Sunday 22 July 2018

యోగా


యోగా
(అంతర్జాతీయ యోగా దినోత్సవం సదర్భంగా)
ఉ.      "కర్మలలోన కౌశలము గాంచుట యోగ"మటండ్రు పెద్ద లా
మర్మ మెరింగి సంతతము మానవు డిమ్మహిలోన స్వీయమౌ
ధర్మము నాచరించుచును తన్మయుడై క్రమశిక్షణంబుతో
నిర్మలమానసుం డగుచు నిత్యముదంబుల నందగావలెన్.                                 1.

ఉ.      రోగము లీభవంబున విరోధము నూనుచు దేహధారులన్
వేగముతోడ గూల్చునెడ విజ్ఞత  జూపుచు నడ్డుచుండి స
ర్వాగమదీప్తశక్తులును, వైభవ మందగ జేయుచుండు నీ
యోగము ధారుణీస్థలిని నున్నతి గూర్చుచు జీవనంబునన్.                             2.

సీ.      నిత్యసంతోషమ్ము నింప జీవనమందు రోగమ్ములను గూల్చు యోగ బలము
బహుళ శక్తిని గూర్చి బ్రతుకుపై సవ్యానురాగమ్ము గలిగించు యోగమిలను
ఉత్సాహమందించి యురుతరామయములన్ వేగమ్ముగా గాల్చు యోగ మవని
స్వార్థభావము ద్రుంచి సాధుత్వమును బెంచి యుత్సాహమును నిల్పు యోగ మెపుడు
తే.గీ.   సర్వవిధముల హర్షముల్ పర్వ మనుజు
డాత్మ బొంగుచు సుఖముల నందుచుండి
జీవయాత్రను జేయుచు క్షేమముగను
నుండునట్లుగ జూచుట యోగ గుణము.                                                       3.

సీ.      శ్రద్ధను నిత్యంబు చదువుసంధ్యలలోన నున్నతోత్సాహాన నుంచుటయును,
క్రమశిక్షణముతోడ శ్రమయంచు దలపక జీవనయానంబు చేయుటయును
హద్దుమీరక యుండి యనుపమంబగు ప్రేమ మంచితంబుగ నెందు బంచుటయును
పరుషవాక్యంబులన్ దరిజేరనీయక సులలితమగు రీతి పలుకటయును
తే.గీ.   స్వార్థభావంబు త్యజియించి సర్వజగతి
కతుల సౌఖ్యంబు లనునిత్య మందునటుల
యత్న మొనరించు చుండు టీ యవనిలోన
యోగ మనుటకు సందేహ మొంద నేల?                                                        4.

కం.     ఆసనములలోనుండుట,
ధ్యాసను సడలించకుండ తద్గత దృష్టిన్
శ్వాసపయి నిలుపుచుండుట
భాసురమగు యోగమండ్రు పండితులు భువిన్.                                              5.




కం.     ఏడాది కొక్కరోజున
కూడుచు యోగంబు జేయు కోరిక మీరన్
పోడిమిని జూపుచుండిన
వీడునె రుగ్మతలు  స్వాస్థ్యవిభవం బగునే?                                                    6.

కం.     అనుదినము శ్రద్ధతోడను
మనమును లగ్నంబు చేసి మరువక యోగం
బును సాధన చేయంగా
మనుజుని జీవనము వెల్గు మాన్యత గల్గున్.                                                   7.

ఆ.వె.   భారమంచు నెంచి కారణంబులు చూపి
యోగ విద్య యందకుండు వాడు
నిఖిల కష్టతతిని నిత్యానురాగాన
స్వాగతించువాడు సర్వగతుల.                                                                  8.

కం.     పిన్నలు పెద్దల భేదం
బెన్నంగా దగదు యోగ మెవ్వరికైనన్
మన్నింప దగిన దిలలో
నన్నింటను హర్ష మొసగునట్టిది యగుటన్.                                                    9.


No comments:

Post a Comment