Friday 8 February 2019

శ్రీ సర్వేశ్వరీ శతకము.


శ్రీమాత్రే నమః
శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీమద్వేంకటేశాయనమః
శ్రీగురుభ్యో నమః
మాతాపితృభ్యో నమః
శ్రీ సర్వేశ్వరీ శతకము.

శ్రీమంతంబగు నీ చరిత్ర వినుచున్ శ్రీమాత! నీ నామముల్
క్షేమం బంద స్మరించుచున్ విమలురై సేవించ నిన్ జేరి యీ
భూమిన్ శిష్టజనాఖ్యనంది నులై పూజ్యార్హులై యొప్పు నా
ధీమంత ప్రకరంబులన్ గొలిచెదన్ దీవించు సర్వేశ్వరీ!                                               01.

నీపైపద్యశతంబు బల్కు తలపున్ నీవే ప్రసాదించినా
వోపద్మాక్షి! మహేశ్వరప్రణయినీ! యుత్సాహమున్ సత్త్వమున్
దీపిల్లంగ పదార్థశక్తినిడుమా తేజోమయంబైన నీ
రూపంబున్ మహిమల్ నుతించ జననీ! రుద్రాణి! సర్వేశ్వరీ!                                       02.

శ్రీవిఘ్నేశ్వరముఖ్యదేవతలకున్ జేకొట్టి యాచార్యులన్
ధీవైదుష్యభరాత్ములన్ దలచి యీ దేహంబు నందించు స
ద్భావాన్వీతుల దల్లిదండ్రుల నిటన్ బ్రార్థించి యీ సత్కృతిన్
నీవై బల్కగ జేయబూనెద నుమా! నిన్గొల్చి సర్వేశ్వరీ!.                                               ౦౩.

శ్రీమచ్ఛంకరసద్గురుల్ మునివరుల్ శ్రీచక్రసంచారిణీ!
ధీమంతుల్ కవిశేఖరాదులు భవద్దీప్తిన్ సుశబ్దావళిన్
నీమం బొప్ప నుతించియుండిరి మృడానీ! శబ్దశూన్యుండ నౌ
సామాన్యుండను నిన్ను దెల్పువిధి నా శక్యంబె సర్వేశ్వరీ!                                          04.

ఆనన్నయ్యయు తిక్కయజ్వ నుడౌ నా యెర్రనార్యుండు నా
శ్రీనాథుండును బోతరాజముఖరుల్ శ్రేయస్కరం బంచు తా
మీనేలం జిమ్మిన వాక్ప్రకాశమున నేనీవేళ దేలంగ నా
కోనారాయణి! శక్తినిమ్ము దయతో నోతల్లి! సర్వేశ్వరీ!                                               05.



దుర్గా! దుర్గతినాశినీ! దురితహా! దుఃఖార్తినాశంకరీ!
సర్గవ్యాపకధాతృముఖ్యదివిషత్సంస్తూయమానోజ్జ్వలా!
భర్గార్థాంగనివాసినీ! గిరిసుతా! భాగ్యప్రదా! పార్వతీ!
మార్గం బొక్కటి యిమ్ము ధన్యతకునై మాయమ్మ! సర్వేశ్వరీ!                                    06.

నీవే లోకము నిల్పుచుందువు కదా! నిన్నందరున్ దల్లిగా
భావంబందు దలంచుచుండెదరు సర్వవ్యాప్తి నీచేతనౌ
దేవీ! నీకయి నిల్తు నీవలననే దీపిల్లు విశ్వంబిటన్
నీవే త్రాతవు నీకు సన్నుతి నతుల్ నీయందు సర్వేశ్వరీ!                                            07.

సర్వవ్యాపివి నీవు లోకజననీ! సర్వాసంహారిణీ!
దుర్వారామయ సంతతుల్ గలుగగా దుఃఖార్తులైయున్న యీ
యుర్వీసంస్థిత స్వీయభక్తులకు శ్రేయోదాయివై హర్షముల్
పర్వన్ గాచెద వందుమమ్మ ప్రణతుల్ ప్రార్థింతు సర్వేశ్వరీ!                                       08.

నీవే దుర్గవు, లక్ష్మి వీవె జననీ! నీవే కదా వాణియున్
నీవే సర్వశుభప్రదాయివగుచున్ నిత్యంబు లోకంబులన్
గావం జూతువు వత్సలత్వగరిమన్ గాత్యాయనీ! పార్వతీ!
ధీవైదుష్యమొకింత గూర్చుచు ననున్ దీవించు సర్వేశ్వరీ!                                          09.

మాయాతీతవు మాయలోన మనుజుల్ మర్యాదలన్ మీరుచున్
శ్రేయం బెంచక సంచరించుటకు, రాశీభూత పాపమ్ములన్
ధ్యేయంబంచును మూటగట్టుటకు నో దేవీ! మహత్త్వంబు నీ
దేయంచు వచింతు చూపుము దయోద్దీప్తాక్షి సర్వేశ్వరీ!                                             10.

సంసారార్ణవమందు గూల జననీ!సర్వార్థసంపత్తి వి
ధ్వంసంబయ్యెను, చేవజచ్చెను మదిన్ ధైర్యంబు క్షీణించె నా
హింసాతత్త్వము హద్దుదాటె ఛలముల్ హేమాత! స్థైర్యంబుతో
మాంసంబందున చేరియుండె దయతో మన్నించు సర్వేశ్వరీ!                                      11.

అమ్మా! నీదయ జూప వేడుచును నీమాహాత్మ్యంబు స్తోత్రంబుగా
సమ్మోదంబున బాడుచుందును సదా సద్భక్తితో నాకిలన్
సమ్మానంబులు, భాగ్యసంచయములున్ సౌఖ్యంబు లన్నింట గా
దమ్మా! నిత్యము నిన్ను గొల్వగల ధ్యేయం బిమ్ము సర్వేశ్వరీ!                                   12.

నీవే నా జనయిత్రివంచు మదిలో నిత్యంబు నీరూపమే
భావింతున్ సుమనోహరంబయిన నీవాత్సల్యముం గోరుచున్
సేవింతు న్నిను నీ సచ్చరిత్ర మెపుడున్ శ్రేయఃప్రదం బౌటచే
దేవీ! నిష్ఠ బఠింతు నాకు నిడుమా! ధీశక్తి సర్వేశ్వరీ!                                                   13.

నాసూనుండు వివేకహీను డితడున్ నానాప్రకారంబుగా
వాసిం గాంచుట నేర్వనట్టి జను డివ్వానిన్ క్షమాశీలినై
దోసం బెంచక గాచుచుచుందు ననుటల్ దుఃఖంబులం ద్రుంచుటల్
హేసద్భావాఢ్య! భవాని! నీకు తగదా యింపార సర్వేశ్వరీ!                                          14.

ఈయజ్ఞానిని సాధుభావ రహితున్ హేకాళి! కాత్యాయనీ!
స్వీయానందమె గోరువానిని నసచ్ఛీలున్ మదోన్మత్తునిన్
మాయామగ్నుని నన్ను నీభవమునన్ మాన్యత్వముం గూర్చి యా
ర్యా! యెట్లైనను గావగావలె హితం బందించి సర్వేశ్వరీ!                                             15.

నిన్నే నమ్మితి నీపదాబ్జములకున్ నిత్యార్చనల్ సేయుచున్
మున్నేనీభవమందు జేసిన ఘంబుల్ గూలి సద్భావముల్
నన్నంటంగను నిన్ను వేడెద జగన్మాతా! శుభాకారిణీ!
మన్నించందగు దీనునిన్ గిరిసుతా! మమ్మేలు సర్వేశ్వరీ!                                           16.

గణుతిం గాంచితి వమ్మ దేవతలలో కల్యాణరూపా!సదా
యణిమాదుల్ భజియించు భక్తతతికై యత్యంత వాత్సల్యవై
గుణదాయీ! యొసగంగ జూతు వనుచున్ గూర్మిన్ బ్రసాదించుమా
మణిభూషా! కరుణారసంబు జననీ! మాతంగి!సర్వేశ్వరీ!                                            17.

నవరాత్రంబులు నీకటాక్షమునకై నానాప్రకారంబుగా
జవసత్వంబుల నీగదమ్మ యనుచున్ సత్ స్తోత్రముల్ గూర్చుచున్
భవదీయాద్భుత సచ్చరిత్రము సదా పారాయణల్ సేయుచున్
స్తవముల్ చేసెదనమ్మ కావుము ననున్ శర్వాణి! సర్వేశ్వరీ!.                                                18.

జననీ! శాంకరి! సర్వవేదవినుతా! సన్మార్గదా!శాశ్వతా!
దనుజప్రాణహరా! ధరాధరసుతా! దాక్షిణ్యసంపూరితా!
మనుజానీకశుభప్రదా! నిను మహామాయా! మహేశస్థితా!
వనజాక్షీ! ప్రమథాధినాథవనితా! ప్రార్థింతు సర్వేశ్వరీ!                                               19.

అష్టైశ్వర్యము లాసుఖప్రకరముల్ హర్షప్రదంబయ్యు సం
తుష్టిం గూర్చగలేని యుచ్చపదముల్ తోరంబులౌ సన్నుతుల్
కష్టం బింతయులేని జీవనగతుల్ కాలేవు సాదృశ్యముల్
స్పష్టం బియ్యది నీపదాంబువులకున్ సత్యంబు సర్వేశ్వరీ!                                         20.

తల్లీ! నీపదపద్మ సన్నిధికి సద్భక్తిన్ సమీపించనౌ
యుల్లంబున్ సతతంబు నాకిడుచు నన్నుత్సాహవారాశిలో
ఫుల్లాబ్జానన! ముంచుమా కరుణతో పోకార్చి యజ్ఞానమున్
కల్లల్గావది నాయదృష్టమగునో కామాక్షి! సర్వేశ్వరీ!                                                  21.

సవ్యంబైన మనంబు సన్నుతలసత్సద్వాక్య సంపత్తియున్
దీవ్యద్భావము కర్మకౌశలమికన్ ధీరత్వ మన్నింటిలో
భవ్యంబైన ప్రయత్నదీప్తి నిడి సర్వైశ్వర్య తుల్యంబుగా
నవ్యానందము గాంచు శక్తి నిడుమా నాతల్లి! సర్వేశ్వరీ!                                             22.

సంసారార్ణవమందు గూలితి నిటన్ సర్వంబు నిస్సారమై
హింసామార్గము బట్టు కారణముగా నెప్పట్టునం జూచినన్
కంసుంబోలు మనస్స్థితిన్నిలుపుచున్ క్రౌర్యంబు నింపెం గదా
ధ్వంసం బయ్యెను దేహ మంటుకొనియెన్ దైన్యంబు సర్వేశ్వరీ!                                   23.

మల్లెల్మొల్లలు పంకజాది సుమముల్ మాణిక్యహారంబు లా
యుల్లాసంబును గూర్చు గంధములు సర్వోత్కృష్ట సారంబులున్
తల్లీ! నీపదజాతధూళిసమతన్ దారందగాలేవు నే
నొల్లన్ బూజకు వానినంద నతి నీ కోయమ్మ సర్వేశ్వరీ!                                             24.

ఈదేహంబును యౌవనంబు భువిలో నిష్టార్థసంప్రాప్తియున్
మోదం బందగ జేయు బాంధవములున్ మూన్నాళ్ళ ముచ్చట్లె పో
ఖేదస్థానములంచెరింగి జననీ కేల్మోడ్చు చున్నాడ నా
మీదం జూపుము త్వత్కృపన్ తనయుడన్ మీనాక్షి! సర్వేశ్వరీ!                                   25.

నీమాహాత్మ్యము వర్ణనీయము భువిన్ నిత్యంబు నీభక్తులన్
క్షేమంబుల్ గలిగించి గాచు విధముల్ కీర్తిప్రసారంబుతో
నామౌన్నత్యము గూర్చుచుండు గతులున్ నానాప్రకారంబుగా
శ్రీమాతా! నుతి కర్హముల్  నిజముగా చిద్రూప! సర్వేశ్వరీ!                                         26.

భక్తిన్ వందన మాచరింతు జననీ! పాదార్చనల్ సేతు నా
సక్తిన్ నీ కథలెల్లవేళల బఠించన్ బూను నన్ గావగా
యుక్తంబౌగద యాలసించదగునా? యోగ్యుండ గానేమి? వే
దోక్తప్రాభవ! మోక్షదాయిని! వరీయోదార! సర్వేశ్వరీ!                                                          27.

సర్వవ్యాపివి నీవు లోకజననీ! సర్వేశ్వరానందినీ!
సర్వారాధ్యవు భక్తయోగిగణముల్ సర్వత్ర నీనామమున్
సర్వోత్కృష్టముగా దలంతురు గదా సద్భాగ్య మందంగ నో
సర్వామ్నాయనుతా! జయంబు లిడగా జాగేల సర్వేశ్వరీ!                                          28.

శ్రీదుర్గా! భ్రమరాంబికా! సకలదా! చిద్రూప! కాత్యాయనీ!
నాదౌ విన్నప మాలకించి యెటులైనన్ జిత్త నైర్మల్యమున్
నీదాక్షిణ్యము జూపి నాకొసగుమా నీకన్న నాకెవ్వరున్
లేదొక్కర్తుక బ్రోచుతల్లి జగతిన్ లేదెందు సర్వేశ్వరీ!                                                  29.

పరమేష్ఠ్యాది సురప్రకాండులు మునుల్ పాండిత్యభూషాఢ్యులౌ
నరసంఘంబులు నీమహత్వగరిమన్ నానాప్రయత్నంబులన్
బరిశీలించి యెరుంగలేరు గద నే బాపాత్ముడన్ మూఢుడన్
దరమా నిన్ దెలియంగ నాకు గొనుమా దండంబు సర్వేశ్వరీ!                                       30.

ధరణిన్ జీవనకాలమింతయనుచున్ ధైర్యంబుగా జెప్పలే
మరయంగా నిది బుద్బుదంపు నిభమై యంతంబునుం గాంచు నే
కరణిన్ నిల్వదు గాన నీకు నెపుడున్ గైమోడ్చి యర్చించు సు
స్థిర చిత్తంబు నొసంగు మో జనని! నిన్ సేవింతు సర్వేశ్వరీ!                                          31.

దైత్యున్ దుష్టుని హుంకరించి యనిలో దాక్షాయణీ! ద్రుంచిన
ట్లత్యంతంబుగ నేడు సర్వజగతిన్ హాహాకృతుల్ నింపుచున్
నిత్యంబై నటియించు స్వార్థగత దుర్నీతిన్ మదోన్మత్త దు
ష్కృత్యప్రాభవమున్ కుదించ గొనుమా జేజేలు సర్వేశ్వరీ!                                         32.

ధ్యానం.
శ్రీమాతా! జగదీశ్వరీ! శివసతీ! చిద్రూపిణీ! పార్వతీ!
క్షేమాకారిణి! యంబికా! గిరిసుతా! కీర్తిప్రదా! శాశ్వతా!
కామార్యర్ధశరీరిణీ! మునినుతా! కైవల్యసంధాయినీ!
చాముండా! యని నిన్ దలంతు నెపుడున్ సావిత్రి! సర్వేశ్వరీ!                                     33.
ఆవాహనమ్
గిరిజా! రమ్మిదె నేడు నీకొరకునై కేల్మోడ్చి యున్నాడ నో
సురసంఘార్చితపాదపద్మసుమహచ్ఛోభాఢ్య! నీవీయెడన్
గరుణన్ జూపి వసించుమమ్మ శుభసత్కామ్యార్థదా! నీకునై
విరచింతున్ బలు సేవలన్ గొనవలెన్ వేగంబు(గొనుటకై విజ్ఞప్తి) సర్వేశ్వరీ!                       34.

నాచిత్తంబున నిన్ను నిల్పి స్తుతులన్ నానాప్రకారంబుగా
నోచిత్సౌఖ్యద! గొల్వబూనితిని నీ వోభక్తచింతామణీ!
యీచిత్రంబున నిల్వు మంతదనుకన్ హేగౌరి! కామేశ్వరీ!
యేచింతల్ మది సేయకుండ స్థిరవై యీవేళ సర్వేశ్వరీ!                                              35.
ఆసనమ్.
దివ్యంబైన శుభాసనంబు జననీ! దేదీప్యమానంబులై
నవ్యత్వంబు వహించియున్న మణులన్ నారాయణీ! యందులో
సవ్యంబౌ గతి నద్ది కూర్చితిని హే సంతోషసంధాయినీ!
దీవ్యద్వైభవ! స్వీకరించుము సుగాత్రీ! గౌరి! సర్వేశ్వరీ!                                             36.
పాద్యం,అర్ఘ్యం,ఆచమనీయం
తల్లీ! నీపదపద్మ హస్తయుగళిన్ దైత్యఘ్న! నీమోమునన్
ఫుల్లాబ్జాసనముఖ్యదేవవినుతా! పూజ్యార్హ మౌనట్లు రా
జిల్లం గల్గు జలంబు నిచ్చుటకునై శ్రీమాత! నేదెచ్చితిన్
జెల్లున్ నీకు గ్రహించ నీయుదకముల్ శీఘ్రంబు సర్వేశ్వరీ!                                          37.
పంచామృతం
క్షీరంబుల్ ధధియున్ ఘృతంబు లివిగో శ్రేష్ఠంబులౌ గవ్యముల్
గౌరీ! నీకిట భక్తితో నిడుటకై కాంక్షించుచున్నాడ నా
నేరం బెంచక తేనె శర్కరలతో నీవంది పంచామృతం
బూరూరన్ శుభసంతతుల్ చిలుకుమా! యొప్పార సర్వేశ్వరీ!                                     38.
స్నానం.
ఇది గంగాది విశిష్ట నిమ్నగలలో నేవేళనున్ పూతమై
సదయా! పారు జలంబు నీకు నిపుడున్ స్నానార్థమై దెచ్చి నీ
పదపద్మంబుల ముందు నుంచితి నుమా!  ప్రార్థింతు నిద్దానిన్
ముదముం జూపుచు స్వీకరింపుమని యామోదించు సర్వేశ్వరీ!                                  39.
వస్త్రము
పలువర్ణంబుల నున్న వస్త్రతతులన్ బంగారు పెద్దంచుతో
వెలుగుం జిమ్మెడి రత్నసంయుతములై విస్తారమౌ శోభకున్
నెలవై యున్నటువంటివానిని మహన్నిష్ఠన్ సమర్పించగా
లలితా! నీకెడ నుంచినాడ గొని నన్ రక్షించు సర్వేశ్వరీ!                                              40.
గంధము
శ్రీగంధం బిది చందనాఖ్యమున సచ్ఛ్రీలందగా జేయుచున్
జాగృద్భావము కల్గజేసి మదులన్ సంతోషమన్ డోలికన్
తూగం జేసెడి దౌట చేకొని భువిన్ తోరంపు సత్కార్యముల్
సాగం జూడుము తల్లిరో యనుచు బ్రస్తావింతు సర్వేశ్వరీ!                                         41.
కుంకుమాదికము.
పసుపుం గుంకుమ మక్షతాదికములున్ భవ్యంబులై వెల్గు నీ
కుసుమాళిన్ బహువర్ణ సంయుతములన్ పద్మాక్షి! సద్భక్తితో
లసదానందవిధాయినీ! పలువిధాలన్ గూర్చి యున్నాడ హే
వసుదా! యంది మదీయ భక్తుడని నన్ పాలించు సర్వేశ్వరీ!                                       42.
నామార్చన
ఎన్నోరూపములంది యీపుడమిపై నెన్నేని నామంబులన్
మన్నించందగురీతి నుండెదవు సన్మార్గంబు జూపించి మా
కన్నింటన్ జయ మందజేయ జననీ! ఆదివ్యనామంబులన్
నిన్నుం గొల్చెద త్వత్కృపార్థినగుచున్ నిత్యంబు సర్వేశ్వరీ!                                     43.

గౌరీ! హైమవతీ! శివా! భగవతీ! కామాక్షి! కామేశ్వరీ!
ఘోరాఘంబుల బాపుతల్లి! యఖిలక్రూరారిసంహారిణీ!
నీరేజాప్తసహస్రదీప్తిసహితా! నిత్యోత్సవా! నిర్మలా!
కారుణ్యామృతవర్షిణీ! శివసతీ! కైమోడ్తు సర్వేశ్వరీ!                                                  44.

శత మష్టోత్తరసంఖ్య నాపయిని నీ సాహస్రనామంబులం
దతులానందముతో "నమో" యనుపదం బన్నింట జోడించి
న్మతి "నోం"కారము పూర్వమం దిడుచు దీనారాధ్య! పూజించెదన్
నతులమ్మా! గిరికన్యకా! శుభములన్ నాకిమ్ము సర్వేశ్వరీ!                                         45.
ధూపం
దీవ్యద్భవ్యవనస్పతీభవములై దీప్తప్రభావంబులై
నవ్యానేకసుగంధపూరితములై నానాప్రకారంబులౌ
సవ్యానూనములైన వస్తుతతులన్ సాధించి ధూపార్థమై
యవ్యాజంబగు భక్తి దెచ్చితిని నీకందింతు సర్వేశ్వరీ!                                                46.
దీపమ్
గవ్యంబైన ఘృతాన దీపశిఖలన్ గల్పించి నీముందటన్
సవ్యారాధనపద్ధతిన్ నిలిపితిన్ సర్వప్రపంచంబునం
దే వ్యత్యాసము కల్గకుండ ద్యుతిదాయీ!దీప్తులన్ బంచుమా!
కావ్యాదుల్ నుతియించు నీమహిమలన్ కైమోడ్చి సర్వేశ్వరీ!                                       47.
నైవేద్యము
భోజ్యంబుల్ వరపాయసాన్న వితతుల్ పూర్ణంబులున్ భక్ష్యముల్
సాజ్యంబుల్ దధిచోష్యసంయుతములై సంతృప్తినిం గూర్చు నో
పూజ్యా! వీనిని స్వీకరించి ధరపై పూర్ణానురాగంబు నీ
రాజ్యంబందున నిల్పుమా హృదయముల్ రంజిల్ల సర్వేశ్వరీ!                                     48.
తాంబూలమ్.
తాంబూలార్థము నాగవల్లికములౌ తారుణ్యపత్రంబులం
దంబా! పూగఫలంబులుంచి విధిగా నాపైని కర్పూరముల్
సాంబున్ చిత్తమునందు నిల్పి యిడెదన్ సర్వార్థముల్ గూర్చు హే
రంబక్షేమకరీ! కొనంగ నిను నే బ్రార్థింతు సర్వేశ్వరీ!                                                  49.
దక్షిణ
బంగారంబున పుష్పసంచయములన్ భవ్యంబుగా నమ్మరో
సంగీతప్రణుతా! నతానుగహితా! సర్వామరప్రార్ధితా!
రంగారంగరచింపజేసి శివసామ్రాజ్ఞీ! యిటన్ దెచ్చి నా
నంగీకారము దక్షిణల్ గొనగ నీ వందించు సర్వేశ్వరీ !                                                50.
నీరాజనం
కర్పూరాత్తములైన వర్తికములన్ కల్యాణదాయీ! శివా!
సర్పాభూషణదేహసంస్థిత! మహాసౌందర్యరాశీ! యఘం
బార్పన్ సౌఖ్యము గూర్ప గోఘృతముతో హర్షాన వెల్గింతు నీ
కర్పింతున్ గొని జ్ఞానదీప్తి నిడుమం చర్థింతు సర్వేశ్వరీ!                                             51.
మంత్రపుష్పం
మంత్రోక్తంబగు పుష్పరాజి సురసమ్మాన్యా! జగం బందునన్
సంత్రాసం బణగంగ జేసి స్థిరతన్ సంధించ నర్పించెదన్
యంత్రాధిష్ఠితచక్రరాజనిలయా! ఐశ్వర్యదాయీ! మహ
త్తంత్రాద్యర్చిత! గూల్చుమా జగమునన్ దైన్యంబు సర్వేశ్వరీ!                                    52.
ప్రదక్షిణనమస్కారము
ఏయేపాపము లీభవంబునను నింకేమేమి కర్మంబులం
దేయేజన్మములందు జేసితినొ నీ కీవేళ సద్భక్తితో
"జే"యంచేను ప్రదక్షిణత్రయమిటన్ జేతున్ సమస్తాముల్
న్యాయంబెంచి హరించు మమ్మ యని నిన్నర్థింతు సర్వేశ్వరీ!                                     53.
క్షమార్పణ
వేదజ్ఞానము లేదు శాస్త్రచయసద్విజ్ఞానమం దింతయున్
లేదేవైదుష్యము పూజసేయు ఫణుతుల్ లెక్కించ లేనమ్మరో
చాదస్తం బనుకోక నాదు దొసగుల్ సైపంగ నిన్వేడెదన్
నీదేభారము కావగా సుతుని నన్ నిక్కంబు సర్వేశ్వరీ!                                               54.
హే లోకేశ్వరి! సర్వశాస్త్ర వినుతా! హేగౌరి! కాత్యాయనీ!
పాలించంగను రాగదమ్మ జననీ! త్వద్భక్తులన్ బ్రేమతో
శ్రీలాలిత్యము గూర్చుచుండి నిరతశ్రేయంబు లందించగా
ప్రాలేయాచలకన్యకా! యనుచు నిన్ బ్రార్థింతు సర్వేశ్వరీ!                                         55.

నీవే లక్ష్మివి వాణివీవె జననీ!  నీహారగోత్రాత్మజా!
వైవిధ్యం బిట రూపమందు గనుచున్ బ్రార్థింతు రీ నేలపై
నీవాత్సల్యము జూపి భక్తులపయిన్ నిత్యంబులౌ హర్షముల్
భావింపందగు శక్తి గూర్చు మముల్ వారించి సర్వేశ్వరీ!                                         56.

దైవం బన్నది లేదటంచు మహదౌద్ధత్యంబుతో నిచ్చలున్
భావం బందున నంధకారపటలుల్ పర్వంగ నున్మత్తులై
యావేశంబున బల్కువారలకు యోగ్యంబైన సంస్కారముల్
నీవందించుము వాస్తవం బెరుగగా  నిన్గొల్తు సర్వేశ్వరీ!                                                57.

దైవంబున్ నిరసించి దుష్టమతులై తారే మహాశక్తులై
భావంబందు నహంకరించి జగతిన్ బల్మాటలన్ బ్రేలుచున్
కైవల్యప్రద! సంచరించు జనులన్ కారుణ్యముం జూపుచున్
దేవీ! రక్షణ సేతువేల? నదీప్తిం బొంద సర్వేశ్వరీ!                                                   58.

తల్లీ! నాకిడుమమ్మ భాగ్యచయముల్ ధాన్యాది సంపత్తులా
యెల్లైశ్వర్యము లంచు నజ్ఞతను నిన్నెన్నేని స్తోత్రంబులన్
ఫుల్లాబ్జానన! కోరుచుందునుగదా! పుత్రుండనౌ నాకు నిం
దుల్లాసంబుల కైన దీవెరుగవే? యోయంబ! సర్వేశ్వరీ!                                               59.

నీమాహాత్మ్య మనంత మద్భుతము, దానిం జెప్పగా శక్యమే
శ్రీమద్ధాతృజనార్దనప్రముఖరాశీభూతగీర్వాణ నా
నామౌనీంద్ర సుధీంద్ర సంములకైనన్ నేను సామాన్యుడన్
శ్రీమాతా! కరుణించుమా! గిరిసుతా! "జే"యందు సర్వేశ్వరీ!                                      60.

మునులున్ దేవగణంబు లెల్లయెడలన్ మోదంబునుం బొందగా
జననీ! నీపదసేవ చేయుదురు విశ్వవ్యాప్తమై యొప్పు నీ
ఘనదీప్తిన్ నుతియించు దీక్ష గొనుచున్ కల్యాణముల్ గాంతు రే
యనుమానంబును లేదు కావు మని నిన్నర్థింతు సర్వేశ్వరీ!                                        61.

ఈ విశ్వంబు త్వదీయ సద్రచనయే యిందందు నీరూపమే
యేవేళన్ భవదాజ్ఞ లేక జగమం దేకార్యముల్ సాగబో
వావైకుంఠాదులు నీయధీనులయి సవ్యంబైన రీతిన్ విధుల్
చేవం జూపుచు నిర్వహింతురుగదా! శ్రీమాత! సర్వేశ్వరీ!                                         62.

ఏనామంబున నిన్నుగొల్వవలెనో యీ భూమిపై జూడగన్
హే నారాయణి! సర్వలోకవినుతా! హే పార్వతీ! శాంభవీ!
జ్ఞానానందమయీ! శివా! సదభిధాసాహస్రముల్ దాల్తు వే
నానందంబున "మాత"యంచు దయసేయం బిల్తు సర్వేశ్వరీ!                                     64.

శ్రీమాతా! ననుగావుమంచు బిలువన్ క్షేమంబులం గూర్చగా
భూమిన్ జేరుదువమ్మ! నీదు భక్తతతులన్ పుణ్యాత్ములన్ జేయుచున్
నామౌన్నత్యము జూపుదానవగుచున్ నానాప్రకారంబుగా
ప్రేమన్ బంచుచు దుఃఖ సంము లిలన్ భీతిల్ల సర్వేశ్వరీ!                                         64.

అష్టైశ్వర్యము లిమ్మటంచడుగబో నమ్మా! సమస్తాముల్
కష్టంబుల్ దొలగించి కావు మనుచున్ కైమోడ్చుచున్నాడ సం
తుష్టిం గల్గినదానితోడ గను సద్బుద్ధిం బ్రసాదించి నా
కిష్టంబైన త్వదర్చనాస్పృహను నీవిప్పించు సర్వేశ్వరీ!                                             65.

ఈ లోకంబున సర్వసంపదలతో నెన్నేని సౌఖ్యంబులె
ప్డాలోకించుచు నుండు నొక్కడిట, నేయానందమన్మాట లే
కాలంబందున జూడలేక బహుదుఃఖంబుల్ భువిన్ లేమి నే
వేళం గాంచుట కేమి కారణము భావింపంగ సర్వేశ్వరీ!                                               66.

హెచ్చుల్ తగ్గులు జాతికారణముగా నీ నేలపై గాంచుచున్
సచ్చారిత్రము జూడకుండ జనులన్ సర్వప్రకారంబులన్
నిచ్చల్ గుందగ జేయు మూఢులు భవానీ! నీదు సంతానమే
యిచ్చోనున్న జనంబులం చెరుగబో రిందేల? సర్వేశ్వరీ!                                          67.

నీతుల్ సెప్పుచు, నిష్ఠలన్ దెలుపుచున్ నిర్మాయికత్వంబు నో
మాతా! చూపుచు విశ్వసించు జనులన్ మన్నించగా లేని వ్యా
ఘాతప్రాప్తికి ద్రోయునట్టి ఖలులన్ గాండ్రించి దండించుచున్
భీతిం గూర్చగ వ్యాఘ్రమున్ బనుపుమా విందౌను సర్వేశ్వరీ!                                      68.

నిత్యం బన్నిట జేయు కార్యములలో నిస్స్వార్థభావంబుతో
సత్యంబున్ గ్రహియించి లోకహితమున్ సమ్యగ్విధానంబునన్
ప్రత్యక్షంబుగ జూపువారలగు నీభక్తుల్ సదా గాంచరే
యత్యంతంబగు సౌఖ్యసంపద భువిన్ హర్షంబు సర్వేశ్వరీ!                                         69.

నానామంత్రములేల నిన్ను గొలువన్ నైర్మల్యతన్ చిత్తమం
దానందంబున దాల్చుచుండి "జననీ! యందింతు దండంబులన్
దీనున్ గావు"మటంచు మ్రొక్కిన మహద్దీప్తిన్ బ్రసాదించవే
జ్ఞానం బందగ జేయవే సతతమున్ సత్యంబు సర్వేశ్వరీ!                                            70.

పుత్రుల్ వీరలు నాకటంచు సుఖముల్ పొందన్ కటాక్షంబు నీ
వాత్రం బందుచు జూపుచుండ నరులా యన్యామర శ్రేణులన్
స్తోత్రంబుల్ గొని చేరుచుండుట మహచ్ఛోభ్యాఢ్యమౌ  హేమమున్
ధాత్రిం గాంచక యిన్మునందు విధమౌ తథ్యంబు సర్వేశ్వరీ!                                       71.

దానంబుల్ పలుచోట్ల చేయుటయు, విద్యావ్యాప్తికై శాలలన్
జ్ఞానస్థానములన్ రచించుటయు, విస్తారంబుగా ధర్మ కా
ర్యానేకంబును చేయుచుండుటయు మాయాతీత! నిన్గాంచు స
న్మానాదృష్టము పొందగోరుట వినా నాన్యంబు సర్వేశ్వరీ!                                          72.

ముక్తిం జూపగ వేడుచుంటి నిచటన్ మున్నీభవం బందునన్
యుక్తాయుక్తము లెంచకుండ ననిశం బున్మాదినై పల్కు దు
ర్యుక్తుల్ గాంచక యజ్ఞతన్ దునిమి సద్యోగంబులం గూర్చ నా
సక్తిం జూపుము తల్లి యందు వినుమా! సర్వత్ర సర్వేశ్వరీ!                                         73.

తల్లిన్ దండ్రిని కట్టుకున్న పడతిన్ తథ్యంబుగా పుత్రునిన్
సల్లాపంబుల దేల్చి వర్తనమునన్ సవ్యత్వ మేవేళ సం
ధిల్లంజేసెడి మిత్రునిన్ దలపడీ దేహాన స్వార్థమ్మునం
దుల్లాసంబును జూపు మానవుడు  తా నున్మాది సర్వేశ్వరీ!                                                  74.

కవితా వేశము నిత్యనూతనముగా కల్గంగ నాకెప్పు డో
స్తవనీయాద్భుత సన్మహత్వచరితా! ధన్యత్వముం బొందున  
ట్లవనిం గొల్చెడి భక్తి భావ మిడుమా!హర్షాన్వితస్ఫూర్తితో
భవదారాధన చేతునమ్మ! యది నా భాగ్యంబు సర్వేశ్వరీ!                                                   5.

శ్రేయం బందగ జేయునట్టి దగుచున్ క్షేమంకరంబైనదై
స్వీయంబై వెలుగొందు ధర్మముపయిన్ చిద్రూపిణీ! నాకు నీ
వాయాసం బిటలేని శ్రద్ధను సదా యందించి రక్షించుమా
నీయాజ్ఞన్ శిరసా వహించు సుతునిన్ నిన్గొల్తు సర్వేశ్వరీ!                                             76.

వేదప్రోక్తములైన ధర్మముల కీ వేళన్ జగంబందునన్
లేదొక్కింతయు ప్రాపకంబు కని నీలీలన్ ప్రదర్శించుచున్
మోదంబందగ నూత్నవైభవమికన్ ముమ్మాటికీవే యిటన్
నేదంపూర్వవిధాన గూర్చవలయున్ నిక్కంబు సర్వేశ్వరీ!                                          77.

సత్యంబాడుట, నిత్యకృత్యములలో సర్వప్రయత్నంబునన్
ప్రత్యక్షంబగు ప్రేమజూపుటయు, సద్భావంబులన్ జిత్తమం
దత్యంతాదరమొప్ప దాల్చుటయు మోటయ్యెం గదా నేడు యీ
వ్యత్యాసంబును మాన్పుమా యనుచు నిన్ బ్రార్థింతు సర్వేశ్వరీ!                                 78.

నిత్యంబయ్యె జగాన సాధుజనులన్, నిర్దోషులన్, కాంతలన్
భృత్యశ్రేణి ననాథదీనజనులన్ భీతిల్లగా జేయుటల్
ప్రత్యక్షంబుగ రౌరవానుభవముల్ ప్రాప్తింపగాజేయు నీ
దైత్యాహంకృతి మాన్పనీకు నిదియే దండంబు సర్వేశ్వరీ!                                           79.

సాహిత్యంబు సమాజ సన్నిహితమై సర్వార్థసంపత్తులన్
దేహంబందున ధర్మవర్తనకునై దీవ్యత్ ప్రభావస్థితిన్
మోహావేశము ద్రుంచి యన్నిటను సమ్మోదంబు గూర్చుక్రియన్
బాహాటంబుగ జేయు శక్తి నిడ నిన్ బ్రార్థింతు సర్వేశ్వరీ!                                             80.

కర్తవ్యంబున నిష్ఠతో నిలుచుచున్ కాఠిన్యతాప్రాప్తిలో
నార్తిం బొందనిరీతి ధైర్యమును నాకందించి సర్వత్ర సత్
కీర్తిం గాంచు నదృష్టమీయగ నినున్ గీర్తింతు దివ్యోజ్జ్వల
న్మూర్తీ! హైమవతీ! కృపన్ దెలుపు మామోదంబు సర్వేశ్వరీ!                                       81.

ప్రాభాతంబున లేచి నీమహిమలన్ బ్రాజ్ఞత్వముం బొందగా
నోభాగ్యప్రద! పాడబూను విధిలో నొప్పారు చిత్తంబులన్
శోభిల్లంగను జేయుమమ్మ భువిలో స్తుత్యర్హతన్ గాంచుచున్
నీభక్తుల్ వెలుగొందురీతి నుతులన్ నీవంది సర్వేశ్వరీ!                                                82.

వేదస్థానముగా, సుధర్మనిధిగా, విజ్ఞానసంపూర్ణగా
నాదబ్రహ్మముగా, మునీంద్ర భువిగా నానావిధ ప్రాభవం
బీదేవప్రాంతము భారతావని గనెన్ హే మాత! నేడిచ్చటన్
తాదృగ్వైభవదీప్తి సన్నగిలె వేదారాధ్య! సర్వేశ్వరీ!                                                    83.

యజ్ఞాదిక్రతువుల్ ప్రపంచహితకృద్యాగాది సత్కర్మలున్
ప్రాజ్ఞుల్ నేర్పిన పద్ధతుల్ వ్రతములున్ వాసిన్ తిరోగాములై
యజ్ఞత్వంబతులామయంబులకు తానందెన్ బ్రధానత్వ మే
విజ్ఞానంబును జూపి కావగలవో ప్రేమార్ద్ర! సర్వేశ్వరీ!                                                84.

నేతల్ నేటి యుగాన స్వార్థమునకై నిష్ఠన్ బ్రదర్శించుచున్
నీతిం గాంచక విత్తసంకలనమే నిత్యోక్త కర్మంబుగా
చేతంబందున నెంచి దేశమునకై క్షేమంబులం గూర్చగా
బ్రీతిం బూనరు యత్నమైన జననీ! వేయేల సర్వేశ్వరీ!                                              85.

నారీలోకము నేడు మారె జగతిన్ నానాప్రకారంబులౌ
క్రూరాకార విచిత్ర వేష ధరులై కోల్పోయి రౌన్నత్యమున్ 
తారాస్థాయికి జేరె నేహ్యతయు  నేతత్తీవ్రతన్ గాంచి య
వ్వారిన్ వస్త్ర వివేక శూన్యతకునై  వారించు సర్వేశ్వరీ!                                              6.

బాల్యంబన్నది జీవనంబున గనన్ భాగ్యాన్వితంబౌచు స
న్మూల్యంబుల్ భవితవ్యసద్రచనకై పూర్ణానురాగంబుతో
తుల్యం బన్నది లేనిరీతి నిలుపున్ దుఃఖంబు చిన్నారులన్
లౌల్యం బందగ కర్మలందునుచుటల్ రక్షించు సర్వేశ్వరీ!                                            87.

వన్యంబుల్ బహుపత్రశాకచయముల్ భవ్యంబులౌ భక్ష్యముల్
ధాన్యంబుల్ ఫలముల్ సదా భువిపయిన్ తన్విన్ బ్రసాదించగా
నన్యం బెంచుచు భోజనార్థ మిచటన్ హా ప్రాణులన్ జంపుటల్  
మాన్యం బెట్టుల యౌను దీని గనుమమ్మా! నీవు సర్వేశ్వరీ!                                         88.

నవ్యోత్సాహము ధర్మరక్షణకునై నానావిధస్ఫూర్తితో
భవ్యంబౌగతి భూజనాళి హృదులన్ వర్ధిల్లగా నిచ్చటన్
దీవ్యద్వ్యైభవదీప్తులెల్లయెడలన్ దీపిల్ల నీనేల స
త్కావ్యంబుల్ విలసిల్లు భాగ్యమెపుడున్ గల్గించు సర్వేశ్వరీ!                                       89.

కాషాయంబు ధరించి లోకగతులన్ ఖండించగా నెంచుచున్
రోషావేశము కూడదంచు నటనల్ రుచ్యంబుగా జేయుచున్
ద్వేషోద్రిక్తతతో నటించుచు స్మరాధీనాత్ములౌచున్ మణుల్
భూషల్గోరెడి మోసకాండ్ర నణచన్ బోవేల? సర్వేశ్వరీ!                                               90.

విద్యాలేశము లేదు నైతిక లసత్ విజ్ఞాన మొక్కింతయున్
సద్యస్స్ఫూర్తియు సాధురక్షణమునన్ సాధించు యత్నంబికన్
హృద్యంబైన చరిత్ర చూడ కనరా దీనేల బాలించగా
నాద్యత్వంబు వహింత్రు నేతలు సుఖం బందంగ సర్వేశ్వరీ!                                        91.

వేదస్తుత్య! సమస్తమంత్రనిహితా! విజ్ఞానసంపత్ర్పదా!
నాదాభ్యర్చితపాదపద్మయుగళీనవ్యోజ్జ్వలా! శాంకరీ!
నీదేభారము సాధుసంగమమునన్ నిత్యోత్సవంబౌ గతిన్
పేదన్నీసుతు నన్ను గావు మిది నా విజ్ఞప్తి సర్వేశ్వరీ!                                                           92.

క్రూరాత్మున్ మహిషాసురాఖ్యుననిలో ఘోరంబుగా జంపిన
ట్లీరాజ్యంబున తాండవించుచు స్వకీయేచ్ఛావిహారంబునన్
ధీరత్వంబును గూల్చుచున్న యవినీతిన్ గూల్చుమోయమ్మ! నీ
పారీణత్వము చాటుమమ్మ! యనుచున్ బ్రార్థింతు సర్వేశ్వరీ!                                    93.

దేశక్షేమము గోరి సర్వగతులన్ దేహాత్మలన్ నిత్య మా
యీశానానాంకిత మొందజేయు జనులన్ హే పార్వతీ! ధైర్యముల్
నాశం బందనిరీతి గావవలయున్ నమ్మించి యవ్వారిలో
ధీశక్తిన్ వెలుగొంద జేయుపని నీదేయందు సర్వేశ్వరీ!                                                 94.

అత్యంతంబగు భక్తితోడ సతతం బత్యుగ్రనిష్ఠాత్ములై
ప్రత్యక్షం బగుమమ్మ యంచు నులౌ భక్తాగ్రణుల్ గొల్తు రౌ
సత్యం బియ్యది నిష్ఠలేని ఖలుడన్ సందేహమే లేదు నా
కృత్యంబుల్ క్షమియింతువా? యెటులనో కీర్తింతు సర్వేశ్వరీ!                                      95.

ఈనేలన్ భవదర్చనామహిమయే యీజీవనంబందునన్
వేనోళ్ళన్ బలికించు వైభవరుచుల్ విస్తారమౌనట్లుగా
నానందంబు లభించునట్టు లిడు నే నామార్గమే యెంచితిన్
దీనారాధ్య! తథాస్తు పొమ్మనుచు నన్ దీవించు సర్వేశ్వరీ!                                        96.

ఏజన్మంబున చేసినానొ సుకృతుల్ హేకాళికా! యిచ్చటన్
ధీజాడ్యంబును పారద్రోలగల నీదీవ్యత్ కటాక్షంబు నా
కీజన్మంబున నందగల్గు స్పృహ తా నిప్పట్టునన్ గల్గె నే
నాజీవంబుగ గొల్తు నిన్ను హరుసం బందించు సర్వేశ్వరీ!                                           97.

నిన్నుం గొల్చుచు నీకటాక్షమునకై నిత్యంబు నిష్ఠాయుతిన్
మన్నింపందగురీతి మానసమునన్ మాహేశ్వరీ! భావనల్
నన్నుం జేరిన జాలు నీ భవమునన్ నాన్యంబు కాంక్షించ నా
పన్నామయదూరిణీ! యదియగున్ భాగ్యంబు సర్వేశ్వరీ!                                          98.

అరుదైనట్టి భవంబు నీ జగతిలో నందించి యున్నావు సు
స్థిర భావంబున నిన్ను గొల్వగల శక్తిన్ బ్రసాదించుచున్
పరమానందము పొందు భాగ్యమిడ నిన్ బ్రార్థింతు నీనేలపై
వరమన్నింట నదేయగున్ శుభములన్ బండించు సర్వేశ్వరీ!                                       99.

భావంబందున నిన్ను నిల్పి సుమహద్భక్తి ప్రభావంబునన్
సేవించందగు స్థైర్యమిచ్చి భవదాశీఃపూర్ణవాత్సల్య మిం
దేవేళన్ గను యోగ్యతావిభవ మందించంగ నిన్వేడెదన్
నీవే కాచెడి దానవౌట కొలుతున్ నిత్యంబు సర్వేశ్వరీ!                                      100.

నాదేశంబిది పుణ్యభూమి జననీ నైర్మల్యతాశక్తికిన్
ప్రాదుర్భూత మమత్వదీప్తి కిరవై ప్రఖ్యాతినిం గన్న దీ
మోదాకారిణి సస్యసంభరితయై మున్ముందు సర్వత్ర న
చ్ఛోదాఢ్యత్వము గాంచ జూడవలె నీవోయమ్మ సర్వేశ్వరీ!                               101.

జీవాధారములైన వస్తుతతు లాశించన్ నభస్పర్శతో
భావంబందున జిక్కకున్కి శుభభావా! పేదసంసారముల్
దైవాధారములయ్యె సత్వమణగెన్ దారిద్ర్య భూతంబు ని
త్యావాసంబును చేయుచుండె దయరాదా కావ సర్వేశ్వరీ!                                102.

నీపుత్రుండను గాన నిర్భయముగా నీపైని స్వాతంతంత్ర్యమున్
చూపించంగను బూని పెక్కు గతులన్ చోద్యంబులౌ కోరికల్
పాపాకారుడనయ్యు దెల్పెద నుమా! పాలించుమా త్వత్కృపన్
నాపై చూపి వివేకమున్ గరప నానందంబు సర్వేశ్వరీ!                                       103.

అమ్మాయంచును కోరమేని జననుల్ హర్షంబుతో వాంఛితం
బమ్మా! దీర్చరటన్న మాట నిజమే యైనన్ ప్రపంచంబునం
దమ్మల్ గొల్చెడి యమ్మ వీవగుటచే నర్థించ లేకుండినన్
సమ్మోదంబును గూర్చగావలె శుభం బందించి సర్వేశ్వరీ!                                 104.

ఆనందంబున నాట్యమాడు హృదయం బమ్మా! నినుం గాంచినన్
మేనన్ ధైర్యము స్థైర్యముల్ గలిగెడున్ మేలైన సత్త్వంబు స
న్మానాధిక్యత గూడుచుండు నతులమ్మా! భాగ్యసంధాయినీ!
నీనామంబె స్మరించుచుందు జననీ! నిత్యంబు సర్వేశ్వరీ!                                 105.

ధ్యానంబందుననుండబూను నెడలన్ తన్వంతరస్థంబులౌ
నానావ్యాధులు నాధులున్ తలపులున్ నాచిత్త మాత్మీయమౌ
స్థానంబట్టుల జేరియుండి విచలించన్ జేయుచున్నట్టి యీ
వైనం బెంచుము గావుమమ్మ తగు త్రోవంజూపి సర్వేశ్వరీ!                               106.

వానిం బోలెడి వాడు లేడు జగతిన్ వాడే జగత్పూజ్యు డ
వ్వానిం జేరగబోవు చుండు శుభముల్ ప్రాప్తించు నవ్వానికిన్  
తానై సద్విజయంబు నిత్యమును నీదాసుండుగా వెల్గుచున్
నీనామంబు స్మరించుచున్న సతమున్ నిక్కంబు సర్వేశ్వరీ!                              107.

కామాక్షీ! కరుణాలయా! నగుణా! కాళీ! శుభాకారిణీ!
శ్రీమాతా! స్థిరసౌఖ్యదాయిని! శివా! చిద్రూపిణీ! చిత్కళా!
హేమాభూషిత! హేసదాశివసతీ! హే దైత్యసంహారిణీ!
క్షేమంబుల్ సమకూర్చ నిన్ సతతమున్ సేవింతు సర్వేశ్వరీ!                              108.

కైలాసాధిపకామినీ! కలుషహా! కామేశ్వరీ! కాంక్షదా!
ప్రాలేయాచలపుత్రికా! బహుభుజా! వైరీభకంఠీరవా!
వ్యాళేంద్రాభరణార్థదేహిని! శుభా! వ్యాఘ్రేంద్రసంచారిణీ!
కాళీ! నిత్యము నిన్ను భక్తి గొలువన్ గాంక్షింతు సర్వేశ్వరీ!                                109.

నాచే నీవిధి యోగ్యపద్యశతము న్వ్రాయించి  యాపైని నే
నాచంద్రార్కయశస్సు నందుకొను భాగ్యంబున్ బ్రసాదింపగా
నోచిద్రూపిణి! యెంచి యుంటివొ మదీయోత్సాహమున్ బెంచుచున్
నాచేతమ్మలరెన్ గ్రహించు నుతుల న్ధన్యోస్మి సర్వేశ్వరీ!                                   110.
***
హ.వేం.స.నా. మూర్తి .