Friday 2 October 2020

అమ్మ

 

అమ్మ

మ.

జననం బీభువిపై నొసంగి పలుకన్ శబ్దంబులన్ నేర్పి జీ

వనయానంబున కైన బుద్ధినిడి సవ్యంబైన మార్గంబునం

దనయం బిచ్చట సంచరించు గతులం దత్యుత్తమానందమున్

నతన్ నేర్పిన తల్లి కే నొసగెదన్ గైమోడ్పులన్ నిత్యమున్.                              1.

ఉ.

ఎన్నివిధాల గుందినదొ యేవిధి గష్టము లంది యున్నదో

తిన్నదొ లేదొ నందనుని ధీమతిగా నొనరించు కార్యమం

దున్నతమైన భావమున నుత్సవ మంచు దలంచుచుండి  నా

కన్నివిధాల యోగ్యతల నందగ జేసిన దమ్మ, మ్రొక్కెదన్.                      2.

మ.

జననీ! నీపదసీమయందు శిరమున్ సానందచిత్తమ్ముతో

వినయం బొప్పగ జేర్చి నిన్ను గొలుతున్ బ్రేమస్వరూపమ్ముతో

నను నీనందను నీసమాజమున సన్మానార్హునిన్ జేయు నీ

కెన లేరెవ్వరు వందనంబు లిట నీకేవేళ నందించెదన్.                                       3.

మ.

నిను దర్శించిన సంతసంబు గలుగున్, నీమాటలన్ విన్నచో

నమందారమరందబిందుతతులన్ గాంక్షించి  కొన్నట్లుగా

మనముబ్బున్ భవదీయ సమ్ముఖమునన్ మానంబు ధైర్యంబు నీ

తనయున్ నన్ను వరించు చుండు జననీ! దండంబు నీవందుమా!             4.

మ.

నిను సేవించెడి భాగ్యమించు కయినన్ నీవందగానీయ కో

జననీ! దేహము వీడియుంటి వెపుడో సత్యమ్ము మాతౄణ మీ

తనుజుం డేగతి తీర్చగల్గు? వినుమా త్వద్దర్శితాధ్వమ్మునం

దనయం బేను జరింతు నమ్రమతి నీకందింతు గైమోడ్పులన్.                  5.

 

.వేం..నా.మూర్తి.

16.9.20.

No comments:

Post a Comment