Tuesday 14 January 2020

అయోమయస్థితి


అయోమయస్థితి

శా.
శ్రీమంతంబుగ జేయు నీ వసుమతిన్ క్షేమంబులన్ నిల్పు దా
నేమాత్రంబును జంకకుండు జగమం దింపారు ధర్మంబులన్
బ్రేమావేశముతోడ గాచు ననుచున్ విశ్వాసపూర్ణాత్ములై
తామీ నేతల నెన్నుకొందురు ప్రజల్ తల్లగ్న చిత్తస్థితిన్.                      1.
మ.
తన యాలోచన లెల్ల యోగ్యములుగా, దైవానుసారంబులై
ఘనదీప్తిన్ జగమందు నింపునవిగా, కల్యాణముల్ గూర్చు పా
వనమంత్రమ్ములుగా దలంచు సతమవ్వానిన్ బ్రయత్నంబునన్
జనులందున్ బులమంగ బూను నతడున్! స్వానందసంసిద్ధికై.                  2.
మ.
గతకాలంబున జేయువారి పనులన్ గార్పణ్యభావమ్ముతో
బ్రతికూలంబుగ దెల్పి వాని కిచటన్ బ్రాధాన్యతన్ జూపకే
చతురోక్తుల్ వినిపించి స్వీయకృతులన్ సంధించు, పౌరాళికిన్
వెతలం గూర్చుటలోన జంకడు గదా! వీరత్వమున్ జూపుచున్.                    3.
సీ.
ఒకడు నిల్పినవాని నొకడు గూల్చుచునుండు
          నొకడాడు మాటల నొకడు ద్రుంచు,
ఒకని మార్గములోన నొక్కడేగక తాను
          ప్రత్యేకతను జూప బలుకుచుండు,
తనరక్షకోసమై ఘనతరైశ్వర్యముల్
          తాకట్టు పెట్టును తడయ కొకడు,
ప్రజల సొమ్మును బిండి బ్రహ్మాండమైనట్టి
          త్యాగబుద్ధిని జూపు యోగి యొకడు
తే.గీ.
కోట్ల కొలదిగ ఋణములు కోరి చేయు
వాడొకండిట జూడంగ నేడు జగతి
నౌర! నేతల లీలల సౌరు లిట్లు
సాగుచుండగ యభివృద్ధి జరుగుటెట్లు?.                                                           4.
సీ.
ఏనేత తమవాడొ, ఎవ్వాడు పెరవాడొ
          కలలోన నైనను దెలియకునికి,
యోగ్యుడెవ్వడొ చూడ యోగ్యతా శూన్యుండు
          తానెవ్వ డనుబుద్ధి తట్ట కునికి,
నుపకారి యెవ్వడో, యపకారమును జేయు
          వాడెవ్వడన్నది చూడ లేమి,
సన్మార్గ మెవరిదో సన్మతి యెవ్వడై
          నిల్చునో యత్నించి పోల్చలేమి,
తే.గీ.
విశ్వసించగ దగినట్టి విమల చరితు
డెవ్వ డనుప్రశ్న కుత్తర మిందు గనక
పౌరు లిచ్చోట శంకితాకారులగుచు
నిడుములను గాంచుచుండి రీయిలను నేడు.                                           5.
మ.
తనసంపాదనలోని విత్తముగతిన్ దానిచ్చు సంపత్తులన్
జనులన్ బిల్చుచు నింటికింటి కొకడున్, సానందియై యన్నిటన్
మును లేనట్టి విధాన నిల్పు క్షమతల్ పూజ్యార్హతల్ చూడకే
కను డీనేతల చర్య లేగతిని జక్కంజేయ సాధ్యంబగున్.                             6.
శా.
ఎన్నో యేండ్లుగ సాగుచుండెను గదా యీ స్వార్థభావైక సం
పన్నానందసుఖానుభోగ్యసరణుల్ పల్మాటలేలా యిటన్
గన్నుల్ గాననిరీతి వర్తనలచే ఖండానుఖండంబులై
యన్నింటన్ క్షతి గాంచె వృద్ధి యిచటన్ హా దైవమా! చూడుమా!                7.
శా.
నీవే రావలె లోకరక్షకుడవై నిత్యప్రసన్నుండవై
దేవా! కావు మయోమయస్థితి నిటన్ ధీరత్వముల్ గూలి స
ద్భావప్రాభవ మంతరించ నిడుముల్ ప్రాప్తించ దుఃఖించు యీ
చేవల్ చచ్చిన మానవున్ నతులివే శీఘ్రమ్ము స్పందించుమా!            8.
మ.
ఘనుడా! రమ్మిదె కర్మవీర!యిపుడీ కాలమ్ము నీశక్తులన్
వినియోగించుచు గావబూన జగతిన్ వేగమ్ముగా యోగ్యమౌ
జనసామాన్యములోన ధైర్యగతులన్ సంధించు యత్నాన దా
ననుకూలించును దైవ మీయెడను నీకన్నింట సత్పౌరుడా! 9.

No comments:

Post a Comment