Tuesday, 21 April 2015

భూమిభూమి
సీ.           జన్మంబు నందించు జనని కేకాలాన
నునికిపట్టై వెల్గుచుండు నేది?
జన్మించియున్నట్టి సకలజీవాలకు
తన్మయత్వము గూర్చు తావదేది?
ఈ చరాచరసృష్టి యేమాత్రమును చింత
నూనక వసియించు స్థానమేది?
స్వపరభేదములేక సర్వంబు తనలోన
చివరి కైక్యంబు తా జేయునేది?
తే.గీ.       తొణకకుండగ, మాటలు తూలకుండ
తరతమంబుల భావంబు తలపకుండ
మోద మందరి కందించు మేదిని యది
వందనంబుల నద్దాని కందజేతు.                       ౧.

సీ.           తనపైన నెలవుండి తమసుఖంబులు గోరి
ముక్కలుగా జేసి మోదుచున్న,
పనిముట్లు చేబూని పరమార్థ మిదియంచు
తనను గోతులుగాగ త్రవ్వుచున్న,
సతతంబు కృషియంచు నతులహర్షంబుతో
వెన్ను జీల్చెడిరీతి దున్నుచున్న,
వ్యర్థాలు, మలినాలు స్వార్థపూర్ణాత్ములై
మదిదప్పి తనమీద వదలుచున్న
తే.గీ.       క్రోధ మించుక జూపక, బాధపడక,
పెద్దమనసున క్షమజూపి, పిల్లలనుచు
సర్వసౌఖ్యంబు లందించి శ్రమను బాపి
రక్ష చేసెడి ధరణికి ప్రణతు లిపుడు.                    ౨.

Saturday, 21 March 2015

శ్రీమన్మథనామసంవత్సరానికి స్వాగతంశ్రీమన్మథనామసంవత్సరానికి స్వాగతం
పద్యోత్పలమాలిక
స్వాగతమోయి! మన్మథ! ప్రభావయుతంబగు నామధారివై
వేగమ యేగుదెంచితివి, విశ్వజనాళికి మేలు చేయగా,
సాగవలెన్ త్వదీయ పరిచర్యలు లోకుల గాచునట్టివై
త్యాగము, సాధువర్తనము, ధన్యత గూర్చెడు శీలసంపదల్
భోగము లందజేయు పరిపూర్ణ సుఖంబుల నిచ్చునట్టి స
ద్రాగమయాన్వితం బయిన రమ్యసుజీవన మాంధ్రభూమిలో
తేగలవీవు, సత్యమిది, ధీయుత! హాయనరాజరాజమా!
నీ గతి సాగుకాలమున నిత్యసుఖంబులు, శాంతివాయువుల్
జాగృతభావనల్, యశము, సన్నుతి కర్హములైన కృత్యముల్,
రోగవిహీనభాగ్యములు, రోషము జూపని సోదరత్వముల్,
వాగమృతంబుతోడ తమ భాగ్యము పంచెడు భావనాబలం
బాగని దానవీరతయు, హర్ష మొసంగు సమైక్యవాదనల్,
దాగని సాహసంబులును ధారుణిలో వికసింపగావలెన్
ప్రోగులు ప్రోగులై భరతభూమిని నల్దిశలందు నిత్యమున్
మూగెడు లంచగొండులకు, మూర్ఖత, స్వార్థము నింపుకొంచు స
ర్వాగమసూక్తిసంపదల వైభవమున్ గనకుండ ధూర్తులై
వాగెడు దుష్టబుద్ధులకు వాసి యణంగవలెన్, మునీంద్ర స
ద్యోగుల బృంద మందరికి తుష్టి యొసంగెడు ధర్మకార్యముల్
సాగుచునుండగా వలయు సత్యము వృద్ధిని పొందగా వలెన్
బాగగురీతి పాలనము భారతదేశమునందు సాగగా
తా గతి దప్పగావలయు దైన్యము, పేదరికంబు లుప్తమై
యోగము కూడగావలయు, నుత్సవముల్ ధరణీతలంబునం
దాగక సాగుచుండవలె నన్నిరకంబుల భాగ్యసంతతుల్
రాగలవన్న నమ్మకము రావలె మన్మథ నీదుకాలమం
దో గురుభావపూర్ణ! విమలోదయ! హాయనరాజ! సుందరా!
భోగమయా! వినీతపరిపూర్ణహృదంబుజయుక్త! నీకిదే
స్వాగతమంచు పల్కెదను సాధుజనావనదీక్షబూని నీ
వాగక రమ్ము మా హృదుల హర్షము నింపుము వర్షమంతటన్.

శ్రీ మన్మథనామ సంవత్సరముశ్రీ మన్మథనామ సంవత్సరము
శా.    శ్రీమన్మన్మథనామవత్సరము సత్శ్రేయంబులన్ గూర్చుచున్
క్షేమం బెల్లజనాళి యుండుకొరకై శ్రీలన్ ప్రసాదించుచున్
ధామంబై సువిశాలసౌఖ్యతతికిన్, ధర్మంపు సంస్థానమై
భూమిన్ కూర్చు శుభంబు లెల్లగతులన్ భోగంబులందించుచున్.         
శా.    విద్యాభ్యాసము చేయుచుండి సుమహద్విజ్ఞాన సంపన్నులై
విద్యార్థుల్ వినయాదిసద్గుణములన్, విస్తారసద్భావముల్
సద్యస్స్ఫూర్తి యు మన్మథాబ్దమున ధీశక్తిన్ సదౌన్నత్యమున్
హృద్యంబౌనటు లందగావలె నిలన్ హృష్టాత్ములై నిత్యమున్.  

శా.    నవ్యాంధ్రంబున సంపదల్ కురియుచున్ న్యాయప్రసారంబునన్
దీవ్యద్వైభవదీప్తు లన్నిదిశలన్ దేదీప్యమానంబులై
భవ్యంబౌవిధి విస్తరించవలయున్ బాగైన సస్యంబు లీ
నవ్యాబ్దంబున మన్మథాన కలుగన్ నానాప్రకారంబుగాన్.

శా.    ఆనందంబిడు రాజధాని కిపుడీ యాంధ్రావనీ రాష్ట్రమం
దేనాడు న్విననట్టి రీతి కనగా నీ మన్మథాబ్దంబునన్
మానం బెల్లెడ చాటునట్టులుగ నిర్మాణంబు సాగన్వలెన్
దానన్ సోదరరాజ్యవాసు లకటా! ధైర్యాఢ్యు లీరంచనన్.  

శా.    మాసాలున్ ఋతుషట్క మాయయనముల్ మాన్యంబులౌ పక్షముల్
వాసింగన్నతిథుల్ సమస్తకరణాల్ వారంబులున్ యోగముల్
గాసింగూల్చెడు తారలున్ వివిధ లగ్నంబుల్ కనన్ రాశులున్
ధ్యాసన్నిల్పుచు మన్మథాబ్దమున సత్సాంగత్యమున్ గూర్చెడున్.  

Wednesday, 31 December 2014

నూతనసంవత్సర(౨౦౧౫) శుభకామనలునూతనసంవత్సర(౨౦౧౫) శుభకామనలు

ఆ.వె. శ్రీల నందవలయు చిరకాలవాంఛలీ
        నూత్నవత్సరాన  యత్నమునను
        చేతమలరునట్లు సిద్ధించవలెగాత
       క్రమత మీకటంచు కాంక్షజేతు            ౧.

ఆ.వె. స్వాస్థ్యవర్ధనంబు చక్కగా నుండుచు
        సంతసంబు గలిగి సతత మొదవు
        నూతనాబ్దమందు నూతనోత్సాహంబు
       క్రమత మీకటంచు కాంక్షజేతు             ౨.

ఆ.వె. ఇనుమడించు దీప్తి యీవత్సరంబంత
        అందుచుండవలయు ననుపమముగ
        సద్యశంబు లొసగు సత్కార్యములచేత
       క్రమత మీకటంచు కాంక్షజేతు            ౩.

ఆ.వె. సర్వదిశలలోన సంవత్సరంబంత
        విజయ మొసగునట్లు విస్తృతముగ
           నలముచుండ వలయు  ననుకూలపవనాలు
       క్రమత మీకటంచు కాంక్షజేతు            ౪.

ఆ.వె. మీకుటుంబ మందు మిగుల హర్షంబబ్బి
        బందుజనులసంగ వైభవంబు
       క్రొత్తవత్సరాన కూడంగవలె గాత
         క్రమత మీకటంచు కాంక్షజేతు                 ౫.


ఆ.వె. సన్నుతించదగిన సద్భావభాగ్యంబు
        శుభము లొసగునట్టి సూక్తిపంక్తి
        కార్యకరణశక్తి కలుగు నీయబ్దాన
        క్రమత మీకటంచు కాంక్షజేతు            ౬.

ఆ.వె. జగతివారలంద రగణిత సౌఖ్యంబు
        లందవలయు ననెడు సుందరమగు
           భావ మీయ వలయు భగవంతు డీయేడు
        క్రమత మన కటంచు కాంక్షజేతు         ౭.

ఆ.వె.  దేశభక్తి మరియు దివ్యానురాగంబు
         సాటివారిపట్ల సవ్యమైన
         ఆత్మసదృశభావ మందునీ యబ్దాన
         క్రమత మనకటంచు కాంక్షజేతు         ౮.

ఆ.వె.   విజయనగర దివ్య విద్యాలయంబందు
          విజయపంక్తి సతము విస్తరించ
              హర్షమబ్బు నూత్నహాయనంబంతయు
         క్రమత మన కటంచు కాంక్షజేతు.       ౯.

ఆ.వె.   హృద్యమైన రీతి విద్యార్థిలోకాన
          వినయదీప్తి గలుగ ననయమిచట
          సంతసంబు గూడు సంవత్సరంబంత
           క్రమత మనకటంచు కాంక్షజేతు            ౧౦.