Thursday 21 January 2021

వేదము.

 

వేదము.

(శ్రీ వేమారంమామి)

ఉ.

శ్రీదము, సర్వకాలముల క్షేమకరాశయపూర్ణమై మహ

  న్మోదము గూర్చుచుండి భవముక్తికి భుక్తికి మార్గదర్శియై

  మేదిని కన్నిరీతులను మేలొనరించగ  నిల్చియుండు నా

  వేదము ధర్మమూలమయి విశ్వసుఖంబును గోరు నెప్పుడున్.                              1.

ఉ.

వేలుపులన్ భజించదగు విస్తృతభవ్యమహామహోక్తులన్

  వేలకువేలుగా బలుక వీలగు రీతిని సుస్వరోక్తస

  చ్ఛైలిని మంత్రరూపమున సర్వశుభంకరలక్ష్యదీప్తి యే

  వేళను వ్యక్తమౌనటుల వేదము తెల్పుచునుండు నిచ్చటన్.                        2.

మ.

యయున్, సత్యము, ధర్మమార్గగమన స్థైర్యంబు, సచ్ఛీలమున్,

  జయకాంక్షాఘనసత్వయుక్తియును, విశ్వక్షేమసద్భావమున్,

  క్షయముం గాంచని సభ్యతాగరిమయున్, సాధుత్వమున్ సన్నుతా

  శయ మీవేదము నింపు మానవునిలో  స్వాంతమ్ము దీపిల్లగన్.                     3.

ఉ.

మానవకోటి కేయెడల మాన్యత గూడెడి యోగ్యమార్గముల్

  తా నతివత్సలత్వమున దన్మయతన్ వివరించు, దుష్టతన్

  గానగ రానివారలకు గల్గెడి దుఃఖము లెట్టు లుండు నో

  వైనము జూపు వేదమిట భాగ్యము నింపెడి భావదీధితిన్.                           4.

మ.

నసంతానము సృష్టి సర్వ మగుటన్ దా నెల్లకాలంబు పా

  వనతన్ వాక్కులయందు నింపి సుమహత్పారుష్య మందెంచినన్

  ఘనతన్ బార్థివశాసనంబు పగిదిన్ గల్యాణముల్ నిచ్చలున్

  గొను డీరంచును బల్కు వేద మిచటన్  గూర్మిన్ శుభస్వాంతయై.             5. 

శా.

రంగద్దివ్యసుఖానుభూతి కొరకై రమ్యేతిహాసంబు లే

  భంగిన్ గాంచగ నొప్పు వాని నటులన్ బల్రీతులన్ మంత్ర స

  త్సంగంబందున నిల్పి మానవులకున్ సమ్యగ్విధానంబుతో

  నంగీకారము జూప జేయ దెలుపున్ హర్షాన వేదం బిలన్.                         6.

చం.

దులను, భాగ్యవర్ధకవనప్రకరంబును, శైలరాజినిన్,

  సదమలసస్యసంపదను, జంతు సమూహములన్, జలంబు,

  య్యెదలను గెల్చు వ్యోమమును, నీ యిల, నగ్నిని, మారుతంబునున్

  మదులను నిల్పె దైవతసమానత గూర్చుచు వేద మీస్థలిన్.                          7.

ఉ.

మాతకు, జన్మదాతయగు మాన్యున, కజ్ఞత గూల్చి జ్ఞానమున్

  జేతము నందు నింపగల శ్రీయుత సద్గురు మూర్తికిన్ మహత్

  ప్రీతిని బూజసేయుటయె విజ్ఞత మానవులార! యంచు నీ

  భూతల మందు దెల్పు గద పుల్లయశస్కరవేద మెప్పుడున్.                       8.

ఉ.

మిక్కిలి విస్తృతం బగుచు మేదినిపై విలసిల్లు వాఙ్మయం

  బిక్కడ  జన్మమందు నను టింపగు తథ్యము, విశ్వదీప్తికిన్

  దిక్కయి నట్టి వేదమును దేకువ జూపుచు రక్ష చేసినన్

  జక్కగ గాచు నెల్లపుడు సర్వవిధంబుల నమ్మువారినిన్.                            9.  

 

హ.వేం. స.నా.మూర్తి.

21.01.21