Sunday 8 September 2019

భవ్యభారతశతకము (మేరాభారత్ మహాన్)


శ్రీరామ
మేరాభారత్ మహాన్
(భవ్యభూమి నాదు భారతమ్ము)
ఆ.వె.
శ్రీలు పంచుచుండు చిద్భాగ్యమును గూర్చు
సర్వజనుల కొసగు సౌఖ్యచయము
సాధుదివ్యచరిత సద్భావభరితయౌ
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      1.
ఆ.వె.
శ్రుతులు పుట్టునేల స్తుతికర్హతనుగూర్చు
శాస్త్రచయము నొసగి సర్వజగతి
ఖ్యాతినందినట్టి కల్యాణగుణదీప్త
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      2.
ఆ.వె.
ఇనుమడింపజేయు నితిహాసములలోన
సన్నుతించ దగిన సంస్కృతులను
సర్వగతుల బ్రజకు సన్మార్గమును జూపు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      3.
ఆ.వె.
కావ్యతతుల జూపి కమనీయమైనట్టి
భావ మెల్ల జనుల గావ బూని
జగతిలోన నింపు సచ్ఛీలసంయుక్త
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      4.
ఆ.వె.
వసుధ నలరు నట్లు బహుళసంఖ్యలలోన
మహిమ గల్గుభాష లిహపరమగు
సుఖము గూర్చురీతి జూపించుచుండిన
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      5.
ఆ.వె.
జాతులెన్నియున్న నీతిమంతంబైన
వర్తనంబు జూపి వసుధలోన
తనసుతాళినెల్ల ధన్యులన్ జేసెడి
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      6.
ఆ.వె.
సత్యవచనమందు సత్త్వంబు గలదెందు
వినుడు మీరటంచు విస్తృతముగ
విశ్వమంత దెలుపు విజ్ఞానపూర్ణయౌ
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      7.
ఆ.వె.
శాంతమార్గమొకటె సంతోషమును నింపు
వైర మాపదలకు కారణమ్ము
శుభములంది సతము సుఖియించుడని నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      8.
ఆ.వె.
సకలజీవులందు సర్వేశ్వరుండుండు
జీవహింస చెరచు క్షేమములను
నమ్మి నడుచుకొనుడు నావార లని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      9.
ఆ.వె.
నీదు పూర్వజనులు నిష్ఠతో జరియించి
ఖ్యాతినందినారు కనుము సుతుడ!
ధర్మములను వీడ దగదని బోధించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      10.
ఆ.వె.
నీది నాది యనుచు భేదభావములేల?
పుట్టునపుడు లేదు పోవునపుడు
వెంటరాదు ధనము వినుడంచు దెలిపెడి
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      11.
ఆ.వె.
వారు వీరటంచు దూరముం బాటించు
టెల్ల తగదు మీకు దల్లినౌచు
నేను నిలిచియుండ నిక్కమంచును దెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      12.
ఆ.వె.
దీక్షబూని వచ్చి భిక్షంబు యాచించు
వాడు దైవసముడు వానిపూజ
భగవదర్చనముగ భావించు డని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      13.
ఆ.వె.
తిండి లేక యొకడు మెండైన కష్టంబు
లందుచుండ సిరుల నంది యొకడు
సంతసించరాదు సము లందరని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      14.
ఆ.వె.
అమలభావ మూని యైశ్వర్యమును బంచి
తోటివారితోడ సాటిలేని
ముదము గనుట యొప్పు నిదె ధర్మమని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      15.
ఆ.వె.
సన్నుతించు రీతి స్వార్థమ్ము విడనాడి
సంహితము గోరి సర్వగతుల
సంచరించు డనెడి మంచిభావము నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      16.
ఆ.వె.
సిరులు బంచకున్న, "నొరులను దూషించి
ఖ్యాతి నందదలచి నీతి దప్పి
తిరుగు టొప్పుగాదు" తెలియుడు మీరను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      17.
ఆ.వె.
మహిళలన్న వినుడు మహిపైని జరియించు
దేవగణము, పూజ్యభావ మూని
గౌరవించు టొప్పు వారి నిందని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      18.
ఆ.వె.
జన్మ నొసగునట్టి జనయిత్రి స్త్రీమూర్తి
యామె లేక జగతి నరయ గలమె?
గారవించు టొప్పు నారి నిందని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      19.
ఆ.వె.
జనున కెల్లగతుల నతర మైనట్టి
యశము గూర్చు మహిళ యామె నెపుడు
సన్నుతించు టౌను సంస్కార మని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      20. 
ఆ.వె.
తల్లిదండ్రులన్న నెల్లసృష్టికి నిందు
కారణంబు లగుట వారి జేర
బోయి శ్రద్ధతోడ బూజించు డని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      21.
ఆ.వె.
జన్మదాతలందు సర్వకాలములందు
వినయవర్తనంబు విస్తృతమగు
పూజ్యభావ మొప్పు పుడమిని మీకను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      22.
ఆ.వె.
జన్మభూమి మరియు జననియు జూడంగ
మిన్న స్వర్గసీమ కన్న నిజము
దీని నెరుగు డంచు మానితంబుగ నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      23.
ఆ.వె.
గురుని సేవ జేయ నరులకు నిహమందు
జ్ఞాన మొదవుచుండు దాన బరము
సుఖద మౌట నిజము చూడుడు మీరను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      24.
ఆ.వె.
ఉన్నదానితోడ నున్నతంబుగ దృప్తి
చెందవలయు సతము చేర వలదు
కాని దానికొరకు నేనాడు నీవను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      25.
ఆ.వె.
పెద్దవారలందు నొద్దిక జూపించి
సంచరించ గలుగు నంచితమగు
సౌఖ్య మిలను మీకు జనులార! యనియెడు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      26.
ఆ.వె.
సాధుసంగమంబు సన్మార్గమును గూర్చు
సర్వగతుల వినుడు సత్వ మొసగు
తెలిసి సంచరించు డిలలోన మీరను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      27.
ఆ.వె.
చీల్చి బలము జూపి చెండాడవలె నోయి!
యిచటి సంశక్తి కెట్టులైన
చెరపు చేయబూను చెనటు లనని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      28.
ఆ.వె.
నియతి దప్పి కోరి నీదేశమును జీల్చ
బూను వారి లోని పొగరు నణచ
సాహసించుమోయి! శక్తిమంతుడ! యను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      29.
ఆ.వె.
సన్నుతించురీతి సర్వేశ్వరుండైన
విష్ణుమూర్తి భువికి విస్తృతమగు
జవము సత్వ మొసగ నవతారములు దాల్చు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      30.
ఆ.వె.
లింగరూపమంది సంగతంబగురీతి
భక్తజనుల గాచి భాగ్య మొసగు
శంకరుండు దిరుగు సర్వోత్తమంబైన
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      31.
ఆ.వె.
నాల్గుమోము లంది నవ్యానురాగాన
తనను గొల్చువారి కనుపమముగ
వరము లొసగు బ్రహ్మ కిరవౌచు వెలుగొందు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      32.
ఆ.వె.
దుష్టులౌచు సతము కష్టంబు లీనేల
గూర్చునట్టి యసుర కోటి ద్రుంచు
శక్తి కనకదుర్గ సంచరించుచునుండు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      33.
ఆ.వె.
ఇలను సర్వజనులు తలచిన పనులలో
తగులబోవు విఘ్నతతుల గూల్చు
విఘ్నరాజు తిరుగు విమలమౌ ప్రాంతమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      34.
ఆ.వె.
తలచువారి కొరకు కలియుగదైవమై
సప్తగిరులపైన సంతసమున
నిలిచియున్నవాని కిలను బ్రీతిదమైన
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      35.
ఆ.వె.
సద్గురూత్తములగు సాయినాథాదులు
ప్రేమతోడ సతము క్షేమసౌఖ్య
మిచ్చుచుండు నేల యిందు సందియమేల?
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      36.
ఆ.వె.
"ఏసు! రక్ష"యన్న, నింపుగ నల్లాను
గొల్తుమన్న గాని, కోరి హరిని
ననుసరింతుమన్న నంగీకరించెడి
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      37.
ఆ.వె.
గుడులు గోపురాలు కోటానుకోట్లుగా
వెలసి సతము ముదము కలుగజేయు
చుండునట్టి చోటు రండు దర్శించుడు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      38.
ఆ.వె.
సుజల లౌచు సతము ప్రజలకు మోదంబు
కలుగ జేయునట్టి గంగవంటి
నదులు పారుచుండు సదమలమైనట్టి
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      39.
ఆ.వె.
దేవతాసమంబు లీవాహినుల్ చేరి
సౌఖ్య మొదవ జేయ సస్యతతులు
పండునట్లు చేసి  భాగ్యంబులను నింపు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      40.
ఆ.వె.
సగరముఖ్యులైన షట్చక్రవర్తులు
నిర్జరాళి కొరకు నిఖిల శుభము
లందునట్లు సాయ మందించు ప్రాంతంబు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      41.
ఆ.వె.
అఖిలభువనతతుల నంగంబులను దాల్చు
గోవు నమ్మవలెను కూర్మిమీర
గొలుచుచుండునట్టి కువలయం బియ్యది
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      42.
ఆ.వె.
మన్ను తింటి వనుచు మాత దండించంగ
దలచ నోటిలోన దాగియున్న
లోకములను జూపు లోకేశు స్థానమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      43.
ఆ.వె.
స్వర్గమందు నుండు జాహ్నవి ప్రేమతో
పుడమిపైకి జేర గడగు నపుడు
చోటు చూపినట్టి దీటైన ప్రాంతమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      44.
ఆ.వె.
ఉత్తరాన జనుల చిత్తంబులను దోచు
చుండి రక్షగూర్చు చుండు నట్టి
హిమగిరీంద్రయుక్త మమలినమౌ నేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      45.
ఆ.వె.
భాషచేత గాని ప్రాంతంబులను గాని
భేద ముండ నేమి? మోద మొసగు
భావ మొక్కటౌచు పావనత్వము గూర్చు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      46.
ఆ.వె.
అమరభాష యిచట నాహ్లాదకరమౌచు
వెలుగుచుండు నట్లె వివిధములగు
ధర్మసూత్రములకు మర్మంబులను దెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      47.
ఆ.వె.
వేదభూమి యగుట విశ్వంబునకు దాను
మానవత్వ మనెడి మాట కుండు
భావ మంద మొప్ప బ్రకటించుచుండును
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      48.
ఆ.వె.
శాంతజీవనమ్ము సర్వసౌఖ్యము లిచ్చు
పోరుబాట తగదు మీరు వినుడు
పౌరులార! యనుచు జీరి బోధించెడి
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      49.
ఆ.వె.
వైరియైన జేరి కోరిన శరణంబు
దొసగు లెంచబోక నసదృశమగు
దయను జూపుగాని దండించ నెంచదు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      50.
ఆ.వె.
విశ్వజనుల సుఖము శాశ్వతైశ్వర్యంబు
గోరి క్రతుచయంబు కూర్మిమీర
చేయవలె నటంచు చెప్పును ప్రజలకు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      51.
ఆ.వె.
అవనిలోన నీకు నపకారమును జేయు
వానికైన హితము వలసినంత
చేయవలె నహితము చేయంగ వలదను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      52.
ఆ.వె.
పలురకంబులైన ఫలితంబు లందించు
యజ్ఞములను భువికి నందజేయు
గురునిభంబు చూడ నిరుపమమై వెల్గు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      53.
ఆ.వె.
కాశి వంటి స్థలము లాశాంతముల దాక
మేటి ధర్మములను చాటుచుండ
దివ్యదీప్తితోడ తేజరిల్లుచునుండు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      54.
ఆ.వె.
విపులమైన రీతి విజ్ఞానశాస్త్రంబు
విస్తరించలేని విషయములను
వేదచయములోన విస్పష్టముగ జూపు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      55.
ఆ.వె.
కర్మభూమి యగుట కష్టించి మనుటందు
నతులమైన హర్ష మందగలదు
నరుడ! యనుచు దెలుపు నవ్యానురాగాన
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      56.
ఆ.వె.
విశ్వజనుల కెల్లవిధముల హర్షంబు
గలుగుచుండ వలయు నలఘుసౌఖ్య
మందుచుండ వలయు ననుచును గాంక్షించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      57.
ఆ.వె.
బాలలందు నిజము భాగ్యహీనులయందు
దీనులందు మరియు జ్ఞానులందు
దైవముండు ననెడు భావంబులను నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      58.
ఆ.వె.
ఎల్లజనుల కిచట నింపారు సౌఖ్యంబు
లందుచుండవలయు నందు నేను
నుండవలయు ననెడి యొప్పిదంబును నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      59.
ఆ.వె.
ఉర్విజనులలోన నుత్సాహమును నింపు
బహువిధంబులైన పర్వములకు
స్థానమై వెలుంగు ధన్యచారిత్రయౌ
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      60.
ఆ.వె.
ప్రజలె స్వాములౌచు పాలనంబును జేయు
చట్టసభలు గలిగి సకలజగతి
యశము లందుచున్న యతులితభావాఢ్య
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      61.
ఆ.వె.
అమరులైనయట్టి యాదేవతలకైన
సాయమందజేసి సాకియున్న
చరితగలుగువారు సామ్రాట్టు లగునేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      62.
ఆ.వె.
మునులు పుట్టినిల్లు  నతరమైనట్టి
తపము లాచరించ దగిన చోటు
పరమ పావనంబు నిరతసౌఖ్యదమైన
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      63.
ఆ.వె.
పలుకులందు జూపు డలఘు మాధుర్యంబు
భావమందు శుద్ధి పనులలోన
ప్రేమ జూపు డనుచు వినిపించు నెల్లెడ
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      64.
ఆ.వె.
అహరహమ్ము కోరి యార్జించుచుండెడి
ధన మశాశ్వతంబు ధరణిలోన
గాన సాయపడుడు దీనుల కని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      65.
ఆ.వె.
శిరము మీద శివుడు సురగంగ నట జేర్చి
వాసముండునట్టి పావనమగు
ప్రాంత మిచట గలదు వరలు కైలాసమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      66.
ఆ.వె.
ఇచటినుండి జేరె నింపార జాహ్నవి
సగరపుత్రతతికి సవ్యగతులు
కలుగజేయుకొరకు నరసాతలమందు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      67.
ఆ.వె.
వ్యాససుకవి నాడు భారతంబును జూపి
బహుపురాణ చయము వ్రాసి యిచట
వేదవిభజనమ్ము విస్పష్టముగ జేయు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      68.
ఆ.వె.
వరమునీంద్రుడైన వాల్మీకి రామాయ
ణాఖ్యమైన గ్రంథ మందమొప్ప
రచన చేసి యున్న రమ్యమౌ ప్రాంతమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      69.
ఆ.వె.
కాళి! నమ్మినాను కాపాడు మమ్మరో!
యనుచు భక్తుడౌచు ననుపమముగ
కావ్యరచన చేయు కాళిదాసునినేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      70.
ఆ.వె.
రమ్యమైనరీతి రఘువంశకావ్యమ్ము
చతురమౌ కుమార సంభవమ్ము
కాళిదాసు వ్రాయు కడురమ్యమౌ నేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                     71.
ఆ.వె.
దూరమైన యట్టి నారీమణికి నాడు
యక్షు డొకడు తెలిపి యభ్రమునకు
సవ్యగతిని జూపి సందేశమును బంపు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      72.
ఆ.వె.
తోరమైన ప్రేమ దుష్యంతు డలనాడు
వరశకుంతలాఖ్య వధువునందు
జూపి భరతు డనెడి సూనుని బడసిన
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      73.
ఆ.వె.
ధర్మరక్షణార్థ మర్మిలి గృష్ణుడు
కోరి పాండవులకు గౌరవులకు
సవ్య మిదియటంచు సమరమ్ము జరిపించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      74.
ఆ.వె.
మృత్యు వందబోవు మేటి భక్తుండైన
మునికుమారు నప్పు డనుపమముగ
హరుడు వేగ గాచి చిరజీవనము గూర్చు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      75.
ఆ.వె.
ఖలుడు రాక్షసుండు కానలందున సీత
నపహరించ హరుల యండతోడ
హరియు వానితలలు నరుక నేగిన నేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      76.
ఆ.వె.
భోజరాజు నాడు పూర్ణసద్భక్తితో
కవులలోన నెవరు నుడటంచు
దెలుప వాణి నిటకు బిలిపించు క్షేత్రమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      77.
ఆ.వె.
తృష్ణ దీరురీతి కృష్ణరాయలు నాడు
తెలుగుభాష నిచట వెలుగజేసి
దేశభాషలందు తెలుగు లెస్సయటన్న
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      78.
ఆ.వె.
భరతనాట్య మటులె పరమ హర్షము గూర్చు
నాట్యరీతులెన్నొ నవ్యగతుల
నందియుండినట్టి సుందరప్రాంతమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      79.
ఆ.వె.
గాంధి నేతయౌచు బంధనమ్ములు ద్రుంచ
శాంతితోడ బోరు సలిపి స్వేచ్ఛ
కూర్చి పెట్టినట్టి కువలయ మియ్యది
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      80.
ఆ.వె.
శాంత్యహింస లిచట సర్వసద్విజయాల
నందజేయ గలుగు నందరకును
నమ్ము డనుచు గాంధి నాడు తెల్పిన చోటు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      81.
ఆ.వె.
మహిత దీప్తి గలిగి మణిహారమై వెల్గు
కాశ్మిరమ్ము దేశ నత నిలను
పెంచుచుండునట్టి యంచితంబగు నేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      82.
ఆ.వె.
సకలజనులలోన సన్నుతాచారమ్ము
లతుల ధర్మదీక్ష చతుర మతియు
నింపి దేశభక్తి పెంపొంద జేసెడి
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      83.
ఆ.వె.
పరము సత్యమౌట నిరత మీయిహమందు
మంచిపనులు చేయ మానవులకు
నచట నిచట సుఖము లందును నిజమను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      84.
ఆ.వె.
దైవమన్న దొకటె భావంబులను భేద
మరసి వాదులాట నరుల కెపుడు
తగదటంచు గొప్ప తథ్యమ్ము బోధించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      85.
ఆ.వె.
పాపభీతియుండ జేపట్టు కార్యాలు
సవ్యగతిని సాగు సత్త్వ మొదవు
సత్య మనుచు జనుల జాగృతి గలిగించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      86.
ఆ.వె.
ధన్యజీవనులను దర్శించి సేవించు
వారి కెల్లగతుల వాస్తవమగు
సంతసమ్ము గలుగు సర్వత్ర యని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      87.
ఆ.వె.
గురునియందు భక్తి, నిరతంబు పఠియించు
భావమూను శిష్యవరుల కెపుడు
విజయమందు ననుచు విస్పష్టముగ దెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      88.
ఆ.వె.
ఛాత్రులందు సతము సద్వత్సలుండౌచు
పాఠ్యబోధనమ్ము పరగ జేయు
గురుడు శ్రేష్ఠు డిలను నిరుపము డని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      89.
ఆ.వె.
మహిళ లెల్లవేళ మహితమై వెలుగొందు
వేషధారణమున విపులమైన
గౌరవమ్ము గాంతు రారయ యని నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      90.
ఆ.వె.
అతులమైన దీక్ష నణుశక్తి శోధించు
కార్యమందు విజయకాంక్షతోడ
సాగుచుండె నేడు సర్వోన్నతంబౌచు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      91.
ఆ.వె.
అంతరిక్ష మందు నాశ్చర్యమును గూర్చు
విషయ మెల్లగతుల విశదముగను
తెలియగోరు దీక్ష కలిగిన దీనేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      92.
ఆ.వె.
శక్తి జూపుచుండి సాంకేతికంబుగ
విస్తరించి విశ్వ వేదికపయి
నత గాంచుచుండె ననిశ మీదేశమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      93.
ఆ.వె.
వృక్షతతులతోడ పక్షిసంతతితోడ
గుడులతోడ కొండగుహలతోడ
సస్యరాజితోడ సర్వదా వెలుగొందు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      94.
ఆ.వె.
చెట్లు, చేమ, లద్రు లట్లె యా నిమ్నగల్
పుట్ట లొక్కటేమి టెట్టి వైన
దైవ నిభము లంచు భావింపబడు నేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      95.
ఆ.వె.
స్త్రీని గౌరవించి చేయూతగా నిల్చి
రక్షచేయ గోరు రమ్యమైన
భావమిందు గలదు పావనప్రాంతమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      96.
ఆ.వె.
అస్మదీయ ధర్మ మానందమును నింపు
పరులధర్మ మెపుడు వెరపు గూర్చు
ధర్మదూరులౌట తగదని బోధించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      97.
ఆ.వె.
పరమహితము గూర్చు పావనత్వమునందు
వేలు పెట్టువాడు కూలువరకు
విశ్రమించ వలదు వినుడు మీరని నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      98.
ఆ.వె.
నరుడు జీవనాన నడువంగ దగినట్టి
మార్గములను దెలుపు మహితమైన
యశము లందు విధము లనిశంబు నేర్పిచు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      99.
ఆ.వె.
అల భగీరథాఖ్యు డిలపైన గంగను
బార జేయుకొరకు ఘోరతపము
చేసియుండినట్టి శ్రీమంతమగునేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      100.
ఆ.వె.
సర్వగతుల దేశసంపద గబళింప
గడగి నట్టి వైరి గణములకును
గణుతికెక్కురీతి గుణపాఠమును నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      101.
ఆ.వె.
దుర్మదాంధులౌచు నిర్మలత్వంబును
జెరచ జేరుచుండు చెనటి జనుల
బారద్రోలువరకు చేరదు నిద్రకు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      102.
ఆ.వె.
తెనె లొలుకు శబ్ద దీప్తులు కురిపించి
స్వచ్ఛమై వెలుంగు స్వాంతమంది
యతిథిజనుల గొలుచు నట్టి దీప్రాంతమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      103.
ఆ.వె.
దయయు, ధర్మదీక్ష, దానభావంబుల
నుగ్గుబాలతోడ నున్నతముగ
బాలబాలికలకు బనిగొని నేర్పించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      104.
ఆ.వె.
ఒరుల యెడల బ్రేమ పరమతసహనమ్ము
సంహితము గోరి సాగుచుండు
భావ మందరకును బంచుచుండెడి నేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      105.
ఆ.వె.
చెనటియైన గాని తనదోషముల నెంచి
బాధపడిన వేళ వాని కొరకు
సవ్యమార్గ మొసగు సాధుత్వ భరితయౌ
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      106.
ఆ.వె.
నేడు సర్వజగతి నిష్థతో శోధించి
విశద బరచు సర్వవిషయతతుల
నిచట నొప్పుమీర నెన్నడో జూపించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      107.
ఆ.వె.
బహుళగతులలోన బారమార్థికమైన
భావసంపదలను చేవజూపి
జనుల కందజేయు సత్వసంపన్నయౌ
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      108.
ఆ.వె.
విశ్వజనుల కెల్ల విధముల సౌఖ్యమ్ము
చేరవలయు ననుచు గోరుచుండు
గాని యహిత మెపుడు కాంక్షించగా బోదు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      109.
ఆ.వె.
సకలవిధములైన సాధుభావంబులం
దతులమైన దీప్తులందు జూడ
ధరను లేదొకండు సరితూగగలదెందు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      110.
ఆ.వె.
వరగుణాఢ్యు డౌచు ప్రజపద్యసభలోన
వరలుచుండు పట్టవర్ధనుండు
వ్రాయజూపె "నాదు భారతంబనుపేర"
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      111.
ఆ.వె.
అమలమై వెలుంగు హరివంశజలధిలో
జన్మమందు మూర్తి సంతసమున
భాగ్యమిది యటంచు వ్రాసె నీ శతకమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      112.

హ.వేం.స.నా.మూర్తి.
08.09.2019

No comments:

Post a Comment