Sunday 12 January 2020

హరిహరాద్వైతము



హరిహరాద్వైతము
(వాట్సాప్ లో వచ్చిన ఒక చిత్రాన్ని ఆధారముగా చేసుకొని వ్రాసినది)
సీసమాలిక

శివకేశవాద్వైత మవనిపై దెలుపంగ
రాగపూర్ణాత్ముడై సాగె శివుడు
జగదంబ నుమగూడి స్కందాగ్రజుని జేర్చి
నందివాహనుడౌచు సుందరముగ
శూలాదిధారియై మేలంచు భోగీంద్ర
మాలలన్ ధరియించి మహితతేజు
డాచంద్రశేఖరుం డాభస్మభూషితుం
డైశ్వర్యదుం డయ్యు ననుపమగతి
నాదిభిక్షువు గాన నర్థింపగా భిక్ష
నటజేరె జూడుడా యద్భుతమ్ము 
దర్శనార్థులు తాము దైవలీలనుజూడ
నాకాశ మార్గాన నచట జేర
గజవాహనుండౌచు గైటభారియు జెంత
కడలిపుత్రిని జేర్చి తడయ కటకు
పాంచజన్యము బట్టి పాణితో నొకవైపు
ధరియించి యొకట సుదర్శనమ్ము
కౌమోదకీయుక్త కరమొక్కటైయుండ 
పుష్పమొక్కటి చేత బూని తాను
పత్నీసమేతుడౌ పరమేశ్వరుని ముందు
నాత్మీయసఖుడౌట నతడు జేరె
"భవతి!భిక్షాం దేహి" "జవమున సద్భిక్ష"
నొసగుమో కల్యాణి! యుత్సహించి
యనుచు శంకరు డప్పు డర్థించెనో యేమొ
సురుచిరతనువల్లి సిరులతల్లి
ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కీమహద్భాగ్యమ్ము
ఘటియిల్లెనోయంచు గరము మురిసి
నమ్రతాపూర్ణయై కమ్రసద్భావయై
శివునిపాత్రను వేసె సిరులభిక్ష
"జ్ఞానశూన్యులు మీరు, మాననీయులు గారు
హరిహరభేదంబు లరయువారు"
తనువులు వేరౌచు కనిపించుచున్నను
వారిర్వురనరాదు వాస్తవమ్ము
ధర్మసూక్ష్మంబిద్ది కర్మఠులై యొప్పు
సద్భక్తకోటి యీ సత్య మెపుడు 
గ్రహియించి చరియించ గ్రహగతుల్ ఫలియించు
లేకపోయిన వేళ శోక మొదవు
కనరాదె మీకిందు ఘనతరంబగురీతి
గిరిశుడర్థించగా హరియు గోరి
కమలచే నిప్పించె నమలినభావాన
భిక్షమ్ము గాంచుడు విశద మిచట
ఆ.వె.
ననుచు దెలుపుచుండె నజ్ఞానలై యెప్పు
డార్యులైన హరిహరాదులందు
నంతరంబు లరసి సంతసించగగోరు
వారి కిచటి చిత్ర మోరి! యనుచు.


No comments:

Post a Comment