Tuesday 14 January 2020

శ్రీ వేంకటేశ్వర


శ్రీ వేంకటేశ్వర
చం.
అతులితభక్తిభావమున నచ్చట జేరుచు నిన్ను జూచుచున్
వెతలను దీర్చు మంచు వినువీధికి శీర్షములేపి మ్రొక్కుచున్
స్తుతులను జేయు భక్తులకు దోరపు హర్షము గూర్చుచుండు నిన్
సతతము గొల్వబూనెదను సత్వము నిమ్మయ వేంకటేశ్వరా! 1.
ఉ.
ఏడుధరాధరంబులకు నేర్పడ నూర్ధ్వమునందు జేరి నీ
వాడను గోపురమ్ముపయి నద్భుతరీతిని స్వర్ణమూర్తివై
చూడగ రండు భక్తు లనుచున్ వచియింతువు నిన్ను గొల్చు నీ
వాడను నన్ను గావుమయ వందన మందును వేంకటేశ్వరా! 2.
ఉ.
పాపములన్ని కూలునట పల్కగ "వేంకట"యంచు నాపయిన్
జూపుము వత్సలత్వమును శుద్ధమనంబున నెల్లరీతులన్
దీపిలు నీదు నామమును దేకువ మీర స్మరించుచుందు నా
తాపము గూల్చి కావుమయ ధర్మవిధాయక వేంకటేశ్వరా!.
ఉ.
తల్లివి తండ్రివై బహువిధంబుల బ్రోచు హితైషివై శుభం
బెల్లెడ బంచు నీపయిని భక్తిని దాల్చెడి సేవకావళిన్
జల్లగ జూడుమయ్య యనిశంబును సౌఖ్యము గూర్చుమయ్య మా
యుల్లములందు నిర్మలత నొప్పుగ నింపుచు వేంకటేశ్వరా! 4.
చం.
ప్రణతులు చేతునయ్య నిను బావనమూర్తిని స్వాంతమందునన్
గుణమణినిన్ స్మరించుచును కూర్మిని జూపుచు లోకమందు గా
రణరహితంబులై కలుగు రాక్షస భావము లెల్ల విశ్వమం
దణచగ వేడుచుంటి ప్రజ కార్తిని బాపచు వేంకటేశ్వరా! 5.

No comments:

Post a Comment