Sunday 12 January 2020

శ్రీ మహాలక్ష్మ్యై నమః


శ్రీ మహాలక్ష్మ్యై నమః

శా.
శ్రీ లీలోకమునందు బంచుచు మహచ్ఛ్రేయంబు లెల్లప్పుడున్
శ్రీలక్ష్మీ! ఘటియింప జేతువు మదిన్ జిద్రూపిణీ! భక్తితో
నీలీలల్ స్మరియింతు నీపదములన్ నిత్యమ్ము ధ్యానింతు నో
లీలామానుషవిగ్రహప్రణయినీ!  క్లేశమ్ములన్ గూల్చుమా!                     1.
ఉ.
సాగరకన్యకా! విపుల సన్మతిదాయిని! విష్ణుభామినీ!
వేగమె భక్తబృందములు వేడిన బల్కుచు బ్రేమ జూపుచున్
భోగము భాగ్యముల్ నిలుప బూనుచు నుందువు సన్నుతింతు నిన్
స్వాగతమమ్మ యంచు నరుసంబున జేరవె రక్ష సేయవే                           2. 
శా.
నిన్నుం గాంచెడివారు విజ్ఞమతులై నిత్యమ్ము లోకమ్ములో  
నెన్నం జాలిన సత్సుఖమ్ము  గని తా మెన్నేని సత్కీర్తు లిం
దన్నింటన్ గొనుచుంద్రు వాస్తవముగా నమ్మా! జగద్వ్యాపినీ! 
నన్నున్ నీ పదపద్మసేవకుని నానందించ గావం దగున్.                               3.
శా.
ఎనిమిది రూపముల్ గొనుచు నిచ్చట జేరెదవమ్మ నిన్ను దా
మనయము గొల్చుచుండెదరు హర్షమతుల్ వరభక్తకాళి నీ
వనుపమ మాతృవత్సలత నాప్రజపైనను జూపుచుండు మో
జనని! యటంచు మ్రొక్కెదను సన్నుతి జేయుచునుందు భార్గవీ!            4.
మ.
కమలా! శ్రీహరి హృత్పదస్థితవునై కల్యాణివై భక్తులన్
విమలానేకయశఃప్రపూర్ణమతులన్ విఖ్యాతులన్ జేతు వా
క్రమమున్ జెప్ప దరంబె యేరికయినన్ శ్రద్ధాన్వితస్ఫూర్తితో
నమరం జేయగ విజ్ఞతన్ గొలుతు నో యమ్మా! నినున్ నిచ్చలున్.             5.
ఉ.
ఇందిర! లోకమాత! రమ! యీప్సితదాయిని! పద్మ! శ్రీకరీ!
సుందరభావశోభిత! వసుప్రద! మంగళదేవతా! సదా
వందనమందు నందుకొని వందలు వేలుగ సౌఖ్య దీప్తు  లిం
దందగ నీదుభక్తుల కనంత ముదంబును గూర్చ వేడెదన్.                           6.

No comments:

Post a Comment