Wednesday 10 July 2019

సాహిత్య ప్రయోజనం

సాహిత్య ప్రయోజనం

శా.
సాహిత్యంపు ప్రయోజనంబు భువిలో సర్వార్థముల్ గూర్చి యీ
దేహస్థంబగు జాడ్యసంతతులకున్ దెప్పించి నాశంబు నె
ప్డాహా యంచనగల్గు సౌఖ్యవిభవం బందించుటౌ నిందు సం
దేహం బించుకయేని లేదు యశముల్ దీపిల్లు నిద్దానితోన్.  1.
మ.
వ్యవహారంబున దక్షతన్ గరపు, సవ్యంబైన సామర్ధ్య మీ
భవమందందెడి మంగళేతరములన్  భంజింపగా గూర్చు, సం
భవమౌనట్లొనరించు సౌఖ్య మెపుడున్, ప్రజ్ఞన్ బ్రదర్శించు నా
యువిదన్ బోలుచు బోధసేయు సతతం బుత్సాహమందించుచున్.   2.
శా.
అజ్ఞానంబు హరింపజేసి మదిలో నత్యంతమౌ ప్రేమతో
విజ్ఞానంబు ఘటింపజేయుచు సదా విస్తారమౌ నట్లిలన్
ప్రజ్ఞన్ గూర్చి సమాజమందు నరునిన్ భాగ్యంబు లందించుచున్
ప్రాజ్ఞుం జేయును  దీని కారణమునన్ వర్ధిల్లు సంస్కారముల్.   3.
సీ.
సాధుత్వమును నేర్పు, సర్వత్ర భువిలోన
చరియించ గల్గెడి సరణి నేర్పు,
హృదయవైశాల్యంబు ముదమారగా బెంచి 
యమలత్వమును జూపి హాయి యొసగు
మాటలాడుట లోన మధురిమల్ గురిపించు
స్నేహదీప్తిని బెంచు మోహమణచు
కర్మలన్ పొనరించు ఘనతరసామర్ధ్య
మందించు నేస్తమై యనవరతము
తే.గీ.
బ్రతుకుబాటకు సరియైన గతిని జూపు
మనిషి మనిషిగ మనగల్గి యనయ మిచట
సంతసంబులు గనునట్టి సమత గరపు
మన్ననలు గూర్చు సాహిత్య మన్నిట నిల.  4.
సీ.
సంఘసంస్కారంబు సన్నుతంబుగ నేర్పి
నవ్యమార్గము జూపి నడువు డనుట
మహిని మానవజన్మ కిహమందు పరమార్థ
మిదియంచు నేర్పుచు ముదము నిడుట
శాశ్వతైశ్వర్యంబు సవ్యసంతోషంబు
లందగల్గెడి రీతు లిందు నిడుట
సన్మార్గగమనంబు సన్నుతాచారంబు
లివియౌను జనులార యెరుగు డనుట
ఆ.వె.
దేశ రక్షణమున దీపిల్లు కాయంబు
మీకటంచు దెలిపి లోకమునకు
హితము గూర్చుచుండు టెల్ల సాహిత్యంపు
సత్ప్రయోజనంబు జగతిలోన. 5.

No comments:

Post a Comment