Sunday 12 January 2020

శ్రీ దుర్గాస్తుతి


శ్రీ దుర్గాస్తుతి
శా.
శ్రీమంతంబగు భూమిపై నిరతమున్ క్షేమంబులం గూల్చుచున్
సామీప్యంబున జేరకుండ సుఖముల్ సర్వత్ర భీభత్సమున్
నీమంబొప్ప ఘటించు నాయసురునిన్ నీచున్మహత్క్రూరునిన్
శ్రీమాతా! తెగటార్చినావు మహిషున్ జేతున్ నమస్కారముల్.
.
మహిషాఖ్యున్ దునుమాడి నీవు సుఖముల్ మాతా! కృపాపూర్ణవై
మహికందించినతీరు సర్వగతులన్ మాన్యత్వముం గాంచె మా
కిహమం దన్నిట సచ్ఛుభంబు లటులే యింపారు సత్కీర్తులన్
మహిమోపేత యొసంగుమా! వినతులన్ మన్నించుమా యీశ్వరీ!
కం.
మహిషాసురమర్దిని!ని
న్నహరహమును గొలుచువారి కతులసుఖంబుల్
మహిపయిని కలుగ జేయుచు
నిహమున హర్షంబు గూర్చు మెప్పుడు దుర్గా!
 శా.
శ్రీలందింతువు భక్తకోటికి మహచ్ఛ్రేయంబులం గూర్చుచున్
వాలాయమ్ము త్వదీయ సంతతికిటన్ వాత్సల్యముం జూపుచున్
మేలైనట్టి విధంబు జీవికకునై మిథ్యాప్రపంచాన నీ
లీలన్ దెల్పుచు నేర్పుచుందువు నతుల్ శ్రీరాజరాజేశ్వరీ!               
.
ధరపై నిత్య శుభంబు లందునటులన్ దాక్షిణ్యసందీప్తితో
వరమందింతువు భక్తరక్షణమునన్ బారీణవైవెల్గుచున్
నిరతానందము గూర్చుచుందు విచటన్ నిన్నెంచగా శక్యమే
స్థిరసద్భక్తిని సన్నుతించెద నినున్ శ్రీరాజరాజేశ్వరీ!                         
శా.
అమ్మా! తల్లులకెల్ల దల్లివయి నీ వత్యంతమౌ ప్రేమతో
సమ్మోదంబును నింపుచుందు విచటన్ సర్వత్ర సత్సౌఖ్య భా
గ్యమ్ముల్ నిల్పుచు, దండముల్ శుభకరీ! కల్యాణసద్గంధముల్
చిమ్మం జూడుము లోకమందు జననీ! శ్రీరాజరాజేశ్వరీ


No comments:

Post a Comment