Tuesday 16 October 2012

బ్రతుకమ్మ

16.10.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో
 పద్యరచన శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన 
పద్యవ్యాఖ్య
 
బ్రతుకమ్మ
పెద్ద చిన్న యనెడి భేద మించుక లేక
ఆడువారు మిగుల హర్షమునను
కూడి యొక్కచోట కుసుమంబు లెన్నియో
సేకరించి మాల సిద్ధ పరచి

రమ్యమై వెలుంగు రాశులుగా పేర్చి
వాటి చుట్టు చేరి వరుసగాను
భాగ్యమబ్బునంచు భజనలు చేయుచు
బాధలన్ని మరచి వైభవముగ



పలురకంబులైన బ్రతుకమ్మ పాటలు
పాడుచుందు రెంతొ భక్తితోడ
పడతులందరకును పర్వరాజం బిద్ది
కాంచగా మన తెలగాణమందు. 

శ్రీమాత

16.10.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో
 పద్యరచన శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన 
పద్యవ్యాఖ్య
 
 శ్రీమాత
శ్రీమాతను నే దలచెద
క్షేమంబును గోరి సతము స్థిరచిత్తుడనై
మామక కల్మషజాలము
లా మమతానిలయ బాపు నతివత్సలతన్.


జగదాధారవు తల్లీ!
నిగమంబులు బలుకుచుండు నీమహిమల నో
యగజాత! లోకపావని!
యగణిత వైభవము లొసగు మఖిలంబునకున్.

దయజూపు మమ్మ! మాపై
జయసిద్ధుల నందజేసి సకలజగాలన్
భయరహితుల నొనరించుచు
రయమున ధార్మికత గూర్చి రక్షించు మికన్.


నవరాత్రుల దీక్షలతో
హవనంబులు చేయుచుండి యనవరతంబున్
భవదీయ నామ మెల్లెడ
నవనతులై దలచువారి కబ్బును సుఖముల్.

నీవే జగదంబిక విక
నీవే నను గావగలవు నిన్ను దలంతున్
దేవీ! దుర్గామాతా!
రావమ్మా! యశములొసగి రక్షించుటకై. 

Tuesday 9 October 2012

ఎర్రన

09.10.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో
 పద్యరచన శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన 
పద్యవ్యాఖ్య
 
ఎర్రన 
సీ.    రమ్యంపు భారతారణ్యపర్వమునందు
                      శేష(శిష్ట)భాగము పూర్తిచేసె నతడు,
        కోదండపాణియౌ కోసలాధీశుని
                       చరిత మాతడు పల్కె శ్రద్ధతోడ,
        హరివంశకావ్యంబు నతిసమర్థతతోడ
                       విరచించి యున్నట్టి విజ్ఞు డతడు,
        నరసింహలీలను నైష్ఠికుడై నిల్చి
                       వచియించె నలనాడు వైభవముగ

తే.గీ. ఆంధ్రసాహిత్య జగతిలో ననుపమమగు
        ఖ్యాతి గడియించి యున్నట్టి ఘనుడతండు
        ఎఱ్ఱనార్యుడు, కవిపరమేశ్వరుండు
        సములు లేనట్టి సాహితీ స్రష్ట యతడు.


కం.  నన్నయ్యకు తిక్కన్నకు
        నెన్నంగా మిత్రుడట్టు లింపుగ నాడున్
        మిన్నగ భారతశేషము
        నన్నింట సమర్థుడౌచు నాంధ్రము చేసెన్.


ఆ.వె. శంభుదాసుడంచు సాహితీలోకాన
         ఖ్యాతినందియుండి చేతమలర
         నధికభక్తి శార్ఙి యవతారముల నెన్నొ
         పల్కినట్టి ఘనుని ప్రస్తుతింతు.
 

Monday 8 October 2012

తిక్కన సోమయాజి

08.10.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో
 పద్యరచన శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన 
పద్యవ్యాఖ్య
 
తిక్కన సోమయాజి
భారతంబున పదునైదు పర్వములను
మించి జవమున నాంధ్రీకరించి యంత
నుభయకవులకు మిత్రుడై యుర్విలోన
ఖ్యాతి నందిన తిక్కన్న నభినుతింతు.

కవికులంబున ఘనునిగా గణుతి కెక్కి
వచనములు లేని సత్కావ్యరచన చేసి
యనుపమంబైన కీర్తుల నందియుండె
సుకవిపరమేష్ఠి తిక్కన్న సోమయాజి.


మనుమసిద్ధిచేత "మామా"యటంచును
గౌరవింపబడుచు కావ్యకన్య
నమితమైన ప్రేమ నతని కర్పణచేయు
తిక్కనార్యుడెంతొ ధీయుతుండు.


హరిహరనాథుని గనుగొని
స్థిరమతియై "కాలకూటసేవనమా? నీ
వరయ యశోదాస్తన్యమొ
ధరగోరెద" వనియె సవ్యధర్మము నిలుపన్.


భగవద్భేదం బెంతయు
తగదంచును నొక్కి చెప్పి ధర నుభయకవీం
ద్రగణంబులకును సఖ్యము
తగురీతిని చేయబూను ధన్యుని గొలుతున్. 

Sunday 7 October 2012

నన్నయ

07.10.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో
 పద్యరచన శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన 
పద్యవ్యాఖ్య
 
నన్నయ
ఆదికవికి ప్రణతులర్పింతు భక్తితో
తెలుగుభాష నెంతొ తీర్చిదిద్ది
యంత భారతంబు నాంధ్రీకరించంగ
నుద్యమించినట్టి యున్నతునకు.

రాజరాజు కోర రమ్యాతిరమ్యంపు
ఫణితి భారతంబు పలుక దలచి
శబ్దజాల మపుడు సంస్కరించినయట్టి
నన్నయార్యఘనుని సన్నుతింతు.


సురుచిరంబులైన సూక్తులనిధి యౌచు
రమ్యమైన యక్షరంబులుంచి
క్రమత మథురములగు కథలతో నిండిన
కైత లల్లినట్టి ఘనుని గొల్తు

Saturday 6 October 2012

కాశీక్షేత్రము

04.10.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో పద్యరచన శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన పద్యవ్యాఖ్య
 వారణాసి
విశ్వనాథుని ధామమై విస్తృతమగు
నఘములను బాపి లోకుల ననవరతము
కాచుచుండును పుణ్యాలగని యనంగ
వైభవంబుల రాశి యీ వారణాసి.


ఆర్షవిద్యల నర్థించి యనుపమమగు
శ్రద్ధ బూనుచు నేతెంచు ఛాత్రతతికి
జ్ఞాన మందించు, గూర్చు సన్మాన మెపుడు
వైభవంబుల రాశి యీ వారణాసి.

మోక్షమును గోరి సత్కార్య దీక్షితులయి
చెంత జేరెడు జనులకు శీఘ్రముగను
శాశ్వతానందమును జూపు సర్వగతుల
వైభవంబుల రాశి యీ వారణాసి.


అన్నపూర్ణయు, ధర్మాని కాటపట్టు,
సాధుజనులకు నిలయంబు, శాంతమునకు,
సత్యదీప్తికి సాక్ష్య మీజగతిలోన
వైభవంబుల రాశి యీ వారణాసి.

కలుషహారిణియై యొప్పు గంగతోడ
సఖ్యమొనరించి, తనుజేరు జనుల కెపుడు
సచ్చిదానందమందించు, సత్వమొసగు
వైభవంబుల రాశి యీ వారణాసి.