Thursday 20 February 2020

ఓం నమశ్శివాయ

ఓం నమశ్శివాయ
కం.
ఓం..
ఓంకారాత్మకుడౌచును
గింకరులకు సర్వగతుల క్షేమంకరుడై
కింకలను బాపుచుండెడి
శంకరుని దలంతు సతము సర్వేశ్వరునిన్.   1.
కం.
న..
నమ్మకముతోడ త్ర్యంబక!
నెమ్మనమున సంతతంబు నిను నిల్పెద నా
కిమ్మహిని భాగ్యసంచయ
మిమ్మన నిదె యడుగుచుంటి నీహాముక్తిన్. 2.
కం.
మ..
మమకారము జూపించుట
కుమతోడను విన్నవింతు నో యీశ్వర! నా
కమలినభావానందం
బమరాగ్రగ! యొసగుమయ్య! యాశ్రితవరదా! 3.
కం.
శి..
శివశివశివశివ యంచును
భవహర!నిను దలచుచుందు బాపంబుల నీ
యవనిని సలుపగ నీయక
స్తవనీయా! కావుమయ్య! ధన్యుడ నౌదున్. 4.
కం.
వా..
వాసిని గూర్తువొ, ఖలుడని
చేసిన కలుషముల నెంచి 'ఛీ పొమ్మ'నుచున్
గాసిని బెట్టెదవో నను
నీసముఖము వీడనయ్య! నిత్యమ్ము శివా!5.
కం.
య..
యజనములు పుణ్యకర్మలు
త్రిజగములను యశము గూర్చు స్థిరకృత్యములున్
రజతాచలసద్గేహా!
నిజమిది నిను జేరు పనులె నిటలాక్ష!నతుల్. 6.

No comments:

Post a Comment