Wednesday 8 March 2023

మహిళ

 సీ.

తల్లియై జన్మంబు ధరవారి కొసగుచు

ధన్యత్వమును గాంచు మాన్య మహిళ,

సోదరి తానౌచు నాదరంబును బెంచి 

యాప్యాయతను బంచు నామె మహిళ,

తనయయై సేవించి యనుపమానందంబు

ప్రభవింప జేసెడి పడతి మహిళ,

అర్థాంగియై జన్మ సార్థకంబుగ జేయు

ప్రేమస్వరూపిణి యామె మహిళ

ఆ.వె.

అన్ని దశలలోన నవనిపై జనునకు 

నండయౌచు నిల్చి యతులదీప్తి 

జేర్చి విజయపంక్తి సిద్ధింప జేసెడి 

యామె మహిళ యామె నభినుతింతు.

సీ.మా.

మహిషాసురుని జంపి మహికి గల్యాణంబు 

సమకూర్చి యున్నట్టి శక్తి మహిళ,

నరకాసురునిపైన శరపరంపర బంపి

యంతకు జేర్చిన యామె మహిళ,

దశకంఠు  ఖండించి దానవాళిని ద్రుంచ

గారణ మైనట్టి కాంత మహిళ,

ధరణిపై బలుమార్లు ధర్మంబు నిల్పెడి 

హరికి జన్మదయైన యామె మహిళ,

ముగ్గురు మూర్తులన్ బురిటి బాలల జేసి

బుజ్జగించిన యట్టి పూజ్య మహిళ,

సూర్యోదయము సైత మార్యుని ప్రాణార్థ

మాపి సన్నుతులందు  నామె మహిళ,

యముని తీర్పున గూడ 

క్రమమును దప్పించి 

పతిని జీవితు జేయు వనిత మహిళ

కురువంశ ఖలులను బరిమార్చ హేతువై 

ధర్మంబు గాచిన తన్వి మహిళ,

ఝాన్సీకి రాణియై ఝంఝానిలము రీతి 

నాంగ్లపాలన మడ్డు నామె మహిళ,

కాకతీయుల నేల  నాకతాయుల నెల్ల

యణచి పాలించిన యామె మహిళ,

దీనులపాలిట తాను  తల్లిగ నున్న

కరుణామయి తెరీస కాదె మహిళ

సంస్కర్త్రి, రచయిత్రి, సామాజికోద్ధర్త్రి

యైన దుర్గాబాయి యరయ మహిళ 

వ్యోమగామిగ ఖ్యాతి నొప్పార నార్జించు

కల్పనా చావ్లయు,కనగమహిళ

అలఘుకీర్తిని గాంచు తొలి తెల్గు కవయిత్రి 

తిమ్మక్క రచనలో దిట్ట మహిళ

రమ్యసచ్ఛైలిలో రామాయణంబు తా

నెల్లర కందించు మొల్ల మహిళ

ఆ.వె.

మహిళయొక్కశక్తి  మహిపైన నింతంచు

తెలుప సాధ్యమగునె? పలుకుటగునె? 

ఆమె లేక యున్న నంతయు శూన్యంబె 

యగుట భక్తి నామె కంజలింతు.

కం.

మహితోజ్జ్వలసచ్ఛక్తిగ

మహిపై చేతనము నింపి మనుజుల కిలలో

మహనీయత కలిగించెడి

మహిళకు జేజేలు నిత్యమహిమాన్వితకున్.

No comments:

Post a Comment