Friday 7 February 2020

మిత్రుడు

మిత్రుడు

ఉ.
మిత్రునికన్న లేరుగద మేటి హితైషులు మేదినీస్థలిన్
శాత్రవవర్గతంత్రముల సత్త్వము గూల్చెడి శక్తియుక్తులున్
ధాత్రిని  సౌఖ్యమందెడి విధానవిశేషవితానదీప్తులున్
మైత్రికి లక్షణంబులని మాన్యతనందగ నేర్పు నెప్పుడున్. 1.
ఉ.
స్నేహితుడైనవాడెపుడు క్షేమమె కోరును కష్టసంతతుల్
మోహముమీరజేరగను మోదము గూర్చగ నేగుదెంచి సం
దేహములేక మిత్రునకు దెల్పుచు ధైర్యము ప్రేమపూర్ణుడై
యాహవశక్తి నేర్పెడి మహాత్ముడు రక్షకు డన్నిరీతులన్ 2.
ఉ.
ధర్మము తప్పకుండెడి విధానము నేర్పును జీవనంబు నా
కర్మమటంచు గూర్చొనక కాగలదానిని బొంద యోగ్యమౌ
మర్మములన్ని తెల్పుచును మాన్యత గూర్చు సమాజమందు దా
నర్మిలితోడ మిత్రుడిట నాతనితుల్యులు లేరు చూడగన్. 3.
ఉ.
ఆపదలందు మున్గునపు డస్థిరతన్ గని విత్తహీనుడై
ప్రాపును గోలుపోయి బహుభంగుల నొంటరిజీవి యౌచు సం
తాపమునందు మున్గు నెడ దైన్యత మాన్పగ ధైర్యదాతయై
చూపును ప్రేమభావము వసుంధర నీ హితు బోలరెవ్వరున్. 4.
ఉ.
తల్లియు దండ్రి యన్నయును దన్మయతన్ గలిగించు సోదరుం
డుల్లము సంతసించునటు లొప్పగు బోధన చేయు సద్గురుం
డెల్లవిధాల సద్ధితము లేయెడ గోరుచునుండువా డికన్
సల్లలితాత్ము డీసఖుడు సత్యము నమ్ముడు ధాత్రిలోపలన్.5.
ఉ.
చక్కని మిత్రు నీక్షితిని సమ్యగమేయసుఖాస్పదంబులౌ
చిక్కని భావజాలముల జేర్చెడివానిని బొందగల్గుటల్
నిక్కము పూర్వజన్మకృతనిస్తులపుణ్యఫలం బనందగున్
దక్కిన మాటలేల యిట దైవనిభుండితడౌట గాంచమే.6.
ఉ.
మిత్రుడు లేని జీవితము మిక్కిలి దుర్భర మెల్లవేళలన్
చిత్రవిచిత్రకష్టములు చేరుచునుండును సంఘమందునన్
బాత్రత దూరమౌ నిక శుభంబులు సంగమువీడి పోవగా
నాత్రము చూపుచుండుటల నందరు గాంచగవచ్చు నెప్పుడున్ 7.
ఉ.
కావున మిత్రులార! కలకాలము సౌఖ్యము లందగోరినన్
దైవసమానుడై వెలుగుధార్మికవర్తను నొక్కవానినిన్
పావనమైన మిత్రతకు వాస్తవదీప్తిని నింపువానిగా
తావకయోగ్యతావిభవదార్ఢ్యత నందు డవశ్య మిచ్చటన్.8.

06.02.2020

No comments:

Post a Comment