Tuesday 14 January 2020

ఆధునిక మానవుని పురోగతి.


ఆధునిక మానవుని పురోగతి.

ఆ.వె.
వర్తమానమందు వైభవోపేతమౌ
జీవనమ్ము నాది క్షితిని నాకు
సములులేరు నిజమసాధ్య మిందొక్కటి
లేదటంచు జనుడు మోదమందు. 1.
ఆ.వె.
వాని ప్రజ్ఞ యేమొ
వాస్తవమ్మేమియో
నేటి వాని విధము నిక్కువముగ
నిపుడు తెలిసికొంద  మేరీతి నుండెనో
శుభ్రచరితులార! చూడ రండు.2.
ఆ.వె.
విద్యలందుచుండె విస్తృతంబుగ నేడు
విమలమానసము వివేక బుద్ధి
మందగించుచుండె మానవోత్తమునకు
జెప్పదరమె నరుని గొప్పతనము. 3.
ఆ.వె.
సఖులు కోట్లకొలది ముఖపుస్తకంబున
గలరు హితముగోరి కడను జేర
నుత్సహించువార లొక్కరైనను లేరు
చెప్పదరమె నరుని గొప్పతనము. 4.
ఆ.వె.
సన్నుతించ దగిన సౌధంబులను గట్టు
నొక్కదానిపైన నొక్కటిగను
దానిలోన చిన్నదైన కుటుంబమ్ము
చెప్పదరమె నరుని గొప్పతనము. 5.
ఆ.వె.
సతము కూడబెట్టు సంపత్తులెన్నియో
కోరి యిట నపర కుబేరుడగుచు
నేమిఫలము శాంతి యెద కందబోదయ్యె
చెప్పదరమె నరుని గొప్పతనము. 6.
ఆ.వె.
ఘనతరంబులైన గడియారములు తాను
సృష్టి చేసె నిచట దుష్టి నొంద
సత్య మతనివద్ద సమయమ్ము లేదయ్యె
చెప్పదరమె నరుని గొప్పతనము. 7.
ఆ.వె.
తెలివి పెంచుకొనియె నలఘు యత్నమ్ముతో
జ్ఞాని నైతి నిచట నేనటంచు
నుర్వి వానిభావ ముద్వేగశూన్యమ్ము
చెప్పదరమె నరుని గొప్పతనము. 8.
ఆ.వె.
ఔషధముల ఖ్యాతి యద్భుతంబుగనుండె
జగతిలోన నేడు సకలగతుల
నైన నేటి మనుజు డారోగ్య హీనుండు
చెప్పదరమె నరుని గొప్పతనము. 9.
ఆ.వె.
శక్తి జూపి నేడు చంద్రుని స్పృశియించి
యచటి కబురులన్ని యరయగలడు
పొరుగువారి యూసు పొందలే డీతండు
చెప్పదరమె నరుని గొప్పతనము. 10.
ఆ.వె.
ఇంత వృద్ధి గాంచి యీలీల జగతిలో
మసలుచున్న నేటి మనుజు నిచట
బొగడ జిత్తమున్న నగుపించ వయ్యరో
పదమ లనెడి మాట వాస్తవమ్ము. 11.


No comments:

Post a Comment