Friday 31 January 2020

శ్రీ సరస్వత్యై నమః

శ్రీ సరస్వత్యై నమః.

శా.
శ్రీమంతంబగు నీదు రూపవిభవశ్శ్రీ నెట్లు వర్ణించునో
యేమాత్రంబును బల్కనేరని నరుం డీమూఢు డోయమ్మ న
న్నీమందున్ పదభావసంయుతునిగా నేరీతిగా జేతువో
ధీమత్కోటివరార్చితా! దీప్తిప్రదా!శారదా! 1.

(ధీమత్కోటివరాస్పదా!సుగుణదా!దీప్తిప్రదా! శారదా!)

ఉ.
బాసరభవ్యభూమి  నటవైభవమొప్ప వెలుంగుచున్న హే
వాసవముఖ్యదేవగణపాలకనాభిజవాక్ప్రసారిణీ!
భాసురసాహితీభువనవాసిని! గానవినోదినీ! భవ
చ్ఛ్వాసయె శబ్ద మీభువిని శారద! నీకివె సన్నుతాంజలుల్. 2.
శా.
అమ్మా! వాసరదివ్యభూమిని సదా హర్షప్రసూనమ్ములన్
జిమ్మం జూచుచు వాసముంటివి గదా చిద్రూపిణీ! నీవు మా
యమ్మల్ గొల్చెడి యమ్మవౌట సతతం బత్యంత సద్భక్తితో
సమ్మోదమ్మున గొల్చుచుందు మిడుమా సద్బుద్ధి
వాగీశ్వరీ! 3.
ఉ.
నీకు సరస్వతీ!నతులు నిత్యము జేసెద సాధుభావనా
నీకవిశేషశక్తినిడి నీతనయున్ నను వత్సలాఢ్యవై
ప్రాకట దివ్యతేజవిభవంబుల గూర్చెడి దానవౌటచే
సాకెదవంచు గొల్చెదను సన్నుతులన్ గొనుమమ్మ భారతీ! 4.
శా.
తల్లీ!నీకు నమస్కరింతు నెపుడున్ త్వత్పాదపద్మమ్ములం
 దెల్లైశ్వర్యవిధాయకస్ఫురణతో హేబ్రాహ్మి!శీర్షంబు నే
నుల్లాసంబున జేర్చెదన్ వినతులై యున్నట్టి మాకూనలన్
ఫుల్లాబ్జానన! జ్ఞానభాగ్యవిలసత్పూజ్యార్హులన్ జేయుమా. 5.

హ.వేం.స.నా.మూర్తి.
31.01.2020.

Wednesday 15 January 2020

" హైందవధర్మము-పండుగలు "


" హైందవధర్మము-పండుగలు "
శా.
శ్రీమంతం బిది హైందవంబు సకలశ్శ్రేయంబు లెల్లప్పుడీ
భూమిన్ గల్గగ గోరుచుండు శుభముల్ పూర్ణానురాగమ్మునన్
నీమం బొప్పగ సర్వమానవులకున్ నిత్యమ్ము జేకూర్చుచున్
ప్రేమన్ జూపుచునుండు తల్లి పగిదిన్ శ్రీలన్ బ్రసాదించుచున్.                  1.
ఉ.
హైందవభావనాబలము హర్ష సుఖప్రద సద్గుణాఢ్యసత్
సుందర దివ్యభాగ్యభవసూనృత వాక్య సుధారసార్ద్ర హృ
న్మందిరసన్నిభం బగుచు  మాన్యత గాంచెను సోదరత్వ మిం
దందును వాస్తవంబు వసుధైక కుటుంబక దీక్ష నందుటన్.                      2.
చం.
సురుచిరపర్వరాజముల శోభలు హైందవమందు జూడగన్
నిరతము నిండియుండి ఘన నిర్మలసన్నుత సంస్కృతీ స్ఫుర
ద్వరకరుణా విశేషముల వైభవమున్ గడియింపజేసి  యీ
నరులకు జీవనంబున ననామయదీప్తులు నింపు నన్నిటన్                         3.
మ.
ధరపై నెందును గానలేని ఘనతల్ తథ్యమ్ముగా నిందులో
నరయంగానగు హైందవా వివిధాఖ్యానంబులన్ దెల్పు యీ
వరపర్వమ్ములలోన హిందువగు సద్భాగ్యమ్ము జన్మాంతర
స్థిరసంపాదిత పుణ్య సత్ఫలమనన్ జెల్లున్ సగర్వంబుగన్.                          4.
ఉ.
ఎంత మహత్వమిందుగల దీశుభపర్వములందు జూడగన్
సంతస మంద రందగల సచ్ఛుభ భావము , ధర్మదీక్షయున్,  
సంతతదానశీలతయు, సజ్జనసంస్తుతి, పాపభీతి, యా
శాంతసుకీర్తు లందగల సంగతు లిచ్చట గాననయ్యెడిన్.                         5.
సీ.
చైత్రమాసారంభ శాస్త్రోక్తవేళలో
          నాదిపర్వమ్ము తానా “యుగాది”
షడ్రసోపేతమౌ సత్ప్రసాదమ్ముతో
          నిల జీవనస్థితిన్ దెలియజేయు
“శ్రీరామనవమి” యీ పౌరాళి కంతకు
          భక్తిభావము నేర్పి బహుళగతుల
ధరను  మానవ జన్మపరిపూర్ణతన్ జూపి
          యానందమందించు నన్నిగతుల 
ఆ.వె.
హనుమ జన్మ దినము “హనుమజ్జయంతి”యై
మహిమాన్వితులపట్ల మహితభక్తి
నిలను మానవాళి కింపైన రీతిలో
నేర్పుచుండు నతుల నిష్ఠతోడ.                                                                   6. 
ఉ.
శ్రావణ కార్తికమ్ములను చండకరుండుధనుస్సు నుండగన్
పావనమైన పర్వతతి భాగ్యదమౌచును గానిపించు స
ద్భావము శీలసంపదలు  భక్తిని జూపెడి వారికందు నా
దైవములన్ భజించుటను తథ్యము హైందవమందు నంతటన్.                  7.
సీ.
ఆశ్వీజమాసాన నారంభముననుండి
          నవరాత్రు లంబకున్ స్తవము లిచట
దశహరాఖ్యంబౌచు దిశలందు వెలుగొందు
          పండుగ యటమీద పరమ హర్ష
మందించి యీనేల నందంబు లనుగూర్చ
          వరుస దీపాలతో నరయ జివర
దీపావళీ పర్వ దీప్తులె ల్లరిలోని
          ద్విగుణితోత్సాహంబు విశదబరచు
ఆ.వె.
సూర్య జన్మదినము శుభకరం బైయొప్ప
మకర సంక్ర మణము సకలమునను
సంతసంబు గూర్చు సర్వార్థదాయియై
మూడు దినము లిచట జూడవచ్చు.                                                              8.
మ.
దురహంకారముపైన, దౌష్ట్యము పయిన్ తోరంపు ధైర్యమ్ముతో
వరయుద్ధమ్మును నేర్పు కొన్ని, మదులన్ భక్తిన్ ప్రసాదించి స
త్సరణిన్ నేర్పును కొన్ని జీవనమునన్ సంస్కారమున్ దెల్పుచున్
ధర నీ హైందవ పర్వముల్  మమత సంధానించి యన్నింటిలోన్.              9
 కం.
పండుగలను హైందవము
దండిగ దర్శించవచ్చు ధరనింకెం ది
ట్లుండుట సంభవమా యిది
మండన మననొప్పు వినుడు మనసంస్కృతికిన్.                                 10.

Tuesday 14 January 2020

కృతజ్ఞతాంజలులు.


కృతజ్ఞతాంజలులు.

.
ప్రజపద్యాఖ్యసమూహ మందు రచనాస్పర్ధన్ బ్రదర్శించి
ద్విజయంబుల్ సమకూర్చు  శుభ్రగుణులౌ  విజ్ఞత్రయీమూర్తులన్
నిజతేజోవిభవప్రభావవిలసన్నిత్యానురాగాత్ములన్
ప్రజకున్ పద్యసుదీప్తి  దెల్పు ఘనులన్ వాంఛింతు గీర్తించగన్.                  1.
.
ఇదిపూర్వంబున నెందుజూడని విధం బిచ్చోట నీరీతిగన్
ముద మందించ సమాజసంగతులకున్ ముఖ్యత్వముం గూర్చి 
త్వదమై యొప్పు ప్రబంధ సద్రచనకున్ వాంఛానుసారంబుగా
నదనున్ జూపి లిఖింపజేసిరి గదా యన్నింట శ్రేష్ఠంబుగన్.                        2.
.
ఒకరో ఇద్దరొ కాదు మూడుపదులం దొక్కంకెయే తక్కువై
యకటా భవ్యకథాప్రపూర్ణములుగా నందించినా రిచ్చటన్ 
స్వకృతుల్ సత్కవు లీప్రయత్నమునకున్ సత్యంబు లోకంబునన్
బ్రకటంబౌను యశంబు సర్వగతులన్ రమ్యాతిరమ్యంబుగన్.                   3.
.
అతులానందము గల్గుచుండె నిపుడీ యార్యప్రపంచంబునన్
నుతికర్హంబగు కావ్యసృష్టికొరకై నూత్నప్రయత్నంబుతో
నతిసామాన్యుడనైన నేను సయితం బత్యంత యత్నం బిటన్
వ్రతతుల్యంబుగ జేసియుండి కనుటన్ వాంఛాఫలం బింపుగన్.                 4.
.
అమలంబైన సమాజకావ్యరచనాయజ్ఞంబునం దిందు
త్క్రమముం జూపుచు బాలుబంచుకొనుచున్ గావ్యంబు లందించు కా
ర్యమునన్ ధన్యతగాంచు సత్కవులకున్ రాగాత్ములై నిత్యమున్
దమ ప్రోత్సాహము జూపు పాఠకులకున్  దండంబు లందించెదన్.                  5.


శ్రీమన్మహావిష్ణవే నమః


శ్రీమన్మహావిష్ణవే నమః
శా.
శ్రీమన్మోహనదివ్యకాయయుతుడై చిద్రూపియై యెల్లెడన్
క్షేమంబుల్ గలుగంగ జేయుచు లసచ్ఛ్రేయంబులం గూర్చుచున్
భూమిన్ సర్వవిధాల గాచుచు మహద్భోగంబు లందించు నా
స్వామిన్ విష్ణుని గొల్తు గావు మనుచున్ సద్భక్తితో నిచ్చలుల్.           1.
శా.
శాంతాకారుని, భోగితల్పశయనున్, సౌజన్యరత్నాకరున్,
సంతోషప్రదు, సాధుసజ్జనహితున్, సన్మార్గదున్, శాశ్వతున్,
చింతానాశను, భక్తవత్సలు, విభున్, శ్రీనాథునిన్, జిన్మయున్
స్వాంతంబందున నిల్పి కావ సతమున్ బ్రార్థింతు గోవిందునిన్.                   2.
మ.
ఇలపై ధర్మము క్షీణతన్ గనుచు దా నెంతేని కుందంగ త
త్ఫలమై దౌష్ట్యము వృద్ధిచెందెడి తరిన్ దానిందు వాత్సల్య సం
కలితుండై యవతారముల్ గొనుచు సంకల్పించి పాపాదులౌ
ఛలముల్ గూల్చుచు గాచు నచ్యుతు హరిన్ సద్భక్తితో గొల్చెదన్.                3.
మ.
దురితంబుల్ నశియింప జేసి భువిపై దుఃఖార్తులన్ బ్రోచుచున్
నిరతం బన్నిట నిండియుండి మదులన్ నిత్యానురాగమ్ముతో
గరుణం జూపుచు నింపుచుండు ప్రభునిన్ గైవల్యదున్ జిన్మయున్
హరినిన్ గొల్చెద లోకరక్షకుని నే నత్యంత మోదమ్మునన్.                              4.
చం.
వరముల నిచ్చి భక్తులకు వైభవముల్ గలిగించుచుండి యీ
ధరపయి నిత్యసౌఖ్యము లుదారత గూర్చుచు రక్షసేయుచున్
నిరుపమహర్షసంతతులు నిత్యము జూపుచు దేవదేవుడై
సురుచిరసద్యశంబు లిడు సుందరరూపుని గొల్తు శార్ఙ్గినిన్.                              5.
చం.
చతురత జూపి యా సుధను సన్నుతరీతిని బంచువాని, దు
ర్మతుల మనోవికారములు వ్రయ్యలు చేయగ జక్రధారియై
యతులిత సత్వముం దెలుపునట్టి మహాత్ముని, ధర్మరక్షకున్,
సతతము గొల్తు నా హరిని, సర్వసుఖప్రదు, నార్యసన్నుతున్.             6.
ఉ.
కారణజన్ముడై జనుల గాచుచు సజ్జనకోటికెల్లెడన్
దోరపు మోదమిచ్చుచును దుష్టుల దైత్యుల ధర్మదూరులన్
మేరలు మీరువారలను మిక్కిలి క్రోధము జూపి గూల్చు న
వ్వీరుని సర్వభారకుని విశ్వమయున్ వినుతింతు నెప్పుడున్                       7.
ఉ.
దానవకోటికిన్, గతులు దప్పుచు లోకమునందు  దౌష్ట్యమున్
మానక చేయుచుండుటయె మాన్యతయంచు దలంచువారికిన్,
దీనజనాళిసౌఖ్యములు ద్రెంచెడి వారికి నంతకాలయం
బౌనదె యోగ్యమంచు నట కంపెడు వెన్నుని సన్నుతించెదన్                       8.
కం.
వందనములు శివసన్నుత!
వందనములు దైత్యనాశ! వైకుంఠ! హరీ!
వందనము లోకపూజిత!
వందనములు దేవ! నీకు వందనము లయా!                                                9.
కం.
నారాయణ! జగదీశ్వర!
కారుణ్యపయోధి! యఘహ! కైటభవైరీ!
వీరాధివీర! సంకట
హారీ! వందనము లిప్పు డందుము శౌరీ!                                                      10.
కం.
సిరిమగనికి వరసుఖదున
కరుసము సకలమున కొసగు హరి కనఘునకున్
నిరుపమునకు శుభగుణునకు
నిరతము నతులనిన బలిమి నిఖిలమున కిలన్.                                           11.

రాజమహేంద్రవరం ప్రజ-పద్య సభ


రాజమహేంద్రవరం ప్రజ-పద్య సభ
19-01-2020

మ.
కనుడీ "రాజమహేంద్రి" సత్పురముగా, కల్యాణసంపత్తికిన్
ఘనమౌ స్థానముగా, సమస్తకవిసంఘస్తోత్రదీప్తంబుగా,
ధనధాన్యాదిఫలాఢ్యయౌ ధరణిగా, దైవప్రదేశంబుగా
ననిశంబిందు యశంబు గాంచెను భళా! యాత్మీయతాకేంద్రమై.           1.
మ.
ఇది యాంధ్రమ్మున రాజధానియయి తా నెన్నో మహత్కృత్యముల్
మదులన్ నిల్చెడిరీతి జేసి ఘనసమ్మానప్రభారాశి కా
స్పదమై వెల్గెను "రాజరా"జిచటి భూపాలుండు ధీశాలి క్షే
మదుడై పాలన చేయుచుండ బ్రజలన్ మాన్యత్వముం గూర్చుచున్.           2.
ఉ.
నన్నయ సత్కవీంద్రునకు నైజమతంబును దెల్ప రాజు, తా
నున్నతలీల వల్లెయని యుత్సవ మియ్యది యంచు శబ్ద సం
పన్నుడు గాన శీఘ్రముగ భారతమున్ రచియింప బూనె నీ
సన్నుతసద్ధరిత్రిపయి సంతసమంది మహర్షితుల్యుడై.                                  3.
కం.
తెనుగునకిట వ్యాకరణము
జననంబును గాంచె నాడు సత్కవియగు నా
యనఘాత్ముడు  నన్నయ తాన్
జనకత్వముతోడ వెలుగ సచ్చరితుడటన్.                                           4.
సీ.
రంగారు ఫణితితో గంగాతరంగిణీ
          నిభయౌచు వెలుగొంది నిఖిలజగతి
“గోదావరీ”నామ మాదరంబుగ నంది
          కలుషహారిణియన్న ఖ్యాతి గాంచి,
సస్యానుకూలయై స్వాదుపానీయయై
          జనమానసములందు స్థానమంది,
పశుపక్షిగణములన్ భవ్యానురాగాన
          జేరబిల్చుచు గొప్ప పేరుగాంచి
తే.గీ.
భవ్య”గౌతమి” తానౌచు బ్రథిత యశము
నరయు చున్నట్టి యాపగ యనవరతము
నిర్మలాశయపూర్ణయై నిస్తులమగు
నవ్యయశమును గూర్చు నీనగరమునకు.                                          5.
ఉ.
ఆదికవీంద్రుడై యశములందిన నన్నయ భవ్యదీక్షతో
వేదసమానమై వెలిగి విశ్వహితంబును గూర్చునట్టి స
ర్వోదయభావనల్ జగతి నొప్పుగ నేర్పెడి భారతమ్ము దా
నాదర మొప్ప నీ భువిని నందగ జేసెను నిష్ఠబూనుచున్.                           6.
మ.
“ప్రజ-పద్యం”బిట జేర బిల్చెను గదా బ్రహ్మాండమైనట్టి స
ద్విజయస్ఫూర్తిని నింపు భావ మలరన్ విద్వాంససంఘంబులన్
నిజసామర్ధ్యము జూపి లోకగతులన్ నిల్పంగ బద్యంబులన్
ద్వజమెత్తన్ గుణహీన కృత్యములపై ధైర్యమ్ము చూపించగన్.              7.
ఉ.
శ్రీయుతుడౌ "ఫణీంద్ర"కవిశేఖరు డాయత కీర్తిశాలి తా
నాయమ "శైలజా"విదుషి యాశ్రిత సత్కవితావిభూతికిన్
ధీయుతు లీప్రదేశమున దీప్తులు నిండ సభాఖ్యపర్వమున్
జేయగ తాము సిద్ధమని చేరగ బిల్చిరి మిత్రకోటులన్.                                8.
శా.
రండో యార్యశిఖామణుల్ శుభగుణుల్ రమ్యానురాగాస్పదుల్
నిండన్ జిత్తములందు పద్యరచనానిష్ఠల్ విశేషంబుగన్
మెండౌ హర్షము గూర్చ నీస్థలమునన్ మేలైన మార్గాన ను
ద్దండోగ్రామయముల్ హరించు కవితల్ తత్ప్రాంతమున్ నింపగన్.              9.
మ.
భవదీయాద్భుతభవ్యశబ్దసుమహద్భావాతిరేకస్ఫురత్
స్తవనీయోన్నతసత్ప్రభావజనితాశాజ్యోతి లోకమ్మునన్
వివిధానేకమహోగ్రరుగ్మతలఠీవిన్ ద్రుంచు మంత్రమ్ముగా
నవచైతన్యము నింప సాగవలయున్ నమ్మందగున్ సత్కవుల్.            10.
శా.
ఈప్రాంతమ్మున మారుమ్రోయవలయున్ హృద్యంబులౌ పద్యముల్
క్షిప్రాస్తోకమహచ్ఛుభప్రకరముల్ చేరంగ సంఘమ్మునన్
శ్రీప్రాప్తించ సమస్తసౌఖ్యవితతుల్ సిద్ధించు మాహాత్మ్య మా
యాప్రజ్ఞాన్విత సత్కవిత్వసుధలం దందించ రండా సభన్.                           11.

                   (మాహాత్మ్యము+ఆయాప్రజ్ఞాన్విత)

శ్రీవిష్ణవేనమః దండకము


శ్రీవిష్ణవేనమః
దండకము
శ్రీమంత! వైకుంఠవాసీ! జగద్రక్షకా! వాసుదేవా! మహాకాయ! విశ్వేశ్వరా! దేవ! దేవాధిదేవా! మహాత్మా! సదా నీకు దండంబు లర్పింతు నీపాదపద్మంబులన్ గొల్తు, నీ నామసంకీర్తనల్ సేతు, నీరూపముం గాంచుచున్ సంతసంబంది సౌఖ్యంబులం గాంతు, నీ దివ్యగాథల్ పఠింతున్, సురేశా! ప్రణామంబులన్  జేసెదన్ నన్ను నీ భక్తునిన్ సేవకున్ గావుమయ్యా! హరీ! పూర్వమందీవు  మత్స్యంబు, కూర్మంబు నంతన్ వరాహంబవైనావు లోకంబులం గావ, భక్తుండు  ప్రహ్లాదు డర్థింప కంబంబునన్ నారసింహుండవై రాక్షసుం ద్రుంచి, నీభక్తుడౌ బాలునిన్ బ్రోచినావయ్య, దైత్యేంద్రు డచ్చోట యజ్ఞంబులన్ సల్పుచుండంగ నవ్వామనాకారముం దాల్చి యందేగి యర్థించి పాదత్రయీదానముంబొంది యవ్వానినిం ద్రొక్కి నావయ్య పాతాళముంజేర, బల్మారు లన్వేషణల్ చేసి క్షాత్రోగ్ర గర్వంబునుం గూల్చినావయ్య, రామావతారంబునన్ దుష్టునవ్వాని నారాక్షసున్ బంక్తికంఠున్ మహద్ఘోర సంగ్రామసీమావిహారంబునుంజేసి శౌర్యమ్ముజూపించి తున్మాడి ధర్మంబునుం గాచినావయ్య, కృష్ణుండవై ధర్మ పక్షంబునుం దాల్చి పాపంబునుం గూల్చినావయ్య, న్యాయంబునుం నిల్పినావయ్య, బుద్ధుండవై యిందు సంచారమున్ సల్పుటేకాదు కల్క్యాఖ్యతో నీధరన్ నిల్వగాబోవు నీసత్వము న్నీదువీరత్వము న్నీమహత్వంబునుం గూర్చి చెప్పంగ బ్రహ్మాది గీర్వాణ సంఘంబులున్, మౌని వర్యుల్, మహాత్ముల్ స్వసామర్ధ్యముం జూపలేరయ్య నేనెంతవాడన్ బ్రభూ! కేవలాఘంబులన్ జేయు మూఢాత్ముడన్ మానవుండన్ గదా నీవు నాడా కరీంద్రాది భక్తాళినిన్ బ్రోచియున్నట్లు నన్నున్ భవత్పాదపంకేరుహంబుల్ సుఖప్రాప్తి నందంగ యోగ్యంబులంచున్ మనంబందు భావించు నీభక్తునిన్ కల్మషానీకదూరున్ బొనర్చంగ బ్రార్థించెదన్, స్వార్థభావంబునుం ద్రుంచి రక్షించగా గోరెదన్, స్వాంత మందింత నైర్మల్యతన్ నింపగా వేడుచుంటిన్ మురారీ! ప్రణామంబులయ్యా! జగద్వ్యాపకా! భుక్తిముక్తిప్రదాతా! రమాసేవితా! సర్వసంపత్ప్రదాతా! నమస్తే నమస్తే నమః |