Wednesday 16 January 2013

గోవర్ధనోద్ధరణం


పద్య రచన - 223 

బుధవారం 16 జనవరి 2013

 

భీతిలనేల మీరు యదువీరులు మత్సఖు లాత్మబంధువుల్
ఖ్యాతిని గల్గువార లమరాధిపుగర్వము నేడు గూల్తు, నా
చేతి కనిష్ఠికన్ గిరిని సేమము గూర్పగ దాల్తు రండు మీ
చేతము లుల్లసిల్లునని చీరెను కృష్ణుడు పల్లెవారలన్.


లోకరక్షకుండు శోకార్తులైయున్న
వారి ననునయించి, భయము బాపి
గోకులంబు గావ గోవర్ధనాఖ్యమౌ
గిరిని లేవనెత్తె సరసు డగుచు.


గోవర్థనగిరి యప్పుడు
భావింపగ ఛత్రమట్లు భాసిల్లె నటన్
గోవులు గోపకులంబులు
గోవిందుని చెంతజేరి కూరిమి మీరన్


గిరిపంచను సుఖమందుచు
నరుసంబున వారు చేసి రద్భుతరీతిన్
కరుణామయుడౌ కృష్ణుని

వరగుణసంకీర్తనంబు వైభవమొప్పన్.

రాళ్ళవానయైన ప్రళయాగ్నియైనను
అవనిజముల గూల్చు పవనమైన
సర్వభారకుండు సంరక్షకుండౌచు
చేరదీయ నేమి చేయగలవు?


తానొనరించిన దొసగును
మానసమున దలపకుండ మన్నించంగా
నానావిధముల శక్రుం
డానారాయణుని వేడె నతిభక్తిమెయిన్.


హరి ప్రసన్నుడౌచు కరుణార్ద్రదృక్కుల
జూచె, నింద్రుడంత జోత లొసగె
ఖేచరాదులెల్ల కీర్తించి రాశౌరి
లీల గాంచి మేలు మేలటంచు.

వందనంబు నీకు వైకుంఠ! మాధవ!
వందనంబు నీకు భవ్యచరిత!
వందనంబు నీకు నందాత్మసంజాత!
వందనంబు గొనుము వాసుదేవ! 

 

Monday 14 January 2013

సూర్యుడు-సంక్రాంతి


పద్య రచన - 221 

సోమవారం 14 జనవరి 2013

 ఏడు గుర్రాల రథమున నినుమడించు
సంతసంబున గూర్చుండి సకలజగతి
కెల్లవేళల వెలుగుల నిచ్చుచుండు
పద్మబంధున కొసగెద ప్రణతిశతము.


జనుల కానందమును గూర్చి యనవరతము
లోకహితమును గోరుచు నేకదీక్ష
నాగకుండగ వినువీధి నేగుదెంచు
పద్మబంధున కొసగెద ప్రణతిశతము.


క్రమత నొక్కొక్క మాసంబు సమత జూపి
రాశులన్నింట దిరుగుచు రయముతోడ
మకరరాశికి జేరెడు మాన్యునకును
పద్మబంధున కొసగెద ప్రణతిశతము.


కర్మసాక్షిగ నుండుచు కాలగతిని
తెలియజేయుచు సర్వదా త్రిజగములకు
నన్నివిధముల నాత్మీయుడగుచునుండు
పద్మబంధున కొసగెద ప్రణతిశతము.


ఆత్మగతిచేత కాలాన నయనములను
రెండుగా జేసి జగముల కండయగుచు
నిప్పు డుత్తరాయనమున కేగుచున్న
పద్మబంధున కొసగెద ప్రణతిశతము.


ధరణివారికి ప్రత్యక్షదైవ మగుచు
నలుగ కుండగ ప్రతిరోజు పలుకుచుండి
ధైర్యమొసగుచు వీపును తట్టుచుండు
పద్మబంధున కొసగెద ప్రణతిశతము.


ఎవని యాగమనంబున నవనియంత
జాగృతంబౌచు పొందును సత్వమెపుడు
వాని కుష్ణరశ్మికిని ప్రభాకరునకు
పద్మబంధున కొసగెద ప్రణతిశతము.


మకరసంక్రాంతి శుభవేళ మాన్యులార!
సకల శుభములు సుఖములు సద్యశంబు
లందుచుండంగవలె నంచు నందరకును
కాంక్ష చేసెద జయములు కలుగు కొరకు.

Saturday 12 January 2013

భోగిమంటలు


పద్య రచన - 220 

ఆదివారం 13 జనవరి 2013

 

భోగములకు సూచకముల్
వేగమె దహియించివేయు విపులాఘములన్
రోగహరంబగు నికపై
పోగొట్టును దు:ఖమండ్రు భోగిని మంటల్.

 
మకరమునకు మార్తాండుడు
సకలంబును గాచువాడు చనుదెంచగఁ దాఁ
బ్రకటితమౌ నయనం బిదె
యికపై శుభమంచు చేతు రీమంట లిలన్.

అయనద్వయమున శ్రేష్ఠము
సుయశంబులు కూర్చుచుండు సుందరమిదియున్
భయమేలా రండిక నఘ
చయమును గాల్చంగ ననుచు జనులీ భోగిన్


ఉదయాత్పూర్వము మిక్కిలి
ముదమందుచు చేరినిల్చి మునుపటి దొసగుల్
మదిలో నిండిన కల్మష
మది గాల్తురు భోగిమంటలం దెల్లెడలన్.


ఈవిధి నిర్మలమతులై
కావింతురు ధర్మకృతులు ఘనముగ మీదన్
పావన మీసంక్రమణము
భావింపగ పుణ్యదంబు భాగ్యప్రదమున్. 

 

వివేకానందుడు


పద్య రచన - 219 

శనివారం 12 జనవరి 2013

 

సీ.     ఎవ్వాని గళములో నిహపరసౌఖ్యంబు
                    లందించు సూక్తంబు లాడుచుండు,
        ఎవ్వాని హృదయాన నిమ్మహీస్థలిపైన
                   శాంతి గోరెడి భావజాలముండు,
       ఎవ్వాని మనములో నీజగజ్జనులంద
                   రొక కుటుంబముగాగ నుత్సవంబు,
       ఎవ్వాని తనువున నెందెందు జూచిన
                   భారతీయత నిండి పరిఢవిల్లు

తే.గీ.     ఉపనిషత్తుల గంధంబు లుర్విజనుల
            కందజేసిన సర్వాంగసుందరుండు
            వేదవేదాన్తవేత్తయై విశ్వమందు
            హైందవంబును చాటు మహర్షి యతడు.  

కం.       లోకోత్తర యశమందు వి
            వేకానందునకు నతులు విమలాంగునకున్
            శ్రీకరమగు హైందవమును
            ప్రాకటముగ జూపినట్టి భవ్యాత్మునకున్.

 

Tuesday 8 January 2013

పేదరికం


పద్య రచన - 214 

సోమవారం 7 జనవరి 2013

 పేదరికం

ఎవరీ బాలకు నుద్ధరించగలరో? యేమాయెనో వీనికిన్?
భవమే భారముగా దలంచి యితడున్ బల్మారు చేచాచుచున్
భవతీ భిక్షమటంచు వేడుకొనినన్ పట్టించుకో రెవ్వ రీ
యవనిన్ పేదరికమ్ము శాపముగదా! యన్యంబు లందెన్నగా.


బక్క చిక్కి పోయె లెక్కకు నందుచు
శల్యపంక్తి యునికి చాటుచుండె
తనువు డస్సిపోయె దైన్యంబు పొడచూపె
చేష్టలుడిగె యెడద చీకిపోయె.


నోటినుండి యొక్క మాటైన బలుకగా
శక్తి లేకపోయె, చావలేక
బ్రతుకుచున్న వాని వంకకు జూచెడు
ఘనుడొకండు కూడ కానరాడు.


వేదభూమి యండ్రు, మోదదాయిని యండ్రు
భరతఖండ మందు బడుగులపయి
దయను జూపుచుండు ధర్మాత్ములెందరో
సిద్ధ మన్యమింక చెప్పనేల?


సర్వజనుల నెపుడు సమదృష్టితో జూచి
కాచుచుండు నంచు గణుతికెక్కి
జగతి నేల గూర్చె భగవాను డీరీతి
పేద మరియు ధనిక భేదములను.

Thursday 3 January 2013

మన్మథుడు

పద్య రచన - 210 

గురువారం 3 జనవరి 2013

 మన్మథుడు

అరవింద మశోకంబును
సరియగు చూతంబు లింక సానందముగా
నరయగ నవమల్లికలను
మరి నీలోత్పలము బూను మారుండెపుడున్.

ధనువుగ నిక్షువు జేకొని
మనములలో ప్రేమ గూర్చు మానవులైనన్
ఘనులా సురవరులైనను
దనుజాదులు వీనివశులు తథ్యము చూడన్.


నిగమస్తుతుడగు శివునకు
నగజాతను గూర్చబూన నాయత్నమునన్
తెగిపడె బుగ్గిగ నచ్చట
జగములకై భవునివలన సన్మతియగుటన్.


పంచబాణుడన్న ప్రద్యుమ్నుడన్నను
మదనుడన్న మరియు మారుడనిన
మీనకేతనుండు మీదట కందర్పు
డన్న మన్మథుం డనంగు డతడు.


కాముడు కాంక్షించినచో
నీమంబును బూని తపము నిత్యము చూడన్
తామొనరింపగ జాలరు
భూమిన్ సన్మునిజనంబు బుద్ధి చలించున్.


మన్మథ! ప్రణతులొనర్చెద
సన్మతి నాకందజేసి సత్యోక్తులతో
సన్మార్గ వర్తనంబున
సన్మానము గూర్పవయ్య సభలం దెపుడున్.

చెక్క భజన


పద్య రచన - 209 

బుధవారం 2 జనవరి 2013

 చెక్క భజన

పలువురు యువకులు చూడగ
నిలువెల్లను భక్తిరసము నిండిన వారల్
నిలబడి భగవన్నామము
పలుకంగా చేరినారు భాగ్యంబనుచున్.

తలపట్టీలను గట్టిరి
విలసిల్లెడు నడుముగుడ్డ, విస్పష్టముగా
గలగలమ్రోగెడు గజ్జెలు
నలవోకగ చెక్కలంది రద్భుతరీతిన్.


హరినిం దలచెదరో మరి
హరునామము పలుకుచుండి యాడెదరో వా
రరుసము హృదయం బందున
విరివిగ పూరించినారు విజ్ఞులనంగా.


చెక్కలతో కదలాడుచు
చక్కంగా నామజపము సద్భక్తులనన్
మిక్కిలి యుత్సాహంబున
నిక్కుంభిని జేయ గలుగు నిహపరసుఖముల్.


అచ్చట జేరిన వారికి
సచ్చరితయు, ధనము, యశము, సౌఖ్యాదికముల్
నిచ్చలు హరిహరనాథుం
డిచ్చుచు గాపాడుగాత! యీప్సిత(సిద్ధుల్) వరముల్.

Tuesday 1 January 2013

2013 శుభాకాంక్షలు





 2013 శుభాకాంక్షలు
(ఉత్పలమాలిక)
నూతన వత్సరాదిని, మనోహర వేళను పండితార్యులి
ట్లాతత మైన భావముల హాయనముం గని స్వాగతించ నా
చేతము సంతసించెను విశేషవచస్సులు పద్యపంక్తులై
భూతలికీ నవాబ్దమును భూరిసుఖంబుల నిచ్చి కావగా

జోతలు చేయబూనినవి "సుందరనూతనవర్షరాజమా!
ఖ్యాతులు సన్నగిల్లె, మరియాదయు మానసమందు లేదు, మా
నేతల కెల్ల వేళ నవినీతి విహారము దక్క వేరిలన్
రోతగ మారిపోయినది, రుగ్మత లట్టు లధర్మకృత్యముల్,

నీతివిహీనవర్తనలు నిత్యములై యబలాబలాత్కృతుల్,
హేతువులేని దౌష్ట్యములు, హింసలు వృద్ధిని బొందుచుండగా
రాతిరియున్, పవల్ గురుతరంబగు బాధలు కష్టనష్టముల్
భీతిని గూర్చుచుండి విలపింపగ జేయుచు విస్తరించ భూ

మాతకు శాంతిసౌఖ్యములు మచ్చునకైనను కానరాక యీ
భూతవిముక్తి గోరి తలపోయుచునున్నది కాచుదానవై
యో తరుణాబ్దమా! నిలిచి యుర్వికి మేలగు శాంతిసూత్రముల్
శీతలవాయువుల్ కలుగ జేయుము సౌఖ్యము గూర్చు మెల్లెడన్.


నూతన సంవత్సర శుభాకాంక్షలు



పద్య రచన - 208 

మంగళవారం 1 జనవరి 2013

 


నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతనవత్సర మందున
చేతో మోదంబు, సిరులు, స్థిరసద్యశముల్
నేతల సుజనత్వంబును
భూతలి కందంగ వలయు పూర్తిగ నికపై.


రెండువేలు గడిచి నిండుగా పండ్రెండు
వత్సరంబు లేగ వైభవముగ
వచ్చి నిలిచినట్టి వర్షరాజంబింక
సత్వ మొసగు గాత! సకలజగతి.


పదమూడవ యబ్దమునకు
సదమలహృదయంబుతోడ స్వాగత మనెదన్
నదులన్నియు సుజలములై
యదనున వర్షంబు గురియు హాయన మంతన్.


గతవత్సరమున గలిగిన
వెతలన్నియు తీరిపోయి విస్తృతసుఖముల్
క్షితిలో నిండంగావలె
నతులిత ధనవృద్ధి నూతనాబ్దంబందున్.



సమతాభావము నిండగ
మమతాన్విత హృదులతోడ మానవులిలలో
క్రమముగ నందెద రనిశం
బమలిన యశములను నూతనాబ్దమునందున్. 

         జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన వేడుకలకోసం వ్రాసినవి.
ఈవత్సర మందంతట
శ్రీ వైభవ వృద్ధి కలిగి స్థిరసౌఖ్యంబుల్
వేవేల శుభములబ్బుత
ఈ విద్యాలయపుజనుల కీశ్వరు కృపచే.


విద్యార్థుల కావశ్యక
సద్యస్స్ఫురణంబు గల్గి సద్విద్యలలో
నద్యతన శక్తియుక్తులు
నుద్యోగక్షమత గూడుచుండగ వలయున్.


నికషలలో శ్రేష్ఠాంకము
లకళంక విశేషయశము లందగ వలయున్
సుకరములై పాఠ్యాంశము
లికపై కలుగంగవలయు నీప్సిత సిద్ధుల్.


గురుజనులకు సద్యశములు
నిరతము సంతోషదీప్తి నిత్యసుఖంబుల్
సరియగు స్వాస్థ్యప్రాప్తియు
నరయంగా గల్గు నూతనాబ్దంబందున్.


భారతవర్షంబున నిక
సారోదకవర్షజనిత సౌభాగ్యమునన్
కోరిన సస్యంబులు తని
వారగ ఫలియించుగాత హాయన మంతన్. 

ఉత్పలమాలిక

నూతన వత్సరాదిని, మనోహర వేళను పండితార్యులి
ట్లాతత హృద్యఛందమున హాయనముం గని స్వాగతించ నా
చేతము సంతసించెను విశేషవచస్సులు పద్యపంక్తులై
భూతలికీ నవాబ్దమును భూరిసుఖంబుల నిచ్చి కావగా

జోతలు చేయబూనినవి "సుందరనూతనవర్షరాజమా!
ఖ్యాతులు సన్నగిల్లె, మరియాదయు మానసమందు లేదు, మా
నేతల కెల్ల వేళ నవినీతి విహారము దక్క వేరిలన్
రోతగ మారిపోయినది, రుగ్మత లట్టు లధర్మకృత్యముల్,
నీతివిహీనవర్తనలు నిత్యములై యబలాబలాత్కృతుల్,
హేతువులేని దౌష్ట్యములు, హింసలు వృద్ధిని బొందుచుండగా
రాతిరియున్, పవల్ గురుతరంబగు బాధలు కష్టనష్టముల్
భీతిని గూర్చుచుండి విలపింపగ జేయుచు విస్తరించ భూ

మాతకు శాంతిసౌఖ్యములు మచ్చునకైనను కానరాక  యీ
భూతవిముక్తి గోరి తలపోయుచునున్నది కాచుదానవై
యో తరుణాబ్దమా! నిలిచి యుర్వికి మేలగు శాంతిసూత్రముల్
శీతలవాయువుల్ కలుగ జేయుము సౌఖ్యము గూర్చు మెల్లెడన్.