Friday 2 October 2020

అర్థాంగి

 

అర్థాంగి

 

శా.

నాయానందమె కోరుచుండి సతమున్ నాకీసమాజమ్మునన్

శ్రేయంబందగ జేయు కార్యములలో జేయూతగా నిల్చుచున్

స్వీయాంతస్స్థితసభ్యతాపరిమళశ్రీచే బ్రకాశించుచున్

నాయర్థాంగి ఘటిల్లజేయు బలమున్ నాయాత్మయై యన్నిటన్.   1.

 

శా.

నాలో ధైర్యము నింపుచుండు నెపుడున్ నానాప్రకారంబుగా

మేలైనట్టి విధాన బల్కు మమతోన్మేషంబు సంధించుచున్

వాలాయంబు మదీయచిత్తపటలిన్ బ్రహ్లాదమున్ నింపు తా

నీలోకంబున నాదు సత్వ మనగా నెంతేని ప్రేమంబునన్.   2.

 

శా.

సంతానంబున కందజేయును మహత్సవ్యానురాగమ్ము కా

సంతైనన్ శ్రమయంచు నెంచదుగదా యర్థంబు లందించుచున్

సంతోషంబును బొందుచుండును మనస్స్థస్వచ్ఛ భావంబులన్

జెంతం జేరుచు వారి యున్నతికినై క్షేమాది సంపత్తికై.   3.

 

.

పుట్టిన మెట్టినిండ్లకయి పూర్ణమనంబున సఖ్యతా స్థితుల్

గట్టిగ నాటజేయుటకు గానగు రీతి జరించు రెంటికిన్

గట్టిన సేతువో యనగ గర్మఠయై సతతంబు నిల్చు తా

నిట్టి సదాశయాఢ్య నిజ మీమెను మెచ్చెద నెల్లరీతులన్. 4.

 

శా.

నేనీరీతి జరించుచుండుట కిటన్ నిత్యమ్ము పద్యాబ్ధిలో

స్నానం బాడుచు నుంటకున్ కతమిదౌ సత్యమ్ము మున్ముందుగా

తానై శ్రోతగ మెచ్చుచుండుటయ విద్యాలంకృతన్ యోగ్యతా

స్థానన్ నాహృదయాధిదేవతను మోదం బందగా మెచ్చెదన్.  5.

 

.వేం..నా.మూర్తి,

26.9.20.

No comments:

Post a Comment