Sunday 9 February 2020

శబ్దాలంకారములు

శబ్దాలంకారములు – నా ప్రయత్నము

1.  వృత్త్యనుప్రాస
కం.
కరములు చరణము లరయగ
సురుచిరగతి నరున కిచట సొగసరితనమున్
వరమగు సరణిని ధరణిని
వెరవక స్థిరపడుటకొరకు విరివిగ నొసగున్.

2. లాటానుప్రాస.
సీ.
శ్రీమంతమైనట్టి చిత్తంబు చిత్తంబు
..................పరులహితముగోరు పనులు పనులు
పేదవారికి బంచు విత్తంబు విత్తంబు
.................సంఘసేవను దెల్పు చదువు చదువు
స్వార్థంబు విడనాడు జన్మంబు జన్మంబు
.................సమసమాజము నిల్పు శక్తిశక్తి
కన్నవారికినైన కాయంబు కాయంబు
.................జన్మభూమిని గొల్చు సరణి సరణి
ఆ.వె.
భావదీప్తి నిండు పద్యంబు పద్యంబు
స్తవములంద గలుగు కవిత కవిత
సమతనిండియున్న సంఘంబు సంఘంబు
పరుల సుఖము గోరు నరుడు నరుడు.

3. ఛేకానుప్రాస, అంత్యప్రాస
తే.గీ.
సుఖద సంపద పదముల చొప్పు కనుడు
పరమ హితకారి కవనమ్ము నమ్ము డెపుడు
పరుల సేవయె సంసారసార మనుడు
వెగటుచేతల తలపేల జగతి వినుడు.

4. అంత్యప్రాస
కం.
మనుజా! హితమిది వినుమా!
జనులందరిలోన దివ్యశక్తిని గనుమా!
ఘనతను గాంచుచు మనుమా!
తనమనభావంబు ధరణి దగదని యనుమా!.

5.  ముక్తపదగ్రస్తము
కం.
సమతను జూపుట క్రమమగు
క్రమమగు కార్యములతీరు ఘనతకు సమమౌ
సమమౌ వినయము క్షమకును
క్షమకును నానరుడె ప్రభుడు గద యివి కలుగన్.

6. యమకము
కం.
వరదాతలు కరుణింతురు
వరమగు కార్యమును జేయ పరమశివా! కా
వర యని యనవలెనా? స్థా
వరజంగమపుం డెరుగడె? వలసిన దిచటన్

హ.వేం.స.నా.మూర్తి.
09.02.2020.

No comments:

Post a Comment