Friday 2 October 2020

సంతానము

 

సంతానము

.

నాతనయుండు దత్సతియు నాతనుజాతయు సాధువర్తనన్

జేతమునందు సంతసము జేకుర జేయుచునుందు రెల్లెడన్

మాతకు నాకు నమ్రులయి మాన్యత నందెడి యోగ్యపద్ధతుల్

ప్రీతిగ నేర్చు కార్యమున విస్తృతహర్షము నందగోరుచున్.                        1.

చం.

చదువులలోన శ్రద్ధయును స్వాంతమునం దతులప్రమోదమున్

వదలని యత్నదీప్తియును భాగ్యవివర్ధకభావశుద్ధి యే

యదనుననైన సభ్యతల నందెడి తత్పరతల్ గలట్టి యీ

సదమల సంతతి న్గనిన సంతసముల్ సమకూరు నామదిన్                      2.

చం.

వినయవిధేయతల్ గలిగి విజ్ఞత నేర్చి నిరంతరమ్ముగా

జనకులమానసంబులకు సర్వవిధంబుల సౌఖ్యసంపదల్

గొనకొని కూర్చుచుండుటయె కోరికగా మది నెంచుచుండు

త్తనుజుల భక్తిభావమును దప్పక మెచ్చెద ప్రేమ జూపుచున్.                    3.

.

సురుచిరవర్తనంబునను శోభిలుచుండెడి నాతనూభవుల్

నిరుపమభాగ్యముల్ గనుచు నిత్యసుఖంబుల నందుచుండి తా

మురుతరసద్యశోవిభవ మున్నతలీలను గాంచి నిచ్చ లిం

దరుసము లందుచుండవలె నంచు మనంబున గాంక్ష చేసెదన్.                 4.

శా.

దైవంబున్ సతతంబు గొల్చెదను సద్భక్తిన్  మదీయాత్మజుల్

భావౌన్నత్యముగాంచి ధర్మపరులై ప్రజ్ఞావిశేషంబుతో

నేవేళన్ ముదమంద జూచుచు వరీయేచ్ఛాఫలం బీభువిన్

భావి న్నిత్యము నంద జూడు మనుచున్ వాత్సల్యమున్ జూపుచున్.            5.

 

హ.వేం.స.నా.మూర్తి.

03.10.20

1 comment:

  1. సర్వ జగద్రక్షకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ పద్యాలు సంకలనం చేయించాలి అనుకుంటున్నాను గోవిందాక్షర శతకం : అక్షరానికి వంద పద్యాలు
    ఛందస్సు : మీ ఇష్టం
    భాష : తేట తెలుగు, సంస్కృతం , ద్విభాషా మిళితం
    మొదటి శతక పద్యం: (అకార పద్యాలు వంద సేకరిస్తాము)
    అక్షరములోని ప్రతి పదమూ "అ" తో మొదలవ్వాలి లేదా "అ కార అక్షరము" తో మొదలవ్వాలి.
    పద్య భావము వేంకటేశ్వరుని కీర్తిస్తూ కానీ స్వామి రూపాన్ని వర్ణిస్తూ కానీ స్వామి లీలలు తెలుపుతూ కానీ ఉండాలి.
    ప్రతి పదార్ధ భావాలూ కూడా పద్యముతో పాటూ తెలపాలి
    మాకు అందిన పద్యాల ను వీడియో సంకలనం చేస్తాము. ప్రతీ పద్యముతో పాటూ రచయిత /రచయిత్రి పేరు ముఖ చిత్రము మరియు వారి వివరాలు వీడియో లో నిఖిప్తం చేస్తాము
    గమనిక : ఒకరు ఎన్ని పద్యాలు అయినా రాయవచ్చు
    send your poems to slokalupadyalu@gmail.com / slokalu@rcsindia.co.in
    Whats app : 9490702244

    ReplyDelete