Tuesday 1 November 2011

పాటలు

జవహర్ నవోదయ
జవహరు నెహురూ పేరున వెలసిన(నామాంకితమగు)
చదువుల నిలయం నవోదయం               //జవ//
          జగములనేలే జాగృతభారత
          నిర్మాణానికి మహోదయం            //జవ//
సద్గుణ సంయుత ఛాత్రాఖ్యంబగు
మణిమయ సదనం నవోదయం
ఆరావళి శివ నీలగిరులతో
ఉదయాచలమిది శుభోదయం                   //జవ//
          వినయవర్తనము విజ్ఞానము గల
          విమలాత్మకులౌ విద్యార్థులతో
          సాధుచరితులై సత్యమూర్తులౌ
          అధ్యాపకయుత నవోదయం            //జవ//
చదువూ సంధ్యలు సత్య సంధతా
సమతామమతల సదాశయం
ఆటపాటల నఖిలాభ్యుదయము
మంచిని పెంచెడి మహాశయం                   //జవ//
           కాశ్మీరంబూ కర్నాటకయూ
           అంతా భారత మందరమొకటని
           జాతీయైక్యత చాటుటకొరకై(సాధించుటకై)
           మైగ్రేషను కిట మహోదయం        //జవ//
హిందువులెవరూ యిసాయిలెవరూ
సిక్కు ముస్లిములు చిన్నా పెద్దా
సకల కులంబులు సర్వ జాతులూ 
సములే యనియెడి సదాశయం               //జవ//

గాంధీ స్తుతి గీతం
భారతదేశపు భాగ్య విధాతవు 
భవ్య చరితుడవు బాపూజీ
కారుణ్యామృత భరితాత్మకుడవు 
గర్వరహితుడవు గాంధీజీ                            //భారత//
        జాతికి పితవయి చరితార్థుడవయి
        అమల యశంబుల నందితి వయ్యా
        అస్పృశ్యభావం బసురత్వంబని
        సకల జగంబుల చాటితివయ్యా          //భారత//
సత్యాహింసలు, సద్భావంబులు
సహనశీలమే సత్కార్యమనీ
సర్వమతమ్ములు సమాన మంచును
దివిలో భువిలో తెలిపితివయ్యా                  //భారత//
          దేశమాటృకా దాస్యశృంఖలలు
          దీక్షాదక్షత దొలగించుటకై
          సర్వవిధంబుల సవ్యమార్గమని
          సత్యాగ్రహములు జరిపితివయ్యా     //భారత//
జన్మభూమికై సమస్త సుఖములు
తృణప్రాయముగా త్యజియించితివీ
స్వాధీనత్వము సాధించుటచే 
భవసార్థక్య నందితివీ                              //భారత//
          నీబలిదానము, నిర్మలభావము
          నిత్యగానమయి నిలవాలి
          భారతీయులకు "బాపూ" నామము
          ప్రాత: స్మరణము కావాలి.              //భారత//


విద్యాలయం(పాఠశాల)
చదువుసంధ్యలకు చక్కని నిలయము
సాధువర్తనకు నెలవుయిది,
సత్యం, ధర్మం, శాంతి యహింసలు
సమతా మమతల స్థానమిది                                //చదువు//
      అజ్ఞానంబను అంధకారమును
      ఆమూలాగ్రం బంత మొనర్చుచు
      జ్ఞానజ్యోతులు జగాన పంచెడి 
      కర్మశాలయే(యీ) విద్యాలయము                 //చదువు//
సమాజసేవయు, సమతాభావము
సత్ శీలంబును, సమయ స్ఫూర్తియు
బహువిద్యలతో పంచుచుండెదరు
శిష్యవత్సలత గురుజనులందరు                          //చదువు//
       సద్వినయముతో సత్పాత్రతతో
       మాన్యతనందుచు మనమందరము
       అన్నిటనుండుచు అధిక శ్రద్ధతో
       చక్కని చదువులు చదవాలి
సత్పౌరులము కావాలి/సత్పౌరులుగా కావాలి.         //చదువు//

(ధ్వజస్తుతి) మువ్వన్నెల జెండా
త్రివర్ణశోభిత సువర్ణ ధ్వజమిది
విమలతేజమున వెలుగునది
స్వతంత్రదీప్తియు, సౌభ్రాతృత్వము
సకజగంబుల చాటునది                                      //త్రివర్ణ//
          కాషాయము బహు కమనీయంబై
          శ్వేతవర్ణమది శాంతిరూపమై,
          హరిత యుక్తమై, అతిసుందరముగ
          ఇలలో నెల్లెడ యెగిరే ధ్వజమిది               //త్రివర్ణ//
జాతి విచక్షణ జనులకు తగదని
సర్వవర్ణములు సరిగా సమమని
వేదశాస్త్రముల విస్తృత భావము
దివికిని భువికిని తెలిపే ధ్వజమిది                     //త్రివర్ణ//
          శాంతి యహింసలు, సస్యశ్యామల
          మఖిలజగంబుల కావశ్యకమను
          విజయసూత్రమును త్రిజగంబులకు
          నిరతము చూపెడి నిర్మల ధ్వజమిది        //త్రివర్ణ// 

అంబేడ్కర్
వందనమయ్యా సుందరహృదయా వందనము
బాబాసాహెబ్ అంబేద్కరాఖ్యా! వందనము                     //వందన/
           దేశాలెన్నో తిరిగినవాడవు,
           శాస్త్రాలెన్నో చదివినవాడవు
           భారతభూమికి  బహుమూల్యంబౌ
           రాజ్యాగంబును కూర్చినవాడవు                       //వందన//
                  దళితసోదరుల ఉద్ధరణార్థము
                  అవమానములే వరదానములని
                  ధర్మబద్ధముగ పోరులు సల్పుచు
                  జీవితమంతయు గడిపిన వాడవు            //వందన//
           మంచిమనసుతో మహనీయతతో
           కులమతభేదము కూడదటంచును
           సకలజనాళికి సమతను బంచుచు
           జాతిరత్నమై నిలిచినవాడవు                         //వందన// 



వివేకానందుడు
వందనము అభివందనము
వివేకానందున కందము లొలుకగ
వందనము అభివందనము                                  //వందన//
      నిత్యానందుడు నిర్మలచిత్తుడు
      నిఖిలాగమముల నిష్ణాతుండు
      భారతీయతను బహుదక్షతతో
      విశ్వజానాళికి విశదము జేసెను                       //వందన// 
ఋషులకు ఋషియై మనీషి యనియెడు
ఖ్యాతి వహించిన ఘనచరితుండు,
వివాదరహితుడు, వివేకభరితుడు
సుందరరూపుడు సుగుణాత్మకుడు                       //వందన//
      కార్యదీక్షితుడు, కాషాయాంబర
      ధారణ జేసెడు ధీరాత్ముండు,
      శాంతిప్రియుడును, సత్యాన్వేషియు
      రూపుధరించిన హిందూ ధర్మము                   //వందన// 


నవోదయ సద్భావగీతం

సోదరభావం మదిలో పెంచుక నవోదయంబున మెలగుదమా
తరతమ భేదము దరిరానీయక భారతీయతను చాటుదమా
                                                                            //సోదర//
మమతను నింపే మైగ్రేషనులో జాతీయైక్యత కనబడగా
చదువుల క్రీడల సహజీవనమున వివేకవృద్ధియె మనబడిగా
                                                             (వినబడగా)//సోదర//
మధురవాక్యముల గురుజనులందరు ఆప్యాయతనే పంచగనూ
సర్వకాలముల సద్బోధనలో జ్ఞానదీధితులు పెంచగనూ
                                                                             //సోదర//
తల్లీ తండ్రీ సర్వము తామౌ గురువుల ఖ్యాతిని పెంచుటకై
జన్మదాతలౌ జననీజనకుల స్వప్నము సత్యము చేయుటకై
                                                                             //సోదర// 

స్వాగతగీతం - 1
స్వాగతాంజలి విమలవినయ వినమితాంజలి
భక్తిభావకోటికుసుమపూరితాంజలి                       //స్వాగతా//
అతిథివరుల కధిక వత్సలాఢ్య జనులకు
సమతజూపి మమత బంచు సజ్జనాళికి                 //స్వాగతా//
జన్మనిచ్చి ప్రేమ బంచు జనక వరులకు
సత్యపథము జూపునట్టి సాధుజనులకు               //స్వాగతా//
యుష్మదమల మార్గదర్శనంబు గావలె
అస్మదంతరంగ వికసనంబు గావలె                      //స్వాగతా//

స్వాగతగీతం - 2
(పూర్వవిద్యార్థుల సమావేశానికి)
స్వాగతము, (సు)ఘనస్వాగతము
అగ్రజవరులకు స్వాగతము                               //స్వాగ//
          మీఆగమనము మిక్కిలి మోదము
          మీ పథదర్శన మనుసరణీయము
          మీ అనుభూతులు, మీఅనుభవములు 
          మాలో స్ఫూర్తిని, మంచిని పెంచును           //స్వాగ//
 చిన్నా, పెద్దా భేదము లేదని
మందిర మిదియని అందరు సమమను
సమరభావం - చదువులసారం
చక్కగ నేర్పే(నవోదయానికి)నవోదయంబున       //స్వాగ// 

 (ఎయిడ్సె అవేర్ నెస్ వీక్ సందర్భంగా 
విద్యార్థులతో ప్రచారం చేయించడానికి 
వ్రాసిన పాటలు)
ఎయిడ్స్ -  1
వద్దుబాబు వద్దురో ఈబ్రతుకు నాకొద్దు
చావొక్కటె మార్గంబు సరియైనా నిర్ణయము                 //వద్దు//
      ఏ జన్మలొ చేశానో, ఏ పాపం చేశానో
      ఈ జన్మాలోన నాకు ఈ ఎయిడ్సు రోగమొచ్చె

బహు దుర్లభమైన జబ్బు పగ వాడికి కూడ వద్దు         //వద్దు//
తల్లి, తండ్రి, అన్న, చెల్లి , పెండ్లా మందరినుండి
వల్లదనెడు మాటాయె పలుకరింత కరువాయె              //వద్దు//
      తోటి వారి నిట్లు వదిలి దులబరింత సరియగునా?
      మానవత్వ మన్నమాట మరచిపోవుటే తగునా?     //వద్దు//
వద్దు వద్దు వద్దంటూ  మరణము సరికాదంటూ
ఊతమిచ్చి వారిలోన ధీరతనూ పెంచాలి
అంటు వ్యాధి కాదంటూ ఎవరికంట బోదంటూ
మమత బంచి మాటలాడి మధురిమనే పంచాలి            //వద్దు//

ఎయిడ్స్ -  2
ఎయిడ్సంటె ఏమిటో ఎందుకదీ వస్తుందో
తెలుసుకొనగ రారండీ తెలియజేయ కదలండీ                  //ఎయిడ్సంటె// 
     మందు మాకు లేనిదండి, మహమ్మారి యిదియండీ
     చక్కగ జాగ్రత్త పడితె యిది ఎవరికి సోకదండీ            //ఎయిడ్సంటె// 
ముట్టుకుంటె రాదండీ మాటాడిన సోకదండి
ఇది సోకిన వారి కింత అనురాగం పంచండి                    //ఎయిడ్సంటె// 
     దానాలన్నింటిలోన రక్తదాన మన్నారు
     తెలియకుండ, తెలుసుకోక  రక్తము నివ్వద్దండీ         //ఎయిడ్సంటె// 
ఈ రుగ్మత నున్నవాళ్ళ నింటినుండి త్రోయకండి,
బ్రతికినంత కాలమైన బలమును చేకూర్చండి               //ఎయిడ్సంటె// 
     రామరాజ్యమండి మనది రాముడు మనదైవ మండి,
     ఏకపత్ని వ్రతమన్నది ఎప్పుడు మరి మరువకండి     //ఎయిడ్సంటె// 
తుచ్ఛమైన సుఖము గోరి విచ్చలవిడి విహరించకండి,
కట్టుకున్న కులకాంతను నట్టేటా ముంచకండి               //ఎయిడ్సంటె// 
     ఇంద్రియ నిగ్రహము గలిగి ఎయిడ్సు రోగ మంటకుండ
     వలసిన జాగ్రత్తలన్ని బహు శ్రద్ధగ పాటించి
     రక్షణసూత్రాలనన్ని సోదరులకు తెలియజేసి
     ఎయిడ్సురహిత భారతంబు నేర్పాటు చేద్దాము        //ఎయిడ్సంటె//      

ఎయిడ్స్ -  3
ఎయిడ్సనే రోగమంట ఇనుకోర పోలిగా
తగులు కుంటె వదలదంట తెలుసుకోర పోలిగా                  //ఎయిడ్సనే//
     ఎయిడ్సంటే ఏమిటో ఇవరంగ చెప్పవే
     ఎట్టాగది వస్తాదో ఇడమరచి చెప్పవే                            //ఎయిడ్సనే//
హెచ్.ఐ.వి. కణములు ఇసుమంత ఉంటేను
ఎయిడ్సురోగ మౌతాది ఇనుకోర పోలిగా
సూది మార్చకుంటేను సూడరోరి పోలిగా
ఎయిడ్సు రోగ మొత్తాది ఇనుకోర పోలిగా                        //ఎయిడ్సనే//
     ఇంకెట్టాగొస్తాది ఇవరంగ చెప్పవే
     తడబడకా వడివడిగా ఇడమరచి చెప్పవే                  //ఎయిడ్సనే//
సొగరమేళ, గడ్డమేళ సుబ్బరంగ పోలిగా
కొత్తబ్లేడు వాడకుంటే కొంపమునుగుతాదిరా
ఎట్టాంటి రగతమో ఎరగకుండా ఎక్కిస్తే
ఎయిడ్సురోగ మొస్తాది ఇనుకోర పోలిగా                        //ఎయిడ్సనే//
      కోరికోరి నీతి దప్పి కొంపలంట తిరిగితే
      కోరికలే లేకుండా కొంప ముంచుతాదిరో
      మందు లేదు, మాకులేదు మాయదారి రోగంరో
      సందులంట తిరగకుండ సక్కంగ నడవరో                //ఎయిడ్సనే//
అమ్మలార! అయ్యలార! అందరికీ తెలపండి
ఎయిడ్సుబారి పడకుండా హాయిగ జీవించండి.               //అమ్మలార//  


ది. 31.07.2004  వ  తేదీన 
జ.న.వి. వెన్నెలవలస ప్రిన్సిపాల్ 
శ్రీ ముళ్ళపూడి కోటేశ్వరరావు గారి 
పదవీవిరమణ సందర్భముగా 
వ్రాసిన గేయం.

నిర్మలహృదితో మర్మములెంచక సన్మానింతము రారండీ,
కూరిమి నిండిన కోటేశ్వరునకు పదవీవిరమణ నేడండీ            //నిర్మల//

ముళ్ళపూడి ద్విజవంశంబున తా ముదమొప్పంగను పుట్టెనటా
అధ్యయనార్థం బారోజులలో లండను దాకా వెళ్ళెనటా             //నిర్మల// 

భావిపౌరులౌ బాలబాలికలు పఠియించుటకై బహుదక్షతతో
సాంఘిక నామక శాస్త్రాంశంబులు విస్పష్టంబుగ వ్రాసెనటా      //నిర్మల// 

బాలబాలికల బంగరు భవితకు అహరహమూ శ్రమియించెనటా
శాంతినికేతన సదృశంబులుగ విద్యాలయములు మలచెనటా //నిర్మల// 

తరతమ భేదము లేనే లేదట మార్గదర్శనను మేటియటా
తలచిన కార్యము సాధించకయే సంకల్పంబును వీడడటా     //నిర్మల// 

బహువిధ ప్రజ్ఞుడు బహుళయశుండట పాలనమందున దక్షుడటా
రంగస్థలమున రమణీయముగా నవరసములనే చూపునటా   //నిర్మల// 

సదమలయశములు సత్సంపదలు కోటేశ్వరునకు కూడవలె
జగదాధారుడు శ్రీసాయీశుడు సకలశుభంబుల నొసగవలె.  //నిర్మల//   



విద్యార్థులకు ప్రార్థనా సభలో జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకు వ్రాసిన పాట.
కామనలు శుభకామనలు
జన్మదినోత్సవ కామనలు
మనలో ఒకరగు మన నెచ్చెలియగు
_______కివె శుభకామనలు  //కామనలు//
          శతమానాయువు, స్వస్థత నిండిన
          చక్కని జీవన మబ్బాలి
          సకల సంపదలు సదమలయశములు
          సన్మతి నీ కెపుడందాలి //కామనలు//
ఆ భగవానుం డఖిలదుడికపై
అన్నిట జయముల నివ్వాలి
జన్మకారకులు జననీ జనకుల
కాంక్షలు సఫలము కావాలి //కామనలు//
          ఇప్పటిలాగే జీవిత మంతా
          నవ్వుల పువ్వులు పూయాలి
          కూరిమి నిండగ నీకెన్నెన్నో
          జన్మదినంబులు జరగాలి //కామనలు//
          (వేడుక లిట్లే జరగాలి)    
08.11.2006
జ.న.వి. వెన్నెలవలస, శ్రీకాకుళం.
                                శ్రీమతి పి. సుగుణకుమారి, పి.జి.టి. హిందీ, జ.న.వి. 
                           విజయనగరం పదవీవిరమణ సందర్భంగా

సద్భావంతో సంతసమందుచు సన్మానింతము రారండీ
సద్గుణరాశికి సుగుణాఖ్యార్యకు పదవీవిరమణ నేడండీ //సద్భావంతో//

దీప్తులందుచును ద్విజవంశంబున చక్కగ జన్మము నందినదీ
జననీజనకుల కత్యుత్తమమగు సంతోషంబును కూర్చినది//సద్భావంతో//

పాఠ్యబోధనము బహుయుక్తంబని అధ్యాపికగా మారినదీ,
బోధనచేయుట పూర్వపుణ్యమని తనుహృద్భాషల తలచినది//సద్భావంతో//

నవోదయంబున నానాస్థలముల విద్యాబోధన చేసినదీ
హిందీభాషను సుందరమౌనటు లందరి కెల్లెడ చెప్పినది //సద్భావంతో//

ఎక్కడి కేగిన నెక్కడ నున్నను మిక్కిలి మక్కువ చూపినదీ
విమలాత్మకయని, విదుషీమణియని విమలయశంబుల నందినది 
                                                                                 //సద్భావంతో//

ఆభగవానుం డమితాదరమును చూపుచు దీవెన లివ్వాలి
శతమానాయువు స్వాస్థ్యం బబ్బుచు శేషజీవితము సాగాలి //సద్భావంతో//
 
  




 













Thursday 20 October 2011

మతము

మతసామరస్య వారోత్సవాల సందర్భంగా వ్రాసిన పద్యములు
మతము
ఛందము - ఆటవెలది.
మనిషి మనసులోన మమతానురాగాలు
ధర్మబుద్ధి గూర్చి ధరణిలోన
వాసిగొల్పునట్లు వసుధైక కౌటుంబ
భావనంబు పెంచవలయు "మతము".


కలహకారణంబు కారాదు మతమేది
కలసియుండుటెల్ల ఘనముగాదె
భరతజాతి మనది, సరియగు దృష్టితో
చూడవలయు జనుల సోదరులుగ.


మతములెన్నియైన మానవత్వంబొండె
దాని దాల్చ జన్మ ధన్యమగును
భావమెరిగి జనులు భాగ్యరేఖలనంది
మంచి బుద్ధితోడ మసల వలయు. 


పుణ్యభూమి యంచు పూర్వకాలమునుండి
ఖ్యాతి బడసి మిగుల నీతి గల్గు
భరతభూమిలోన బహుమత కలహాలు
తొలగిపోయి సమత వెలుగ వలయు. 


మతము పేర జరుగు మారణహోమంబు
మార్చె దానవునిగ మనిషి నిచట
మనువు నేర్పినట్టి మానవత్వము జంపు
మతము వలదు వలదు మనకదేల?


                 భావి భారత భాగ్యవిధాతలైన విద్యార్థులు
                                      ప్రతిహృదిలో సమతాభావం తిలకించాలి,
                                      ప్రతిమదిలో సమరసభావం పలికించాలి.

Sunday 16 October 2011

నేటిభారతం

నేటి భారతం
(వర్తమాన దేశపరిస్థితులగూర్చి వ్రాసిన పద్యములు)
(ఛందము - ఉత్పలమాల)


ఏమి విచిత్రమో తెలియదీభరతావనిలోన దుష్టతా
ధూమము విస్తరిల్లినది, దుర్జనసంగతితోడ మానవుల్
నీమము దప్పి యుండిరిట నిత్యములయ్యె నధర్మకార్యముల్
సేమము మృగ్యమైనయది, చిందరవందరయయ్యె సౌఖ్యముల్.


పూర్వపు వైభవంబులవి పోయినవెక్కడ? దేశమంతటన్
పర్వములన్నియున్ కనగ భావవిహీనములయ్యె, సృష్టిలో
సర్వము పాపపూరితమసారమునయ్యె, సహిష్ణుతా
నిర్వహణంబు శూన్యమయి నీరసమయ్యెను వేదపాఠముల్.


సత్యము నామమాత్రమయి సర్వజనంబుల యంతరంగముల్
నిత్యము కల్మషంబులను నిండి యకారణ శత్రుభావముల్
హత్యలు, మానభంగములు నాసురకృత్యము లన్నిచోటులన్
నృత్యము చేయుచున్నయవి నిర్మలసఖ్యము కానరాదిలన్.


వేదవిచారశూన్యులయి విప్రులనేకులు భారతాన సం
పాదితభూసురత్వమును, బంధురవిజ్ఞత గోలుపోయి, దా
మోదరశంకరాది సురముఖ్యుల సేవలు విస్మరించి యు
న్మాదముతోడ నుండిరిట మత్సరగ్రస్తత ధర్మబాహ్యులై.


నాలుగుజాతులందు నిల నైతికవర్తన మంతరించె నే
డేలనొ, భారతానగల యేలికలందరు స్వార్థభావనా
జాలము చిత్తమందు గొనసాగ నగణ్యదురాగతంబులన్
దేలుచు సఖ్యముండిరిట దేశపురోగతి కడ్డుగోడలై. 


సత్యముబల్కువారలకు సర్వపరాభవదు:ఖసంతతుల్
నిత్యమసత్యభాషణము, నీమము దప్పిన వర్తనంబులున్
హత్యలు, దోపిడీలు, పరిహాసవచస్సులు బల్కుచుండి స
త్కృత్యము దూరువారలకు దివ్యసుఖంబులు నేడు జూడగన్.

వచన కవిత్వం

 రక్షకభటుడు
శ్రీకాకుళం జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ ప్రత్యేక సంచిక "అంజలి" కోసం వ్రాసిన కవిత.


రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     ఇంటాబైటా వీధులలోనా
     కార్యాలయముల సర్వాకారత
     ఎక్కడజూచిన తానేయగుచూ
     అఖిలజగత్తున కాత్మబంధువై
          తనసంసారము, ఘనసంతానము
          ఖాకీబట్టలకంకిత మిచ్చీ
          స్వార్థబుద్ధినీ త్యజియించీ
          సతతము సేవల సతమతమయ్యే
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     దుండగులెచ్చట దండిగ ఉంటే
     మెండుగ వారల దండించుటకై
     లాఠీదెబ్బల లావణ్యంబుగ
     దేహశుద్ధితో దీవించుటకై
          దేశపౌరులే తన సోదరులని
          దేశరక్షణమె తనకు కార్యమని
          ముదము మీరగా ముందుకుదూకే
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     సంఘసేవయే పరమార్థముగా
     సాధువర్తనమె సల్లక్షణమై
     దేశరక్షణమె దివ్యవరమనీ
     కర్తవ్యానికి కట్టుబడుటకై
          కాలత్రయమున త్రికరణశుద్ధిగ
          ప్రతిజ్ఞబూనిన పోలీసండీ
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     అవినీతులనూ అక్రమాలను
     దుష్టబుద్ధినీ దుర్మార్గమును
     నిర్మూలించగ నిజజీవితమే
     పణముగ బెట్టిన పోలీసండీ
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     సమాజభూజపు చీడపురుగులై
     అభివృద్ధులకే అడ్డుగోడలై
     తమభావాలకు మమతను వీడుతు
     కిల్బిషమయమౌ గీతిక పాడుతు
          దేశాన్నమ్మే ధీమంతులకు
          సింహస్వప్నము పోలీసండీ
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     మంచికి మమతకు మారుపేరుగా
     మానవీయతకు మరోపేరుగా
     దుష్కృత్యాలను, దోపిడీలను
     మాయాదైత్యుల మట్టుబెట్టుటకు,
          శాంతి యహింసలు సమాజమందున
          నెలకొల్పుటకై నడుము బిగించిన
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
  ఇక వర్తమానమును వచియించినచో
     అవినీతులతో, అక్రమాలతో
     దౌర్జన్యాలతొ, దుర్బుద్ధులతో
     అధికాహంకృతి ఆసురగుణులౌ
     దుర్మార్గులతో, ద్రోహిగణముతో
          చేతులు కలిపీ స్వీయగౌరవము
          కాలరాయుచూ ఖాకీ బట్టల
          ఔన్నత్యంబును అణగద్రొక్కుచు
          కర్మఠరూపము కళంకితంబుగ
స్వార్థభావనకు సద్రూపముగా
కల్మషజాలము కడుపున నింపుక
          పోలిసుశాఖకు పూర్వార్జితమగు
          పూజ్యభావనలు పుడమిక్రిందకు
          అణచెడివారే అధికులు గలిగిన
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     తనకళ్ళెదుటే ధరణీవలయము
     ధర్మబాహ్యమై, దానవీయతకు
     నిలయంబై మరి నిలబడగా
          సకలజీవులకు జన్మదాతయై
          అఖిలజగంబుల కాధారంబగు
          అబలామణి నేడవమానాలకు
     గురియై, అవనతయై, బహుదు:ఖితయై
          రక్షణకోసం రాత్రీపగలూ
          అబలను నేనని యాక్రోశించగ
     చూచీ చూడక, కిమ్మనకుండగ
     రిపోర్టు లేదని, సపోర్టులేదని
     పెదవిని విప్పక ముదమున నుండే
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     ఈ పరిణామపు కారణమేమో,
     ఈవిధి వీరలు మారుటయేమో
     రక్షకభటులే భక్షకులనియెడి
     పత్రిక వార్తల ఫలమదియేమో
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ
     సత్యమహింసా సమానధర్మం,
     నిస్స్వార్థంబును, నిర్మలచిత్తము
     అంకితభావం, ఆత్మీయతయు
     సేవాగుణములు తనలో పెంచుక
          శాంతమూర్తులై సద్భావంతో
     కర్మభూమియౌ పుణ్యభూమియౌ
     భారతదేశపు పురోభివృద్ధికి
     రక్షకభటులే యాధారంబన
     కీర్తిమంతులై మెలగాలి,
     రక్షకభటులై నిలవాలి.
రక్షకభటునీ ఉదంతమండీ
లక్షితబుద్ధిని వినరండీ.
  
వ్రాయాలని ఉంది
వ్రాయాలని ఉంది
సత్కవితారచనం చేయాలని ఉంది
       మధుర మనోహర దృశ్యాలను తిలకించి,
     మదీయ మనోభావాలను మేళవించి,
     నవరసభావాలొలికించి, 
     సమరసభావం పలికించి
     సురుచిర సుందర శబ్దాలతో
     సరససుకుమార పదలాలిత్యంతో
వ్రాయాలని ఉంది
సత్కవితారచనం చేయాలని ఉంది
     జననియు, పిమ్మట జన్మభూమియును
     స్వర్గముకన్నను సర్వోత్కృష్టములను భావనతో
ధర్మభూమియని, కర్మభూమియని
మునులకు, ఋషులకు, ఘనచరితులకు,
షట్ శాస్త్రాలకు, సద్ధర్మాలకు,
వేదచతుష్టయసారంబులకు,
భగవద్గీతకు, బహుగ్రంథాలకు,
సమతకు, మమతకు, సకలమతాలకు
నిలయం బిదియని నిర్మలహృదితో
     శుభకామనతో సద్భావనతో
     అతిసుందరముగ నస్మద్దేశపు
     ఖ్యాతిని దెల్పగ లేఖిని గైకొని
     శ్రీకారంబును చుట్టిన క్షణమున
అఖిల జగంబుల నబలలనందరి
నతివేగంబున బలిగొను సుందరి
వికృతరూపము, విశ్వాకారము
కన్యాశుల్కపుటగ్రజ తానట
వరకట్నంబది, పెనుభూతంబది
     ఎదురై నిలిచిందేమిటిదంటూ
     దేశకీర్తనము తగదని యంటూ
వ్రాయాలని ఉంది
సత్కవితారచనం చేయాలని ఉంది
     ఎం.ఏ. బీ.ఏ. లెన్ని చదివినా
     ధ్రువపత్రాలవి యెన్ని దొరికినా
     తినుటకు తిండీ కట్టుబట్టలూ
     దొరకక యిలలో జనజీవనమది
     వర్తమానమున దుర్భరమవ్వగ
బ్రతుకు తెరువుకై బాటయిదంటూ
అన్యాయాలను ఎదిరించుటయే,
అక్రమాలపయి విక్రమించుటయె
ధర్మపథంబది తమదని యంటూ
     శపథం పూనియు సరణిని మార్చిన
     తీవ్రవాదులం మేమని పలికే
సోదరులెదురై నిలిచా రేమిటిదంటూ
దేశకీర్తనము తగదని యంటూ    
     వ్రాయాలని ఉంది
     సత్కవితారచనం చేయాలని ఉంది
కర్మశాలలను, కార్యాలయముల
రచ్చబండలను, రక్షిత స్థలముల
వివిధప్రాంతముల విశ్వాకారత
దర్శనమిస్తూ ధరణీతలమున
     మూలముతానని శూలపాణియై
     తాండవమాడే ధనపిశాచమది
ఎదురై నిలిచిందేమిటిదంటూ
దేశకీర్తనము తగదని యంటూ    
     వ్రాయాలని ఉంది
     సత్కవితారచనం చేయాలని ఉంది
స్వర్గద్వారము చక్కగ జూపెద,
సకల సిద్ధులను తృటిలో నిచ్చెద
దేవుని దూతను తిరముగ నమ్ముడు,
శక్తిమంతుడను సర్వంబమ్ముడు
     మీమానంబులు, మీధనసంచయ
     మంతా నాకే అర్పించండని
     సంగత్యాగిని, స్వామిని నేనని
     మూర్ఖజనాలను మోసగించుచూ
మాయలు మర్మాలెన్నో చూపుచు
     బ్రతుకు తెరువుకై పద్ధతి మార్చిన
     కాషాయంతో వేషం కూర్చిన
     కుహనాసాధువు కోపంగా గని
ఎదురై నిలిచాడేమిటిదంటూ
దేశ కీర్తనము తగదని యంటూ
     వ్రాయాలని ఉంది
     సత్కవితారచనం చేయాలని ఉంది
అధికారార్థం బఖిల జనానికి
సేవలు చేశా సిరులను పంచా
ఎన్నికలొస్తే ఎట్లాగైనా
లబ్ధినందుటకు లక్షలు పంచా
     కోట్లు గడించుట కనీస ధర్మం,
     నోట్లను పొందుట జీవిత మర్మం
నిజమిది యందుకె  నిధులన్నిటిని
స్వాహా చేయుట సరియగు పనియని
     ప్రతి ఉదయంబున ప్రతిజ్ఞ బూనే
     నేత యతండట నను గర్జించీ
     మూర్ఖుడ వీవని నను తర్జించీ
ఎదురై నిలిచాడేమిటిదంటూ,
దేశకీర్తనము తగదని యంటూ
     వ్రాయాలని ఉంది
     సత్కవితారచనం చేయాలని ఉంది
విస్పష్టంబుగ, విస్తారంబుగ
అంచెలంచెలుగ పంచభూతములు
     హేళన చేయగ యీవిధి యిట్టుల
     దేశకీర్తనము చేయుట యెట్టుల?
జగాలనలమిన మృగతుల్యములగు
అకారపంచక మభిధానములగు
     అన్యాయంబులు, నక్రమంబులును
     అధర్మకార్యాలవినీతులును
     అవిద్య మొదలగు నఖిల రుగ్మతలు
     బహుభూతంబులు బహు దుర్మతులు
అదృశ్యమయ్యెడి యాక్షణమెప్పుడు?
జగాలనన్నిట జనని భారతియె
బహుశ్రేష్ఠంబని ప్రశంసలందే
మధుర క్షణములు మరి యవి యెప్పుడు?
     కవి హృదయం పులకించేనా?
     వాంఛిత మృదుభావాలను పలికించేనా?
వ్రాయాలని ఉంది
సత్కవితారచనం చేయాలని ఉంది


ఉగాది ఎప్పుడు?

ఉగాది పండుగ వచ్చిందంటూ
ఆనందాలను తెచ్చిందంటూ
     సంతోషంతో సద్భావంతో
     సుమధుర సుందర పదజాలంతో
నూత్నవత్సరమ! స్వాగతమంటూ
దశదిశలా యిక శోభనమంటూ
     కవితలల్లుకొని, మమత నింపుకొని,
     కవులంతా మరి  వేదికలెక్కీ
     దివిజావళికిక దీటుగ మ్రొక్కీ
     నూతనహాయన వైభవంబులను
     భావిజీవితపు సౌఖ్యంబులనూ
కీర్తిస్తే మరి సరిపోతుందా?
     స్వాగతగీతిక పాడుతు పోతూ
     కవితానాట్యాలాడుతు పోతూ
     ప్రజలంతా యిట కలిసుండాలని,
     సమతా మమతా కలిగుండాలని
ఉపన్యసిస్తే సరిపోతుందా?
     స్త్రీస్వాతంత్ర్యం సిద్ధించాలని
     దేశాభ్యుదయం పెంపొందాలని
          నిండు సభలలో
          మెండు స్వరంతో
ఆక్రోశిస్తే సరిపోతుందా?
     ప్రతిగ్రామంలో, ప్రతిరాష్ట్రంలో
     దేశమంతటా, విశ్వం నిండా
            వీధులు
            పేటలు
            రచ్చబండలూ
     ఎక్కడచూచిన మారణహోమం
     ఏచోటైనా స్వార్థపుధూమం
     ధనం చూచుకొని, మదం పెంచుకొని
     దుష్టశక్తులను కూడగట్టుకొని,
     అన్యాయంతో, అక్రమాలతో
     పేదలరక్తం పిండిత్రాగుతూ
     బడాబాబులై మనుషులుండగా
ఉగాది యెక్కడ? యుగాది యెక్కడ?
     జాతిభావములు, భాషాభేదము
     లక్రమకృత్యాలన్యాయంబులు
     ఎచ్చట చూచిన పెచ్చరిల్లుతూ
     సంకోచింపక విజృంభింపగ
ఉగాది యెక్కడ? యుగాది యెక్కడ?
     మనిషిని మనిషియె మదమత్సరుడై
     పశుసమానుడై భక్షణసేయగ,
     ఇంటా బైటా దేశమంతటా

     స్వతంత్రపవనాలదృశ్యమవ్వగ
     శాంతి యహింసలు మృగ్యములవ్వగ
ఉగాది యెక్కడ? యుగాది యెక్కడ?
     పగలైనా మరి రాత్రైనా
     ధైర్యవంతులై నడివీధులలో
     స్త్రీలంతాయిక స్వేచ్ఛగ తిరిగే
ఉగాది యెప్పుడు? శుభాది యెప్పుడు?
     దేశమంతటా నలుమూలలో
     ఎక్కడచూచిన ఎక్కడవిన్నా
          పెనుభూతాల్లా
     పాతుకుపోయిన తీవ్రవాదములు,
     మనసులు నిండిన మతదురంతములు
     ఆసాంతంగా అదృశ్యమయ్యే
     శాంతి యహింసలు ప్రకటితమయ్యే
ఉగాది యెప్పుడు? శుభాది యెప్పుడు?
     పురాణతతులకు పుట్టినిల్లుగా
     చతుర్వేదముల జన్మభూమిగా
     ఖ్యాతి వహించిన భరతావనిలో
     అఖిలధర్మముల కాటపట్టుగా
     మునులకు జనులకు మోక్షదాయిగా
     పేరుగడించిన పుణ్యభూమిలో
సత్యం, ధర్మం, సమతాభావం
జనముల మనముల సద్భావం
దూరంగా కనుమరుగై పోవగ
క్రౌర్యం, ద్వేషం, కుటిలత్వంబులు

వైషమ్యంబులు, విమతత్వంబులు
నిత్యసత్త్వమున నాట్యములాడగ
     ఉగాది యెక్కడ? యుగాది యెక్కడ?


ఉగాది
నేడే ఉగాది, సుభాను సంవత్సరాది
సమతా మమతల సద్భావాది,
కవితా భవితల నవయుగాది,
మనకందరికీ ఈ యుగాది            కావాలి
సకల సత్కార్యాలకు శుభాది
సత్యం, శివం, సుందరాది             భావాలను
ప్రతిహృదిలో పలికించే సదాది
కర్షకజనులకు నవ సస్యాది
హర్షిత హృదులకు భవభోగాది
సాధు జనాలకు సత్సంగాది
ముదిత మనాలకు శుభమోక్షాది
కవిగురుజనులకు శుభశబ్దాది
ఛాత్రగణానికి సత్ శీలాది
సర్వజనాలకు బహు పర్వాది
ఆప్యాయతానురాగాలకు పునాది
ఈసారైనా మారాలి మతోన్మాది          కావాలి
సర్వమత సమరసాస్వాది
ఈ సమయం అతి శుభసమయం
ఈ వత్సరమంతా సుఖాల మయం
మీ జీవనమతి సుందరం
మీ మనసది యొక మందిరం           కావాలని
ఆకాంక్ష, శుభకామన.


     
    

Saturday 1 October 2011

మత్స్యోదంతము


మత్స్యోదంతము
(చేపల కథ)
(గద్య కథకు పద్యాను కృతి) 
పూర్వకాలమందు పుష్పక మను చెర్వు
కలదు దానియందు కాలమతియు
సుమతి, మందమతియు సుఖ్యాతనామాల
మత్స్యమిత్రులుండు మైత్రితోడ.

సుమతి సార్థకనామంబు శోభనంబు
అకట! యేదేని యాపద నంది నపుడె
గాంచు సద్భావభాగ్యంబు కాలమతియు
మంద మతియౌర! నిజముగ మందబుద్ధి.

భేదము లేకిక మత్స్యాల్
మోదంబున జేరియుండు ముచ్చట గొల్పన్.
రాదేది వాటి మధ్యను
వాదెప్పుడు జూడ మిగుల వాక్యము లేలా?

అంత నొకపరి వేసవి యెంతొ తీవ్ర
తరముగను గాసె లోకాలు దైన్యపడగ,
చెట్లు చేమలు పైరులు చేవ జచ్చి
కనలిపోవుచునుండ దా గాంచి సుమతి.

తనమిత్రులతో నను దాన్
వినుడో సన్మిత్రులార! వేసవి జూడన్
కనకన నిప్పులు రాల్చుచు
ఘనతాపము గూర్చు చుండె కనుడీ మీరల్.

ఇంతకు మున్నె జాలరులు యిచ్చటికేగిరి వారలొండొరుల్
సంతసమంది పల్కిరిటు చక్కగ చెర్వున నీళ్ళు లేమి తా
మెంతయొ మోదమందుచును నిచ్చటి నీరము కొద్దికాలమం
దింతయు నింకిపోవు నపుడిచ్చట చేపల బట్టగా దగున్.
              కావున
ఇట నుండగ రాదికపై         
నెటులైనను నేగ వలయు నెందేనిపుడే
పటుతరమగు యాలోచన
నటు నిటు యోచించి గనుడు యస్మన్మిత్రుల్.

బాగగు యాలోచన దా
న్సాగెను మన్మదిని యిపుడు శ్రద్ధగ వినుడీ
వేగంబున మనమందర
మాగక యీకాల్వవెంట నఛ్ఛోదంబున్.

ఎట్టులైన గాని నేరీతి నైనను
చేర వెళ్ళ వలయు, వేరు మార్గ
మేది లేదు, వినుడు యింకేది యైనను
తెలియ వచ్చెనేని తెల్పుడనియె.

సుమతి మాటల కెంతయొ చోద్యమంది
కాలమతి యను నేమేమి? బేలవలెను
యింత చింతేల? భయమేల? సుంత వినుమ,
కాంతు మార్గంబు నాపద గల్గెనేని.

మందమతియేమొ మిత్రుల మాటలసలె
విననిదానియు బోలె నేమనదు కనదు
ధరణిని వినాశకాలము దాపురింప
హితుల మాటలు మరియేల మతికి నెక్కు.

వారిద్దరి కృత్యము గని
యారేయినె సుమతి చేరె నచ్ఛోదంబున్
నీరము తా గతియించగ
వారంతట వలలతోడ వచ్చిరి బెస్తల్.

సరసులోని చేపలనరమర లేకుండ
పట్టి విసరినారు గట్టుపైకి
మందమతియు కాలమతియును తటముపై
విసరి వేయ బడిరి వేగిరాన.

కాలమతి యంత శవముగా గదలకుండ
కొంత సేపుండ వారలు గూడ దాని
వదలివేసిరి మృతమని, పిదప తాను
సరసి జేరెను వెనువెంట సంతసాన.

మందమతికేమి తోచక మారుమారు
ఎగిరి పడుచుండ తటముపై మిగుల జూచి
చేత జాలరి యొకరుండు చిదిమి పట్టి
బుట్టలోపల వైచెను దిట్ట యనగ.

భావి కష్టతతిని భావన సేయుచు
కష్టతరణ మపుడె గాంచు సుమతి
సుమతి మాట వినని కుమతియు మందుండు
ప్రాణహీనుడగును బాధపడుచు.




Thursday 29 September 2011

వేంకటసత్యాలు

వేంకట సత్యాలు
ఛందము - ఆటవెలది

శ్రీలనొసగుచుండి చిన్మయ రూపివై
నిఖిలజగతి నేలు నిన్ను దలచి,
నీతిపద్యశతము నిష్ఠతో బలికెద
వేంకటేశ! వినుమ, బొంకుగాదు.   1.

వేంకటేశ్వరుండు వినయసంపన్నుండు
జనకు డమలచరిత జననినాకు
సాధుచరితతాను సామ్రాజ్యలక్ష్మియు
వేంకటేశ! వినుమ, బొంకుగాదు.     2.

¶సూరిజనులు సత్యనారాయణుండంచు
పిలుచు చుంద్రు నన్ను పేర్మిమీర
¶సత్యవచన మాడి సత్కీర్తి నందెద
వేంకటేశ! వినుమ, బొంకుగాదు.   3.

ముళ్ళపూడి వంశ ముఖ్యుండు నారాయ
ణాఖ్య గురుని కృపయె యఖిలజగము
బాగుగోరు పలుకు పలికించు నాచేత
వేంకటేశ! వినుమ, బొంకుగాదు. ౪.


పెద్ద చిన్న యనుచు భేద భావములేల?
మానవత్వ మొకటె, మమత యొకటె
కులములెంచ నేల? గుణమె ముఖ్యంబురా
వేంకటేశ! వినుమ, బొంకుగాదు.౫.


సారహీన మండ్రు సంసార మెల్లెడ
సారహీనమైన సంగమేల?
సంగరహితమైన సంసారముండునా?
వేంకటేశ వినుమ బొంకుగాదు. ౬.


కలిమిబలిమిచేత విలసిల్లు మనుజుండు
మందబుద్ధియయ్యు మాన్యుడగును
ఘనత వలయునన్న ధనమె మూలంబురా 
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭.


చదువు గల్గువారు స్వామివి నీవని
కూర్మితోడ ధనికు గొలుచుచుంద్రు
యిలను వాడె చూడ నింద్ర తుల్యుండులే
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮.


అంతులేని సిరుల కధికారి యొక్కడు
చూడ ధనములేని శూన్యుడొకడు
నిఖిలజగతిలోన నీలీల గనలేము
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౯.


అల్పమృగముజంపి హాయిగ నడవిలో
చింత లేక దిరుగు చిరుత యట్లు
బలముగలుగువాడు బలహీను బాధించు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦


ధనము గలుగు వాడె దైవంబు జగతిలో
వాని యులుకు పలుకు బ్రహ్మ వాక్కు
రాజకీయమందు రాణించు వాడింక
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౧


అంత మిథ్యయనియు నంతమందెవ్వరు
వెంటరారటంచు విశదమయ్యు
భార్య, పుత్రులంచు పరుగెత్తు మనుజుండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౨


అవనిలోన జూడ నవినీతి యధికమై
లంచగొండితనము మించి పోయె
కలియుగాన నేడు కనరాదు ధర్మంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౩


కాసులివ్వకున్న కార్యాలయాలలో
పనులుగావు నేడు జనుల కిలను
కాసులాసజూప క్షణములో పనులౌను
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౪


దేశరక్షణందు లేశమంతయు చింత
నవ్యజగతి లేదు నాయకులకు
ఎట్టులైన వారి పొట్ట నిండిన చాలు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౫


వాదులాడి జనుల బాధించు వాడును,
జూదమాడువాడు, చోరుడిలను
కలియుగంబులోన ఘనులయా వీరంత,
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౬


బాలుడైన గాని బహువృద్ధుడైనను
రూపహీనుడైన రోగియైన
చదువు గలిగెనేని సన్మాన మందును
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౭


బొంకులాడువాడు, బొంకించువాడును,
తీవ్రవాది యగుచు తిరుగువాడు,
కుత్సితుండు వీరు గొప్పవారలు నేడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౮


ఎదుటివాని పనుల నెంత మంచివియైన
మెచ్చలేడు జనుడు హెచ్చుగాను,
కనుడు నాదు యశము ఘనుడ నేనంటాడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౯


అమలు సేయ డెప్పుడభివృద్ధి పథకాలు
నిజము చూడ దేశనేత నేడు,
ఎట్టులైన తనకు పొట్టనిండిన చాలు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౦


తనకు వలయు సుఖము తక్కువారేమైన
నేమి యంచు దలచు నిలను జనుడు
స్వార్థహృదయుడగుచు సాధించు సర్వంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౧


మంచివాడు వీడు మననేత యంచును
విజయవంతు జేసి విజ్ఞుజేయ
దేశభక్తి లేక తినుచుండు లంచాలు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౨


పట్టుబట్టగట్టి భగవాను గొలిచినా
కరము సంతసించి వరములీడు
సాటివారి యందు సహకారి గాకున్న
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౩


కలిగినంతలోన ఘనముగా జీవించి
పరులకెపుడు కలిమి బంచువాడు
స్వర్గసుఖము ధరనె సమకూరి వర్థిల్లు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౪


రాజకీయమందు రాణించ వలెనన్న
నిజము బలుకరాడు, నియతితోడ
పనులు సేయరాదు, భక్షించవలె గాని
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౫


విద్యగలిగి వేదవేత్తయు తానైన
ధరను జూడ మిగుల ధనుకుడైన
వినయశీలి యగుట ననయంబు ముఖ్యంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౬


ధనము గలిగియున్న, ధరనేలు ప్రభుడైన
తార్కికుండునైన, తల్లిదండ్రి
వలచి కొలువడేని వ్యర్థజీవనుడౌను
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౨౭


గురువులన్న భక్తి కొంచెమైనను లేదు,
చదువుపైన శ్రద్ధ మొదలె లేదు,
అరయఛాత్రులందు నవగుణంబులు హెచ్చె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౮


అంగబలముతోడ హత్యలు చేయించి
మానవత్వమంత మట్టి గలిపి
నాట్యమాడువాడె నాయకుండిల నేడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౯


కుంభకోణమందు కోట్లను గడియించి
దేశభక్తిలోన దిట్టలమని
నీతి బల్కు వారె నేతలు నేడైరి
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౩౦


తాను తప్పు చేయు, తన తప్పు జూడక
యెదుటివారి తప్పులెత్తి చూపు
తప్పులేనివారు ధరణిలో కలరేమి?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౧


ఛీదరించుకొనుచు, చిటపటలాడుచు
నెదుటివారి కలిమికేడ్చువాడు
ఘనత నంది యశము గనలేడు ధరణిలో
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౩౨


బంధుజనుల బిలిచి భాగ్యరేఖనుబంచి
యొంటివాడు గాక నోర్మితోడ
మెలగుచుండువాని కిలను సౌఖ్యము గల్గు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౩


ధర్మభీతి యేల? దైవచింతన యేల?
మానవత్వమేల? మమత యేల?
స్వార్థపూర్ణుడైన చాలును నేడింక
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౩౪


ఎదుటివారి యూసు నిసుమంత యెత్తక
స్వీయసుఖము గోరు విమల మతియె
కలియుగంబులోన విలసిల్లు, ఘనుడౌను
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౫


వ్యర్థజీవి గాక, వార్థక్యమందున
సకలజన్మలభ్య సుకృతమనుచు
తల్లిదండ్రి గొలుచు తనయుండు ధన్యుండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౬


స్వార్థబుద్ధివీడి సవ్యంపు మార్గాన
వర్తనంబు సేయు వాని కిలను
కలిమి యేల గల్గు? కలియుగంబిది గాదె?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౭


స్వార్థరహిత సేవ, సత్యవాక్పాలన,
ధర్మభీతి మరియు దానగుణము,
కలిగెనేని మనుట కష్టమీయుగమందు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౮


అల్పబుద్ధియయ్యు నధికుడనేనంచు
పలువిధంబుగాను బలుకుటెల్ల
యవనిలోన జూడ నధమత్వమదిగాదె?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౯


సకల శాస్త్రవేత్త, సర్వజ్ఞుడయ్యును,
మందబుద్ధినంచు మాటలాడు
దర్పహీనుడొండె ధన్యుండు జగతిలో
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౦


మతములన్ని యొకటె, మనుజులమందరం
బంచు భాషణంబు మించి యొసగి
కూర్మిజూపువాన్కి కులమె సర్వంబులే
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౪౧


ఇల్లు చక్క బెట్టు, నింపైన వాక్యాల
పతికి సౌఖ్యమెపుడు బంచు నింతి
నిఖిల జగతి లోన నిరుపమ నిస్స్వార్థ
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౨


రేయి పవలు మరియు రేపును మాపును
కులమువారి సుఖమె గోరు చుండు
సార్థకంబు జూడ నర్థాంగి జన్మంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౩


సారవంతమైన సంసార జలధికి
సంతసంబు గూర్చు చంద్రరేఖ
సాధ్వి, యల్గెనేని సర్వంబు శూన్యంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౪.


జన్మనొసగు, బెంచు, జనునకు సతతంబు
నఖిలసుఖము లిచ్చు యశము గూర్చు,
జీవకోటికతివ జీవనాధారంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౫


ఆజ్ఞమీరకుండి యనుకూలవతి యౌచు
మగని మనసు నెరిగి మసలుకొనెడి
భార్య దొరుక జనుడు భవ్యజీవనుడౌను
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౬


స్వీయసుఖముగోరి చేయదేపనియైన
భర్త, బంధుజనులు బాగుగున్న
చాలు నంచు దలచు నాలు యీజగతిలో
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౭


ప్రాణనాథు కొరకు పరమకష్టములైన
వ్రతములెన్నొ సేయు సతతమతివ
భర్త నెంచు చుండు పరమదైవంబుగా
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౮


అతివ లేక యున్న నందహీనము గీము
రాజరహితమైనరాత్రి పగిది
అఖిలజగతికెన్న నతివయె మూలంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౯


వేతనంబు నంది విశ్వాసరహితుడై
స్వామికార్యమందు శ్రద్ధ లేక
నిల్చువానికంటె నీచుడు లేడొండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౦


మాయనెరుగకుండి మంచిగా వర్తించి
పరులకెపుడు సాయపడెడి నరుడు
ఘనతనందలేడు కలియుగంబున నేడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౧


ఓటు కొరకు మొదట దీటైన వరముల
నిచ్చుచుంద్రు నేతలిలను నేడు
పదవినంది పిదప పల్కరింపగ రారు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౨


వినయవర్తనంబు, విద్వాంసశుశ్రూష
సత్యభాషణంబు, సాధుచరిత
మంచి గుణములివ్వి మరి సందియంబేల?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౩


దిక్కు మొక్కులేని దీనార్తులను గాంచి
చిత్తశుద్ధితోడ చేరదీసి
దయనుజూపువాడు ధన్యుండు జగతిలో
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౪


ఉర్విలోన నేడు నుద్యోగమంచును
ప్రాకులాడుచుంద్రు పౌరులెల్ల
స్వీయవృత్తి నెవరు సేయంగరారయ్యె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౫


విత్తమున్ననేమి? విద్యనేర్చిన నేమి?
గౌరవాదరంబు గల్గనేమి?
మార్దవంబు, మమత, మానవత్వములేక
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౬


మాటలోన మిగుల మార్దవమొలికించి
సాటివారికెపుడు చేటు చేయు
నరుడు సత్వరంబె నశియించు తథ్యంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౭


స్వీయ ధర్మమందు శ్రేయస్సు గలదంచు
శాస్త్రమందు నాడు చదువ లేదె?
బ్రతుకు తెరువు కొరకు పరధర్మమేలనో?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౮


శక్తిలేనివాడ, సాయమెట్టికజేతు
సాటివారికంచు జనుడు పల్కు
మనసు కుదిరెనేని మార్గంబు గల్గదా?
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౫౯


ధరణిలోన నేడు ధనవంతుడెల్లెడ
ఛీదరించుకొనును పేదవాని
జననమందునపుడె ధనము తెచ్చెనయేమి?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౦


ధర్మపరుడనంచు దైవంబు గొల్చుచు
భక్తి నుపవసింప ఫలితమేమి?
ధరణి దీనులందు దయజూపకున్నచో
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౧


ఖ్యాతినందగోరి ఘనమైన దానాలు
చేయనేమి ఫలము? చిత్తశుద్ధి
శూన్యమయ్యెనేని చూడంగ నిసుమంత
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౨


అస్మదీయుడీత డన్యుడు వాడంచు,
నల్పబుద్ధి యేల? యఖిలమునకు
భవము నొసగువాడు భగవంతుడొక్కడే
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౩


వేదచయము జదివి, విద్వాంసుడైయుండి
వివిధశాస్త్రధర్మవేత్తయయ్యు
గర్వసంయుతుండు ఘనతనందగలేడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౬౪


వేలకొలది ధనము వెచ్చించి భగవంతు
గొలుచుగాని నరుడు కూర్మితోడ
పేదవారి కెపుడు మోదంబు గూర్చడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౫


అతిథి జనులకేమి యందివ్వలేకున్న
మంచి మనసుతోడ మమత జూపి,
మధువులొలుకు నట్టి మాటయె చాలొండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౬


సకలభోగభాగ్యసంపత్తి గల్గియు
సర్వజగతినేలు సత్త్వమున్న
చదువులేని బ్రతుకు సార్థక్యమందదు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౭


విశ్వవిదితమైన వీరత్వమదియున్న
నమల యశము మనుజుడంద బోడు,
ఒరుల పట్ల కొంత యోరిమి లేకున్న
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౮


అల్పబుద్ధి యయ్యు నధికుడ నేనంచు
తెలివిగల్గు వారి దెగడు చుండు
నధిక గర్వయుక్తుడవివేకి యీరీతి
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౯


ధనమదాంధుడౌచు దాయాదులను జూచి
కుడువ వచ్చిరంచు కోపగించు,
విత్తమంతమందు వెంటవచ్చున యేమి?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౦


పైకి నీతులెన్నొ పలికెడి వాడెప్డు
చెడ్డపనులె తాను చేయు టెల్ల
కాదు దోస మిదియె కలియుగ ధర్మంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౧


సత్యభాషణంబు నిత్యంబు చేయుచు
బహుళ ధర్మకార్యవర్తియైన
వాని కిహము పరము వైభవయుక్తంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౨


బుద్ధిమంతులగుచు బోధించు వారెల్ల
సుంత యేని యాచరింతురేమి?
చెప్పువారె గాని చేయువారిల లేరు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౩


నిత్యశంక లేల? యత్యాశయదియేల?
తుష్టిలేమి యేల? దు:ఖమేల?
జనుని జీవనంబు శాశ్వతంబా యేమి?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౪


బ్రతుకదలచి నరుడు మెతుకులు గొనవలె
తినుటకోసమిలను మనుట తప్పు,
కోటి పాపములకు కుక్షియె మూలంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౫


కొడుకు వలయు నంచు కోటి పూజలు చేసి
సుతుని గాంచి నరుడు సుఖములందు
దుష్టుడౌచు వాడు దూరిన శోకించు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౬


బుద్ధి గలిగి నరుడు పుణ్యంబు కోసమై
తీర్థయాత్రలంచు దిరుగుచుండు,
దేశసేవలేక దివమేల యబ్బును?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౭


బాహు బలము గల్గి దేహసౌష్ఠవమున్న
మాతృదేశసేవ మానె నేని
ధరణిలోన నరుడు ధన్యుడు గాలేడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౮


పరమధర్మశాస్త్రపారంగతుండయ్యు
వేదపఠన చేత విజ్ఞుడయ్యు
మాతృపూజలేక మాన్యుడు గాలేడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౯


సాటివారి యందు సమతను జూపించి
చిత్తశుద్ధితోడ సేవ జేసి
మనుచు నుండు నట్టి మనుజుడు ధన్యుండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౦


దార, పుత్రులంచు తనవారు వీరంచు
పాటు పడును నరుడు పగలు రాత్రి
అంతమందు వీరలనుసరింతుర యేమి?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౧


మోహపూరితంబు దేహమనిత్యంబు,
సకలరోగజాల సంయుతంబు,
మమత దీనిపైన మహిలోన వ్యర్థంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౨


తేనెవలెను మిగుల తియ్యగ మాట్లాడి
కుమతి యగుచు గొంతు కోయువాడు
అసురశబ్దవాచ్యు డన్యుడు గాబోడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౩


కఠినమైన నేమి కంఠస్వరంబొండు,
వెన్నవంటి హృదయవిభవముండి
మమతగలిగియున్న మర్త్యుడె దివిజుండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౪


పరుషవాక్య మెపుడు బలుకకనుండుచు
మత్సరంబు వీడి మనెడువాడె
మౌనియనగ బరగు మరియొండు మౌనుయా?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౫


సాధుజనుల యందు శాంతంబు విడనాడి
క్రూరబుద్ధితోడ కుపితుడగుచు
మసలుచుండు వాడుమానవుడెట్లౌను?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౬


ధర్మమన్ననేమి? దానంబులననేమి?
భగవదర్చనంపు భావమేమి? 
సతము దీనులందు సహకారమే గాదె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౭


ముక్కు మూసుకొనుచు, మూడువేళలయందు
ధ్యానమగ్నుడైన తపసియౌనె?
దానగుణము, భూతదయలేకయున్నచో 
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౮


సాధువర్తనంబు, సచ్ఛీలసంపద
వెలయు సహనముండవలయు గాని,
సోయగంబు గాదు సుదతికి ముఖ్యంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౯


మంచి పనులు సేయ మనకు భాగ్యంబబ్బు
చెడ్డపనుల తోడ చేటు గల్గు
భాగ్యకారణంబు భగవంతుడెట్లౌను?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౦


అఘములెన్నొ చేయు, ననృతంబులాడును,
మార్చుచుండు రూపు మారుమారు
కుక్షికొరకు నరుడు కువలయంబున జూడ
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౧


తాను సాయపడడు, తనకు సాయము సేయ
నెవరురారటంచు నేడ్చుచుండు,
స్వార్థబుద్ధి నరుడు సంకుచితాత్ముండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౨


జన్మనిచ్చి పెంచు జనకుల బోషింప
భారమనెడు తనయు బడయుకంటె
పుత్రహీనుడైన పుణ్యంబునందును
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౩


అవనిలోన మనుజుడర్థార్జనార్థమై
ఎట్టిమార్గమైన నెంచుకొనును,
బ్రతుకుబాటనున్న పరమార్థమిదియేను
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౪


సిగ్గుపడగనేల స్వీయధర్మముజూచి?
యన్యధర్మమన్న నాశయేల?
మతము మార్చుటెల్ల హితకరియెట్లౌను?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౫


పనులు సేయ వలయు, ఫలములెంచగ నేల?
యనుట నాటి మాట, యదియె నేడు
ఫలముగొనగవలెను, పనులు సేయక యయ్యె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౬


నవ్యదుగ్ధజనిత నవనీత తుల్యంబు
నిరతమోదయుతము నిర్మలంబు
పరమపావనంబు బాలుర హృదయంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౭


తల్లిదండ్రియెవరు? తనవారలెవ్వరు?
అన్నదమ్ములెవ్వరాప్తుడెవడు?
అభయమిచ్చి మనల నాదరించెడి వాడె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౮


విశ్వదీప్తమైన విజ్ఞానసంపత్తి
బహుళయశము నరుడు పడయుటెల్ల
పూర్వజన్మలబ్ధ పుణ్యప్రభావంబె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౯


సజ్జనాళి గొలువ ముజ్జగంబులలోన
సద్గుణంబులబ్బు శక్తి హెచ్చు,
విమలమౌను తనువు వికసించు హృదయంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౦


చిర్రుబుర్రుమనుచు చీటికి మాటికి
బంధుజనుల మనసు బాధపెట్టి
యేమి పొందు నరుడు, యేకాకియౌగాని
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౧


ఒరుల జేరదీసి యుత్తమగుణుడౌచు
మమత బంచి యిచ్చు మానవునకు
వైభవంబు యశము భగవంతుడొసగును
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౨


శక్తిగలదు నాకసాధ్యంబు లేదంచు
విర్రవీగుచుండు వెర్రి జనుడు
నిత్యసత్త్వుడైన మృత్యుంజయుండౌనె?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౩


బాగుగోరి సుతుని బహురీతి బోధించు
ఘనతనందు నంచు గాంక్షసేయు
ఎవ్వడెరుగు తనయుడెట్లుండునో భావి
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౪


పరులవలెను తనకు సిరులబ్బలేదంచు
నేడ్చుగాని మనుజు డించుకైన
దైవనిర్ణయంబు తనభాగ్యమనుకోడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౫


చీకుచింత లేక చిన్మయరూపులై
పరుగులిడుచు నుంద్రు బాలలెల్ల
బాల్యమనగనేమి? బహుమూల్యమదిగాదె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౬


దేహదీప్తిగోరి దవ్యౌషధంబులు
వాడనేమి ఫలము వసుధలోన
దయయు, వినయమున్న తనువది వెలుగొందు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౭


జంకు గొంకు లేక సాగిపోవలెగాని
యాదిలోన భీతి నందరాదు
ధైర్యవంతుడొందు కార్యసాఫల్యంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౮   
                                               సర్వేజనాస్సుఖినోభవన్తు
                                                         -మూర్తి