Tuesday 30 July 2019

భావదారిద్ర్యము


భావదారిద్ర్యము
దారిద్ర్యానుభవంబు భూత మగుచున్ తర్జించ భావంబునం
దేరీ పద్యము హృద్యమై వెలుగున ట్లీవేళ సృష్టించి స
త్కారం బందగలట్టి వార లిచటన్ తథ్యంబు పద్యస్థితుల్
చేరంబోవు సమానమౌచు వచనశ్శ్రీయుక్తమౌ కైతకున్
మీరెట్లన్న నటంచు బల్కదగునే? మేలౌనె యీ భావనల్?
సారోదాన్విత నిమ్నగా సదృశమై సన్మార్గదస్ఫూర్తితో
జేరున్ దాను హృదంతరాళములకున్ క్షేమంకరంబైన యీ
పారావారనిభప్రభావయుతమౌ పద్యప్రపంచంబు స
ర్వారాధ్యం బగు సాధుభావ సుమహ ద్భాగ్యాతిరేకంబుతో
వారు న్వీరని చూడకుండ శుభముల్ పంచంగ సంసిద్ధమై
యౌరా! యంచను రీతి భావపటలిన్ హర్షంబుగా గూర్చి దు
ర్వారోగ్రామయ సత్వసంహతిని క్షిప్రం బంత మొందించు నూ
త్నారంభంబులు చేయుచుండ, యిచటన్ దక్షత్వముం జూపుచున్
గోరం జేయరె సత్ప్రబంధరచనల్ కోటానుకో ట్లందులో
ధారల్ గట్టుచు పారుచుండదె మహద్భావప్రకాశంబు తత్
క్షీరాభాచ్ఛవిశేషదీధితులలో జిత్సౌఖ్యమందించు సం
స్కారానేకపరీమళంబు లవనిన్ సర్వత్ర వ్యాపించవే ధీ
పారమ్యంబు లభించదే జనులకున్ వాదేల? సత్యమ్ము నే
డారమ్యాద్భుత పద్యవాహిని నిటన్ హర్షంబుతో నందుచున్
తోరంబైన ప్రయత్నముల్ సలిపి యస్తోకంబులౌ కావ్యముల్
తా రీవేళ సృజించుచుండిరిగదా తత్సాహితీవార్ధిలో
తీరైనట్టి శుభాశయంబులు, లసద్దివ్యేతిహాసంబులున్,
స్వైరప్రాభవదీప్తు, లీక్షణములో సంఘంబు నందున్న త
ద్ఘోరాఘాదిసమస్తరోగతతులన్ గూల్చంగనౌ పద్ధతుల్,
నారీలోకమహత్వరక్షణకునై నవ్యంబులౌ యోచనల్,
వీరత్వంబులు, ధర్మరక్షణకునౌ విద్యల్, తదర్ధంబులున్,
దారుల్ సౌఖ్యవివర్ధనంబునకునై, ధన్యత్వమీ జన్మకున్
నైరాశ్యంబును గూల్చి గల్గు విధముల్ నానాప్రకారంబులై
తారుణ్యంబు వహించియుండ నిటులన్ తత్పద్యసంసృష్టిలో
దారిద్ర్యం బిట భావమందు గలదో ధన్యాత్ములారా! యటం
చౌరా! పల్కుట లొప్పునా? నిజముగా నానందముం గూర్చు న
ట్లేరోజైన ప్రజాఖ్యపద్యసభలో నిందున్న వారిచ్చటన్
బ్రారంభింతురు గాదె పద్యరచనన్ ప్రహ్లాద మీ సంమం
దారోగ్యాది సమస్తసౌఖ్యములచే నందించగా గోరి, య
వ్వారిన్ సాధుమహత్ప్రభావ యుతులన్ భావానుగుణ్యంబుగా
సౌరుల్ నింపిన పద్యముల్ పలుకుచున్  సన్మానసంపత్తి కా
స్కారంబైన బలంబు నందెడి శుభాకారార్యసంఘంబులన్
ధీరత్వంబు సమస్త పాఠకులలో దీపిల్లగా జేయు స
చ్చారిత్రస్థితులన్ స్మరించదగు లేశం బైన భావంబునన్
దారిద్ర్యంబిట నెంచగా దగదు సద్భావంబు లందం దగున్.


Sunday 28 July 2019

వాంఛాసిద్ధి


వాంఛాసిద్ధి
.
పద్యము వ్రాయ బూనితిని భవ్యపదంబుల భావదీప్తితో
సద్యశమున్ గడించగల సన్నుత శైలిని నింపి యందులో  
హృద్యములైన సూక్తులకు నింపుగ స్థానము గూర్చి సంమం
దద్యతనేతిహాసముల నందర కందగ జేయు కాంక్షతోన్.                               1.
.
నాదుమనోరథంబులను నమ్మితి గావున నిన్ను దైవమా
కాదనకుండ దీర్చుమయ! కామిత సత్ఫలదాతవీవు నా
పైదయజూపుమా యనుచు భక్తిగ దేవుని సంస్మరించితిన్
మీదట లేఖినిన్ గొనుచు మిక్కిలి యత్నము చేయబూనితిన్.                        2.
.
కాగితముల్ పరంపరగ గ్రమ్మిన వంతట చిత్తు చుట్టలై
యాగక నేగుచుండె గడియారపు ముళ్ళు జవంబుతో గనన్
సాగనిదాయె లేఖిని యశక్తత ద్యోతక  మౌట స్వాంతమం
దీగతి కేమి కారణమొ యెంచగ నిట్లని దోచె నాయెడన్.                                             3.
.
సవ్యవిధాన లక్షణ విచారము చేయకపోవుచుండుటల్,
కావ్యము వ్రాయ బూనుటకు కానగు పద్ధతి నేర్వకుండుటల్
దివ్యములైన పూర్వకవి దీప్తులు నేర్పెడి గ్రంథసంమున్
సేవ్యముగా దలంచక ప్రసిద్ధిని గోరుట లిందు హేతువుల్.                                4.
.
నాయెడనున్న వస్తువె యనంతము, శ్రేష్ఠము, సన్నుతం బికన్
శ్రేయద మన్నభావన యశేషముగా మనమందు దూరి యీ
కాయమునందు జేరుట సుఖంబుగ నిందు వసించి యుండుటల్
జ్ఞేయము లీపరిస్థితికి  జేర్చెడి హేతువులంచు  నిచ్చలున్.                                        5.
.
దైవములన్ దలంచినను,  దాళక కాంక్షలు బూనుచుండినన్
పావనసాహితీసుధలు పానము సేయక కావ్యసృష్టికై
యేవిధి సల్పినన్ జతన మేర్పడ దందు ఫలంబు చూడగా
నావలె కోరికల్ మిగులు నమ్మదగున్   హితకాంక్షులందరున్.                           6.

Friday 26 July 2019

జయ జగదంబ


జయ జగదంబ

మానిని

మల్లెలు జాజులు మైమరపించుట మానక పూసెడి మంకెనలున్
కొల్లలు కొల్లలు కోరిక దీరగ గూరిచి నీకయి కోవెలకున్
తల్లివి నీవని తన్మయ మందుచు తాళని నిష్ఠను దండలతో
నుల్లము దీపిల నొప్పుగ దెచ్చితి నో యుమ! గావగ నొప్పునులే.

శంభుని రాణివి, సర్వజగంబుల సన్నుతులందెడి శక్తివిలే
శాంభవి నిన్నిట చల్లని తల్లిని చక్కగ గొల్చెద సర్వదవై
శుంభనిశుంభుల చొప్పడగించిన సుందర మూర్తివి శోకహవై
కుంభినివారల  గోడడగించుచు గూర్మిని జూపగ గోరెద నిన్.

విశ్వములో గన విస్తృత మయ్యెను విజ్ఞత గూల్చెడి భేదము లా
శాశ్వతమౌ నసౌఖ్యము గూర్చెడి సత్యపథంబులు శత్రువులై
నశ్వరమై సుఖనాశము జేసెడి నవ్యవిధానమె  నమ్మెడిదై  
శశ్వదనంతవిషాదమునింపుచు సాగుచునున్నది  సంమునన్.

రావలె నీవని ప్రార్థన జెసెద రమ్యసువర్తన రాజిలగన్
దీవెన లిచ్చుచు ధీవిభవంబిట దీపిల జేయుచు ద్వేషములన్
పావన రూపిణి! పారగ ద్రోలుచు భక్తుల పాలిటి భాగ్యదవై
కావగ వేడెద కాంక్షలు దీర్చెడి కల్పకమౌచు జగంబులకున్.

నిత్యము గొల్చెద నిష్ఠను బూనుచు నిర్మలభావము నీవిడుచున్
సత్యమునందున సాగెడి శక్తిని సన్నుత వర్తన సద్గుణముల్
భృత్యుడు వీడని ప్రేమను బంచుచు వీడక గావగ విన్నపముల్
దైత్యవినాశిని! ధర్మవిహారిణి! దక్షజ! చేకొను దండములన్.  

Thursday 11 July 2019

దేశాభివృద్ధిలో నాపాత్ర

దేశాభివృద్ధిలో నాపాత్ర
11.07.2019

ఉ.
శ్రీలిట నిత్యవాసమును జేయుచునుండు, పరోపకారియై
మేలును గోరుదేశమిది, మేదినిలోన శుభప్రదంబుగా
దాలిచె సద్యశంబు, లిట దథ్యముగా సుఖదీప్తి గూర్చు, వే
దాలకు జన్మభూమి సురధామము, భారత మార్యవాసమున్.                        1.
శా.
నాదేశంబిది సద్భవంబు నిచటన్ నాకున్ బ్రసాదించె స
మ్మోదంబుల్ ప్రజకిందు గూర్చు పనియే ముఖ్యంబుగా యెంచి నా
నాదివ్యాద్భుతభావనాపటలులన్ నవ్యప్రభావంబుతో
వేదాకారముతోడ బంచు జగతిన్ విజ్ఞత్వముం గాంచుచున్.                  2.
శా.
ఈనాదేశపు సంస్కృతీవిభవమం దిస్మంతయున్ ఘాతమిం
దేనాడున్ గలుగంగ నీయను సదా యింపారు సద్వర్తనన్
మానంజూడక ధర్మ రక్షకుడనై మాన్యత్వసద్భాగ్య సం
ధానంబున్ విధియంచు నెంచి నిలుతున్ ధన్యత్వమున్ గాంచెదన్.                ౩.
శా.
నాయీదేశసమాజరుగ్మతల, నా నందంబునుం గూల్చుచున్
హేయంబైన విధాన మానసములం దెప్పట్టునన్ నీచమౌ
ధ్యేయం బంది జనించు వాని విధమున్  తేజోవిహీనంబుగా
జేయన్ దీక్ష వహించెదన్ జగతికిన్ క్షేమంబు చేకూర్చెదన్.                          4.
మ.
ఖలులై యిమ్మహిలో భయంకరములౌ కర్మంబులం జేయుచున్
తలపం జాలని రీతి సంమునకున్ దాపంబు గల్గించి యా
వల మోదంబును గాంచు శక్తులకు సద్భావప్రదంబైన కై
తల సద్భోధన చేసెదన్  జగతిలో ధర్మంబునుం గావగన్.             5

Wednesday 10 July 2019

సాహిత్య ప్రయోజనం

సాహిత్య ప్రయోజనం

శా.
సాహిత్యంపు ప్రయోజనంబు భువిలో సర్వార్థముల్ గూర్చి యీ
దేహస్థంబగు జాడ్యసంతతులకున్ దెప్పించి నాశంబు నె
ప్డాహా యంచనగల్గు సౌఖ్యవిభవం బందించుటౌ నిందు సం
దేహం బించుకయేని లేదు యశముల్ దీపిల్లు నిద్దానితోన్.  1.
మ.
వ్యవహారంబున దక్షతన్ గరపు, సవ్యంబైన సామర్ధ్య మీ
భవమందందెడి మంగళేతరములన్  భంజింపగా గూర్చు, సం
భవమౌనట్లొనరించు సౌఖ్య మెపుడున్, ప్రజ్ఞన్ బ్రదర్శించు నా
యువిదన్ బోలుచు బోధసేయు సతతం బుత్సాహమందించుచున్.   2.
శా.
అజ్ఞానంబు హరింపజేసి మదిలో నత్యంతమౌ ప్రేమతో
విజ్ఞానంబు ఘటింపజేయుచు సదా విస్తారమౌ నట్లిలన్
ప్రజ్ఞన్ గూర్చి సమాజమందు నరునిన్ భాగ్యంబు లందించుచున్
ప్రాజ్ఞుం జేయును  దీని కారణమునన్ వర్ధిల్లు సంస్కారముల్.   3.
సీ.
సాధుత్వమును నేర్పు, సర్వత్ర భువిలోన
చరియించ గల్గెడి సరణి నేర్పు,
హృదయవైశాల్యంబు ముదమారగా బెంచి 
యమలత్వమును జూపి హాయి యొసగు
మాటలాడుట లోన మధురిమల్ గురిపించు
స్నేహదీప్తిని బెంచు మోహమణచు
కర్మలన్ పొనరించు ఘనతరసామర్ధ్య
మందించు నేస్తమై యనవరతము
తే.గీ.
బ్రతుకుబాటకు సరియైన గతిని జూపు
మనిషి మనిషిగ మనగల్గి యనయ మిచట
సంతసంబులు గనునట్టి సమత గరపు
మన్ననలు గూర్చు సాహిత్య మన్నిట నిల.  4.
సీ.
సంఘసంస్కారంబు సన్నుతంబుగ నేర్పి
నవ్యమార్గము జూపి నడువు డనుట
మహిని మానవజన్మ కిహమందు పరమార్థ
మిదియంచు నేర్పుచు ముదము నిడుట
శాశ్వతైశ్వర్యంబు సవ్యసంతోషంబు
లందగల్గెడి రీతు లిందు నిడుట
సన్మార్గగమనంబు సన్నుతాచారంబు
లివియౌను జనులార యెరుగు డనుట
ఆ.వె.
దేశ రక్షణమున దీపిల్లు కాయంబు
మీకటంచు దెలిపి లోకమునకు
హితము గూర్చుచుండు టెల్ల సాహిత్యంపు
సత్ప్రయోజనంబు జగతిలోన. 5.

Monday 8 July 2019

పగను వదిలితేనే శుభం

పగను వదిలితేనే శుభం
08.07.19

ఉ.

శ్రీలణగున్, శరీరమున జేవయు జచ్చును, మానసంబునన్
మేలగు భావజాలము సమీపమునన్ వసియించబోవ, దే
కాలము నందునన్ బహుముఖంబగు కష్టము గల్గు, దేహి రో
గాలకు జుట్టమౌను పగ గ్రమ్మినచో నిజజీవనమ్మునన్. 1.
సీ.
అలనాడు కౌరవుల్ పలు వంచనలు చేసి
పాండుపుత్రులతోడ బగను దాల్చి
ప్రత్యహమ్మును వారి నత్యంతరోషాన
కష్టసాగరమందు దుష్టు లగుచు
పడనెట్టి చివరకు కడు దుస్సహంబైన 
మరణ మందిన తీరు మనము గనమె
వారి దౌష్ట్యంబుచే ధారుణీతలమంత
నట్టుడికి పోయె నా యదనునందు
తే.గీ.
వైరభావంబులను బూను కారణమున
సర్వనాశన మౌనంచు సజ్జనాళి
చెప్ప జూచిన వినరైరి చెనటు లగుట
పగకు మించిన రుగ్మత జగతి గలదె. 2.
మ.
పగవారైనను సాధు శబ్దములతో బల్కన్ బ్రమోదంబునన్
తగవుల్ సూడక సఖ్యతన్ నెరపరే తథ్యంబుగా సంపదల్ 
తగురీతిన్ గొన జూపరే తలపరే దైవత్వ మన్నింటిలో
జగతిన్ వైరము లేల యంద రొకటై సంతోష మందందగున్. 3.
కం.
పగ మంచిది కాదను టగు
తగు భావము విశ్వమందు తథ్యము పగచే
తెగిపోవును బంధంబులు
నగుబాటగు నన్ని యెడల నరునకు జూడన్. 4.
కం.
పగ వీడుట శుభకర మగు
జగతికి వైభవము లొదవు సర్వవిధాలన్
సుగమం బగు జీవన మిట
తగ నైక్యత గలిగియున్న ధరణిని బ్రజకున్. 5.

Sunday 7 July 2019

కాకి నేర్పే పాఠాలు


కాకి నేర్పే పాఠాలు
07.07.19

ఆ.వె.
కావు కావు మనుచు భావపూరితమైన
ధ్వనిని చేయుచుండి యనవరతము
జనుల కిలను నేర్పు నతరమౌరీతి
కాకి పాఠములను క్రమము గాను.                1.
ఆ.వె.
తిండి బట్టలేక తిరిపెంబులై యుండి
సాయమించుకైన సర్వ జగతి
యందకునికి నిత్య మగచాట్లు పడువారి
గావరోరి జనుడ! కావు మనును .                .  
ఆ.వె.
లోకమందు ధర్మ మీకాలమందున
నామమాత్రమయ్యె ధీమతివయి
అట్టులిట్టు లనక నద్దాని నె ట్లైన
గావరోరి జనుడ! కావు మనును .                .
ఆ.వె.
పెద్దవారలగుట వృద్ధాప్యముననేడు
కదలేక యున్న కన్నవారి  
నీసడించుకొనక యెంతేని ప్రేమతో
గావరోరి జనుడ! కావు మనును .               4.
ఆ.వె.
దేశగౌరవంబు లాశాంతములదాక
విస్తరించె నాడు వినుము దాని
నరసి నేడు నీవు నశ్రద్ధ చేయక
కావరోరి జనుడ! కావు మనును .              5.
ఆ.వె.
తనకు రక్షగూర్చు ధరణీజముల గూల్చి
దనుజ తుల్యుడౌచు మనుజు డిలను
సంతసించు తుదకు చింతించు నెట్లైన
కావరోరి జనుడ! కావుమనును.               6.
ఆ.వె.
పరిసరంబులన్ని మురికి చేయుచునుండు
కలుషితంబు నదుల గలుపుచుండు
తగని పని యిదంచు మనుజునకుం దెల్పి
కావరోరి జనుడ! కావుమనును.               7.
ఆ.వె.
అనుదినంబు కాకి యర్థవంతంబుగ
చెప్పుచుండు హితము చేయదలచి
కావుకావు మనుచు కడు సంతసంబున
బంధుజనుల రాక బలుకుచుండి.            8.
ఆ.వె.
ధరణి వీడి చేరి పరలోక మందున
నున్న వారి కొరకు నుర్విజనము
లొసగునట్టి మెతుకు లుత్సాహమున నంది
వారి జేర్తునంచు బలికి యెగురు.              9.

ఔను, నాకు దేవుడు కనబడ్డాడు.


ఔను, నాకు దేవుడు కనబడ్డాడు.
 06.07.19
ఉత్పలమాలిక

దేవుని గంటి నేనిచట దీనజనంబుల సేవ చేయుటే
పావనమైన కార్యమని ప్రత్యహమున్ మదిలోన నిష్ఠతో
భావన చేయుచున్ నిలుచు వారలలోన, నిరంతరమ్ముగా
జీవన మీ ధరాస్థలిని చిన్మయరూపుడు దేవదేవు డిం
దేవిధినైన సంమున నింపెసలార పరోపకార మో
జీవుడ! చేయుమా యనుచు చెప్పి సృజించెను నన్ను నాదు నా
నావిధ సంపదల్ జనగణంబుల నార్తులలోన బంచెదన్
ధీవిభవంబు మీర నని దెల్పి చరించెడి వారియందునన్
దైవము నిందు జూచితిని, తన్మయులై ప్రజ కెల్లరీతులన్
శ్రీవిభవంబు జూపుచును, శీలము శోభిలునట్టి పద్ధతుల్
జీవితమందు దీప్తులను జేర్చుకొనందగు సత్పథంబు,
ద్భావము లెప్డు నేర్పగల వారయి దీపిలు తల్లిదండ్రులం
దావర దాయకున్ బ్రభు ననంతసుఖప్రదు జూచినాడ నౌ
నోవిమలాత్ములార!  నిజ ముర్విని సందియ మించుకేనియున్
రావల దిందు నమ్మవలె రమ్యపదంబులతోడ యిచ్చటన్
చేవను జూపు విజ్ఞ కవిశేఖరులార! ముదంబు నాకగున్.

వృద్ధాప్యం-రెండవ బాల్యం



వృద్ధాప్యం-రెండవ బాల్యం
04.7.19

కం.
శుద్ధాంతరంగ సంయుత
మిద్ధరణిని ధర్మబద్ధ మెల్లరి కొరకై
సద్ధితము గోరుచుండెడి
వృద్ధాప్యము బాల్యనిభము విను డెట్టు లనన్. 1.
ఆ.వె.
చీకుచింత లెపుడు చేరంగ రాబోవు
స్వపరభేద మరయు నెపము గనము
కలిమి లేము లిటను బలిమి జూపించవు
రసను బాల్యనిభము ముసలితనము. 2.
కం.
అందరి క్షేమము గోరుచు
సుందరమగు భావి కొరకు శుభకామన లె
ప్డందించు ముసలితనమును
సందియమే లేదు బాల్య సమమని యనుటన్. 3.
ఆ.వె.
ధనము కూడబెట్టి యనయంబు సౌఖ్యాల
కొరకు కాంక్షసేయు సరణి లేదు
దొరకినంతలోన నరుసంబులను గాంచు
ముసలితనము బాల్యమునకు సమము. 4.
కం.
ప్రేమం బందును, సకలురు
క్షేమంబుల నడుగుచుండి కీర్తించెద రీ
భూమిని గన వృద్ధాప్యము
ధీమతులకు బాల్యసమము తెలియుడు దీనిన్. 5.
ఆ.వె.
బాలవాక్కు నిజము బ్రహ్మవాక్కని యండ్రు
పెద్దవారి మాట చద్దిమూట.
మెండు హితము గూర్చు రెండును భువిలోన
ముసలితనము బాల్యమునకు సమము. 6.

అవయవదానం



అవయవదానం


03.7.19 -

తే.గీ.

అవయవంబుల దానమీ యవనిలోన

దానసముదాయమున జూడ తథ్యముగను

శ్రేష్ఠతరమౌట దానికై సిద్ధమైన

వాని కబ్బును సౌఖ్యంబు పరమునందు. 1.


తే.గీ

కాలి బూడిదయైపోయి నేలనుగల

మట్టి గలియుటయే గాన గట్టి మదిని

నవయవంబుల నితరుల కందజేయ

గోరువానిని పరమందు చేరు సుఖము. 2.


నిజమైన సౌందర్యం.


నిజమైన సౌందర్యం.
(05-07-19)

ఆ.వె.
మానవుండు సతము మాన్యత్వముం బొంద
సంచరించుచుండి సర్వగతుల
దేహసౌష్ఠవంబు దీప్తిప్రదంబైన
యంద మంద గోరు నన్నిగతుల.                      1.
ఆ.వె.
దేహదీప్తి గోరి దివ్యౌషధంబుల
రాశులిందునందు శ్రమకు నోర్చి
కూర్చు కొనుట లోన కువలయంబంతయు
తిరుగుచుండు టిందు నరయవచ్చు.                2.
ఆ.వె.
స్వర్ణమయములైన సన్నుతాభరణంబు
లతులరత్నఖచితమై వెలుంగు
నట్లు కూర్చి తాల్చ నమరిన యందాని
కనుభవించు మోద మహరహంబు.                    3.
ఆ.వె.
మోహమిం దదేల దేహంబు నిత్యమై
నిలువబోదు భువిని నిక్కముగను
దాని కంద మిచట నానావిధంబైన
భూషణంబు లొసగబోవు వినుడు.                    4.
ఆ.వె.
నిర్మలాత్ములార! నిజమైన సౌందర్య
మెందు గల దటంచు సుందరమగు
మనముతోడ నెంచ నతరమైనట్టి
యంద మిందు నంద రరయవచ్చు.                  5.
ఆ.వె.
మానవత్వదీప్తి, మమతానురాగాలు
సాటివారియందు సవ్యమైన
సానుభూతితోడ సమతను జూపించు
టందు నిక్కమైన యంద మమరు.                    6.
ఆ.వె.
స్వార్థబుద్ధి వీడి సర్వమానవులకు
నిత్యశుభము గోరు నిర్మలమగు
ఠీవియూని హితము భావించుచుండుట
యందు నిక్కమైన యంద మమరు.                  7.
ఆ.వె.
ఎదుటివారి మనసు కిసుమంతయుం గాని
బాధ కలుగురీతి పరుషములగు
మాటలాడకుండ మనగల్గ జాలుట
యందు నిక్కమైన యంద మమరు.                  8.
ఆ.వె.
ఆత్మతుల్యు లంద రన్నలు తమ్ముళ్ళు
జగతి యంత నాకు స్వంతమైన
దగు కుటుంబ మనుచు ననుకొన గల్గుట
యందు నిక్కమైన యంద మమరు.                  9.
ఆ.వె.
ఇతరు లెన్నియేని యిక్కట్లు పడుచుండ
స్వీయసుఖము లందు హేయమైన
సంతసంబు గాంచు స్వాంతంబు వీడుట
యందు నిక్కమైన యంద మమరు.                  10.
ఆ.వె.
నాదు కుక్షి నిండ మోదమందెద నంచు
దలచకుండ తనదు ధనచయంబు
దీనజనుల జేరి దానంబు చేయుట
యందు నిక్కమైన యంద మమరు.                  11.
ఆ.వె.
తనను విశ్వసించి తనపక్షమున జేరు
వారి నమ్మకంబు కోరి ద్రుంచి
వంచనంబుతోడ బాధించకుండుట
యందు నిక్కమైన యంద మమరు.                  12.
ఆ.వె.
ఫలము లందగోరి పరుల పంచన జేరి
స్వీయధర్మ మన్న ఛీ యటన్న
భావ మూనకుండ పావనుండైయుండు
టందు నిక్కమైన యంద మమరు.                    13.
ఆ.వె.
అల్పసుఖములందు ననునిత్యమును పెచ్చు
కల్లలాడునట్టి కాంక్ష వీడి
సత్యవాదియౌచు నిత్యంబు చరియించు
టందు నిక్కమైన యంద మమరు.                    14.
ఆ.వె.
జన్మభూమి కొరకు సన్మార్గగామియై
ధర్మదీక్ష బూని తనువు, ధనము
తడయకుండ జేరి త్యజియించు యత్నంబు
నందు నిక్కమైన యంద మమరు.                    15.
ఆ.వె.
గృహము జన్మభూమి లిహమందు సౌఖ్యంబు
కలుగజేయు నట్టి స్థలము లగుట
సతము వాటికైన స్వచ్ఛతాకార్యంబు
లందు నిక్కమైన యంద మమరు.                    16.
ఆ.వె.
వృక్ష మిలను జనుని రక్షించు గావున
లక్ష మాటలేల లక్షణముగ
చెట్లు నాటి వాటి సేవను తరియించు
టందు నిక్కమైన యంద మమరు.                    17.
ఆ.వె.
కలియుగంబులోన నిలపైన ధర్మంబు
మృగ్యమగుచునుంట యోగ్యు డగుట
తలచి నిష్ఠతోడ   దానిని రక్షించు
టందు నిక్కమైన యంద మమరు.                     18.
ఆ.వె.
మహిని దైవతములు మహిళలై యుండుట
మాతృభావమూని నాతుల గని
గారవించుటౌను కర్తవ్యమని యెంచు
టందు నిక్కమైన యంద మమరు.                    19.
ఆ.వె.
గురుజనంబులందు నిరతంబు భక్తితో
మెలగుచుండి యొండు తలపు లేక
క్షితిని వారిమాట హితకరమని యెంచు
టందు నిక్కమైన యంద మమరు.                    20.
ఆ.వె.
కనుక మేలుకొనుట కర్తవ్య మగుటను
జాగరూకులౌచు సర్వజనులు
నిష్ఠబూని భువిని నిజమైన సౌందర్య
మరయ గలుగు సరణి నందవలయు.                21.