Monday 8 July 2019

పగను వదిలితేనే శుభం

పగను వదిలితేనే శుభం
08.07.19

ఉ.

శ్రీలణగున్, శరీరమున జేవయు జచ్చును, మానసంబునన్
మేలగు భావజాలము సమీపమునన్ వసియించబోవ, దే
కాలము నందునన్ బహుముఖంబగు కష్టము గల్గు, దేహి రో
గాలకు జుట్టమౌను పగ గ్రమ్మినచో నిజజీవనమ్మునన్. 1.
సీ.
అలనాడు కౌరవుల్ పలు వంచనలు చేసి
పాండుపుత్రులతోడ బగను దాల్చి
ప్రత్యహమ్మును వారి నత్యంతరోషాన
కష్టసాగరమందు దుష్టు లగుచు
పడనెట్టి చివరకు కడు దుస్సహంబైన 
మరణ మందిన తీరు మనము గనమె
వారి దౌష్ట్యంబుచే ధారుణీతలమంత
నట్టుడికి పోయె నా యదనునందు
తే.గీ.
వైరభావంబులను బూను కారణమున
సర్వనాశన మౌనంచు సజ్జనాళి
చెప్ప జూచిన వినరైరి చెనటు లగుట
పగకు మించిన రుగ్మత జగతి గలదె. 2.
మ.
పగవారైనను సాధు శబ్దములతో బల్కన్ బ్రమోదంబునన్
తగవుల్ సూడక సఖ్యతన్ నెరపరే తథ్యంబుగా సంపదల్ 
తగురీతిన్ గొన జూపరే తలపరే దైవత్వ మన్నింటిలో
జగతిన్ వైరము లేల యంద రొకటై సంతోష మందందగున్. 3.
కం.
పగ మంచిది కాదను టగు
తగు భావము విశ్వమందు తథ్యము పగచే
తెగిపోవును బంధంబులు
నగుబాటగు నన్ని యెడల నరునకు జూడన్. 4.
కం.
పగ వీడుట శుభకర మగు
జగతికి వైభవము లొదవు సర్వవిధాలన్
సుగమం బగు జీవన మిట
తగ నైక్యత గలిగియున్న ధరణిని బ్రజకున్. 5.

No comments:

Post a Comment