Sunday 7 April 2019

శ్రీ వి కా రి కి స్వా గ త ము

శ్రీరామ
శ్రీ  వి  కా  రి  కి  స్వా  గ  త  ము

శా.
శ్రీమంతంబుగ విశ్వమానవులకున్ శ్రేయంబు లందించుచున్
    క్షేమస్థాపనకై "వికారి!"శుభదశ్రీలన్ స్వరూపంబునన్
    నీమం బొప్పధరించి యీక్షితిపయిన్ నిత్యంబు హర్షంబులన్
    ప్రేమన్ బంచగ వచ్చియున్న నిను నీవేళన్ బ్రశంసించెదన్.    1.
మ.
వినుతింతున్ నిను నో "వికారి"వినుమా విశ్వంబునందంతటన్
   ఘనతం నింపెడి శాంత్యహింసలకునౌ కల్యాణభావంబు లీ
    జనచిత్తంబుల నింపుమా, విమలమౌ సద్వాక్యసంపత్తి నీ
    వనయం బిందు త్వదీయ కాలమున నో హర్షప్రదా! చూపుమా.  2.
శా.
కాలుష్యంబులు నేడు సత్వయుతులై క్రౌర్యంబు జూపించుచున్
   వాలాయంబుగ మానవాళిగతులన్ బాధించు చుండంగ నీ
   నేల న్నీస్థితి యో"వికారి"!మలినానీకంబు లోకంబునన్
   గూలం జేసెడి శక్తిగూర్చు నిదె నీకుం జేతు  శబ్దాంజలుల్.  3.
మ.
రిపుసంఘంబులు భారతావనికి బల్రీతుల్ మహత్కష్టముల్
   నెప మొక్కింతయులేక గూర్చుట లహో నిత్యస్వకార్యంబుగా
   జపముల్ సేయుచునుండె వారి కుటిలాశల్ద్రుంచ బౌరాళి కీ
   విపుడా ధైర్యము హే “వికారి” యిడుమా యీనేల నీవుండగన్ . 4.
చం.
కినుక వహించి సంఘమున గీడ్పడజేయగ స్వార్ఘబుద్ధితో
   ననయము సంచరించెడి దురాత్ముల చిత్తములందు లేశమై
   నను రమణీయభావము జనప్రియవౌట "వికారి"వర్షమా
   కనబడజేయుమీ విచట గల్గగ జూడుము సౌఖ్యసంపదల్.  5. 
ఉ.
స్వానుభవంబుతో బ్రజకు చక్కని వర్తనమందియుండ స
    న్మానము లందు నిచ్చట ననంతముగా బరమందు నిత్యమున్
    మానక జేరు సౌఖ్యములుమాధవు సత్కృప చేత ముక్తి మీ
    కానక నందునంచు మరియాదను నీవు "వికారి!" నేర్పుమా.  6.
చం.
గతమున నందియున్న పలుకష్టములన్ మరపించి ప్రీతితో
   నతులిత సౌఖ్యసంపదల నందగజేయు శుభాశయంబుతో
   క్షితి కిపుడొప్పు మీరగను జేరు "వికారి!"నవాబ్దమా! జగ
   న్నుతముగ నీదు వాంఛకిట నూతన సత్వము కూడు గావుతన్.  7.
మ.
తరుణోపాయము లీ ధరాప్రజలకున్ దౌష్ట్యంబుతో మోసముల్
   నిరతంబిందు ఘటింప జేయు టకునై నిష్ఠన్ బ్రదర్శించు నా
   యరిసంఘంబుల బార ద్రోలు పనిలో నందించి యీకాలమం
   దురు చైతన్యము నో"వికారి!"యరుసం బొప్పార గల్గించుమా . 8. 
చం.
మునుపటికంటె మేలయిన మోదము లీ ధరపైన నిచ్చలున్
   మనుజుల కీవు జూపుచును మాన్యత గూర్చుచు శాంతి భద్రతల్
   జనహిత కార్యముల్ నిలిపి సస్యసమృద్ధిని జేర్చి సౌఖ్యముల్ 
   ఘనముగనందజేయగ"వికారి!" యిటన్ నిను స్వాగతించెదన్  9.

అందరికి “

శ్రీ వికారినామ సంవత్సరాగమన సందర్భమున

హృదయపూర్వక శుభాకాంక్షలు.

హ.వేం.స.నా.మూర్తి.