Sunday 12 January 2020

శ్రీ కృష్ణ


శ్రీ కృష్ణాయ నమః


కం.
శ్రీమంత! దేవకీసుత!
ప్రామినుకుల రక్ష చేయు పరమాత్మ! హరీ!
కామితసద్వరదాయక!
నీమంబున నిన్ను గొలుతు నిరతము కృష్ణా!                   1.
కం.
నందాత్మజాత! మునిజన
వందిత! సౌభాగ్యదాత! భక్తాధీనా!
సుందరరూపా! కొనుమిదె
వందన మో గోపబాల! వరగుణ! కృష్ణా!                           2.
కం.
సురగణపూజిత! నిరుపమ
కరుణాకర! వాసుదేవ! కైటభవైరీ!
స్థిరతరహర్షవిధాయక!
పరమాత్మా! యందుమయ్య! ప్రణతులు కృష్ణా!     3.
కం.
సురుచిరసుయశోదాయక!
ధర నచట యశోద కపుడు తన్మయమగున
ట్లురుతరవిశ్వం బంతయు
సరగున జూపించు నీకు సన్నుతి కృష్ణా!                           4.
కం.
దనుజుల దౌష్ట్యపరంపర
లను ద్రుంచిన ఘనుడవీవు లలితాకారా!
కొనుమిదె దాసుడ నగుటను
వనమాలీ! నీకు జేతు ప్రణతులు కృష్ణా!                            5.
కం.
నీ యెదుటను దండములని
శ్రేయఃప్రద! నిలిచినాను చిత్సుఖ దీప్తిన్
నీయనుచరుడయి మెలిగెద
నీయంగా దగదె నాకు నించుక కృష్ణా!                            6.
కం.
యాదవవంశవిభూషణ!
మోదాకర! విపులశౌర్య! మునిజనసుఖదా!
నీదే భారము గావగ
వేదస్తుత! విన్నపంబు వినవలె కృష్ణా!                             7.
కం.
తలపులలో బలుకులలో
కలుములకయి చేయబూను కార్యంబులలో
కలుషవినాశక! నినుగను
బలమొసగుము దేవదేవ! వసుధను గృష్ణా!                     8.
కం.
నీనామము స్మరియించిన
నేనాడును నఘము చేర దిసుమంతైనన్
తానై చేరిన నా క్షణ
మే నాశము బొందు సత్య మియ్యది కృష్ణా!                    9.
కం.
దండంబులు కంసాంతక!
దండంబులు శార్ఙ్గపాణి! దయగల తండ్రీ!
దండంబులు పురుషోత్తమ!
దండంబులు విశ్వరూప! దండము కృష్ణా!                      10.

శ్రీకృష్ణాయనమః

కం.
శ్రీమంత! నందనందన!
స్వామీ! సర్వార్థదాత! సన్నుతచరితా!
క్షేమప్రాపక! వరగుణ
ధామా! వందనము లందదగునో కృష్ణా!                                     1.
కం.
కరుణామయ! శుభకాయా!
నిరుపమమృదుభావదీప్త!నిఖిలవ్యాప్తా!
సురుచిరవాక్యాలంకృత!
వరదాయక ప్రణతులంద వలయును కృష్ణా!                             2.
కం.
యాదవవంశవిభూషణ!
శ్రీదా! యఖిలేశ! సతము 'జే'యని నిన్నున్
మోదం బందగ దలచెద
నోదేవా భక్తిభావ మొప్పగ గృష్ణా!                                               3.
కం.
మునిజనసంస్తుత! శౌరీ!
యనఘానుగసౌఖ్యకారి!యసురారి!హరీ!
యనుదినధర్మవిహారీ!
కొనుమిట వందనము చేరి గోపీకృష్ణా!                                     4.
కం.
మురళీధర! సద్గురువర!
సురుచిరదరహాసభరితసుందరవదనా!
స్థిరతరహర్షవిధాయక!
ధరణీధరధారి!కొనుము దండము కృష్ణా!                                 5.

కం.
గోపీవల్లభ! యురుతర
పాపాపహ! భక్తకోటి బాంధవ! శార్ఙ్గీ! 
హే పద్మాక్షా! ప్రణతులు
శ్రీపతి! సద్భక్తి నీకు జేతును కృష్ణా!                        6.
కం.
గోవర్ధనగిరివరధర!
దేవా! నవనీతచోర! దివ్యాకారా!
పావన భవ్యవిచారా!
తావక పదములకు జేతు దండము కృష్ణా!                       7.
కం.
వందనమయ! గోపాలా!
వందనములు గానలోల! వరశుభశీలా!
వందనము దైత్యకాలా!
వందనములు స్వీకరించ వలయును కృష్ణా!                    8.



No comments:

Post a Comment