాగత శతకము

https://drive.google.com/file/d/1ntkVeaBzXG1UBGmiQOhO1Y9Unnk42STU/view?usp=sharing

27.      శ్రీ వేంకటేశ్వరోదాహరణము

https://drive.google.com/file/d/1eZ2LFpLDuTFwjyReJBr2AdfjGhcSnosu/view?usp=sharing

28.      శ్రీ వైశాఖ మాహాత్మ్యము – తెలుగు పద్యకృతి

https://drive.google.com/file/d/1I9F6PaqQ53ZMrjyr2WzJgSBS8CFwFGSg/view?usp=sharing

 

Tuesday 28 June 2022

బెంగుళూరు-బన్నేరుఘట్ట"

 ది. 27.06.2022వ తేదీన బెంగుళూరు(కర్నాటక)లోని "బన్నేరుఘట్ట జంతుప్రదర్శనశాలను"దర్శించిన సందర్భమున కలిగిన భావములకు పద్యరూపము.


"బెంగుళూరు-బన్నేరుఘట్ట"


మ.

అభయారణ్యము బెంగుళూరు పురిలో నత్యున్నతంబౌగతిన్

బ్రభవింపంగను జేయుచుండి ముదమున్ బ్రఖ్యాతినిం గాంచె స

ద్విభవం బన్నివిధాల జంతుతతికిన్ దివ్యానురాగస్ఫురత్

ప్రభలం జూపుచు గూర్చుచున్ నగరికిన్ బ్రాముఖ్యతన్ నిచ్చలున్. 1.


కం.

బన్నేరుఘట్ట ప్రాంతము

సన్నుతమయి యలరుచుండె సద్విభవముతో

నన్నింట జంతుతతులకు 

నున్నతవాసస్థలంబు నొప్పుగ నగుచున్.    2.


మ.

పులులున్ సింహము లేనుగల్ వనములో బూర్ణంబుగా స్వేచ్ఛతో

చలియింపం దగు వీలు జూపి రచటన్ సద్భావముం దెల్పుచున్

దలపించున్ భరతావనీమహిమ మా స్థానంబు దర్శించువా

రలఘుశ్రేష్ఠసుహర్షదీప్తి యుతులై యాశ్చర్యముం బొందగన్.   3.


ఉ.

జంతువులన్ బ్రదర్శనకు సన్నుతరీతిని నిల్పినారలా 

ప్రాంతమునందు మానవుల భావములన్ గ్రహియించునట్లుగా 

నింతులు బాలకుల్ జనము లెల్లరు జూడగ జేరవచ్చుచున్

సంతస మందుచుందు రనిశంబును వానిని గాంచి యెంతయున్.    4.


చం.

అదియె 'సఫారి' నామమున నా వనసంస్థిత జంతుజాలమున్

పదిల మటంచు జూపగల వాహనరాశి జనప్రవాహమున్ 

ముదమును బంచ నెక్కుడని పోడిమి మీరగ నిల్చియుండు నే

యదనుననైన నిక్కమిది యద్భుత మాయెడ ద్వారమందునన్.    5.


సీ.

వాహనంబున నెక్కి వనసీమలో సాగ

భల్లూకసంఘముల్ స్వాగతించు 

ముందుకేగిన వేళ నందు శార్దూలముల్ 

కనిపించి యలరించు ఘనతరముగ

మృగరాజు లచ్చోట నగణితానందంబు 

జేకూర్చ గ్రమముగా జేరుచుండు

కరిసమాజము గాంచ పరమహర్షంబున

గున్నలతోనందు గూడియుండు

ఆ.వె.

వనచరాళి మధ్య జనసమూహం బేగి 

తనివి దీర గాంచి తన్మయులయి 

యనుపమంబు సత్య మద్వితీయం బౌర!

యనుచు బలుకు చుందు రరయ నచట.   6.


సీ.

అట బెద్దమెడతోడ నరయ జిరాఫీయు

గన్నులవిందుగా గానుపించు

తోరంపుటందాల చారలన్ ధరియించు 

గుర్రంబు లచ్చోట గూర్చు ముదము

చిత్రవర్ణాలతో జింకలా వనమందు 

నానందమును బంచు నందరకును

నక్కలు తోడేళ్ళు నానావిధంబులౌ

వన్యస్థ జీవాల వాస మచట

తే.గీ.

ఖడ్గమృగములు పక్షులు కపికులంబు

స్వపరదేశీయ పశుగణ స్థానమగుచు 

దర్శకాళిని మురిపించు దనివి దీర్చు

ఘనత నందిన బన్నేరుఘట్ట నిజము.   7.


చం.

సురుచిరమైనప్రాంతమయి సుందరతన్ వెలుగొందు బెంగుళూ

ర్పురమున రాజమార్గములు పూర్ణతరాచ్ఛమనోహరంబులై 

యరయగ జేరువారలకు హాయిని గూర్చు సువృక్షరాజితో 

హరితవనంబు లంతటను హర్షము నింపును  మానసంబులన్.    8.


కం.

విద్యలపురమై యియ్యది

యద్యతనానంతదీప్తి నందెడి చదువుల్

సద్యశము నొసగు దక్షత

లుద్యోగస్థిరతజనుల కొసగుచునుండున్.    9.


మ.

ఇట టాటా మహనీయు డున్నతముగా నింపారు విద్యాస్థలిన్

పటుశక్తిన్ రచియింపజేసె గొనగా భవ్యంపువిజ్ఞాన మి

చ్చట విద్యార్థులు  చేరి కాంతురుగదా శాస్త్రోక్తమౌ దక్షతల్

మటుమాయం బయి పోవ  నజ్ఞతలు సన్మానంబు చేకూరగన్. 10.


ఉ.

ఇచ్చటి పుష్పసంపదయు నిచ్చటి పచ్చదనంపుశోభలున్

హెచ్చగు పారిశుద్ధ్యగతు లీయెడలన్ గల సౌధదీప్తులున్ 

మెచ్చగనొప్పు సత్యమిది మించు యశంబును బెంగళూరిలన్

నిచ్చలు గాంచగావలయు నిర్మలతావిభవప్రపూర్ణయై. 11.


హ.వేం.స.నా.మూర్తి.

29.06.2022.

Monday 18 April 2022

శ్రీ శ్రీ

 

శ్రీ శ్రీ

 

శా.

ఛందోబద్ధకవిత్వధిక్కృతులతో సర్వత్ర యిచ్చోట నా

చందం బియ్యది విప్లవాత్మకముగా సాహిత్యమున్ గూర్చుటల్

మందత్వంబును వీడి రండు పలుకన్ మాన్యత్వముం గాంచగా

నందం బిందని కావ్యమార్గమున దా నందించె నూత్నత్వమున్.   1.

ఆ.వె.

అగ్గిపుల్ల యైన నాకుక్కపిల్లైన

సబ్బుబిళ్ళ యైన సత్య మిచట

వస్తు వేది యైన భవ్యకవిత్వంపు

సృష్టి కర్హ మంచు జెప్పె తాను.               2.

శా.

శ్రీశ్రీగా వెలుగొందె లోకమునకున్ శ్రేయంబులన్ గూర్చు కా

వ్యశ్రీలన్ వెలయించి విప్లవముగా నాంధ్రంబునందంత తా

నశ్రాంతంబుగ, గార్మికాళి సుఖసమ్యగ్జీవనానందమే

సుశ్రీలన్ గురిపించు నియ్యెడ ననెన్ శుద్ధాంతరంగమ్మునన్.     3.

మ.

వరభావంబుల "ఖడ్గసృష్టి"యు, "మహాప్రస్థాన"కావ్యంబులన్

ధరణీరక్షణభావదీప్తి గొనుచున్  ధైర్యమ్ము లోకమ్మునన్

స్థిరమై నిల్వగజేయ వ్రాసె జనతా శ్రేయంబె కావ్యంబులం

దరయం గల్గెడి లక్ష్యమంచు దెలుపన్ హర్షప్రదైకేచ్ఛతోన్.           4.

కం.

యుగకర్తగ శ్రీ శ్రీ నీ

జగమున మంగళముగూర్చు సాహిత్యమునన్

దగురీతి బలుకు చుండెద

రగణితగౌరవముతోడ ననుచర గణముల్.                     5.  

 

హ.వేం.స.నా.మూర్తి.

19.06.2021.

శ్రీనాథుడు

 

శ్రీనాథుడు

శా.

శ్రీనాథుండను నేనటంచు కవనశ్రీమంతు డైయొప్పుచున్

దా నిందున్ గవితాసుమాన్విత మహత్కల్యాణభావోల్లసత్

జ్ఞానైశ్వర్యవిధాయకక్షితిజముల్  సర్వోపయోగ్యంబులై

యానందంబును గూర్చురీతి నిలిపెన్ హర్షైకచిత్తంబునన్.   1.

సీ.

చిన్నారి వయసులో శ్రేయస్కరానేక

          కావ్యముల్ రచియించి గణుతి కెక్కె

కుకవిత్వ భావంబు కువలయంబున నిండ

          బర్యటించుచు దాని భంగపరచె

శాస్త్రచర్చలలోన సర్వాధికత్వంబు

          నందుచు దానందె వందనములు

బహురాజదర్శనం బహరహంబును జేసి

          సన్మానములు గాంచె సర్వగతుల.

తే.గీ.

తెలుగులోనైన గీర్వాణకలితమైన

పలుకులోనైన కవనంబు లలఘుగతిని

మేటియై చెప్పగలను కర్నాటభాష

గాగ యని పల్కె శ్రీనాథ కవివరుండు.                             2.

మ.

కవిలోకంబున “సార్వభౌము”డగుచున్ ఖ్యాతిన్ గనెన్ సారవ

ద్వివిధానేకసుకావ్యసద్రచనచే విస్తారరూపంబునన్

నవదీప్తిన్ బ్రసరింపజేయు రవియై నైజప్రభావమ్ముతో  

నవనిన్వెల్గెను సత్కవీశ్వరుడు తా నందింతు గైమోడ్పులన్.    3. 

సీ.

దాహార్తిచే గుంది “త్ర్యంబకా! నీకేల

          తరుణులి ద్దరటంచు” నురుము వాడు

“జొన్నన్నపున్ ముద్ద వెన్నుడా! తిని నీదు

          పస జూప రమ్మంచు” బలుకువాడు

“తెమ్మురా కస్తూరి తెల్గురాజా” యంచు

          బహుదర్పమున గోర వచ్చు వాడు

“రసికు డొక్కడు పోవ డెసగ బల్నా” డంచు

          నలఘుకష్టము తోడ దలచువాడు

తే.గీ.

తనను బోషించి నిచ్చలు ఘనత గూర్చు

వారి నవసాన దశయందు బహుళగతుల  

దలచి సురగురు డతిభీతి గలత చెంద

నరుగు చుంటిని దివికని యన్నవాడు.                             4.

సీ.

కాశీకాఖండాది కావ్యరాజంబులన్

          విరచించి సద్యశం బరయువాని,

కనకాభిషేకంబు ఘనతరంబుగ నాడు

          ముత్యాలశాలలో పొందువాని,

తాను కోరిన రీతి దానంబు లెన్నియో

          ప్రభువుల మెప్పించి పడయువాని,

విద్యాధికారియై విస్తృత సమ్మాన

          మలనాడు సర్వత్ర నందువాని

తే.గీ.

తెలుగువారల భాగ్యాన నిలను కవిగ

యవతరించిన సత్కవి ననుపము ఘను

ధీమతిని సర్వ కవిసార్వ భౌము దలతు

వందనీయుని శ్రీనాథ భట్ట కవిని.                                 5.

 

హ.వేం. స. నా. మూర్తి.

12.06.2021.