Sunday 12 January 2020

విష్ణుస్తుతి


విష్ణుస్తుతి
శా.
వైకుంఠున్ గరుణావిశేషనిలయున్ భాగ్యప్రదున్ శాశ్వతున్
శ్రీకంఠాదిసమస్తదేవవినుతున్ జిన్మూర్తినిన్ జిష్ణునిన్
లోకార్త్త్యంతకు ధర్మరక్షకు  నజున్ లోకైకవీరున్ బ్రభున్
చీకాకుల్ దొలగించి గాచుటకునై "జే"యంచు బ్రార్థించెదన్.               1.
మ.
జగదీశా! సరసీరుహాక్ష! చతురా! సౌజన్యరత్నాకరా!
ఖగరాడ్వాహన! కామితార్థఫలదా! కైవల్యసంధాయకా!
యగజాశోకవినాశనా! యఘమహాహంకారసంహారకా!
నిగమారాధితపాదపద్మయుగళా!  నిన్గొల్తు సర్వాత్మకా!                       2.
మ.
అతులానందవిధాయకా! యనుపమా! యైశ్వర్యదా! యచ్యుతా!
వితతౌన్నత్యమహత్ప్రభావసహితా! పీతాంబరా! విశ్వపా!
నుతసర్వామర! నాశితాసురగణా! నూత్నానురాగావృతా!
నతభక్తేష్టఫలప్రదా! నరహరీ! నారాయణా! సన్నుతుల్.                     3.
మ.
విమలోదారవరప్రదాయకవిభూ! విస్తారభావోజ్జ్వలా!
మమతాశోభిత! మౌనిసజ్జనహితా!మాన్యా! మహత్ప్రాభవా!
నమతాలోకసమస్తసౌఖ్యజనకా! నానావసుప్రాపకా!
సమతాపూర్ణ!సదా యొనర్తు బ్రణతుల్  శౌరీ! జగద్రక్షకా!                4.
శా.
గోవిందా! గుణశేఖరా! గురువరా! గోదార్చితా! గోపపా!
దేవా! దివ్యతనుప్రభావిలసితా! దేవేంద్రసమ్మానితా!
నీవే దిక్కని గొల్చుచుందు సతమున్  నీపాదపద్మంబులం
దోవైకుంఠ! శిరమ్ముజేర్చెద వరీయోత్సాహమందించుమా.                  5.

No comments:

Post a Comment