Saturday 28 October 2017

సమస్యాపూరణం - 8

సమస్యాపూరణలు  8
నేల-నీరు-అగ్గి-గాలి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయటం.

(అగ్గి)రిశున కనె నర్జును
డెగ్గును స్మరియించ(నేల) యీనీశక్తిన్
దిగ్గన రా(నీ రు)ద్రా!
నెగ్గం(గా లి)ప్త ననిని నీదయ నాకున్.

జన్మ మందున, నిహమున, జనకులపయి
హితులపైనను ననుమాన మతిగ జూపు
జనుడు మూఢుండు, కొలిచిన తనను వాని
శంకలను దీర్చు వాడెగా శంకరుండు.

శంకరుండన నెవరని ఛాత్రునొకని
గురుడు ప్రశ్నించ నర్థమిం తరయకుండ
శబ్ద సామ్యతచే బల్కె సత్వరముగ
శంకలను దీర్చు వాడెగా శంకరుండు.

మూఢ మతులార! కాంక్షల ముసుగులోన
మూల్గు చుండెద రదియేల? ముదముతోడ
వినుడు గోవిందు గొల్వుడీ రనుచు జనుల
శంకలను దీర్చు వాడెగా శంకరుండు.
.
బాసరవాసి యొక్కరుడు భవ్యగుణాఢ్యుడు నగ్నిహోత్రియున్
భూసుర వంశసంభవుడు పూజ్యుడు సంతత సత్యనిష్ఠుడై
వాసిని గన్న పండితుడు భానుని యుగ్రత కోర్వలేక యీ
వేసవిలో సుధాకరుడు వెళ్ళె హిమాద్రికి సేదదీరగన్.

కోరికతో తను గొల్వగ
చేరెడు సద్భక్త తతికి చిత్సౌఖ్యంబుల్
గూరుచు జనార్దను శుభా
కారమ్మును మించి తీపి కలదే పుడమిన్.

నేరము లెంచబోక నను నీపదదాసుని గాంచి త్వత్కృపా
సారము బంచి గావుమని సన్మతి గొల్చెడివారి కాంక్షలన్
దీరిచి సర్వ సౌఖ్యముల దేల్చెడి మోక్షదు డైన శార్జ్గి యా
కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్.
ఇమ్మహి పరవనితల గని
నెమ్మనమున జనని యంచు నిష్ఠాగరిమన్
నమ్ముచు నుండెడి వారికి
తమ్ముని సతి తల్లి యగును తథ్యము దెలియన్.

అమ్మగ నన్యకాంతలను హర్షముతో గనుచుండి వారికిన్
నెమ్మది గౌరవం బిడుచు నిష్ఠను బూని నిరంతరం బిలన్
నమ్మిన సత్పథంబున ననామయ మెంచి చరించు వారికిన్
తమ్ముని భార్య తల్లి యగు తత్త్వ విదుల్ పరికించి చూడగన్.

శతపత్రతుల్య నేత్రను,
నతితనుమధ్యమను, మందయానను, ముగ్ధన్
చతురను, సుందరి, నట నా
యతులను గన మతియె పోయె యతిరాజునకున్.
స్వాస్థ్యమును గోరుచుండెడి జనులకిలను
నుభయ వేళల నడచుట యొప్పు నండ్రు
భోజనము మీద శతపథ మోజ మొసగు
నడక, హానికారకము మానవుల కెపుడు?
జడియక ధర్మమన్న, ఘన సంస్కృతి నందక, స్వార్ధబుద్ధితో
నుడువుచు బొంకు లెల్లెడల, నూతన తేజము తోడ కల్మషం
బొడబడి చేయుటల్ సతత మొప్పని యెంచి ధరాతలంబునన్
నడచుట హానికారక మనాగరకం బగు మానవాళికిన్.



అంశము- శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళ రూప వర్ణనము.
ఛందస్సు- తేటగీతి (లేదా) ఆటవెలఁది.
నాలుగు పాదాల 'చివరి' అక్షరాలు వరుసగా తి - రు - మ - ల ఉండాలి.
శ్రీకరం బైన ముద్రతో నీకర మ(తి)
సుందరం బౌర! దేహంపు సొగసు తీ(రు)
మాట కందదు మధురాతి మధుర నా(మ)
వేంకటేశ్వర!నినుగొల్తు వివిధ గతు(ల).
కలుష సంహార మొనరించు కనుల కాం(తి)
సిరులు జగతికి బంచెడి చేతి సౌ(రు)
తులసి పెనగొన్న కాయంపు టలఘు సీ(మ)
తిరుమలేశుని రూపంబు సురుచిర మి(ల)
భండన మందున ఢక్కలు
డాండడ డాండాం డడాండ డా మ్మనె, వీణెల్
మెండుగ మ్రోగెను గెలుపుల
పండుగలో నగరమందు బహువిధములుగాన్.

మెండైన యతిశయోక్తులు
భండన భీముండు చేరి పలుకుచు మిత్రుల్
రండనుచు దెలిపె నిట్టుల
డాండడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్.
సరసంబున కొకరోజున
నిరువురు వేషములు మార్చ నేకాంతమునన్
తరుణీ రూపుండగు తన
పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్

ఉరుతర ప్రేమభావమున నొక్కదినంబున నూత్నదంపతుల్
సరసపు లాటలోన కడు సంతస మందుచు స్వీయ వేషముల్
సురుచిరరీతి మార్చుతరి సుందరి యాకృతి దాల్చియున్న యా
పురుషుని కంఠమం దపుడు పుస్తెను గట్టెను చాన వేడ్కతో.
అరయగ డింభకు డొక్కడు
సురుచిర సత్కావ్యగంధ శూన్యుడు పలికెన్
గురుడడుగగ తరగతిలో
భరతుని రాఘవుఁడు దునిమె భామిని కొఱకై.

గురు డొకనాడు శిష్యులకు కూరిమి నిండగ ప్రశ్న లెన్నియో
తరగతిలోన వేయుచును తద్గత భావము దెల్పునప్పు డా
హరియను మందబుద్ధి యొక డందు వచించె జవాబు లిచ్చుచున్
భరతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురలెల్ల మెచ్చఁగన్.
అగణిత హర్షం బందుము
సుగుణాకర! పట్టపగలె చుక్కలగను మా
జగపతి మాంత్రికు మహిమన్
తగనంచును బిలిచె సఖుని తన్మయు డపుడున్.
అంశం - వానరుల సహాయముతో రాముడు వారధిని నిర్మించుట.
నిషిద్ధాక్షరములు - ఓష్ఠ్యములు (ప-ఫ-బ-భ-మ)
ఛందస్సు - మీ ఇష్టము
నలనీలాదులు నిలువగ
నలఘులు వానరులు రాల నతి హర్షానన్
జలనిధిని దేల్చ రాఘవు
డలరుచు వారధిని గట్టె నవ్వేళ నటన్.
అద్దిర నాటక మందున
నిద్దరి కీ పేరులున్న విట దంపతులై
పద్దియములు పాడుటలో
ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్.

పద్దెంబందు వచింపు మోరి యిపు డా పద్మాక్షి యస్మత్ప్రభున్
వద్దన్నన్ వరియించె నంచు భటు డవ్వానిన్ కవిన్ జూచుచున్
గద్దించంగను ప్రాణభీతి గదురన్ గంపించి యవ్వా డనెన్
ముద్దిమ్మంచు ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్ రావణున్.
తోరపు జననీ భావము
చేరగ నత డామె కచట జేజే లనియెన్
నేరం డన్యము గద, యే
సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్?

మదిలో యుక్త మయుక్తముల్ దలప కేమాత్రంబు నిట్లాడె నా
మదమత్తుం డొక డా సభాస్థలిని బల్మా రంద రౌరా యనన్
ముదమారంగను సీత నాభరతుడే మోహించె నవ్వేళలో
అదె సారంగధరుండు దా వలచెఁ జిత్రాంగిన్ మనోజార్తుఁడై.
కమ్ - సిట్ - గో - రన్
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
విను జానకి! (కమ్బు)గళున్
ఘను రావణు దూరెదేని గా(సిట) గలుగున్
నిను(గో)(రను) దూషించుచు 
మనగలవా యనిరి యచటి మగువలు సీతన్.

నా(కము)(గో)(రను) దేవా!
హే కమలదళాక్ష! రామ! హే సుఖధామా!
నాకీయవె (సిట)పొట లిల
రాకుండెడి జీవనమ్ము రఘుకుల సోమా!
కామద మది తిరుమల గల
భూమీధరపంక్తి బహుళ పుణ్యద మగుటన్
నీమముతో నీ వో ప్రా
చీ!మలఁ గొల్చిననె కలుగు శ్రీభాగ్యమ్ముల్.
క్షేమదమౌచు భక్తులకు క్షేత్రము లందున నున్నతంబుగా
భూమిని తిర్మలాఖ్యమున పూర్ణసుఖంబుల నందజేయు
ధ్ధామము నమ్మగా వలయు తద్గత మానస మంది నీవు ప్రా 
చీ! మల గొల్చినన్ గలుగు పేర్మిని సంతత భోగభాగ్యముల్.
న్యాయానువర్తనంబును
ధ్యేయము చేరంగ సతము దివురుట యుక్తం 
బేయెడ తగ దలసత్వము 
పోయిన దేదియును దిరిగి పొందగ వశమే?.

న్యాయము ధర్మవర్తనము నవ్యయశంబుల నందగోరు స 
ద్ధ్యేయముతోడ మానవుడు దీప్తచరిత్రను గాంచగా వలెన్ 
శ్రేయము లందగోరవలె చెల్వ మశాశ్వత మెంచి చూడగా 
పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే

ధ్యేయము దృఢతర మైనను
న్యాయంబును నమ్మి యున్న నవయత్నముతో 
నేయెడ చరియించినచో 
పోయిన దేదియును దిరిగి పొందగ వశమే.

న్యాయము ధర్మవర్తనము నవ్యయశంబుల నందగోరు స 
ద్ధ్యేయముతోడ మానవుడు ధీయుతు డౌచు నిరంతరంబుగా 
నేయెడ సంచరించినను నిమ్మహి సత్ఫల సిద్ధియౌ నికన్ 
పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే.

పాపకర్ముడౌచు కోపంబు వహియించి 
భూతదయను వీడి పుడమిలోన 
తిరుగు చుండువాడు దేవుని లీలలు 
కనులు వేయి గలిగి కాంచలేఁడు.

ఎన్నగ బోక కర్మముల నింతయు ధర్మము చేయబోక తా
నెన్నడు మానవత్వ మొక యించుకయైనను చూపబోక యా
పన్నుల కెల్లరీతులను బాధను గూర్చుచు నుండువా డిలన్
కన్నులు వేయి గల్గినను గాంచఁగలేఁడు గదా ప్రకాశమున్.
అంశము- సూర్యోదయ వర్ణనము.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా ప్ర - భా - త - ము ఉండాలి.
(ప్ర)కృతి పులకించ సత్త్వంబు సకలమునకు 
(
భా)సురం బౌచు నందంగ భాస్కరుండు 
(
త)మములను ద్రుంచి ప్రాగ్ధరాధరము నుండి
(
ము)దము మీరగ నేతెంచె హృదయ మలర.

వాడొక ఛాత్రుడు మందుడు
నేడీ ప్రశ్నకును బదులు నేనిత్తు ననెన్
చూడగ నాతడు పలికెను 
గాడిదపై నెక్కి హరుఁడు కంసునిఁ జంపెన్.

వాడొక బుద్ధిహీనుడగు పండితపుత్రుడు వాని కింతయున్ 
పోడిమి లేదు విద్యలను పూర్తిగ శుంఠ యతండు గావునన్ 
చూడక యుక్తమా యనుచు చోద్యము గల్గగ పల్కె నిట్టులన్
గాడిద నెక్కి శంకరుఁడు కంసునిఁ జంపె దయావిహీనుఁడై.

స్వంత వాక్యాలు నిర్మించు స్పర్థలోన
నీకు ననువైన దేదియో నిర్భయముగ
గోరు మని పల్క బాలుండు గురున కనియె
కనగ "గతజల సేతుబంధనమె"మేలు. 

క్షితిపయి వార్ధకంబునను కీడ్పడి మిక్కిలిగాగ కుందుటల్
గతజల సేతుబంధనమె, కల్గగ జేయు ననంత లాభముల్
సతతము శ్రద్ధ బూనుచును సన్మతితోడ నభాగ్యులందునన్
చతురత జూపి చేతనగు సాయము జేయుట సత్య మెల్లెడన్. 
మద్యపానంబు చౌర్యంబు మానవతకు 
దూరమైనట్టి పనులను తోరముగను 
చేయుచుండుట మొదలగు చేష్టల పయి 
ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు.

మానము నెంచబోవకను మానవతన్ విడనాడి మద్యమున్
పానము చేయుచుండి బహుభంగుల బొంకులు పల్కుటెల్లెడన్
జానగు కార్యమంచు తన స్వాంతము నందున నిత్య మేవిధిన్
ధ్యాన మొనర్చుటే మిగుల నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్.

నరుడు సృష్టించు విజ్ఞాన పరికరముల
కారణంబున నిండ్లలో కలుగుచుండు
నలఘు గ్రీష్మంబు చలికాల మందు జూడ
మండు వేసవిలోఁ జలి మెండు సుమ్ము.

వాసిని గాంచగోరి బహుభంగుల శాస్త్రములందు శోధనల్ 
చేసి యనేక వస్తువుల చేతను జీవన శైలి మార్చె తా
నాసగ మానవుండు ఘను డౌర!భళీ (చలిలోన)హిమమందు గ్రీష్మమున్
వేసవి కాలమంందు చలి వెక్కసమై వడకించు నెల్లరన్.
కోపము - తాపము - పాపము - శాపము
పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(దత్త పదాలను అన్యార్థంలో ప్రయోగించాలన్న నియమం లేదు)


కోపము దుర్యోధన బహు
తాపము కలుగంగజేయు తగదని రచటన్
పాపము నొడిగట్టెద విక
శాపములను జూతువనుచు సజ్జను లపుడున్.

నిండు పేదరికంబున నిత్యమవని 
బహుళ సంతతి సాకగ బలిమి యింత
లేక మెతు కైన దొరకమి నాకలి యను
కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె.

అలసట నొందజేయుచును హాయిని గూల్చుచు నంతరంగమం 
దలమట గల్గజేయుచును నన్నివిధంబుల గుందజేయుచున్
పలికెడి శక్తినంతటిని భంగమొనర్చెడి క్షుత్తు రూపియౌ
కలికి కవుంగిలింత కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా.

పతికి నెదురాడి నిత్యమ్ము చతుర ననుచు
విర్రవీగుచు దిరుగుచు వినయ మింత
దాల్చ కుండగ నుండెడి తన్వి యిలను
నేరమగుఁ జేయఁ గాత్యాయనీ వ్రతమ్ము.

ఘనముగ ప్రేమను బంచుచు
తనమనమును దోచుకొనిన తన నాథుండౌ
వినయుం డను నా శుభ నా
ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్.

చతురానను డని యన్నను,
క్షితిపయి పరమేష్ఠి యన్న, క్షేమంకరుడౌ
శతధృతి, స్రష్ట యటన్నను
రతిపతి! మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్.

మిగుల దారిద్ర్యమున జక్కి మిడుకు వేళ
నున్నతోద్యోగమున జేర కన్న కొడుకు
తల్లి దండ్రుల యరుసంబు తలప దరమె 
మండుటెండలోఁ గురిసెను మంచు జల్లు.

ఒక్క కార్యాలయంబున నొప్పు మీర
తనదు తనుజాత యధికార దర్ప మంద
నచట బంట్రోతు పదవిలో నమరి నట్టి 
దమ్మయె నమస్కరించిన దాత్మసుతకు.

కాంత - నారి - మగువ - వనిత
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మర్యాదా పురుషోత్తముడైన రాముని స్తుతిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

సీ.
ఏ(కాంత)పరిచర్య లేకాలమును జేతు 
నీకాంత గొలిచెదన్ నిత్య మవని 
గుణఘ(నా! రి)పునాశ! కువలయాధిపతీశ! 
నీనారి సీతను నిష్ఠ దలతు
వర(మగు వ)చనంబు, భవ్య దేహంబుతో 
మహి వెల్గు రామ! నీ మగువ గొలుతు 
న(వని త)న్మయభావ మందుచు శ్రీరామ!
భక్తి నర్చింతు నీ వనిత నెపుడు 
ఆ.వె.
నిరత మొసగువాడ పరుషోత్తమా! నీకు
నతుల గౌరవాన నతుల శతము 
భావశుద్ధి గూర్చి బహుమూల్య గుణ మిచ్చి 
కావు మయ్య నన్ను గరుణ జూపి.

ఆపాపకు పాపనికిని
జూపులు కలసినవి యొక్క సుముహూర్తమునం
దాపయిని నిక మదనుని ప్ర
కోపాగ్నులు గురిసినంతఁ గూరిమి హెచ్చెన్.

వంపు సొంపులతో జేరి వలపు మీర
మదనతాపాన బడవేయు మగువ నంది
మాన మొసగగ నద్దాని మానసమును
దోషమేకాదు చేయుట దొంగతనము.

దొంగ రాజట మంత్రులు దొంగ లచట 
చౌర్య కళలోన బ్రజలను శోభనముగ 
తీర్చి దిద్దుట కృత్య మా దేశమునను 
దోషమేకాదు చేయుట దొంగతనము.

దొంగల రాజ్య మచ్చటను దొంగ ప్రభుం డిక మంత్రు లందరున్
దొంగలు వారి కృత్య మది దోచుట యెల్లెడ కేగి నిత్యమున్ 
దొంగలుగా బ్రజావళికి ద్రోవను జూపుట శాసనం బటన్ 
దొంగతనమ్ము సేయుటయు దోషముగా దది పుణ్యకార్యమే.

ముమ్మాటికి నాతనువున
కొమ్మా సగ మిప్పు డీవు కొను మిదె ప్రియ వీ
విమ్ముగ ముల్లోకంబుల 
కమ్మా యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్.

మిశ్రా నామకు డొకపరి
యశ్రువులను గార్చువాని యాంతర్యమునన్ 
మిశ్రిత కపటము గాంచక
యాశ్రయము నొసంగి తా నిరాశ్రయుడయ్యెన్.

ఆశ్రిత వత్సలుండ విపు డాదుకొనందగు నన్ను నయ్యరో
మిశ్ర! గురూత్తమా! యనుచు మిక్కిలి దీనత జేరియున్న యా
మిశ్రిత దంభు స్వాంతమున మీరిన కుత్సిత మెంచకుండగా
నాశ్రయమిచ్చి తానిట నిరాశ్రయుడయ్యె నదేమి చిత్రమో.

ఊరి కేగిన మిత్రుండు చేరి పిదప
సఖున కీరీతి దెలిపెను సంగతులను 
ముదము మీరగ చెలికాడ! మొన్న యచట
పాండు! రాజు పెండ్లాడె సుభద్ర నపుడు.

దండిగ మద్య మచ్చటను త్రాగిన వాడొకరుండు తూలుచున్
రండిదె మిత్రు లిచ్చటకు రండని బిల్చుచు ప్రేలుచుండె నా
ఖండల నందనుం డతడు కాడె యుధిష్ఠిరు డాలకించు డా
పాండు ధరాధినాథుఁడు సుభద్రను బెండిలియాడెఁ గాంక్షమై.

ఆర్యుడ వీవా యంచును
క్రౌర్యముతో నరచుచుండి కవచాన్విత యై
ధైర్యంబు జూపుదానిని 
హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్.

నిరుపమమైనభీతి ననునిత్యము గాంచిన ప్రక్కత్రోవలన్
పరుగిడు భీరువయ్యు బహుభంగుల దిట్టుచు కాలుడోయనన్ 
చరిచెద నంచు వచ్చుటను సత్వమొ, మాయయొ యెంచలేక యా
హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్.

భావి కాలంబు నెంచుచు బలికెను గద
బ్రహ్మ మీరీతి స్వామియై ప్రజలలోన
ధర్మ మణగారి పోవును తథ్య మటులె
నీతిరహితుఁడె జనులకు నేత యగును.

జాతికి జ్ఞానబోధనము చక్కగ జేసెను భావి నెంచి యీ
రీతిగ బ్రహ్మ మిచ్చటను శ్రీలు గడించుట లక్ష్యమౌ గనన్
పాతకముల్ సమస్తములు వ్యాప్తిని జెందును తథ్య మెంచగా 
నీతివిహీనుఁడే జనుల నేతగ గౌరవమందు నెల్లెడన్.

అలఘు హర్షయుతులు చెలికత్తె లిర్వురు
స్వీయ సఖుల పేర్లు చెప్పునపుడు 
వారిలోన నొకతె వనజాక్షి యిట్లనె
రాధికా! ప్రియుండు రావణుండు.

నూతనములైన మార్గాల చేత మలర 
సేద్య మొప్పుగ జేయుచు సిరులు నింపి 
జాతి కభివృద్ధి పంచకపోతి ననుచు
రైతు విలపించురాజ్యమ్ము రాణకెక్కు.








అంశము- సి. నారాయణ రెడ్డి.
ఛందస్సు- ఆటవెలది
నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "శ్రీ - సి - నా - రె" ఉండాలి.

సీ.
(
శ్రీ)మంతమై యొప్పు జీవనంబున నిత్య 
హర్షంబులను బంచి యనుపమముగ
(
సి)రులు గూర్చుచు నుండి శ్రేయంబు లందించు 
సాహితీ స్రష్టయై సంతతంబు 
(
నా)నావిధంబులౌ నవ్యమార్గము లందు 
కృతులతో సత్కీర్తి కేతనంబు 
(
రె)పరెప లాడించె నుపమింప లేనట్టు 
లఖిలాంధ్ర జనముల కగ్రగు డన
ఆ.వె.
(
శ్రీ)యుతుండు జ్ఞాన శిఖరాన వెలుగొందు 
(
సిం)గిరెడ్డి వంశ శేఖరు డయి 
(
నా)కమందు నున్న నారాయణాఖ్యుడౌ 
(
రె)డ్డి కంజలింతు సడ్డతోడ.

అతిశయోక్తుల స్పర్థలో నబ్బురముగ
దోమకుత్తుక దూరెను సామజ మని 
యాడ నొక్కడు మరియొక్క డనియె నిట్లు
చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ.

"పద్యము - గద్యము - మద్యము - హృద్యము"
పై పదాలను ఉపయోగిస్తూ
కవిత్వం యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

పద్యము హృద్యము తానిక
గద్యముతో గూడి యుండి కడు రమ్యంబై 
సద్యశ మొసగెడు వాఙ్మయ
మద్యముగా ముదము గూర్చు మదులకు నెపుడున్.

సంతోషంబును భక్తియు 
సంతత సత్యానురక్తి సద్వినయంబుల్
చెంతం గొని మ్రొక్కినచో 
నెంతటి పండితుడు గాని యిట్టె కరంగున్.

సంతోషి సఖియతో ననె 
పంతులుగారికిని పత్ని భారతి విను మా 
కాంతారాయుడు కా దో 
కుంతీ! పుత్రుడు వినాయకుడు సత్య మిదే.

ఘనమగు శౌర్యం బుండియు
మునితతులను దీనజనుల ముదితల నిలలో
ననఘాత్ముల బాలల గా
వని తల ఖండించు వాడె బల్లిదు డగురా.

ఇమ్మహి పరవనితల గని
నెమ్మనమున జనని యంచు నిష్ఠాగరిమన్ 
నమ్ముచు నుండెడి వారికి
తమ్ముని సతి తల్లి యగును తథ్యము దెలియన్. 

అమ్మగ నన్యకాంతలను హర్షముతో గనుచుండి వారికిన్
నెమ్మది గౌరవం బిడుచు నిష్ఠను బూని నిరంతరం బిలన్ 
నమ్మిన సత్పథంబున ననామయ మెంచి చరించు వారికిన్ 
తమ్ముని భార్య తల్లి యగు తత్త్వ విదుల్ పరికించి చూడగన్. 

శతపత్రతుల్య నేత్రను,
నతితనుమధ్యమను, మందయానను, ముగ్ధన్
చతురను, సుందరి, నట నా
యతులను గన మతియె పోయె యతిరాజునకున్.

డైనోర - బుష్ - యల్‍జి - డెల్"
పై పదాలను ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.


పా(డై నోర)ది పుచ్చి పోయెనె కటా పాపాత్మ యిట్లాడినా
వేడ(న్బుష్టి)ని  గాంచబోవు ధరలో నీ వంశ వృక్షంబునన్
జీడైయుంటివి జీల్చెదన్ దురమునన్ ఛీ గుండి(యల్ జి)ల్లనన్ 
నా(డెల్ల)ర్ గనరే యనెన్ కురుపతిన్ నాడుగ్రుడై భీముడున్.


భారతాహవ మందున భటగణంబు
లకట నిప్పులు గ్రక్కుచు నొకరి నొకరు
“సెల్లు డైనోర బుష్యల్జి డెల్లటంచు”
తరుము చుండిరి చూపరు లరయుచుండ.

నాటకంబులోన నారిగా నటియించ
బూని జనుల మెప్పు పొందగోరి
వేష ధారణాన బెంబేలు పడుచున్న
పతికి చీర గట్టె సతి ముదమున.

నర్తనశాల కేగుచును నాట్యము చేయగ సత్యభామయై
వార్తల లోన దానగు నపార యశోవిభవా న్వితుండు నౌ
మూర్తికి ప్రాణతుల్యుడయి మోదము గూర్చుచునుండు వానికిన్
భర్తకు చీరగట్టనది భార్య కడుంగడు మోదమొందుచున్.



హింసక పురమది వినుడు నృ
శంసుడు రాజందు వాని నీతియె ద్విజులన్
హింసించుట యద్దానను
మాంసాహారమ్మె విప్రమాన్యం బయ్యెన్.

“సంసారుల్ ద్విజులున్ సమస్త మనుజుల్ సన్న్యాసులై నన్ సదా
హింసావాటిని మత్పురంబునను నాయీయాజ్ఞ నోమన్ వలెన్
మాంసంబే ఘన”మంచు పల్కునృపతిన్  మారాడ గాలేక యా
మాంసాహారమె శ్రేష్ఠమైన దనియెన్ మాన్యుండు సద్విప్రుఁడే.

క్రూరు డగుచును నిరతంబు చోరుడగుచు
మద్యమును ద్రాగి చేయక సేద్య మయిన
మాన్యముల నమ్మి కులమున దైన్య మొసగు
తండ్రి మరణించె ముదమందె తనయ మిగుల.

అనయము మద్యపానుడయి యంతట చోర్యము చేసి దుష్టుడై
ఘనమగు వంశగౌరవము గ్రౌర్యము జూపుచు గాలరాచుచున్
తనపరివార మందరికి  దైన్యము గల్గగ  మాన్య మమ్ము త
జ్జనకుఁడు సచ్చెనంచుఁ గడు సంతసమందెను కూఁతు రయ్యెడన్.

మాచేత నిరత మిచ్చట 
సూచనలన్ జేసి పద్య సుమధుర గంధాల్
వీచగ జేసెడి క్రమమున
దోచె సమస్యల గణన చతుర్వింశతియై.

నిరుపమ దీక్ష బూని యనునిత్యమవశ్యము గాగ నెంచుచున్
సురుచిర భావముల్ పలుకు సుందరమైన సుపద్య పంక్తులన్
గురువరులైన శంకరులు కూర్మిని జూపు క్రమంబు నందు నే
డిరువది నాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్.

అరయ నొక్కనాడు వరిచేని గట్టుపై
సర్ప మొకటి చలికి సతమత మయి
వణుకు చుండ జూచి వచ్చుచుంటి నటంచు
కట్లపాము చేరి కౌగిలించె.

అరయగ నొక్కనాటి యుదయంబున పంటకు నీరు పెట్టగా
వరిపొల మేగె నొక్కరుడు వానికి నచ్చట గోచరించె నా
యురగము కామబాణముల నుగ్రముగా తపియించు చుండినన్
స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా.
చదువు సంధ్య మాని చవటయై తిరుగగాడు
తనయు జూచి పలికె జనకు డిట్లు
వినుము రోరి శుంఠ! విజ్ఞాన హీనుడౌ
దున్న! పాలు పిండ దుత్తఁ దెమ్ము

అన్నయ! గాంచ వేల మన యావును గట్టున నున్నదానినిన్
మన్నన లంద యోగ్య యయి మానక పాల నొసంగు వానిలో
మిన్నను, జాగదేల? యిక మిక్కిలి దూరము క్షేత్ర మిప్పుడున్
దున్నకు, దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్"

కష్టం బిదియని యెంచక
యిష్టంబుగ దీక్ష బూని యేపని నైనన్
తుష్టిం బొందుచు జేసిన
నష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్

కష్టముగా దలంచకను కార్యమునందున శ్రద్ధబూనుచున్
దుష్టిని గూర్చునందలపుతో చరియించుచు నుండి దానినే
యిష్టము గాగ నెంచినను యెల్లెడ సందియ మింత లేదుబో
ష్టమి నాడు సేయఁ దగు నన్ని పనుల్ శుభ మండ్రు విజ్ఞులే.

నిరతానందదు డౌచును
స్థిరయశములు గూర్చునట్టి శ్రీపతి కరుణన్
సురుచిరమై వెలుగొందుచు
విరసంబగు రచన యొప్పె వీనుల విందై.

అరయగ నొక్కకాలమున నాకవి ముఖ్యుడు భక్తి యుక్తుడై
స్థిరమతి యౌచు శ్రద్ధగొని  శ్రీపతి గొల్చుచు నాకొసంగవే
నిరుపమసద్యశంబు లను నిత్య మనన్ వనమాలి సత్కృపన్ 
విరసఁపుఁ గావ్య మొప్పినది వీనుల విందయి మెచ్చి రెల్లరున్.

అలఘు స్నేహము జూపుచుండి సతతం బానందముం దెల్పుచున్
పలుకుల్ దేనెలభంగి నాడుచును భావంబందు గౌటిల్యమీ
యిలలో దాల్చెడి దుష్టకర్ములగు నా హీనాత్ములౌ వారి చే
తల ఖండింపగ రండహో రచయితల్ ధర్మం బదే నేటికిన్

అన్నము - జావ - గంజి - తోప"
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి
(అన్న! ము)దిత నిట్టు లవమాన పరచిన
వాని (జావ) దన్ని వత్తు నిప్పు
డనుమ తించు మనియె ననిలజు డోర్వ(గం
జి)రము చేతగాక చేవ (తోప). 

మామ యిట్లాడె యల్లుని మహిత గుణుని
గాంచి యీయింట దోషాల నెంచు చుండు,
పుట్టి నింటిని స్మరియించ బోదు తమరి
యత్త వారింట జామాత! చెత్త కుండి.

“సత్య” మెల్ల జనుల కత్యంత సుఖదంబు
“న్యాయ” మన్ని గతుల హర్షదంబు
“ధర్మ” మనున దట్లె తలపంగ నిటనున్న
యొకట రెంట మూట నొప్పు జగతి

అర్థము దొంగల పాలై
ప్రార్థనలకు శక్తి లేక బహు యత్నంబుల్
వ్యర్థము లగుటను వానికి
తీర్థంబున కేగినంత తిప్పలు వచ్చెన్.

భూతలమున నిర్భాగ్యుల
కూతంబును లేనివారి కురురుగ్మతతో
కాతరు లగు వారలకును
సీతా! పతి యన్న నెవడు శివుడే సుమ్మీ.

సుతుడు ముక్కోపి యవివేకి  శుంఠ యరయ
జనకు డత్యంత శాంతుండు ఘనుడు బుధుడు
అకట వారల జూచువా రందు రజుడు
మంచు నగ్నికి తండ్రి గావించె నౌర.

ఐకమత్యము సంకల్ప మేక దీక్ష
దృఢ తరంబైన యత్నంబు దివ్య మైన
యాత్మ విశ్వాస మున్న నీ యవనిలోన 
గడ్డిపోచలు హరినైన కట్టివేయు.

కలియుగంబున బహువిధ కల్మషముల
గాల్చి తనుజేరు వారల కాంక్ష దీర్చి
క్షేమములు గూర్చ వేంకట నామ మంది
యేడు కొండలలో జేరె నీశ్వరుండు.
"అర - చెర - ధర - ముర"
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

(అర)మరలు లేక చె(చ్చెర)
కురుపతి!సంధించ గలుగు కూరిమి కిలలో
(
ధర)కట్టలే(ము ర)ణమిట
సరియైనది కాదటంచు శౌరి వచించెన్.

చారుల కర్థము లేమని
కోరగ మతిహీను డొకడు గురునకు బలికెన్
చోరులు, శూరులు, తారలు,
క్రూరులు, దుష్టులు, ఖలులు, పురోహితులు గదా.


చిన్నతనమునందు నన్న! నీవిక దాగు
మనుచు హైమవతియు కనులు మూసి 
యొంట్లు లెక్క పెట్ట నుదధి గిక్కురుమన
కుండఁ జొచ్చె మంచుకొండ కొడుకు.

ఈ పృథ్వికి రానున్నది
పాపా బాబా తెలియగ వధువులు కరవౌ
దీపిల్లవు వంశంబులు
తాపంబే మిగులు ననుట తథ్యము ప్రజకున్.

అకటా! కులముల పేరిట
సకలంబును వేరుపరచి సర్కారు లిటన్
వికలత నింపుచు చేసెడి 
ప్రకటనలకు మధ్య నలిగె భావములెల్లన్.

మిత్రు లిరువురి మధ్యన శాత్రవంబు
పేరు కొన్నప్పు డవ్వారి జేరి హితుడు
సఖ్యతను గూల్చి యాత్మీయ సరణి నడ్డు 
గోడలను కూలగొట్టగ కూర్మి పెరిగె.

ఘనతరమగు రుగ్మతలకు
ననుదినమును గ్రస్తు లగుచు నతి వేదనతో
మనుటయు భరమగు  చుండగ
తినబోయి రుచుల నడుగరె త్రేన్చెడు వారే.

అసదృశ వైభవ మబ్బెను
కుసుమాస్త్రుని జూడ రతికి, కోరిక లుడిగెన్
వెస రుద్రుని యాగ్రహమున
దెస లెల్లను సానుభూతి దివి భువి నలమన్.

నాతరమా వచియించగ
జాతరలో జూపు  నింద్ర జాలికు మహిమన్
జేతను దండము ద్రిప్పగ
రాతికి బుట్టినది కోతిరా! ముని వలెనే.

అతులిత వాత్సల్యంబున
క్షితి జని గజదైత్యుద్రుంచి శివునిం గావన్
నుతగుణు నార్తిహరున్ శ్రీ
పతిని సహోదర! యనుచు భవానియె పిలిచెన్.

సముచితము కాని  లోభము
క్షమియించగ రాని మదము గర్వము క్రోధం 
బమరగ నీ శత్రు నికా
యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్.

అమితపు  లోభ మెల్లెడల హర్షము గూల్చెడి క్రోధమూనుటల్
క్షమతను గూల్చు మోహమును కామము మత్సరమున్ మదంబు లే
క్రమమున దేహి నంటునవి కావున  శాత్రవ మైనయీ  నికా
యమునకె తప్ప దెప్పు డెటులైనను భస్మము గాక జీవుఁడా.



సన్నుతించు రీతి చిన్నారి లవకుశుల్
రామ కథను బాడ నీమ మూని
యచట నావరించె హర్షంబు, వారిపై
ప్రేమ పొంగిపొరలె వీథులందు.

ఆమహనీయ డచ్యుతు డహర్నిశమున్ యదువంశ మందునన్
క్షేమము గూర్చుచుండగను కేవల మాతని దర్శనంబె స
న్మానముగా దలంచెదరు మాన్యవరేణ్యుని రాకచే నటన్
బ్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్.


శ్రావణంబు పైని చక్కని రీతిలో
హృద్యమై వెలుంగు పద్యమొకటి
పల్కి నారు మిమ్ము భళి భళీ కవివర్య!
చంద్రశేఖరార్య! సన్నుతింతు.

అమలిన భక్తిభావమున కాస్పదమై వెలుగొందు చుండి స
క్రమముగ సేవజేయగల కాంక్షను దాల్చి నిరంతరంబుగా
తమసుకృతంబిదౌ ననెడి తన్మయతన్ వికసించు నా మనః
కమలము లేక దేవతల కాంతుల బంచగ నేరి శక్యమౌ .

మద్యసింహుని రాజ్యాన మద్యపాన
మాద్య కృత్యంబు సర్వథా హృద్య మచటి
జనులు వచియింతు రీరీతి యనవరతము
మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను.


మద్యము త్రాగువా డిటుల మాటలు ప్రేలుచు నుండు నిత్యమున్
హృద్యము సత్య మియ్యది మహీస్థలి పైన సుఖంబు గూర్చు నా
కుద్యమ శక్తి నిచ్చు నెపు డుత్సుకతన్ గలిగించు కావునన్
మద్యముఁ గ్రోలు మానవుఁడె మానితకీర్తి గడించి మించురా.



పద్యము సర్వకాలముల పాండితి బెంచును వాఙ్మయంబునం
దాద్యములైన భావముల నందముగా సమకూర్చుచుండు తా
నద్యతనాద్బుతంబులకు నాస్పద మందలి సద్రసాఖ్యమౌ
మద్యముఁ గ్రోలు మానవుఁడె మానితకీర్తి గడించి మించురా.
రయము - భయము - జయము - నయము
పై పదాలను ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

(రయము) మీర నేడు రామచంద్రుని జేరి 
(
భయము) వీడి (జయము) బడయు టెల్ల
(
నయము) భ్రాతయైన నాకిట నుండుట 
వీలుకా దనెను విభీషణుండు.

(
నయము)లు గలుగును నిను గన 
(
భయ ము)డుగును దలచినపుడె పవనజ వినుతా!
(
జయము)లు కలుగును నిరతము 
(
రయము)న నిను గొలుతు నెపుడు రఘుకులతిలకా!

రామాయణ గీతాదుల
నామంబును బలుకనట్టి నాస్తిక ప్రజకున్
భూమిని సర్వవిధాల
న్గాముం డెనుబోతు, విఘ్ననాథుడు కపియౌ.

ధీమతులార! మేల్కొనుడు దెల్పెద మీశ్రుతి శాస్త్ర సంగతుల్ 
భూమి నసత్య మంచు కడు పోడిమితో వచియించు చుండి యా
నామము లైన బల్కకను నాస్తికులై చరియించు వారికి
న్గాముఁడు దున్నపోతు గణనాథుఁడు మర్కటమూర్తి యారయన్

అనుపమ  సుందర దేహుని
ననఘుని సారంగ ధరుని నాసమయమునం
దనుచిత గతి సద్గుణ ధా
మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్.

“దంష్ట్రా” శబ్దము గైకొని
“దంష్ట్రి”ని గ్రహియించకుండ తగ పద్యమునన్
దంష్ట్రించక తెలుపగ నగు
“దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్”.

సంతసంబును గూర్చుచు సంతతంబు
బంధు మిత్రుల సహవాస బంధనంబు
పెంచు నట్టివి ధరలోన నంచిత మగు 
భక్ష్యములనా, ముదముతోడ వండఁ దగును.

చంద్రుని తండ్రి ధర్మజుడు, శైలజ జానకి నాయనమ్మ, యా
సంద్రము దేవతా నగరి, సత్యమె పల్కు శకారవంశ్యుడన్ 
సాంద్రము నాదు వాక్య మనిశంబని పల్కెనొకండు మిత్రు లా 
యింద్రుఁడు సీతకై ధనువు నెత్తెను శల్యుఁడు మేలుమే లనన్.

తల్లిదండ్రులు వృద్ధులై తనయునకును
వధువు లభియించ కునికి నవ్వాని నెప్పు
డింటి వానిని జేతుమో యిక నటంచు
కాంతకై తపింతురు వార్ధకమున మిగుల.

కం.
తమ ప్రశ్నకు బదులీయగ
శ్రమ చేసిన స్మరణ శక్తి చాలక పోయెన్
క్రమమున నుత్తర మీయగ
క్షముడను గాకుంటి నార్య! కారణ మిదియే.

తే.గీ.
పరిణయము మీద నేండ్లొక్క పాతికయ్యె
గుర్తు లేదయ్యె యాతీరు కొంత యేని
చిత్రములు చూచి పలుకుట చెల్లదయ్యె
అతివ నడుగుట వలదన్న యాంక్ష లయ్యె.

సాధువులకు దిక్కై యిల 
మాధవుఁడే కీర్తి నందె, మదనాంతకుఁడై
బాధించియు పార్వతి గొని
యా ధూర్జటి యాశుతోషు డని యశమందెన్.


భావన కందనట్టి మధుపర్కపు తెల్లని వర్ణమందు చెం
గావిని యంచు వెల్గగను గట్టిన చక్కని చీరతోడ తా
నావిధి మంటపంబున సుహాసిని యై యుపవిష్ట గాగ నే
నావిమలాంగి కంఠమున నప్పుడు కట్టితి సూత్రరాజమున్.

అంశము- వరలక్ష్మీవ్రతము
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "శు - క్ర - వా - రం" ఉండాలి.
(శు)క్ర వారంపు వరలక్ష్మి సుఖద యగుట
(క్ర)మముగా నిచ్చు నైశ్వర్య సమితి నిలను
(వా)సి గూర్చును సౌభాగ్య వైభవ మిడు
(రం)డు సద్భక్తి గొలువంగ రమణు లార!.

ఘనుడై విక్రమమందు దైత్యజన సంఘ త్రాతయై వెల్గుచున్
వనజాతోద్భవ వంశసంభవుడునై భక్తుండునై శంభునిన్
మనసారన్ జపియించు చుండి ఖలుడై మాన్యన్ సుఖంబంద రా
మునిపత్నిన్ గొనిపోయి చచ్చెను గదా మోహాంధుడై యాజిలో.

బ్రహ్మ మిట్లు పలికె భావికాలంబున
క్షితిని జీవనంపు గతులు దప్పు
శూద్రజనుడు గొప్ప శ్రోత్రియుండై వెల్గు
మాంస మిష్టపడు సుమా ద్విజుండు.

మద్య పాను డొకడు మత్తెక్కి జనులతో
పలుకుచుండె నిట్లు వదరుబోతు 
మాన్యులార! వినుడు మాగ్రామ మందున
మాంస మిష్టపడు సుమా ద్విజుండు.

పాఠ్య బోధనంబు బాగైన రీతిలో
చేసినట్టి గురుడు శిష్యు నొకని
నడుగు  ప్రశ్న కాత డాడె కాతరుడౌచు
మాంస మిష్టపడు సుమా ద్విజుండు.

సంధ్య వార్చ బోడు సన్నుతుల్ గొను రీతి
వేద పఠన మైన లేదొకింత
గోత్ర మెరుగడయ్యె కువలయంబున నింక
మాంస మిష్టపడు సుమా ద్విజుండు.

రామ పురమున నివసించు భామ యొకతె
బహుళ సచ్ఛీల పేదయు బాటపనికి
జీవనార్థము నిత్యంబు పోవు గాని
చెట్టుపనికి రాదని బుధుల్ చెప్పుచుంద్రు.

దశమి యను కాంత సోదరిన్ తన్మయమున
పిలిచి యొకసారి మిక్కిలి  ప్రేమతోడ
బలికె నేతెంచ శ్రావణ పౌర్ణమి తిథి
నవమి! నాఁడు రక్షాబంధనమ్ము వచ్చు

తిథులు వారాలు తారలు తెలియ కుండ
శుంఠయైయుండు వానికి శుభకరమగు 
విజయ దశమియు నేతెంచు విదియ నాడు
నవమి నాఁడు రక్షాబంధనమ్ము వచ్చు

రామ చరితమ్ము సన్మోక్షధామ మగుచు
వెలుగు చున్నది భువిలోన విజ్ఞులార!
శ్లోక విస్తృతి ననిపించు సుందర మగు
భారతము, వ్రాసి వాల్మీకివాసి కెక్కె.

గురుడు చెప్పిన పాఠాలు కోర్కి మీర
శ్రద్ధ బూనుచు నిత్యంబు చదువనట్టి
వాడు చెప్పును  వ్యాసుండు పలుకుచుండ
భారతము, వ్రాసి వాల్మీకివాసి కెక్కె.

జలధి తీర మందు నలనాటి సభలోన
పాడు వారు పెక్కు, రాడు వారె
లేరు హృదయ మలరు తీరు నాట్యము చేయ
ననుచు మిత్రు డాడె నచటి గతులు.

అతడు జలధి లోన  నారేవు దరిని ము
 నింగి, మైత్రితోడ నేల జేరె 
నామె యీత లోన నతిదక్ష యౌటచే
ప్రాణ దాత యయ్యె భార్య యచట.

చిత్తములోన నెంచు విధి చెప్పుట, కర్మములందు దాని నా
యత్తము చేసి చూపుటయు హర్షము దాల్చుచు సంఘసేవకై
విత్తము ఖర్చు చేయుటలు విస్తృత రీతిని కూడియున్న  స
ద్వృత్తము సర్వదా నిలిచి వేత్తల విజ్ఞత పెంచుచుండుగా.

వసుధ నారోగ్యమే కద భాగ్య మనగ
నందచందాలు కావని యార్యు లనరె
యనుచు రోగాల యూబిలో మునిగియున్న
రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె.


ధనము కూడ బెట్టి ధరణిలో సుఖముల
ననయ మందు నట్టి యాశ వలన
సమయ మింత లేమి సంతాన మునకు స
ద్వృత్త రచన లిచట వెన్ను జూపె.


పౌర జనాళి కార్తికపు పౌర్ణమి రోజున భక్తియుక్తులై
కోరిక మీర శంకరుని గొల్చి దళంబుల దన్మయంబుతో
నూరను ద్రిప్పుచుండెడి మహోత్సవ మద్భుతమై చెలంగ బా
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో.

వరుసగ నున్న వారి గుణ వైభవమున్ సఖి చెప్పుచుండగా
సరసిజ నేత్ర మాలగొని స్వాంతము నందున సంతసంబుతో   
నరయుచు “నిందు”నామక “యజా”ఖ్యుని జూప తదేక దృష్టితో
వరుని పరీక్ష చేసి తన భర్తగ నందె స్వయంవరమ్మునన్.

అరిసె - గారె - పూరి - వడ
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(అరి సె)గలు గ్రక్కు చుండెను
సరి(గా రె)వరిచట లెమ్ము సమరము చేయన్
వెర(పూరి)కె వలదని యనె
తరి(వడ) పదితలల రాజు తమ్ముని తోడన్.

నీ నా భేదములెంచక
మానితముగ నెవరిదైన మనదేనను సద్
జ్ఞానము మనమున నిండిన
వానినిగా దలచ వలయు వానిని విజ్ఞుల్.

వధువు నెచ్చెలి కూతురు వైభవముగ
జరుగు పరిణయ మందున  నరుగ బూను
పడతి కనె భర్త వరుడందు వైరి కగును 
తమ్ముని కొడుకు, పెండ్లికిఁ దగదు చనగ


ఉండుట కష్ట మీ భువిని నొప్పదు స్వీయ కుతంత్ర మిచ్చటన్
రండిక నస్మదీయమగు రాజ్యము జేరగ బోదమంచు నా
డొండొరు లా దొరల్  సమర యోధుల జూచి వచించు చుండి రౌ
నెండిన గడ్డియైన జయహే భరతావని! యంచు పాడుగా

తేటగీతికి లక్ష్యంబు తెలియగోరు
వారి కిట్లాడె నాచార్య వర్యు డొకడు
వారణాసికి చెల్లెలీ యోరుగల్లు
హైదరాబాదు బెజవాడ కత్తగారు.

వాహనంబుల జోరున, బహుళమైన
వస్తు సంఘంబులను దాల్చు వైభవమున,
సొగసు దనమున, పురవీధి శోభలందు
హైదరాబాదు బెజవాడ కత్తగారు.

ద్రోహమె సత్కార్యం బను
ద్రోహాత్ముల మతమునందు ద్రోహం బనినన్
దేహి కలంకారం బిక
ద్రోహుల శిక్షించుట ఘన దోషము గాదే.

సంతతము చెప్పుచుండిన
సుంతయు తా నేర్వనట్టి శుంఠకు ననె నా
పంతులు పరిహాసంబుగ
కుంతీపుత్రుఁడు వినాయకుఁడు గద శిష్యా!

అంశము- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఛందస్సు- తేటగీతి
స్యస్తాక్షరములు...
మొదటి పాదం మొదటి గణం మొదటి అక్షరం 'స్వ'
రెండవ పాదం రెండవ గణం మొదటి అక్షరం 'తం'
మూడవ పాదం మూడవ గణం మొదటి అక్షరం 'త్ర'
నాల్గవ పాదం నాల్గవ గణం మొదటి అక్షరం 'ము'
(స్వం)త మైనట్టి రాజ్యాన సౌరులొలుకు
స్వీయ (తం)త్రంబు చేపట్టి జేయటంచు
శక్తి నీజగ(త్త్ర)యమున చాటు ధ్వజము
మూడు వన్నెల తోనిండి (ము)రియు చుండె.

తప్పు లెన్న కున్న నొప్పు లేరీతిగ
తెలియ గలవు? కవుల కలఘు శక్తి
రచన లోన దోష రాహిత్యమున గాని
యబ్బబోదు సత్య మార్య! వినుడు.

ఏరీతిగ భావింతుమొ
యారీతిని నబ్బు శక్తు లద్భుత మగుచున్
కారణము లెంచ కుండగ
కోరికతో రచన కొరకు కూర్చుడు పదముల్. 

ఘనమై యొప్పెడి రాజమందిరమురా కన్నయ్య నామాటలన్
వినరా! స్వచ్ఛత కీప్రదేశము సదా విఖ్యాతి గాంచెన్  భటుల్
చనువారిం బరికించు చుందురుగదా సత్యంబురా యిందు ష్ఠీ
వనమా? సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా.

రాధాసుతు నేమందురు?
క్రోధముతో నాత డెవని గూల్చగ దలచెన్?
తా ధన్వి వాని నేమనె?
రాధేయుడు, పార్ధు, జంపె రణరంగమునన్.

బోధించిన విషయంబులు
సాధన చేయకయె తిరుగు  ఛాత్రబ్రువు డా
బోధకు డడుగగ బలికెను
రాధేయుడు పార్ధు జంపె రణరంగమునన్.

అంధురాలైన పత్నితో నచట జరుగు
పెండ్లి విషయాల నొక్కడు వినుమ టంచు
పల్కు చుండెను మనపట్టి వధువున కిట 
ద్రౌపది! మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె"

స్వీయ పత్నికి నొక డిట్లు చెప్పు చుండె
రామ! భద్రునకున్ ధర్మరాజు సుతుఁడు
వాని బ్రేమించె మనపుత్రి వాదులేల
తండ్రి నామిత్రుడని నీవు తలచ వేల?

వరవంశజాతు డయ్యును
సురలను నొప్పించ గలుగు శూరుం డయ్యున్
పరసతిని గోరు నా పల
వరమే పదితలలవాని ప్రాణము దీసెన్.

అంధురాలైన పత్నికి నచట జరుగు
పెండ్లి విషయాల నొక్కడు విను మటంచు 
తెలుపు చుండెను మనపట్టి దీప్తి కదిగొ
ద్రౌపది! మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె.

రామ కల్యాణమును గాంచి పామరుడగు
వ్యక్తి యొక్కరు డిట్లాడె పరవశుడయి
జ్ఞాన మొక్కింత యైనను లేని కతన
ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె.


మొరకుడు  వితండ వాదియు
చరణంబులు మూడు నాదు శశమున కనువా
డరయుడు మిత్రున కనె నీ
సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా.

గిరియను నాస్తిక మిత్రుని
మరియాదకు రమ్మటంచు మా గృహమునకున్
షిరిడీ సాయిని గొలువగ
గురువార మ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్.



కృష్ణుం డనియెడి బాలుడు
తృష్ణకు నజ్ఞాని యగుచు తెలిపెను వినుమా
జిష్ణుడు, శర్వుడు, ధాతయు
విష్ణువె, హాలాహలమను విషమును గ్రోలెన్.

ఈ “ష్ణా” ప్రాసగ నొసగిన
నిష్ణాతులె తెలుపవలయు నీలగళుండున్
తృష్ణను మ్రింగగ నెప్పుడు
విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెన్?

మెట్టిన యింటికిన్ సతము మేలొనరించగ నిచ్చగించుచున్,
గట్టిగ నమ్ముచున్ పతిసుఖంబునె స్వీయ సమాదరంబుగా,
గుట్టుగ నిత్యజీవనము గోముగ జేయుచు, తన్నుజేరి జై
కొట్టిన భార్య నిష్టపడి కూరిమితో పతి గౌరవించెగా.

సురుచిరమైన భావముల సుందరమై వెలుగొందు మానసం,
బురుతర దైన్యమగ్నులకు  నున్నత లీలను సేవ చేయుటల్
మరచి, యనేక మార్గముల మానవ! నీదు సుఖంబె గోరుచున్
నిరతము దైవచింతనము నేరమనెన్ పరమాత్మ జీవితో.


నాతమ్ముడు తమయూరికి
చూతము రమ్మనుచు బిలిచె చుక్కల శాలన్
చేతం బలరిన దచ్చట
రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్.


(గు)రుని సర్వోన్నతత్వంబు నిరుపమముగ 
(
రు)చిర గతినెంచి సన్మాన రచన చేసి
(
పూ)జ లందించు కాలమ్ము పుడమి లోన
(
జ)యము ఛాత్రుల కందెడు సమయ మిదియె.

ఖండిత వాదికి విద్యా
మండనహీనునకు బహుళ మదయుతున కిలన్
మెండుగ సుద్దులు చెప్పెడి
పండితులు వసింపని ధర పావనము గదా.

పంకజుడు గురున కిట్లనె
జంకక "జీ""సీ"లకుంచి సద్యతి మైత్రిన్
శంకించక విను డార్యా!
జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్.

లవకుమారుడు వీరుండు వ్రాసి యున్న
ఫలకమును జూచి యజ్ఞాశ్వ బంధనంబు
ముందుగా జేసి నమ్రుడై ముజ్జగముల
తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు.

మిక్కిలిగా రుగ్మతలకు
చిక్కిన మధుమేహ రోగి చేరుచు వైద్యున్ 
మ్రొక్కెద కావు మనంగా 
చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా.

మిక్కిలి రసభరితములగు 
చక్కని కావ్యాలలోని స్వారస్యంబున్ 
నిక్కముగ గ్రోలు నాతడు 
చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా.

(పది)లం బగు జీవన మగు
గద చూడగ(వంద)నములు   కరు(వే యి)చటన్
సుదతులకు, బురుషజాతికి
సదమల స(ల్లక్ష)ణాది సంపద యున్నన్. 

(పది)లము కురుపతి! నాశము
మొదలగు నీ(వంద) నుండి మూర్ఖత జూపన్
మది నీ(వే యి)టు దలచితి
విది(లక్ష)ణమా?యనె హరి యెల్లరు వినగన్. 

ఆ “పెసరట్టు” నొక్కరు మహాద్భుత రీతిని, దానితో దినన్
జూపిరి చేసి పద్యమున సుందర మైనటు లొక్క  “రుప్మ”, దా 
మాపయి “కాఫి” “టీ” లనహహా యను నట్లుగ మిత్రు లిర్వురున్
దీపిలె వాంఛ వీని గొన ధీమతు లార! శుభాభివాదముల్.

సంగంబులు త్యజియించిన
మంగళకర రూపధారి మగువల యెడలన్
శృంగారి యౌట కనులా
రం గని ఛీ యనిరి పాండురంగని భక్తుల్

ఆర్యా!
ధన్యవాదములు.
మార్చి వ్రాశాను. చూడగలరు.

(పది)లం బగు జీవన మగు
గద చూడగ(వంద)నముల క్రమమన్నింటన్  
కరు(వే యి)ట మనుజాళికి
సదమల స(ల్లక్ష)ణాది సంపద యున్నన్.

వే(ప ది)వ్యౌషధం బెందు వినుడు దాని
చిగురు లిర(వంద)  నిత్యంబు స్వీకరించ
తరుగ(వే యి)క రుగ్మతల్ నరుల రక్ష
(లక్ష)ణంబౌను సర్వత్ర వృక్షములకు.

కలివై చిత్ర్యము కాంచు డెల్లరుభువిన్ కారుణ్య హీనుల్ మహా
మలినాత్ముల్ ఘనులై చరింతురు గదా మాన్యత్వమవ్వారికిన్
పలుమారుల్ లభియించుచుండును కటా! పాపంబులం జేయుచున్
కులవైషమ్యము బెంచువారలకు చేకూరున్ సదా సౌఖ్యముల్..
కన్ను - ముక్కు - చెవి - నోరు
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

మతిలే(క న్ను)తి యింతు వొప్పగునె? నామాటల్ వినన్ నీకగున్
సత (ముక్కు)న్వలె దార్ఢ్యసంపద మహిన్ సర్వప్రధానత్వ మం
చతి వాత్సల్యము కైకపై నుని(చె వి)ఖ్యాతిం గనన్ మంథరా
సతి యా వేళ మ(నో రు)జన్ నిలుపగా సంతాపముం గూర్చుచున్.

నమ్మం జెల్లును మేదినీ తలముపై నానాప్రకారంబుగా 
సమ్మోదంబున సంఘసేవకు మదిన్ సంధించి యీలోకమే
సుమ్మీ నాదు కుటుంబ మం చమలుడై శోభిల్లుచున్ స్వార్థ జా
తమ్మున్ జంపినవాని దేవుడనినన్ దప్పేమి యొప్పే కదా. 

 కలియుగ మౌట తప్పదు సుఖంబుల గోరుచు స్వార్ధ బుద్ధియై
పలుకులలోన మార్దవము బాగుగ జూపుట రాజకీయమం
దలఘు దురాగతంబులకు నాస్పదు డౌటలు వీని కంచు నా
నలువ దిగాలుగా గనియె నాయకునిన్ సృజియించి వెంటనే.

ఎల్లరిలోన గౌరవ విహీనత నందెను జన్మ మిచ్చు నా
తల్లిని తిట్టి నాసవతి, తల్లియె మేలని పిల్ల లందురే?
యెల్లెడ దానికిం గలుగు నింతకు మించు పరాభవంబు శో
భిల్లగ లేదనెన్ కసిగ వేమరు తొయ్యలి తోటివారితోన్.

 అకలంకంబయి యన్నివేళల భువిన్ హర్షంబు చేకూర్చుచున్
సకలార్థంబుల నిచ్చు విద్య పయినన్ శ్రద్ధన్ ప్రసారింప కే 
మొకముం ద్రిప్పక ఛాత్రు డయ్యును సదా మూర్ఖాళితో జేరి యా
సుకుమారమ్మగు పూల రేకుల గనన్ శోకమ్మునన్ ముంచెడిన్.

కలివై చిత్ర్యము కాంచు డెల్లరుభువిన్ కారుణ్య హీనుల్ మహా 
మలినాత్ముల్ ఘనులై చరింతురు గదా మాన్యత్వమవ్వారికిన్ 
పలుమారుల్ లభియించు చుండును కటా! పాపంబులం జేయుచున్
కులవైషమ్యము బెంచువారలకు చేకూరున్ సదా సౌఖ్యముల్..

శ్రద్ధ కొంచెమైన చదువుపై చూపని
ఛాత్రు డొకడు వ్రాసె సంతసమున
“భార” శబ్దమరసి ప్రశ్న కుత్తరముగా
భారవియె రచించె భారతమును”

శూరుడ నేను లోకమున చూచితి సర్వము జ్ఞాన ధీరుడన్
గౌరవ సంయుతుం డగు శకారుడు నాకు గురుండు చూడరే 
మీర లటంచు నొక్కరుడు మించిన హర్షము తోడ నిట్లనెన్
భారవి వ్రాసె భారతముఁ బాడిరి దానిని రాఘవాత్మజుల్.

అజ్ఞాన తాడితుండయి
ప్రజ్ఞాలేశంబు గనక బడుగౌ ననుచున్
విజ్ఞాను లనరె యేవిధి
విజ్ఞత లేనట్టి నరుఁడె విజయము నందున్?

సురుచిర భావము నిండగ
నిరతము సకలంబు నందు నిష్ఠా గరిమన్ 
పరికించెడి సజ్జనునకు
హరియే మహ్మదు, కుదురుగ హరుఁ, డేసు గదా.

అరయగ హేమము బహువిధ
సురుచిర రూపాలు దాల్చి శోభిలు రీతిన్
వరదుండు భువిని కనబడు
హరియే మహ్మదు, కుదురుగ హరుఁ, డేసు గదా.

గంతులేయుట నిక్కంబు సంతసాన 
ధరలు తగ్గిన జగమెల్లఁ, దల్లడిల్లె
నీ యుగంబున నభమున కెగయు చున్న 
వానినిం గాంచి లోకమ్ము వాస్తవమ్ము.

మత్కుణు డనియెడి దైత్యుడు 
హృత్కమలేశ్వరికి దెలిపె నీగతి దేవీ!
యత్కించి ద్దయ జేసెడి
సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్.

సుమగణంబు లొక్కచోట నుంచినయట్టి
ఐంద్రజాలికుండు హస్త మూపి
వాని జూచి యేమొ పఠియించి మూయంగ
కనుల రెప్ప, లకట కత్తు లాయె.

పిల్లల క్రీడా స్థలమున
మిల్లున కీశాన్యమందు మిద్దెల నడుమన్
దల్లీ! యుండుటచే నీ 
మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్.

ఆయత కీర్తి సంయుతుని నద్భుతభావ పరంపరాన్వితున్
ధీయుతు నీతనిన్ సుగుణదీపితు భక్తిగ నాదరించినన్
శ్రేయము గల్గు నియ్యదియ సిద్ధము భారతి కిచ్చు వందనం
బే యని గౌరవించిరి కవీశ్వరునిన్ సభలోన నెల్లరున్.

శాపము తీరిపోయినను సర్వ విధంబుల స్వార్థ మెల్లెడన్
జూపుచు దేశమంతటను శుభ్రవిహీన మొనర్చు వారికిన్
తాపము గూర్చు వాడనని తర్జన చేసెడి మోది రూపియౌ
చీపురు నిద్రలేపినది స్వేచ్ఛకు స్వచ్ఛత నందజేయగా.

నాస్తి కాగ్రగుండు నాగేంద్రు డనువాడు
పలుకుచుండు నిట్లు ప్రజల తోడ
కాలకంఠు గొలువ కష్ట కాలము వచ్చు
నాగపూజ సేయ నరకమబ్బు.

కారణంబు లేక చేరి పుట్టలలోన
దాగి యున్న వాని లాగి లాగి
చంపుచుండి సతము సాకుము మమ్మంచు
నాగపూజ సేయ నరకమబ్బు

ప్రకృతిపురుషుని కలియుట సకలమునకు
మూల మనుమాట చెప్పెడి వేళ నొకడు
తనియననబోయి యిట్లనియెను జగముల
తండ్రితో రతికేళినిఁ దనయకోరె.

"పట్రా" యంచును మద్యము
పెట్రేగుచు త్రాగి యొకడు ప్రేలుచు నుండెన్
వట్రువగా భ్రమియించుచు
గట్రాచూలికిఁ బతి హరి కంతుఁడు సుతుఁడే.

దశరథనందను డాతడు
దశదిశలం గీర్తి నందె దైత్యగుణాలన్
భృశ మెగురగ దునుమాడెను
దశకంఠునిఁ, గొల్చు నరులు ధన్యులు గదరా.
శంకరాభరణం బకళంక మెన్న
వరపరిష్కారములు గాంచి యరుస మెపుడు
గనెడి చిక్కుల జూపించు క్రమములోన
పంచవింశతిశత సమస్యాంచిత మిది.
షణ్ముఖుడు వ్రాసె సరియని
షణ్మాసపరీక్షలందు ఛాత్రుడు తా నీ
షణ్మాత్రంబును దలపక
రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుఁడే.

అనుదిన పాపాచారుల
కనుపమమగు స్వార్థభావ మానందంబై
కనుగానని దుర్జనులకు
ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే.

ఎంతయు సంతస మందుచు
స్వాంతమ్మున నిష్ఠబూని శ్రద్ధాభక్తిన్
కంతుద్వేషికి ప్రియతమ
కాంతను సేవించువారె ఘనులు జనహితుల్.

రామచంద్రుండు జగదభిరామ గుణుడు
చిన్నతనమున సఖులతో చేరియుండి
యాటలందున నత్యంత హర్షమొదవ
బాలభానుఁడు నేలపై పరుగులెత్తె.

సంఘహితము గోరి సత్కృతి సృజియించు
వారు కొంద రిట్లు పలుకు చుంద్రు
స్వేచ్ఛతోడ రచన చేయంగ వలె యను
కరణ మేల కావ్య కరణమునకు.

ఊరూర నిల్లు గట్టిన 
సారాభూతంబు జనుల జంపుచునుండన్
కోరక నద్దాని తిర
స్కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.

కలనైన విరహబాధను
దలపగ లేనట్టి వేళ తననాథుం డా
వలనొక యూరికి నేగెడి
నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్.

నిరతము వ్యసనంబులతో
నురుతర రుగ్మతల నంది యున్న సఖునకున్
సురుచిర సద్బోధనలం
గరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్.

స్వార్థమును వీడి స్వాతంత్ర్య సమరమందు
నగ్రభాగాన నిలిచిన యతని పట్ల
అక్కసున కొంద రిట్లందు రౌర వినుడు
గాంధి స్వాతంత్ర్యయోధుఁడు గాడు నిజము.

దాస్యమున మ్రగ్గి బాధతో తప్త యైన
భరతభూమిని స్వేచ్ఛ కాకరము చేయు
చేవ గలుగు మహాత్ముండు కేవలముగ
గాంధి స్వాతంత్ర్యయోధుఁడు గాడు నిజము.

ఆటవెలదిలోని యర్క పంచక మెట్టు
లుండునోయి ఛాత్ర యుదహరించు
మనిన గురున కాత డాడె నీరీతిగా
విజయదశమి వచ్చు విదియనాడు.

వరుస దప్పక తల్లికి తరగతి గల
స్నేహితుల పేర్లు బాలుండు చెప్పుచుండె
వినుము వీరంత నామిత్రు లనిల భాను
అన్న దమ్ములు, రాముఁడు నంగదుండు.

హద్దులు మీరిన హర్షం
బద్దిన ముఖ సీమతోడ నతివలు ఘనులై
ముద్దుగ నాడెడు వేళగు
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్!

వద్దనక సంతసంబున
పద్దెనిమిదిమంది పొరుగు వారలతోడన్
ముద్దగు మతసహనముతో
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్.

అన్నకిట్లు పలికె ననుచిత మిదియంచు
రావణానుజుండు, రాముఁడు కద
రక్ష సేయు నిన్ను రమణి సీతమ్మను
విడిచి నిలుతువేని వినయమునను.

మందబుద్ధి యొకడు మాటల కున్నట్టి
యక్షరాల సమత లరసి పలికె 
,రలు మొదట నుంట నురుతరోత్సాహాన
రావణానుజుండు రాముఁడు కద.

తపము చేయుచు నుండంగ తనను జేరి
ధ్యాన భంగంబు చేయుట మాననట్టి
దుష్టజనముల శిక్షించు త్రోవలోన
మునికిఁ గోపమే భూషణం బనఁగ నొప్పు.

తననుం జేరుచు దుర్మధాంధులగుచున్ దౌష్ట్యంబుతో ధ్యానమం
దనయం బుండగనీక భంగమునకై యత్యంతమౌ యత్నమున్
ఘనమౌ నంచును చేయువారి పనులన్ ఖండించి శిక్షింపగా
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్.

ధర్మ్యం బెంచక నిరత మ 
ధర్మ్యమె యోచించు నరుడు తన్మయు డయి యా 
యూర్మ్యుపమ భంగురంబగు
హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్.


అజ్ఞాన తాడితుండయి
ప్రజ్ఞాలేశంబు గనక బడుగౌ ననుచున్
విజ్ఞాను లనరె యేవిధి
విజ్ఞత లేనట్టి నరుఁడె విజయము నందున్?