Saturday 29 December 2012

తెలుగు వైభవం


పద్య రచన - 205 

(శనివారం 29 డిసెంబర్ 2012)

 

 
తెలుగు వైభవం
ఆంధ్రభోజుడాత డలనాడు బహుభాష
లరసి వాటి రసము లనుభవించి
తెలుగుభాషలోని తియ్యందనాలను
మెచ్చి పల్కె నిట్లు మేలటంచు.


సందియంబు లేదు సర్వాంగసుందరం
బైన భాష గాదె యాంధ్రభాష
నిత్యసత్యమియ్య దత్యంత మధురంబు
దేశభాషలందు తెలుగు లెస్స.

 
పలికినట్లుగానె భక్తిభావము బూని
కవులనాదరించి ఘనతగూర్చి
సాధుకార్యమంచు సాహిత్యసేవను
చేసి యుండి నట్టి శ్రేష్ఠుడతడు.


కృష్ణరాయవిభుని కృపచేత నలనాడు
తెలుగుతల్లి మిగుల వెలుగులీనె
ఘనతరంబులైన కావ్యంబు లెన్నియో
భాగ్యవశముచేత భవమునందె.


వర్తమానమందు పాలకాగ్రణులందు
మాతృభాషపైన మమత లేదు
సంఘటించ వలెను సాహితీ బంధువుల్
తెలుగు వైభవంబు నిలుపు కొరకు. 

Friday 28 December 2012

శ్రీదత్త


పద్య రచన - 204 

శుక్రవారం 28 డిసెంబర్ 2012

 

 శ్రీదత్త

అనసూయాత్మజ! భగవన్!
ఘనచరిత! మహానుభావ! కల్మషహారీ!
మునిజనహృదయవిహారీ!
తనయుని ననుగావుమయ్య దత్తాత్రేయా!

 

అనసూయాత్మజ!వందన
మనువారల నాదరించి యతివత్సలతన్
ఘనతరశక్తుల నిచ్చుచు
ధనకనకము లొసగెదీవు దత్తాత్రేయా!


నవవిధ నిధులును, సిద్ధులు
వివిధాద్భుతమంత్రశక్తివిభవము లబ్బున్
స్తవనీయుని నిను గొల్చిన
ధవళితదివ్యాంగదీప్త! దత్తాత్రేయా!


మూర్తిత్రయరూపుడవై
యార్తుల బాధలను దీర్చి యనుపమ సుఖస
త్కీర్తులు సంతస మనిశము
కూర్తువు సుగుణప్రదాత! కూర్మిని దత్తా!


నీవే తండ్రివి జగముల
కీవే మముగాచువాడ వీప్సితవరదా!
దేవా! దత్తాత్రేయా!
రావే జగములను బ్రోవ రయముగ సుఖదా!


శ్రీకరుడవు సద్భక్తవ
శీకరుడవు దత్తదేవ! జిజ్ఞాసులకున్
ధీకరుడవు దీనులకు గృ
పాకరుడవు సతము నీకు ప్రణతులొనర్తున్.