Tuesday 14 January 2020

అట్టు


అట్టు

కం.
శ్రీమంతము నీరూపము
కామిత సంతృప్తిదాయి గద నీరుచియున్
స్వామినివి నీవు జూడగ
భూమిని భోజ్యములలోన బోడిమి నట్టూ.                      1.
కం.
నీయాకారము సుందర
మాయతమై వెలుగుచుండు నద్భుతరీతిన్
జ్ఞేయము నీరుచి యిలపయి
సోయగముల రాశివీవు సొగసరి వట్టూ!                          2. 
కం.
పిన్నలు పెద్దల కందరి
కన్నింటను బ్రీతి గొల్పు నాహారమవై
మన్ననలను బొందగ నీ
వెన్నంగను జేరియుంటి విలపయి నట్టూ!                      3.
కం.
నిను జూచిన నానందము
ఘనతరముగ గలుగు మదుల గాంక్షలు జేరున్
దినుటకు సత్వరముగ నీ
మనుజులలో నిక్క మోయి మరిమరి యట్టూ!                 4.
కం.
బంగాళదుంపకూరకు
రంగగు నిను జేర్చి కొనుట రసవత్తరమై
యంగీకృతమై యిచ్చట
సంగతముగ సాగుచుండు సత్యం బట్టూ!                       5.

నిను సాంబారున లేహ్యం
బుననున్ జేర్చి తినుట యన భూజనుల కిటన్
ఘనతరముగ హర్షదమై
కనిపించును మెత్తు నిన్ను కరమెపు డట్టూ!                   6.
కం.
పెసరట్టు వౌదు వొకపరి
మెసవగ నాశలను గొలుపు మినపట్టు వనన్
గనిపింతువు మరియొకపరి
నిను బహురూపిని నుతింతు నిక్కం బట్టూ!                    7.  
కం.
దోసె యనెడి నామంబును
వాసిగ నందితివి నీవు వసుధాస్థలిలో
భాసుర లేహ్యాలంకృత!
చూసితి నీఘనత కొనుము జోతల నట్టూ!                       8.
కం.
పెనముపయి నుడుకుచుందువు
మనుజుల సంతృప్తి కొరకు మైమరచుచు నీ
వనయము లోకహితంబున
మనుచుందువు మరలమరల మహిపయి నట్టూ!                    9.
కం.
నిను దినని మనుజు డుండదు
నిను జేయని గృహము లేదు నిఖిల జగానన్.
నిను బొందుట కయి యనిశము
మనమున గాంక్షించుచుంద్రు మానక యట్టూ!             10.

No comments:

Post a Comment