Sunday 22 September 2019

సౌందర్యశతకము

సౌందర్య శతకము
(ప్రజ-పద్యం వారి ప్రోత్సాహంతో)
ఇది కదా నిజమైన అందం.

తే.గీ.
శ్రీకరంబైన భావంబు చిత్తమందు
దాల్చి యుర్విని సర్వత్ర ధర్మమందు
సంచరించుట హితకారి సర్వగతుల
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              1. 
తే.గీ.
సత్య మొక్కటి యిలలోన సర్వకాల
మతుల మైనట్టి శక్తిని మతుల నింపి
మనుజు నిటజేయు మహనీయు ననఘు గనగ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              2.
తే.గీ.
స్వార్థభావంబు విడనాడి సర్వజనులు
నాదు పరివార మనియెంచి మోదమునను
సంచరించుట శుభకర మెంచి చూడ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              3.
తే.గీ.
ఆశలకు బోక లోభమ్ము లేశమైన
దాల్చ కుండగ తనకున్న దానితోడ
తృప్తి నందుటలోనందు దీప్తి సతత
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             4.


తే.గీ.
పరుల ధనముల నాశించి పాపములకు
బోక సన్మార్గ గామియై పుడమిలోన
వెలుగుచుండుటలో గల్గు నలఘు సత్వ
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             5.
తే.గీ.
స్వపరభేదంబులకు బోక  సంపదలను
తోటివారికి బంచుచు మేటి యగుచు
జగతి మనుచుండ జేకూరు ప్రగతి చూడ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              6.
తే.గీ.
తాను బలశాలి యౌట నెవ్వానికైన
బాధ గలిగించ నెంచెడి భావమునకు
కడగి వీడ్కోలు చెప్పునత జనున
కిదియె యందమ్ము నిర్మల హృదయులార!               7.
తే.గీ.
స్వీయధర్మంబు నందందు శ్రేయ మనెడు
మాట నొకపరియైనను మరువకుండ
మనుటలో నందు మోదంబు మానవునకు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              8. 
తే.గీ.
జగతి నందిన మానవ జన్మమునకు
సార్థకత్వమ్ము గూర్చెడి సవ్యగతుల
నెరిగి చరియించు టగుగాదె సరియగు పని 
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            9.

తే.గీ.
పరుషవాక్యాలు పలుకుచు నిరుపమమగు
కష్ట మిలలోని వారికి కలుగ జేయు
వాంఛలను వీడ జేకూరు వాస్తవ సుఖ
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             10.
తే.గీ.
స్వచ్ఛభారత మిలగాంచు సన్నుతులను
గాన శుభ్రతకై బూని  నేను నిలుతు
ననెడి సద్భావమున గూడు నతులదీప్తి
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            11.
తే.గీ.
నాదు భారత మిలలోన నవ్యములగు
యశము లందంగ వలె నందు ననుపమమగు
హర్ష మొదవును నాకను టందె హాయి
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            12.
తే.గీ.
జన్మనొసగిన వారికి సన్మతియయి
సేవచేసెడి భావాన ఠీవి గనుచు
బ్రతుకుచుండటలో గాదె భాగ్య మిచట
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              13.
తే.గీ.
కలుషముల నెల్ల నదులందు గలుపుచుండి
తాను సుఖమందు భావమ్ము నూనకుండ
భాధ్యతల నెంచ నరుసమ్ము బడయవచ్చు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              14.

తే.గీ.
కాని వానికి ననిశమ్ము కడగి బొంకు
లాడు చుండెడి ప్రకృతిని వీడి యిచట
మనుటలో నందు సంతృప్తి మానవునకు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              15.
తే.గీ.
తనను గన్నట్టి వారలు తనకు నేర్పు
సంస్కృతులనుండు సత్వమ్ము సవ్యగతిని
తెలిసి మసలుట జనునకు స్థిరత గూర్చు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              16.
తే.గీ.
స్వీయభాషను విడనాడి పోయి యటకు
భంగ పాటుకు గురికాక భవ్యమతిని
గోరి తనభాష నేర్చిన కూడు శుభము
లిదియె యందమ్ము నిర్మల హృదయులార!              17.
తే.గీ.
అఖిల జగమున నీవేళ నలమియుండి
భీతి గొల్పెడి యవినీతి వెంట జనక
సాధువర్తన నుండుట సభ్యత యగు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              18.
తే.గీ.
ఆంగ్ల సంస్కృతి నిటనంది యమలమైన
స్వీయ సంస్కారములు రోయు ధ్యేయములను
విడిచి పెట్టుట యీనేల విజ్ఞతయగు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              19.

తే.గీ.
మానవత్వంబు నిలుపుచు మమత జూపి
సాటి జనులందు సర్వధా సదయు డగుచు
మసలుచుండుట నరునకు నొసగు శుభము
లిదియె యందమ్ము నిర్మల హృదయులార!              20.
తే.గీ.
నాస్తికత్వంబునకు బోయి నైజ దీప్తి
గోలుపోకుండ నిత్య మీ నేలపైన
విజ్ఞతను జూప లభియించు వివిధ శుభము
లిదియె యందమ్ము నిర్మల హృదయులార!              21.
తే.గీ.
ప్రకృతి లోనున్న వివిధమౌ ప్రాణికోటి
యరయ తనవంటిదే యంచు సురుచిరమగు
భావమును దాల్చ సుఖములు బడయవచ్చు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              22.
తే.గీ.
దీనజనులందు దయజూపు మానవునకు
దైవదర్శన మన్నింట తథ్యముగను
కలుగుచుండును సత్యమీ యిలను జూడ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              23.
తే.గీ.
విద్యలను నేర్వ సర్వదా వినయమునను
సంచరించుచు నుండుట ఛాత్రతతికి
సముచితం బౌను సర్వత్ర జగతిలోన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              24.

తే.గీ.
పెద్దలందున సద్భక్తి వివిధమైన
జ్ఞాన సముపార్జనాసక్తి సత్యయుక్తి
బాలురకు నొప్పు నిలలోన బడయ సత్వ
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             25.
తే.గీ.
సతికి పతిపైన సతతంబు సన్నుతమగు
భక్తిభావంబు విశ్వాసయుక్తి వలయు
సత్య మటులైన సుఖములు నిత్య మొదవు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              26.
తే.గీ.
పతికి సతిపైన ననురాగ మతులమైన
నమ్మకంబుండ సంసార నౌక సాగు
సవ్యదిశలోన నిక్కమ్ము సర్వగతుల
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              27.
తే.గీ.
జన్మభూమికి ద్రోహమ్ము సలుపబూను
జనుల భావమ్ములను గాంచి సంహరించు
టుచిత మైనట్టి కార్య మీ యుర్విలోన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              28.
తే.గీ.
గురువులకు చాత్రతతిపైన నిరుపమమగు
వత్సలత్వము కనిపింప వలయు సతము
దాన వికసించు నిలలోన జ్ఞానదీప్తి
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            29.

తే.గీ.
విద్యలందున సంస్కృతీ విభవ మెపుడు
నిండియుండిన దేశాన నుండ గలుగు
పౌరులందున సద్భక్తిభావగరిమ
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            30.
తే.గీ.
సాధుసంగంబు మదిలోని వ్యాధులకును
సమ్యగౌషధ మైయుంట సజ్జనాళి
జేరుచుండుట యుక్త మెవ్వారికైన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              31.
తే.గీ.
భారతీయత యననేమి బహుళగతుల
ధార్మికత్వంబు సర్వత్ర కర్మలందు
నిలిపి యుంచుట యంచును  బలుక నొప్పు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              32.
తే.గీ.
పాపభీతియు సద్భావ పరిమళంబు
సర్వ విధముల నన్నింట సమత మమత
కలిగియుండుట సద్యశోనిలయముగద
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            33.
తే.గీ.
గ్రంథ పఠనంబు తద్గత రమ్య విషయ
చయము మానస మందున జయము లంద
నిలుపు చుండుట సత్కార్య మిలను జూడ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              34.

తే.గీ.
నిరత మెంతేని యత్నంబు స్థిరతరముగ
జేసి మనుజుండు శ్రేష్ఠుడై చిరము భువిని
యశము లందంగ వలయు తా నసదృశముగ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              35.
తే.గీ.
నిత్య మైనట్టి యన్యాయ కృత్యములను
"ఛీ"యటంచును స్తంభింప జేయుటకయి
యువత సంసిద్ధులై యెప్పు డుండవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              36.
తే.గీ.
పెద్దవారల పనులందు పిన్న లెపుడు
చేతనైనట్టి సాయంబు చేయవలయు
నవని నటులైన జయముల నందవచ్చు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              37.
తే.గీ.
పరమ పావన మైనట్టి భరత భూమి
కతుల యశముల నందించ నంద రిచట
యత్న మొనరించ వలయును నూత్న గతుల
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              38.
తే.గీ.
సజ్జనాళిని బీడించి సంతసంబు
కాంచుచుండెడి జనునకు గలుషమతికి
దగిన శాస్తిని జేయంగ దగును ధరణి
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              39.

తే.గీ.
సద్గుణాఢ్యున కిలలోన సంతతంబు 
భాగ్య మిదియంచు నమ్రులై ప్రణతు లిడుట
తగిన కార్యంబు నరులకు తథ్యము గద
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!                      40.
తే.గీ.
సతత మత్యాశలకు బోయి సంపదలను
కూడబెట్టుట లక్ష్యమై యాడనీడ
తిరుగుచుండుట సరికాదు నరుల కిచట
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                41.
తే.గీ.
కుర్రవాండ్రకు మనమందు గోమలతయు
భవ్య మైనట్టి సంస్కృతీ వైభవంబు
నేర్పుచుండుట యుక్తంబు నిత్య మిచట
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                42.
తే.గీ.
అనిశ మిలలోన సంతానమునకు గడగి
వివిధ సంపద లైశ్వర్య మవిరళముగ
నిచ్చుటయెగాదు సంస్కార మీయనొప్పు
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                43.
తే.గీ.
సుతుడు ఖలుడైన జనకుల గతియె దోష
మందుచేతను సంతతి కందజేయ
వలయు నిరతమ్ము ధార్మిక వర్తనమ్ము
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                44.

తే.గీ.
మనుజు డనిశంబు సంతానమునకు సవ్య
మార్గదర్శన చేయుచు మహితమైన
దేశభక్తిని ధరియించ దెలుపవలయు
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                45.
తే.గీ.
సంతతికి దేశసౌభాగ్య సంపదలను
వృద్ధి పరచెడి దక్షతన్ విమలమతిని
నేర్పవలయును జనకులు నిచ్చలిచట
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                46.
తే.గీ.
స్వీయవర్తనమున జేసి విస్తృతముగ
పరుల మనములయందున బాధ కలుగు
నట్లు చరియించ కుండుట లగును ధర్మ
మిదియె అందమ్ము నిర్మల హృదయులార!               47.
తే.గీ.
కలియుగంబిది యంచును కలుషములకు
జంకకుండుట సరికాదు సర్వకాల
మవని సన్మార్గ గమనంబు నంద నొప్పు
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                48.
తే.గీ.
నరుడు సంఘాన జీవించు సురుచిరగతి
నొక్క డౌచును నేవేళ నుండలేడు
కనుక నొరులందు బ్రేమతో మనుట యొప్పు
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                49.

తే.గీ.
స్వార్థభావంబు క్రౌర్యంబు పరుషవాక్కు
ధర్మరాహిత్య మనిశంబు కర్మలందు
శ్రద్ధలేమియు త్యజియించ జనుడు వెలుగు
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                50.
తే.గీ.
పావనంబైన భారత భవ్యధర్మ
మెల్ల జగతికి జూపించి సల్లలితమగు
ఖ్యాతి గాంచుట యుక్త మీ జాతి కనయ
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             51.
తే.గీ.
సత్యవాక్పాలనార్థమై సర్వగతుల
కష్టములకోర్చి నిలబడి యిష్టముగను
సంచరించుట తగుగద జనున కెంచ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              52.
తే.గీ.
జన్మభూమిని సంతోష ఝరులు నింప
నవసరంబైన ప్రాణంబు లడలకుండ
త్యాగధనుడౌచు నర్పించ దగును నరున
కిదియె యందమ్ము నిర్మల హృదయులార!               53.
తే.గీ.
పరుల సొమ్మును సర్పంబు పగిది జూచి
యపహరించుట కెంచ కీ యవని పయిని
భావపరిమళ మందుచు బ్రతుక వలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              53.

తే.గీ.
నేతయౌవాడు సతతమ్ము నీతి దప్పి
సంచరించుచు నుండంగ సర్వగతుల
భంగపరచుట యొప్పు నవ్వాని నిచట
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              54.
తే.గీ.
ప్రజల హితమును గోరని ప్రభుతపయిని
తిరుగుబాటును జేయుట సరియగు పని
యగుట నరుడిందు పౌరుష మందవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              55.
తే.గీ.
కర్మభూమియు బహువిధ ధర్మభూమి
భారతం బౌట పురుషుండు ధీరు డిచట
కర్మఠుండౌచు సుఖములు గాంచ వలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              56.
తే.గీ.
పౌరు డగువాడు శుభయుతాకారుడగుచు
దేశమంతట సద్భావదీప్తు లెపుడు
వ్యాప్తి చెందించ వలయు సంతృప్తి గలుగ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              57.
తే.గీ.
ఖలుని వలెయుండి బహుదీర్ఘకాలమిచట
బ్రతికి యుండుట కన్నను నుతులు గాంచు
జీవనం బింత యందిన శ్రేష్ఠ మవని
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!               58.

తే.గీ.
ఆస్తికత్వంబు  భాగ్యమీ యవనిలోన
గాన మనుజుండు దైవాన మానకుండ
బుద్ధి నిలుపుచు  హర్షంబు పొందవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              59.
తే.గీ.
పుట్టు సమయాన లేదయ్యె పోవునపుడు
వెంట రాదయ్యె విత్తంబు విజ్ఞమతిని
దీని దెలియుట మనుజున కౌను యుక్త
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             60.
తే.గీ.
సారహీనమ్ము చూడ సంసారమందు
రందె జగమంత బ్రభవించు నందు దీప్తి
సుఖము శుభములు చేకూరు చోటు గాన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              61.
తే.గీ.
పైరు పచ్చల క్షేత్రాలతీరు లెప్పు
డవని నానందమున ముంచు నద్భుతముగ
వాని సంరక్షణం బొప్పు మానవునకు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              62.
తే.గీ.
తాను సంతప్త యౌచును మానవునకు
నీడ నిచ్చెడి వృక్షంబు నిక్కముగను
దైవ మననొప్పు దానిని గావవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              63.

తే.గీ.
జగతి కాధారమై యొప్పు సతికి సతము
గౌరవంబును సమకూర్చు క్రమము నెరిగి
సంచరించుట సభ్యత సర్వజగతి
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              64.
తే.గీ.
మాతృభావాన నన్యయౌ మహిళ నెపుడు
చూచుచుండుట భువిలోన శుభకరమగు
జనున కియ్యది కర్తవ్య మనుట యొప్పు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              65.
తే.గీ.
కనును, పెంచును, తల్లియై నత గూర్చు
నవని సోదరి, సతియౌచు జవము నింపు
లలన యాయమ కందించ వలయు సౌఖ్య
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             66.
తే.గీ.
దీనజనులందు దేవుండు జ్ఞానమూర్తి
వాసముండును సతతమ్ము వాస్తవమ్ము
దీని నెరిగిన మనుజుండు దీప్తి నందు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              67.
తే.గీ.
హిందు వగువాడు నుదుటను సుందరమగు
తిలకధారణ మనిశమ్ము దీప్తమతిని
జేయు టొప్పగు నద్దాన జేరు శుభము
లిదియె యందమ్ము నిర్మల హృదయులార!              68.

తే.గీ.
దాన మొనరించు మనుజుండు దానివలన
ఫలితమును బొంద నిలలోన దలపరాదు
సత్య మది గూర్చు శుభములు సర్వగతుల
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              69.
తే.గీ.
సత్యమును బల్కు సమయాన నిత్య మిచట
కలుగుచుండెడి కష్టంబు దలపకుండ
ముందు కేగుట యుచిత మిందెందు గనిన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              70.
తే.గీ.
వాదులాడుట, పెరవారి ఖేదమునను
మోదమందుట సరికాదు సాదరముగ
నెల్లవారిని బ్రేమించు టిందు సవ్య
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             71.
తే.గీ.
సంమును బట్టి పీడించు సర్వములగు
రుగ్మతల నంత మొందించ ప్రోడ యగుచు
మనుజు డుద్యోగమును జేయ జనుట యొప్పు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              72.
తే.గీ.
ప్రకృతి లోనున్న బహువిధ భాగ్యచయము
ననుభవించుట కర్హులీ యవని జనులు
కాని యద్దాని జెరుపంగ కడగవలవ
దిదియె యందమ్ము నిర్మల హృదయులార!              73.

తే.గీ
వృత్తివిద్యలు సంస్కృతీవిభవమునకు
చిహ్నములుగాన వాటిచే సిరుల నందు
టుచిత మీభువి మానవు డుత్సహించి
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            74.
తే.గీ.
ధర్మమును గావ మనుజుండు తడయకుండ
ప్రాణములనైన తృణముల వలెను మదిని
దలచు టుచితంబు తర్కించ దలచ నేల
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            75.
తే.గీ.
తాను  భక్షించుచుండెడి దాని బట్టి
భావములు గల్గు మదిలోన వాస్తవమ్ము
కనుక సాత్వికాహారంబు గొనుట సవ్య
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             76.
తే.గీ.
దీప్తి నొసగవు జనునకు దివ్యమైన
భూషణంబులు మధురమౌ భాషణమున
నతులమైనట్టి సత్కీర్తి యంద గలుగు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              78.
తే.గీ.
ప్రత్యహమ్మును సుఖమున బ్రాకులాట
సలుపుచుండెడి మనుజుండు క్షణము తాను
జన్మభూమికి వెచ్చించ సభ్యత యగు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              79.

తే.గీ.
అక్షరవిహీను, నజ్ఞాను నబలుడైన
జనుని దయమాలి వంచించు టనుచితమని
తెలిసి పురుషుండు సుజనుడై మెలగవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              80.
తే.గీ.
వేదశాస్త్రాల విస్తృత విషయములను
విశ్వసించుట విశ్వస్థ విజ్ఞతతికి
విపుల లాభప్రదం బౌట విశదముగన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              81.
తే.గీ.
బ్రతుకుటకు కూడు కావలె ప్రాణికిలను
కూటికోసమె బ్రతుకుట కూడనిపని
యనెడి సత్యమ్ము గ్రహియించ నగును హర్ష
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             82.
తే.గీ.
భారతాదులు బోధించు పద్ధతులిట
జనుని సర్వోత్తముని జేయు సర్వగతుల
కాన నవ్వాని మన్నించు టౌను యుక్త
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             83.
తే.గీ.
సాధు సంగతి సకలార్థ సాధకమయి
హితము చేకూర్చు గావున సతము జనుడు
తద్గతానందమున దేలి తనియ వలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              84.

తే.గీ.
శ్రీలు గలుగంగ చెలరేగి చిందులాడి
లేమి యంటంగ దుఃఖించు టేమి భువిని?
స్థిరత యొప్పును సర్వత్ర నరున కెప్పు
డిదియె యందమ్ము నిర్మల హృదయులార!              85.
తే.గీ.
దైవమును జేరి యర్చించ దలచువేళ
భావశుద్ధియు సద్భక్తి పావనతయు
దాల్చవలె నరు డన్యంబు తలచకుండ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              86.
తే.గీ.
ఎదుటివారికి సాయమందించువేళ
ప్రతిఫలంబును గోరుట పాడిగాదు
నిర్మలత్వము హృదయాన నిలుపవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              87.
తే.గీ.
మధురమైనట్టి యొక రెండు మాటలాడి
పరుల కొకయింత హర్షమ్ము పంచు పనికి
సంశయించుట సరికాదు సర్వగతుల
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              88.
తే.గీ.
కన్నవారిని, జ్ఞానసంపన్నుల నిక
గురుజనాళిని సజ్జనవరుల నెపుడు
చేరి  సేవించు టొప్పగు నేరికైన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              89.

తే.గీ.
మాతృభాషానురక్తుడై మానవుండు
నిరత మద్దాని నాత్మలో నిలుపుకొనుచు
హాయి నందుట యుచిత మిం దన్నిగతుల
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              90.
తే.గీ.
కవిత వ్రాయంగ దక్షత గలుగువాడు
సంహితమును గోరుచు సన్నుతమగు
రచన చేయంగవలయును రమ్యగతిని
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              91.
తే.గీ.
ఎన్ని యిబ్బందు లెదురైన నేడనున్న
స్వీయ ధర్మంబు విడనాడ జిత్తమందు
తలచు టైనను సరికాదు తెలియు డెల్ల
రిదియె యందమ్ము నిర్మల హృదయులార!              92.
తే.గీ.
సవ్యమార్గాన నడచుచు సన్నుతమగు
భావమును దాల్చి యుండుట భావిగతికి
సాధనమ్మిందు లేదింత సంశయమిట
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              93.
తే.గీ.
ఆడజాలక మద్దెల యోడటంచు
పలుకునట్లుగ యుగమిది కలి గదయని
తెలుప సరికాదు యత్నమ్ము సలుపవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              94.

తే.గీ.
పెద్ద లందున సద్భక్తి పిన్నలయెడ
వత్సలత్వంబు ప్రేమయు పరుల యెడల
జూపగలిగిన మనుజుండు శుభము లరయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              95. 
తే.గీ.
నాదు ధర్మంబు బహువిధ మోదకారి
యున్నతోన్నత మన్నింట నుర్విలోన
ననుచు చాటుటలో సత్వ మమరియుండు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              96.
తే.గీ.
న్యాయమును గాతు నాకున్న ధ్యేయమునకు
క్షతిని జేకూరనీయ నీ క్షితిని సతత
మనెడు స్థైర్యంబు గావలె జనున కెప్పు
డిదియె యందమ్ము నిర్మల హృదయులార!              97.
తే.గీ.
బహుళయశముల నందిన భరతభూమి
నాదు జనయిత్రి యీయమ కేదియేని
హాని రానీయ ననుట సన్మాన మిచ్చ
టిదియె యందమ్ము నిర్మల హృదయులార!              98.
తే.గీ.
చదువు నేర్చెడి కాలాన ఛాత్రతతికి
నస్మదాచార ధర్మంబు లందజేయ
వలయు సత్పౌరులైయిందు నిలుచు కొరకు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              99.

తే.గీ.
ఇలను జెట్లను నదుల గోవులను బసుల
తనకు నాదర్శములుగ జేకొనుట తగును
పరహితంబును గోరెడి పనికి సతత
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             100.
తే.గీ.
ఆధునిక మెంచి సంస్కృతి నణచబోక
ముంగిళులలోన చక్కని మ్రుగ్గు బెట్టి
యతిథులను స్వాగతించు టీయవనినొప్పు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              101.
తే.గీ.
భువిని సాంకేతికత్వంబు పూర్ణముగను
నిండియున్నను జాతికి మెండు కీర్తి
నందజేసెడి వృత్తుల నింద కూడ
దిదియె యందమ్ము నిర్మల హృదయులార!              102.
తే.గీ.
వివిధరూపాలలోనుండి భువికి సుఖము
లందజేసెడి భగవాను డరయ నొక్క
డనెడి భావాన మనుజుండు మనుట యొప్పు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              103.
తే.గీ.
తలచి చేపట్టు కర్మలం దలయకుండ
విఘ్నతతులకు బెదరక విమలమతిని
ముందు కేగుట ధర్మంబు మోదకారి
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            104.

తే.గీ.
పలుకు లందున మధురిమ తలపులోన
నిర్మలత్వమ్ము ధరియించి నిష్ఠబూని
కర్మలను జేయ శుభములు కలుగుచుండు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              105.
తే.గీ.
కలలు నిజమౌను సత్యమ్ము కల్లకాదు
సముచితంబైన యత్నమ్ము సన్నుతగతి
విశ్రమించక చేసెడి విజ్ఞమతికి
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              106.
తే.గీ.
ఫలములనుగోరి నిత్యమ్ము పరు గదేల
భావశుద్ధిని కర్మయే దైవ మనుచు
దలచి యత్నించ సిద్ధించు ధరణిలోన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              107.
తే.గీ.
వారు వీరంచు నెంచక బహుళమైన
కష్టముల నున్న వారల కడకు జేరి
చేతనైనంత సాయమ్ము చేయవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              108.
తే.గీ.
సవ్యరీతిని హరివంశసంభవుండు
సత్యనారాయణుడు వ్రాసె సంతసమున
సాధుచరితుండు సౌందర్య శతక మిట్టు

లిదియె యందమ్ము నిర్మల హృదయులార!              109.


హ.వేం.స.నా.మూర్తి.
22.09.2019.