Tuesday 14 January 2020

రాజమహేంద్రవరం ప్రజ-పద్య సభ


రాజమహేంద్రవరం ప్రజ-పద్య సభ
19-01-2020

మ.
కనుడీ "రాజమహేంద్రి" సత్పురముగా, కల్యాణసంపత్తికిన్
ఘనమౌ స్థానముగా, సమస్తకవిసంఘస్తోత్రదీప్తంబుగా,
ధనధాన్యాదిఫలాఢ్యయౌ ధరణిగా, దైవప్రదేశంబుగా
ననిశంబిందు యశంబు గాంచెను భళా! యాత్మీయతాకేంద్రమై.           1.
మ.
ఇది యాంధ్రమ్మున రాజధానియయి తా నెన్నో మహత్కృత్యముల్
మదులన్ నిల్చెడిరీతి జేసి ఘనసమ్మానప్రభారాశి కా
స్పదమై వెల్గెను "రాజరా"జిచటి భూపాలుండు ధీశాలి క్షే
మదుడై పాలన చేయుచుండ బ్రజలన్ మాన్యత్వముం గూర్చుచున్.           2.
ఉ.
నన్నయ సత్కవీంద్రునకు నైజమతంబును దెల్ప రాజు, తా
నున్నతలీల వల్లెయని యుత్సవ మియ్యది యంచు శబ్ద సం
పన్నుడు గాన శీఘ్రముగ భారతమున్ రచియింప బూనె నీ
సన్నుతసద్ధరిత్రిపయి సంతసమంది మహర్షితుల్యుడై.                                  3.
కం.
తెనుగునకిట వ్యాకరణము
జననంబును గాంచె నాడు సత్కవియగు నా
యనఘాత్ముడు  నన్నయ తాన్
జనకత్వముతోడ వెలుగ సచ్చరితుడటన్.                                           4.
సీ.
రంగారు ఫణితితో గంగాతరంగిణీ
          నిభయౌచు వెలుగొంది నిఖిలజగతి
“గోదావరీ”నామ మాదరంబుగ నంది
          కలుషహారిణియన్న ఖ్యాతి గాంచి,
సస్యానుకూలయై స్వాదుపానీయయై
          జనమానసములందు స్థానమంది,
పశుపక్షిగణములన్ భవ్యానురాగాన
          జేరబిల్చుచు గొప్ప పేరుగాంచి
తే.గీ.
భవ్య”గౌతమి” తానౌచు బ్రథిత యశము
నరయు చున్నట్టి యాపగ యనవరతము
నిర్మలాశయపూర్ణయై నిస్తులమగు
నవ్యయశమును గూర్చు నీనగరమునకు.                                          5.
ఉ.
ఆదికవీంద్రుడై యశములందిన నన్నయ భవ్యదీక్షతో
వేదసమానమై వెలిగి విశ్వహితంబును గూర్చునట్టి స
ర్వోదయభావనల్ జగతి నొప్పుగ నేర్పెడి భారతమ్ము దా
నాదర మొప్ప నీ భువిని నందగ జేసెను నిష్ఠబూనుచున్.                           6.
మ.
“ప్రజ-పద్యం”బిట జేర బిల్చెను గదా బ్రహ్మాండమైనట్టి స
ద్విజయస్ఫూర్తిని నింపు భావ మలరన్ విద్వాంససంఘంబులన్
నిజసామర్ధ్యము జూపి లోకగతులన్ నిల్పంగ బద్యంబులన్
ద్వజమెత్తన్ గుణహీన కృత్యములపై ధైర్యమ్ము చూపించగన్.              7.
ఉ.
శ్రీయుతుడౌ "ఫణీంద్ర"కవిశేఖరు డాయత కీర్తిశాలి తా
నాయమ "శైలజా"విదుషి యాశ్రిత సత్కవితావిభూతికిన్
ధీయుతు లీప్రదేశమున దీప్తులు నిండ సభాఖ్యపర్వమున్
జేయగ తాము సిద్ధమని చేరగ బిల్చిరి మిత్రకోటులన్.                                8.
శా.
రండో యార్యశిఖామణుల్ శుభగుణుల్ రమ్యానురాగాస్పదుల్
నిండన్ జిత్తములందు పద్యరచనానిష్ఠల్ విశేషంబుగన్
మెండౌ హర్షము గూర్చ నీస్థలమునన్ మేలైన మార్గాన ను
ద్దండోగ్రామయముల్ హరించు కవితల్ తత్ప్రాంతమున్ నింపగన్.              9.
మ.
భవదీయాద్భుతభవ్యశబ్దసుమహద్భావాతిరేకస్ఫురత్
స్తవనీయోన్నతసత్ప్రభావజనితాశాజ్యోతి లోకమ్మునన్
వివిధానేకమహోగ్రరుగ్మతలఠీవిన్ ద్రుంచు మంత్రమ్ముగా
నవచైతన్యము నింప సాగవలయున్ నమ్మందగున్ సత్కవుల్.            10.
శా.
ఈప్రాంతమ్మున మారుమ్రోయవలయున్ హృద్యంబులౌ పద్యముల్
క్షిప్రాస్తోకమహచ్ఛుభప్రకరముల్ చేరంగ సంఘమ్మునన్
శ్రీప్రాప్తించ సమస్తసౌఖ్యవితతుల్ సిద్ధించు మాహాత్మ్య మా
యాప్రజ్ఞాన్విత సత్కవిత్వసుధలం దందించ రండా సభన్.                           11.

                   (మాహాత్మ్యము+ఆయాప్రజ్ఞాన్విత)

No comments:

Post a Comment