Saturday 29 February 2020

దేవీస్తుతి


దేవీస్తుతి 
స్రగ్విణీవృత్తము

 (నాలుగు రగణములు-యతి-7వ అక్షరము)

శ్రీలిలన్ బంచుచున్ క్షేమమందించుచున్
మేలుగా లోకముల్ మేటివై గాచుచున్
బాలవై శక్తివై వాణివై తల్లివై
జాలి జూపించు నిన్ సన్నుతింతున్ సదా.           1.

అంబ! దండంబులో యమ్మ నీవందుమా
సంబరంబుల్ సదా సాగునట్లీభువిన్
అంబుజాక్షీ! మహా హర్షముల్ గూర్చి లో
కంబులందున్ శుభా కాంక్షలన్ నిల్పుమా.          2.

నీవె సర్వం బిటన్ నిష్ఠతో నిత్యమున్
పావనీ! నిల్పుచున్ పాపముల్ గూల్చుచున్
దేవి!వాత్సల్యముల్ దీపిలన్ జూపుచున్
గావగా నెల్లెడన్ గల్గుకల్యాణముల్.                   3.

తల్లులై వెల్గు మాతల్లులన్ గన్న యో
తల్లి నిన్ గొల్చినన్ తథ్యమీ లోకమం
దెల్ల సౌఖ్యంబు లెప్డింపుగా గూడి మా
యుల్ల ముబ్బున్ యశం బొప్పుగా నందుచున్.  4.

తల్లి నీపాదముల్ తన్మయత్వంబుతో
నెల్లకాలంబుమే మిచ్చటన్ గొల్తు మీ
పిల్లలన్ మమ్ములన్ ప్రేమజూపించుచున్
చల్లగా గావుమా సన్నుతుల్ గాంచుచున్.          5.

హ.వేం.స.నా.మూర్తి.
01.03.2020.


Friday 28 February 2020

పుష్పము.

కం.
మావలెను నిత్యమీగతి
భావంబున శుద్ధి గలిగి ప్రహ్లాదమునన్
జీవించు మానవా!
యని
పావనముగబలుకు విరుల ఫణితికి జేజే. 1.
కం.
కులమతభేదములరయక
నిలలో జీవించగలుగు టిట్లగు ననుచున్
దెలుపుచు మానవజాతికి
వెలిగెడి యీపుష్పజాతి విధికిని జేజే. 2.
జగతికి బ్రేమను బంచుట
యగణిత సద్యశము లనిశ మందెడి మార్గం
బగునని పరిమళముల నిల
దగురీతినిబంచు పుష్పతతులకు జేజే. 3.
కం.
విమలత్వము హృదయంబున
గ్రమమెరుగుచు నింపుకొనిన ఘనతరయశముల్
సమకూరును మము గనుడను
సుమధురమగు పుష్పజాతి చొప్పుకు జేజే. 4.
కం.
వసుధాస్థలిలో సంతత
మెసగగ నుపకారగరిమ యింపలరంగా
మసలుడు మావలె నను యీ
కుసుమంబుల యెదలలోని కూర్మికి జేజే.

హ.వేం.స.నా.మూర్తి.
29.02.2020.

పుస్తకము

ఉ.
పుస్తకమిందు జ్ఞానమును బొందగ జేయుచు సర్వకాలమున్
వాస్తవజీవనస్థితిని వైభవ మొప్పగ నేర్పుచుండు  నీ
మస్తకమున్ దిగంతముల మాన్యత లందగ జేయునట్టిదౌ
వస్తువు మానవా! నిజము భాగ్యద మియ్యది యన్నిరీతులన్. 1.
చం.
నరవర! గ్రంథరాజపఠనంబున యోగ్యములైన భావముల్
వరగుణముల్ ప్రవర్తనము ప్రస్తుతు లందగజాలు పద్ధతుల్
ధరపయి గూర్చగల్గుటలు తథ్యము మానవజీవనంబునం
దరయగవచ్చు సౌఖ్యముల నార్యజనావళి చూపినట్లుగన్. 2.
శా.
పొత్తం బీభువిలోన సర్వగతులన్ బూజ్యుండునౌ మిత్రుడై
చిత్తంబందలి కల్మషప్రకరమున్ ఛేదించి దుర్భావనా
పత్తిం గూల్చెడి యౌషధంబు వినుమా! బ్రహ్మాండముం గెల్చు సం
పత్తి న్నీకు వశంబు చేసి జయముల్ పండించు నో మానవా! 3.
మ.
అమితానందఫలప్రదాయి యయి తా నన్నింట యోగ్యంబునై
భ్రమలం గూలక శాశ్వతంబయిన సౌభాగ్యంబు నుం గాంచు సత్
క్షమతన్ నేర్పును పుస్తకంబు విధిగా సన్మార్గమందించు నీ
క్షమపై దీనిని మించు సాధనమి కొక్కండైన లేదెన్నగన్.
 5.
సీ.
పుస్తకస్థంబైన వాస్తవజ్ఞానంబు
పూజ్యతాకాంక్షులై పొందవలయు
పొత్తంబులంగాంచి చిత్తదీప్తిని బెంచి
మహనీయులై జనుల్ మసలవలయు
గ్రాంథికంబైనట్టి కమనీయ భావంబు
లంది సభ్యత్వంబు నందవలయు
వీనిలోనున్నట్టి విజ్ఞాన సంపత్తి
నింపుగా నెదలలో నింపవలయు
ఆ.వె.
పుస్తకంబు భువిని హస్తభూషణమన్న
పలుకు లోని భావ పరిమళమును
తెలిసి యందులోని స్థిరతరజ్ఞానంబు
మదిని నిలిపి జనుడు మసలవలయు. 6.

హ.వేం.స.నా.మూర్తి.
29.02.2020.

Monday 24 February 2020

నాదేశం


నాదేశం
          .
        శ్రీరఘురామరాజ్య మిది క్షేమకరంబయి యన్నిరీతులన్
        జారుతరంబుగా వెలుగు చ్ఛుభసన్నుతసంస్కృతీలసత్
        గౌరవభాగ్యసమ్మితము, ర్మధరిత్రిగ వేదభూమిగా
    వీరజనాళికిన్ శుభదవిస్తృతశౌర్యమహత్వదీప్తులన్  
    గోరికదీర గూర్చుచు, కుంఠితధార్మికభావనాఢ్యసం
    స్కారవిధానవిజ్ఞతల త్వము జూపుచు, సర్వమానవా  
    కారసమానతల్ గరపి, ల్మషసంఘదురాగతమ్ములన్  
    దూరము జేయగా గలుగు తోరపుశక్తిని మానసమ్ములన్
    జేరగ జేసి, దార్ఢ్యత లశేషముగా గలిగించి, నిచ్చలున్
    మారుచునున్న లోకమున మాన్యత లందగజాలు పాటవం
    బీ రమణీయ ధాత్రియెపుడింపుగ నేర్పుచు గాచుచుండు  “స
    త్కారము లెల్లరీతులను గాంచుడు  నందనులార!” యంచు నా  
    చారపరంపరన్ దెలిపి భ్యత నింపును జీవనంబు నం
    “దూరక నన్యధర్మముల నుర్విని  జేకొను టొప్పుగాదు మీ
    రారయవచ్చు సౌఖ్యముల ద్భుతరీతిని స్వీయధర్మమం
    దో రసికాగ్రణుల్‌! వినుట లొప్పగు” నంచును దెల్పుచుండు నీ  
    భారత మాయతంబయిన వ్య యశస్సుల కాలవాలమై
    సౌరులు నింపుకొన్నయది ర్వవిధంబుల సత్య మిందు నా  
    శౌరి కృపాంతరంగమును, ర్వశుభంకరశంకరాది బృం
    దారకకోటివత్సలత, దైన్యత గూల్చెడి యజ్ఞయాగ సం
    భారమహత్వ దీప్తియును, బావన నిర్మలభావశుద్ధి, యా
    కారము దాల్చి యుండెడి సు ప్రద ధార్మిక శక్తి, యెల్లెడన్
    వారును వీరు నన్న విధి వ్యత్యయముం గననట్టి చిత్త, మా
    హారవిహార జన్యమగు ర్షము, లద్భుత మంత్రరాజముల్,
    ధీరతగూర్చు శాస్త్రములు, దీవ్యదనంతముదాకరంబులై
    చేరి మమత్వభాగ్యమును శ్రేష్ఠతరంబుగ బంచునట్టి సం
    భారములైన కావ్యములు,  వైభవ పూర్ణ పురాణసంతతుల్,   
    గౌరవభాజనంబయిన ర్మఠశక్తిని నేర్పుచుండు నె
    వ్వారయినన్ దురాత్ములయి పావనతన్ జెరుపంగ జూచినన్
    వారికి యుక్తమైన గుణపాఠము చెప్పుటలోన దిట్టయై
    మేరలు మీర ద్రుంచుటకు మేలగు మార్గము లందజేయు నా 
    కీ రమణీయ సద్భువిని నీభవమందిన దాత్మనెంచినన్
    తోరములౌ సుకర్మములు తొల్లిటి జన్మలయందు జేయుటల్
    కారణ మన్యమిచ్చటను గానగ రాదు మదీయ జన్మ”కీ
    ధారుణికిన్ మహత్వమును దైవమ! యిమ్మ”ని కోరకుండ నా 
    వీరత జూపి సేవకయి వెన్నును జూపక నిల్చువాడ, నా
    కోరిక దీర జన్మదకు గూరిమి బంచెద, స్వార్థహీన స
    త్పౌరుడనన్న ఖ్యాతిగొన ధైర్యము నిండగ ముందుకేగెదన్
    భారతి! వందనమ్ము సుమభాసుర భావము నామనమ్మునన్
    గోరికదీర నింపవలె, కోట్లకొలందిగ పుణ్యకార్యముల్
    శూరతజూపి చేయదగు శుభ్ర విధానము నేర్పుమమ్మ   సా
    కారము జేయుమమ్మ మది ల్గెడి స్వాప్నిక యోగ్య వాంఛలన్
    మీరను కట్టుబాట్లనని మిక్కిలి నమ్రతతోడ బల్కెదన్
    జేరును సద్యశంబులిట శ్రీలు ప్రవాహములౌచునిత్యమున్
    బారుచునుండు సందియము భావములం దది యేల విశ్వమం
    దౌర! యటంచు నచ్చెరువు నందరె యందరు నిన్ను గాంచి నీ
    వారయ శ్రేష్ఠతా గరిమ న్నివిధంబుల నందగల్గుటల్
    దూరము గాదు నిక్కమిది  తొల్లిటిరీతిని, శీఘ్ర మిప్పు డో
    ధారుణి! సర్వజీవులకు న్మయతన్ గలిగించు నట్టి సత్
         ప్రేరణ నిమ్మటంచు  నిను వేడెద భారతమాత! నిత్యమున్.

హ.వేం.స.నా.మూర్తి.
24.02.2020.


Thursday 20 February 2020

ఓం నమశ్శివాయ

ఓం నమశ్శివాయ
కం.
ఓం..
ఓంకారాత్మకుడౌచును
గింకరులకు సర్వగతుల క్షేమంకరుడై
కింకలను బాపుచుండెడి
శంకరుని దలంతు సతము సర్వేశ్వరునిన్.   1.
కం.
న..
నమ్మకముతోడ త్ర్యంబక!
నెమ్మనమున సంతతంబు నిను నిల్పెద నా
కిమ్మహిని భాగ్యసంచయ
మిమ్మన నిదె యడుగుచుంటి నీహాముక్తిన్. 2.
కం.
మ..
మమకారము జూపించుట
కుమతోడను విన్నవింతు నో యీశ్వర! నా
కమలినభావానందం
బమరాగ్రగ! యొసగుమయ్య! యాశ్రితవరదా! 3.
కం.
శి..
శివశివశివశివ యంచును
భవహర!నిను దలచుచుందు బాపంబుల నీ
యవనిని సలుపగ నీయక
స్తవనీయా! కావుమయ్య! ధన్యుడ నౌదున్. 4.
కం.
వా..
వాసిని గూర్తువొ, ఖలుడని
చేసిన కలుషముల నెంచి 'ఛీ పొమ్మ'నుచున్
గాసిని బెట్టెదవో నను
నీసముఖము వీడనయ్య! నిత్యమ్ము శివా!5.
కం.
య..
యజనములు పుణ్యకర్మలు
త్రిజగములను యశము గూర్చు స్థిరకృత్యములున్
రజతాచలసద్గేహా!
నిజమిది నిను జేరు పనులె నిటలాక్ష!నతుల్. 6.

శ్రీ శివాయ నమః.

శ్రీ శివాయ నమః.
(సర్వలఘుకందములు)

కం.
శుభకరునకు సురవరునకు
విభవము లొసగుచును భువికి  వివిధ సుఖములన్
బ్రభుడయి నిరతము దెలుపుచు
నభయము గలుగగను నిలుచు నభవునకు నతుల్.  1.
కం.
గిరిశునకు పరమశివునకు
హరహరయని బలికి జలము లట శిరముపయిన్
వరమగు విధమున జిలికిన
వరమొసగెడి యతని కిపుడు ప్రణతుల శతముల్.  2.
కం.
శిరమున జలమును జిలుకుచు
ధరగల దళములను బయిని దనకొసగినచో
సురకుజమును మన గృహమున
పెరడున నిలబడగ బిలుచు విబుధునకు నతుల్.  3.
కం.
పురహరునకు భవహరునకు
స్మరహరునకు  విసము మెసవి సకలజగములన్
సరగున నిలిపిన ఘనుడగు
హరునకు నతులనెద దలచి యనవరత మిటన్. 4.
కం.
గిరిసుతను సగము తనువున
సురుచిరముగ నిలిపి గళము శుభకరుడయు యా
యురగముల కొసగు పశుపతి
నరుసమునకు నిలయు డయిన యభవుని గొలుతున్. 5.

Sunday 9 February 2020

శబ్దాలంకారములు

శబ్దాలంకారములు – నా ప్రయత్నము

1.  వృత్త్యనుప్రాస
కం.
కరములు చరణము లరయగ
సురుచిరగతి నరున కిచట సొగసరితనమున్
వరమగు సరణిని ధరణిని
వెరవక స్థిరపడుటకొరకు విరివిగ నొసగున్.

2. లాటానుప్రాస.
సీ.
శ్రీమంతమైనట్టి చిత్తంబు చిత్తంబు
..................పరులహితముగోరు పనులు పనులు
పేదవారికి బంచు విత్తంబు విత్తంబు
.................సంఘసేవను దెల్పు చదువు చదువు
స్వార్థంబు విడనాడు జన్మంబు జన్మంబు
.................సమసమాజము నిల్పు శక్తిశక్తి
కన్నవారికినైన కాయంబు కాయంబు
.................జన్మభూమిని గొల్చు సరణి సరణి
ఆ.వె.
భావదీప్తి నిండు పద్యంబు పద్యంబు
స్తవములంద గలుగు కవిత కవిత
సమతనిండియున్న సంఘంబు సంఘంబు
పరుల సుఖము గోరు నరుడు నరుడు.

3. ఛేకానుప్రాస, అంత్యప్రాస
తే.గీ.
సుఖద సంపద పదముల చొప్పు కనుడు
పరమ హితకారి కవనమ్ము నమ్ము డెపుడు
పరుల సేవయె సంసారసార మనుడు
వెగటుచేతల తలపేల జగతి వినుడు.

4. అంత్యప్రాస
కం.
మనుజా! హితమిది వినుమా!
జనులందరిలోన దివ్యశక్తిని గనుమా!
ఘనతను గాంచుచు మనుమా!
తనమనభావంబు ధరణి దగదని యనుమా!.

5.  ముక్తపదగ్రస్తము
కం.
సమతను జూపుట క్రమమగు
క్రమమగు కార్యములతీరు ఘనతకు సమమౌ
సమమౌ వినయము క్షమకును
క్షమకును నానరుడె ప్రభుడు గద యివి కలుగన్.

6. యమకము
కం.
వరదాతలు కరుణింతురు
వరమగు కార్యమును జేయ పరమశివా! కా
వర యని యనవలెనా? స్థా
వరజంగమపుం డెరుగడె? వలసిన దిచటన్

హ.వేం.స.నా.మూర్తి.
09.02.2020.

Friday 7 February 2020

మిత్రుడు

మిత్రుడు

ఉ.
మిత్రునికన్న లేరుగద మేటి హితైషులు మేదినీస్థలిన్
శాత్రవవర్గతంత్రముల సత్త్వము గూల్చెడి శక్తియుక్తులున్
ధాత్రిని  సౌఖ్యమందెడి విధానవిశేషవితానదీప్తులున్
మైత్రికి లక్షణంబులని మాన్యతనందగ నేర్పు నెప్పుడున్. 1.
ఉ.
స్నేహితుడైనవాడెపుడు క్షేమమె కోరును కష్టసంతతుల్
మోహముమీరజేరగను మోదము గూర్చగ నేగుదెంచి సం
దేహములేక మిత్రునకు దెల్పుచు ధైర్యము ప్రేమపూర్ణుడై
యాహవశక్తి నేర్పెడి మహాత్ముడు రక్షకు డన్నిరీతులన్ 2.
ఉ.
ధర్మము తప్పకుండెడి విధానము నేర్పును జీవనంబు నా
కర్మమటంచు గూర్చొనక కాగలదానిని బొంద యోగ్యమౌ
మర్మములన్ని తెల్పుచును మాన్యత గూర్చు సమాజమందు దా
నర్మిలితోడ మిత్రుడిట నాతనితుల్యులు లేరు చూడగన్. 3.
ఉ.
ఆపదలందు మున్గునపు డస్థిరతన్ గని విత్తహీనుడై
ప్రాపును గోలుపోయి బహుభంగుల నొంటరిజీవి యౌచు సం
తాపమునందు మున్గు నెడ దైన్యత మాన్పగ ధైర్యదాతయై
చూపును ప్రేమభావము వసుంధర నీ హితు బోలరెవ్వరున్. 4.
ఉ.
తల్లియు దండ్రి యన్నయును దన్మయతన్ గలిగించు సోదరుం
డుల్లము సంతసించునటు లొప్పగు బోధన చేయు సద్గురుం
డెల్లవిధాల సద్ధితము లేయెడ గోరుచునుండువా డికన్
సల్లలితాత్ము డీసఖుడు సత్యము నమ్ముడు ధాత్రిలోపలన్.5.
ఉ.
చక్కని మిత్రు నీక్షితిని సమ్యగమేయసుఖాస్పదంబులౌ
చిక్కని భావజాలముల జేర్చెడివానిని బొందగల్గుటల్
నిక్కము పూర్వజన్మకృతనిస్తులపుణ్యఫలం బనందగున్
దక్కిన మాటలేల యిట దైవనిభుండితడౌట గాంచమే.6.
ఉ.
మిత్రుడు లేని జీవితము మిక్కిలి దుర్భర మెల్లవేళలన్
చిత్రవిచిత్రకష్టములు చేరుచునుండును సంఘమందునన్
బాత్రత దూరమౌ నిక శుభంబులు సంగమువీడి పోవగా
నాత్రము చూపుచుండుటల నందరు గాంచగవచ్చు నెప్పుడున్ 7.
ఉ.
కావున మిత్రులార! కలకాలము సౌఖ్యము లందగోరినన్
దైవసమానుడై వెలుగుధార్మికవర్తను నొక్కవానినిన్
పావనమైన మిత్రతకు వాస్తవదీప్తిని నింపువానిగా
తావకయోగ్యతావిభవదార్ఢ్యత నందు డవశ్య మిచ్చటన్.8.

06.02.2020