Friday 27 July 2018

శ్రీ గురవే నమ:


శ్రీ గురవే నమ:

సీ.
ప్రేమతో దరిజేర్చి క్షేమమారయుచుండి
యుత్సాహమును గూర్చుచుండువాడు,
అమితవాత్సల్యాన సమత నందరిపైన
నెల్లకాలము ప్రకటించువాడు,
ఛాత్రుల హృదయాలు సద్వివేకంబుతో  
వెలిగించ మనములో దలచువాడు,
తనసంతతిని మించి నులు వీరంచును
శిష్యుల ప్రస్తుతి చేయువాడు, 
తే.గీ.
సదమలము లౌచు ముదమంది సర్వగతుల
మానసంబులు వికసించ మనుజకోటి
సౌఖ్యములు గాంచి యిలలోన సవ్యదిశను
సాగవలెనంచు యత్నంబు జరుపువాడు.                                       1.
సీ.
విసుగింతయును లేక విస్తృతరూపాన
శిష్యకోటికి బోధ చేయువాడు
తనఛాత్రు లన్నింట ననుపములై యిలన్
నిలువంగ హర్షించ  నేర్చువాడు
జాతినిర్మాణాన ఖ్యాతి గాంచుట తప్ప
యాత్మసౌఖ్యము లెంచనట్టివాడు
సంకటంబులనైన సంతోషమని యంచు
దాటు సామర్ధ్యంబు చాటువాడు
తే.గీ.
గురుడు సర్వార్థములు పొందు సరణి దెలుప
దక్షు డనుదిన హితకార్య దీక్షితుండు
క్షితిని నాబాలగోపాల మతని కర్మ
శాలలో మలచిన వస్తు జాలము గద.                                              2.

శా.
అజ్ఞానమ్ము హరింపజేసి మదులం దత్యున్నతానందముల్
విజ్ఞానమ్మును బంచుచుండి సతమున్ విస్తారరూపంబుగా
ప్రజ్ఞన్ బెంచు విధాన బోధనములన్ భవ్యంబుగా జేయు నా
ప్రాజ్ఞున్ సద్గురువర్యు నే ననిశమున్ బ్రార్థింతు జ్ఞానార్థినై.                  ౩.
కం.
గురుడగు బ్రహ్మ సమానుడు,
గురు డచ్యుతు, డతడె శివుడు, గురు డెంచినచో
ధరణిని పరమ బ్రహ్మము
పరమాత్ముడు గాన చేతు భక్తిని ప్రణతుల్.                                      4.
కం.
వందన శతములు గురునకు
సుందర జీవనము గూర్చు సురుచిర మార్గం
బందరకును జూపించెడి
బృందారకసమున కిత్తు వినయాంజలులన్.                                     5.

హ.వేం.స.నా.మూర్తి.
27.07.2018.

Monday 23 July 2018

విష్ణు స్తుతి


శ్రీమన్మహావిష్ణవే నమః

చం.
సురగణ నిత్యవందిత విశుద్ధ సుఖప్రద సర్వపాప సం
హరణ మహత్త్వదీప్త నహర్షవివర్ధక భక్తకోటి స
ద్వరద యశఃప్రసారకర వైభవదాయక భార్గవీపతీ
వరచరణారవింద జలపానవిభూతిని గోరి మ్రొక్కెదన్.                                1.
మ.
జగదీశా! మధుసూదనా! సురవరా! సర్వార్థసంధాయకా!
ఖగవాహా!మునిసంస్తుతా! నుతగుణా! కారుణ్యరత్నాకరా!
యగజాతార్తిహరా! సమస్తసుఖదా! హర్షప్రదా! శాశ్వతా!
నిగమాభ్యర్చిత! వాసుదేవ! నృహరీ! నీకై సదా మ్రొక్కెదన్.                        2.
శా.
నీనామంబు జపించు భాగ్యగరిమన్ నిత్యంబు నేనందగా
హే నారాయణ! భక్తలోకవరదా! హేముక్తిదాతా! హరీ!
దీనోద్ధారక! దైత్యనాశనమహద్దీక్షాన్వితా! శ్రీపతీ!
నానాభాగ్యవిధాయకా! సురనుతా!నాకీయవే సత్త్వమున్.                           3.
శా.
నీనాభేదము చూపనట్టి గుణమున్, నిస్స్వార్థభావంబు,
న్మానార్హంబగు వర్తనంబు, భువిపై నవ్యానురాగంబు, దీ
నానీకామయకష్టసంహతులలో నైనంత సాయంబులన్
నేనందించెడి శక్తినిమ్ము కృపతో నిత్యంబు నిన్గొల్చెదన్.                             4.
శా.
చక్రం బీయెడ బంపి నామనమునన్ సర్వత్ర వ్యాపించి భా
వక్రౌర్యంబున కాలవాలమయి నన్ బాధించు దుర్నీతులన్
వక్రీభూతచరిత్ర కాకరములన్ వైకుంఠ! దివ్యాయుధా!
శక్రాదిత్రిదశార్చితా! తునుమవే! సంతోష మందించవే!                              5.
మ.
బహురూపా! సకలస్థితా! నరసఖా! భాగ్యప్రదా! యిందిరా
సహితా! దానవకోటిసంహరణదీక్షాదక్ష! సత్యాశ్రయా!
అహిభూషానుగ! వేదవేద్య! పరమా! యజ్ఞేశ! పీతాంబరా !
అహితప్రాభవనాశ! వత్సలుడవై యందందగున్ సన్నుతుల్.                       6.
23.07.2018

Sunday 22 July 2018

దీర్ఘ సమాస పద్యాలు


శా.
సర్వారాధితపాదపద్మ పదవీ సంజాత గంగాపగన్
దుర్వారాఘసమూహరూషిత మహ ద్దుఃఖాబ్ధి నిర్మగ్నులౌ
యుర్వీసంస్థిత మానవాళి విలసద్యోగార్థులై మున్గినన్
సర్వైశ్వర్యవినిర్మలత్వసుఖముల్ సత్యంబు తామందరే.
18.07.2018
మ.
సతతానందద సత్కవిత్వరచనా సంప్రాప్త సన్మాన దీ
పితహర్షస్థిత సత్కవీంద్రవదనావిర్భూత శబ్దాళి ని
ర్గతమాధుర్య రసైకపానజ లసత్ప్రజ్ఞావిశేషాదిసం
స్తుతభాగ్యాన్విత పాఠకాళి కిలలో తూగంగ లేరెవ్వరున్.
19.07.2018

సురగణనిత్యవందితయశోమయభాగ్యవివర్ధమాన శం
కరచరణారవిందజసుఖాకరభవ్యరజోవిభూతి ని
ర్ఝరనిరతావగాహనవిరాజితపుణ్యజనైకసేవనా
తురవరమానవాళికిని తుల్యత నందుట దుర్లభం బిలన్.
22.07.18.
చం.
సురగణ నిత్యవందిత విశుద్ధ సుఖప్రద సర్వపాప సం
హరణ మహత్త్వదీప్త ఘనహర్షవివర్ధక భక్తకోటి స
ద్వరద యశఃప్రసారకర వైభవదాయక భార్గవీపతీ
వరచరణారవింద జలపానవిభూతిని గోరి మ్రొక్కెదన్.

23.07.18.


ఎస్.వి.రంగారావు


ఎస్.వి.రంగారావు

కం.
శ్రీమంతమైన జీవన
మీమహనీయునకు గల్గె నిమ్మహిలోనన్
కామితవరదుం డీతని
నామం బిట వెలగ జేసె నైష్ఠికు డగుటన్.         1.
శా.
రంగారాయుని వైభవంబు దలపన్ రమ్యాతిరమ్యంబు స్వ
ర్గంగాసన్నిభమైన పావనతకున్ సాక్ష్యంబు తానౌచు నా
డంగీకారము తెల్పె చిత్రములలో హావంబు భావంబులన్
రంగారన్ ప్రకటింపజేయుపనిలో ప్రావీణ్యతన్ జాటుచున్.         2.
ఉ.
పాత్రలలోన లీనుడయి భవ్యముగా నటియించియున్న స
ద్గాత్రుని రంగరాయఘను కారణజన్ముని స్వీయదీప్తిచే
గోత్రము నందు సద్యశము గూడగ జేసినవాని ఖ్యాతికిన్
పాత్రుని చిత్రసీమ కురుభాగ్యము గూర్చిన వానినెన్నుదున్.        3.
శా.
ఎస్వీయారను పేర నాంధ్ర భువిపై నెంతేనియున్ స్తుత్యమై
భాస్వంతంబగు జీవనంబు గనునా ప్రజ్ఞాప్రభావాఢ్యు తే
జస్విన్ ధీరు నటాగ్రగణ్యు ఘనునిన్ సర్వత్ర నాంధ్రామృతం
బాస్వాదింపగ జేయువాని నిట నిత్యంబున్ స్మరించం దగున్.      4.
ఆ.వె.
తెలుగు చిత్రసీమ యిలలోన వెలుగులన్
జిమ్ముచుండుదాక చేరి దివిని
దారకలును చంద్రు డారవి యున్నంత
కాల మీ తపస్వి ఘనత నిలుచు.              5.

హ.వేం.స.నా.మూర్తి.









యోగా


యోగా
(అంతర్జాతీయ యోగా దినోత్సవం సదర్భంగా)
ఉ.      "కర్మలలోన కౌశలము గాంచుట యోగ"మటండ్రు పెద్ద లా
మర్మ మెరింగి సంతతము మానవు డిమ్మహిలోన స్వీయమౌ
ధర్మము నాచరించుచును తన్మయుడై క్రమశిక్షణంబుతో
నిర్మలమానసుం డగుచు నిత్యముదంబుల నందగావలెన్.                                 1.

ఉ.      రోగము లీభవంబున విరోధము నూనుచు దేహధారులన్
వేగముతోడ గూల్చునెడ విజ్ఞత  జూపుచు నడ్డుచుండి స
ర్వాగమదీప్తశక్తులును, వైభవ మందగ జేయుచుండు నీ
యోగము ధారుణీస్థలిని నున్నతి గూర్చుచు జీవనంబునన్.                             2.

సీ.      నిత్యసంతోషమ్ము నింప జీవనమందు రోగమ్ములను గూల్చు యోగ బలము
బహుళ శక్తిని గూర్చి బ్రతుకుపై సవ్యానురాగమ్ము గలిగించు యోగమిలను
ఉత్సాహమందించి యురుతరామయములన్ వేగమ్ముగా గాల్చు యోగ మవని
స్వార్థభావము ద్రుంచి సాధుత్వమును బెంచి యుత్సాహమును నిల్పు యోగ మెపుడు
తే.గీ.   సర్వవిధముల హర్షముల్ పర్వ మనుజు
డాత్మ బొంగుచు సుఖముల నందుచుండి
జీవయాత్రను జేయుచు క్షేమముగను
నుండునట్లుగ జూచుట యోగ గుణము.                                                       3.

సీ.      శ్రద్ధను నిత్యంబు చదువుసంధ్యలలోన నున్నతోత్సాహాన నుంచుటయును,
క్రమశిక్షణముతోడ శ్రమయంచు దలపక జీవనయానంబు చేయుటయును
హద్దుమీరక యుండి యనుపమంబగు ప్రేమ మంచితంబుగ నెందు బంచుటయును
పరుషవాక్యంబులన్ దరిజేరనీయక సులలితమగు రీతి పలుకటయును
తే.గీ.   స్వార్థభావంబు త్యజియించి సర్వజగతి
కతుల సౌఖ్యంబు లనునిత్య మందునటుల
యత్న మొనరించు చుండు టీ యవనిలోన
యోగ మనుటకు సందేహ మొంద నేల?                                                        4.

కం.     ఆసనములలోనుండుట,
ధ్యాసను సడలించకుండ తద్గత దృష్టిన్
శ్వాసపయి నిలుపుచుండుట
భాసురమగు యోగమండ్రు పండితులు భువిన్.                                              5.




కం.     ఏడాది కొక్కరోజున
కూడుచు యోగంబు జేయు కోరిక మీరన్
పోడిమిని జూపుచుండిన
వీడునె రుగ్మతలు  స్వాస్థ్యవిభవం బగునే?                                                    6.

కం.     అనుదినము శ్రద్ధతోడను
మనమును లగ్నంబు చేసి మరువక యోగం
బును సాధన చేయంగా
మనుజుని జీవనము వెల్గు మాన్యత గల్గున్.                                                   7.

ఆ.వె.   భారమంచు నెంచి కారణంబులు చూపి
యోగ విద్య యందకుండు వాడు
నిఖిల కష్టతతిని నిత్యానురాగాన
స్వాగతించువాడు సర్వగతుల.                                                                  8.

కం.     పిన్నలు పెద్దల భేదం
బెన్నంగా దగదు యోగ మెవ్వరికైనన్
మన్నింప దగిన దిలలో
నన్నింటను హర్ష మొసగునట్టిది యగుటన్.                                                    9.


పూలు (పుష్పప్రశంస)








పూలు (పుష్ప ప్రశంస)

ఆ.వె.
తనసుఖంబు గోర కనునిత్యమును స్వీయ
జనుల కొరకు ముదము ననుపమముగ
జూపుచుండునట్టి సుదతియా యనునట్టు
లీలతాంతసం మింపు గొలుపు.                                                                     ౧.
కం.
కర మరుదగు సౌందర్యం
బురుతరమైనట్టి విభవ మున్నతరీతిన్
పరిమళములు వెదజల్లెడి
విరులివియె గులాబులనుట విజ్ఞత ధరణిన్.                                                        ౨.
తే.గీ.
హృదయ నైర్మల్యమును జూపి ముదముతోడ
సర్వకాలములందున శక్తి నొసగు
ప్రాణమిత్రుని మమతానురాగములను
చాటునట్లున్న వీపూలు మాటలేల?                                                           ౩.
తే.గీ.
అమల మతిసుందరంబైన యంతరంగ
మతుల హర్షంబునుం బంచు నట్టి విభవ
మంది యున్న గులాబీల నందు నిట్లు
విరులు కావివి యనురాగ ఝరులు కాని.                                                           4.
కం.
పలుకుచు నున్నవి యీవిరు
లిలలో గలవారి కెప్పు డీ మా సొగసుల్
సలలితముగ నందించుచు
మెలగెడి మాసాటి యెవరు మేదినిలోనన్.                                                  ౫.
కం.
ఈనాడును నీయెదుటకు
నేనే చనుదెంచి యుంటి నిక్కము మూర్తీ!
మానక నాయందంబుల
నీనేలకు దెలుపు మనుట లీవిరుల గతుల్.                                        6.
ఉ.
అక్కజ మైన సోయగము హాయిని గూర్చెడి దేహదీప్తితో
మక్కువమీర దర్శకుల మానసమున్  హరియించుచున్న యీ
చక్కని పుష్పముల్ గల ప్రశాఖిక చూడగ నంచయానయౌ
యొక్కలతాంగియా యనగ నున్నది హర్షము గూర్చుచున్నదై.                  7.
ఆ.వె.
పిన్న పెద్ద భేద మెన్నంగ నేలనో
తనువుకాదు సొగసు నతరముగ
నుండవలయు యశము లొందుట కనియెడి
యీసుమాల గతులు చూసినారె?.                                                           8.
 ఆ.వె.
మనుజులార! మీరు ననునిత్యమీరీతి
విమలహృదయులౌచు వికసితులయి
సంతసంబు పంచు డంతట యనునట్టు
లీసుమాలు కాంతు లీనుచుండె.                                                              9.
కం.
మాలోని తెల్లదనమును
వాలాయము దలచుకొనుచు వసుధాస్థలికిన్
మేలైన నిర్మలత్వము
మీలోనను దాల్చ గలుగు మీకు శుభంబుల్.                                             10.
కం.
పరహితము గోరుచుండుడు
సురుచిర మగు స్వాంతశుద్ధి చూపుచు మమ్మున్
నిరతం బాదర్శంబుగ
నరు లరయు డటంచు విరులు నానాగతులన్.                                           11.
ఆ.వె.
పలుకుచున్న యట్లు భావంబునం దోచె
స్వార్ధపరత నున్న జనులలోన
విరుల జూచియైన విమలత్వ మబ్బునా
చూడవలయు ధరణి నేడ యైన.                                                              12.
మ.
విరులం జూచినవేళలందు మదులన్ విస్తారమౌ సౌఖ్య మీ
ధరణిన్ మానవు లెల్ల గాంచెద రికన్ తథ్యంబుగా నందరే
యరుసం బామయసంతతిన్ మరచి యాహా యీలతాంతంబు లే
కరణిన్ పుష్పభవంబు నందినవొ సంస్కారాఢ్య లన్నింటిలోన్.           13.
చం.
బ్రతుకిల రెండురోజులని భావన చేయక ప్రాణముండగా
క్షితిపయి హర్షదీప్తులను కేవల మన్యజనాల కోసమై
యతులితదీక్షతోడ మరియాదను దప్పక పంచుచుండు నీ
చతురత గల్గు పుష్పముల జన్మము ధన్యము గాదె చూచినన్.           14.
చం.
సరసత లేక దేహమున స్వార్ధము నిండిన జీవనంబు లీ
ధరపయి నూరు వర్షములు దాల్చిన నేమి ఫలంబు పూవులై
పరులకు హాయి బంచగల భాగ్యము లందుచు రెండురోజు లా
దరమున నుండగల్గుటయె ధన్యత యెంచగ న్నిరీతులన్.                          15.
కం.
భగవంతుని చాతుర్యం
బగణిత మానందదంబు నత్యద్భుతమే
యగునను మాటకు సుమమిది
తగుసాక్ష్య మనంగ వచ్చు ధారుణియందున్.                                            16.
ఆ.వె.
జగతిలోనున్న శుభమెల్ల నగణితముగ
నొక్కచోటను జేరిన దక్కజముగ
సత్యమనురీతి నీపూలు సౌరులొలుక
హరితపత్రాల నడుమన నమరియుండె.                                          17.
తే.గీ.
ఆకుపచ్చని చీరెలో ననుపమమగు
గౌరవర్ణాన దేహంపు సౌరు లొలుక
నొక్క లలితాంగి నుదుటిపై యొప్పు మీర
నలదు కొన్నట్టి తిలకమో? యదిసుమంబొ?                                             18.
ఆ.వె.
దేహదీప్తి పైని మోహాన మైపూత
లెన్నొ పూసి భంగ మిలను గాంచు
విశ్వజనుల జూచి వెక్కిరించెడి రీతి
నీసుమంబు తోచు నింపుమీర.                                                                19.
ఆ.వె.
దర్శకాళి కిలను తన్మయత్వము గూర్చు
నట్టు లమరియున్న హర్షదమగు
కుసుమమిది యనంగ కొంతైనసందేహ
మిందులేదు స్పష్ట మెల్లగతుల.                                                               20.
కం.
హనుమంతుని వాలంబున
ననుపమమగు రత్న మొక్క టతికినయ ట్లీ
వనజాతము చూపరులకు
కనువిం దొనరించుచుండె కడు రమ్యంబై.                                       21.
కం.
మందముగల రేకులతో
నందంబుగ నీసుమంబు హర్షప్రదమై
వందనముల కర్హత యెపు
డందుచు నున్నట్టు లున్న దత్యుత్తమమై.                                       22.
తే.గీ.
పుష్పగుచ్ఛాన రంగులపూలపంక్తి
నతికినట్లుగ, పూబోడి యగునొకర్తె
విరుల మాలను సిగలోన దురిమినట్టు
లీసుమం బతి హృద్యమై యిచట జేరె.                                                     23.
తే.గీ.
చిత్రకారుడు కుంచెతో చిత్రగతుల
చిత్రమునుగీసి రంగులు చెన్నుమీర
నద్ది యిటదెచ్చి నిపుణత నతికినట్టు
లున్న దీసుమ మెంతయు నున్నతముగ.                                       ౨౪.
కం.
జనముల మనముల నీసుమ
మనుపమమగు నరుస మిడుచు నధ్భుతరీతిన్
ఘనతర వర్ణంబులతో
దన దీప్తిని జాటుచుండె ధరణిని కనుడీ.                                                    25.
శా.
అస్తవ్యస్తము జీవనంబు కనగా నందున్ విశిష్టంబులై
యస్తోకంబగు హర్షమిచ్చునవి యాసాహిత్య సంగీతముల్
 సుస్తిం గూల్చెడి యౌషధంబులగుచున్ శోభిల్లు నంచిందు వి
న్యస్తంబై విలసిల్లు పూలజత గణ్యంబౌచు గాన్పించెడిన్.                             26.

ఉ.
"ఎంత మనోహరంబయిన దీ సుమభూజము దర్శకాళికిన్
సంతస మందజేయగల సౌరులు గన్నది" యంచు బల్క నా
వంతయు లేదు క్రొత్తదన, మయ్యది యెంచిన పాతపాటయే,
యింతలు చేసి చెప్పుటయె యియ్యది తథ్య మటంచు నాడెదన్.               27.
ఉ.
మాటలు చాలకుండె, యనుమానము లేదిట, దీని కెయ్యెడన్
సాటి యనంగ రాదొకటి, సత్యము నిర్మల మద్వితీయమున్
మేటియు నౌర! పుష్పముల   మిక్కిలి మోహన మెల్లరీతులన్
నీటను బుట్టెనో భువిని నిష్ఠ జనించెనొ యెంచు టేలనో!                           28.
మ.
అవురా! యియ్యది పుష్పమా, తుహిన సంఘాయత్త ఖండంబు లీ
భువిపై భూజము రూపుదాల్చ నడుమన్ ఫుల్లాబ్జ మన్నట్లు సం
భవమైనట్టి తుషార సంహతి పయిన్ భానూదయంబందునన్
నవదీప్తిన్ బ్రసరింపజేయు విశదానందంపుటాకారమో.                           29.
కం.
ఏమని పలుకగ నగునో
యేమని వర్ణించ నగునొ యీసుమ దీప్తిన్
శ్రీమంత మన్ని విధముల
భూమిని నిద్దాని కొకటి పోలునె చూడన్.                                    30.
కం.
అబ్బబ్బ దీనియందం
బిబ్బడి ముబ్బడిగనౌచు నీక్షణములకున్
పబ్బంబై యున్నదిగద
యబ్బుర మీ దైవసృష్టి యనదగు నిలలోన్.                                    31.

ఆ.వె.
జగతిలోని మేటి సొగసులన్నియు నొక్క
స్థలమునందు జేరి నిలిచినట్లు
విరిసమూహ మిందు నిరుపమంబై నేడు
మనసు దోచుచుండె కనుడు నిజము.                                                       32.

ఆ.వె.
అనవసరములైన యాటోపములు లేని
మోహనాంగి వోలె ముదముగొల్పు
చుండె నీసుమాల నిండియుండినయట్టి
సహజమైన సొగసు లహహ నిజము.                                                        33.

ఆ.వె.
మనసు గలిగి భువిని మసలుచుండెడు నట్టి
రాగహృదయులార! స్వాగతంబు
రండటంచు బిల్చు చుండినట్లుగ నీసు
మాల చాడ్పు స్పష్ట మేల శంక?                                                              34.

మ.కో.
ఆకుపచ్చని గుల్మ మందున నంద మొల్కుచు నీవిరుల్
వీక మీర హరిద్రవర్ణపు విస్తృతంబగు దీప్తులన్
ప్రాకటంబుగ దెల్పుచుండగ భాగ్య మబ్బెను చూడగా
నీకతంబున నీసుమంబుల నీస్థలంబున వేడ్కతోన్.                                     35.