Tuesday 14 January 2020

ఆంగ్లసంవత్సరం. 2020


ఆంగ్లసంవత్సరం.
2020
ఉ.
కాదిది వత్సరాదియని కారణముల్ ప్రకటించుచుండి యా
మోదము కాదు మాకని ప్రమోదము జూపక భవ్యకామనల్
మేదిని నిచ్చటన్ దెలుప మీకగునా యుచితం బటంచు యీ
భేదము జాపుచుండుటలు విజ్ఞులకుం దగునా? తలంచగన్?                  1.
ఆ.వె.
ఆంగ్లవర్షమైన నది కాలగమనమ్ము
కాకపోవునేమి? కరము ముదము
గూర్చకుండునేమి కూర్మినందరకిందు?
శివము బలుక బూన జేటదేమి?                                                                2.
ఆ.వె.
ఆంగ్ల సంఖ్య లిచట నారంభముననుండి
నేర్చుచుంటి మౌర! నిష్ఠతోడ
చదువులందు స్వీయ సంఖ్యాస్వరూపమ్ము
నెవరు నేర్పుచుండి రీయుగాన.                                                       3.
ఆ.వె.
తిథులు చూడలేము తేదీలు మాత్రమే
వ్రాతలోన నాంగ్ల వత్సరమ్మె
యనుసరింతు మిచట జననాదికము లెంచ
వరగుణాఢ్యులార! యెరుగరేమి?                                                   4.
ఆ.వె.
నిత్యజీవనాన నిచ్చలీ భువిపైన
నాంగ్లకాలగతుల నందియుండి
పలుకవలదు శుభము వత్సరారంభాన
ననుట సముచితంబె యార్యులార!                                                   5.
సీ.
శుభకామనలు బల్కు సుందరంబగురీతి
               యెల్లసంఘంబునం దెరుకపరచి,
వింతపోకడలతో విజ్ఞానదీప్తులన్
               గలుషమంటగనీక గావబూని,
సంస్కారవంతమౌ సన్మార్గమున జేరి
               యానంద మందెడి యదను దెలిపి,
సత్కార్యములు చేయు సంకల్ప మందంగ
               సర్వమానవులందు సరణి జూపి
తే.గీ.
లోకమంతయు సన్నుతి కాకరముగ
జేయబూనుచు కవితలు వ్రాయవలయు
రండు కవులార! సందేహ ముండనేల
హితకరంబైన పనిలోన నీక్షణాన.                                                                 6.

నూతనాంగ్లవత్సరమునకు స్వాగతము.
ఉ.
శ్రీలిల బంచుమా హృదయసీమలలో మలినమ్ము ద్రుంచుమా
మేలగు భావజాలమును మిత్రునిరీతి హృదంతరమ్ములన్
శీలము శుద్ధిచేయుగతి జేర్చుచు మోదము గూర్చుచుండుమా
కాలగతిన్ ధరాస్థలిని గావగ జేరిన నూతనాబ్దమా                               1.
ఉ.
వచ్చుట పోవుచుండుటలు వాస్తవ మియ్యది జీవరాశికిన్
బచ్చదనంబు పృథ్విపయి బంచగ జేరెడి యబ్దకోటులం
దిచ్చట నొక్కతీరు, సృజియించుటలేల యనంత దౌష్ట్యముల్
నిచ్చలు శాంతిసౌఖ్యములు నింపుట యుక్తము నూతనాబ్దమా!                    2.
ఉ.
స్వాగత మీధరాస్థలికి సభ్యసుగంధపరంపరావళీ
యోగము నందజేయుట మహోత్సవమంచు దలంచి నిల్చు హే
రాగమయా! శుభప్రద నిరంతరసన్నుతసత్వదీప్తి నీ
యీగతిలోన నీభువిని నెల్లెడ నింపుము నూతనాబ్దమా!                      3.
ఉ.
నిన్నిట సంఖ్యలందు గణనీయగ జూతుము చింతయేల నీ
కన్నిట గూర్చు గౌరవము లందు మనామక వైననేమి నీ
కన్నులలో వరీయశుభకామన నింపి మహత్ప్రభావవై
యన్నుల మిన్నవై మనుము హాయనరాజమ! నూతనాబ్దమా!             4.
ఉ.
నీవిటనుండ నీభువిని నిత్యనిరామయభాగ్యరాశి మా
కేవిధినైన నందునని, యీప్సిత సిద్ధి ఘటించ నెంచు మా
భావము గూల్చబోవలదు వత్సరసంతతిలోన నిన్ను సం
భావన చేతు మీ వతిశుభప్రద వంచును నూతనాబ్దమా!                              5.

No comments:

Post a Comment