సంతానము
ఉ.
నాతనయుండు దత్సతియు నాతనుజాతయు సాధువర్తనన్
జేతమునందు సంతసము జేకుర జేయుచునుందు రెల్లెడన్
మాతకు నాకు నమ్రులయి మాన్యత నందెడి యోగ్యపద్ధతుల్
ప్రీతిగ నేర్చు కార్యమున విస్తృతహర్షము నందగోరుచున్. 1.
చం.
చదువులలోన శ్రద్ధయును స్వాంతమునం దతులప్రమోదమున్
వదలని యత్నదీప్తియును భాగ్యవివర్ధకభావశుద్ధి యే
యదనుననైన సభ్యతల నందెడి తత్పరతల్ గలట్టి యీ
సదమల సంతతి న్గనిన సంతసముల్ సమకూరు నామదిన్
2.
చం.
వినయవిధేయతల్ గలిగి విజ్ఞత నేర్చి నిరంతరమ్ముగా
జనకులమానసంబులకు సర్వవిధంబుల సౌఖ్యసంపదల్
గొనకొని కూర్చుచుండుటయె కోరికగా మది నెంచుచుండు మ
త్తనుజుల భక్తిభావమును దప్పక మెచ్చెద ప్రేమ జూపుచున్. 3.
చ.
సురుచిరవర్తనంబునను శోభిలుచుండెడి నాతనూభవుల్
నిరుపమభాగ్యముల్ గనుచు నిత్యసుఖంబుల నందుచుండి తా
మురుతరసద్యశోవిభవ మున్నతలీలను గాంచి నిచ్చ లిం
దరుసము లందుచుండవలె నంచు మనంబున గాంక్ష చేసెదన్. 4.
శా.
దైవంబున్ సతతంబు గొల్చెదను సద్భక్తిన్ మదీయాత్మజుల్
భావౌన్నత్యముగాంచి ధర్మపరులై ప్రజ్ఞావిశేషంబుతో
నేవేళన్ ముదమంద జూచుచు వరీయేచ్ఛాఫలం బీభువిన్
భావి న్నిత్యము నంద జూడు మనుచున్ వాత్సల్యమున్ జూపుచున్. 5.
హ.వేం.స.నా.మూర్తి.
03.10.20