Friday 2 October 2020

శ్రీసీతాపతిశతకము

 

శ్రీసీతాపతిశతకము

రచయిత

హరి వేంకట సత్యనారాయణ మూర్తి

 

 

శ్రీరామ

శ్రీసీతాపతిశతకము

 (ఛందము : శార్దూలము)

 

శ్రీమత్పంక్తిరథాత్మజాత! సుమనస్సేవ్యా! జగద్రక్షకా!

రామా! భాగ్యవిధాయకా! నుతగుణా! రాజీవనేత్రా! నతుల్

స్వామీ! మౌనిజనాశ్రయా! స్తుతమతీ! సౌఖ్యప్రదా! రావా!

క్షేమప్రాపక! యోగివంద్య! సుయశశ్శ్రీమంత! సీతాపతీ!               1.

 

సంకల్పించగ జేసినావు పలుకన్   సత్పద్యముల్ నీపయిన్

సంకోచింపక నూరు, శబ్దగతులన్ శైలీమహత్వంబులన్

జంకింతేనియు లేక నేర్వనయితిన్ సత్యంబు నీవే నిరా

టంకస్ఫూర్తి ననుగ్రహించవలె జాడన్ జూపి సీతాపతీ!                  2.

 

నాజన్మప్రదులైన వారలను, నానా యోగ్యమార్గంబులన్

దేజంబందగ విద్యనేర్పు గురులన్, ధీమంతులై కావ్యముల్

రాజిల్లంగను వ్రాయు పూర్వకవులన్ బ్రార్థించి నేనీపనిన్ 

రాజేంద్రా! భవదీయసత్కృపను బ్రారంభింతు సీతాపతీ!              3.

 

కౌసల్యాప్రియనందనా! నరవరా! కల్యాణభావాన్వితా!

హే సర్వేశ్వర! కోసలేశ! కరుణాహేవాక! వీరాగ్రగా!

నీసాన్నిధ్యము భక్తసంములకున్ నిక్కంపుటానందముల్

భాసిల్లంగను జూపు జీవనమునన్ బద్మాక్ష! సీతాపతీ!                   4.

 

రామా! నీయభిధన్ గలట్టి మహిమల్ బ్రహ్మాండమం దెచ్చటన్

ప్రేమానుగ్రహపూర్ణ! యన్యములలో వేమారు యత్నించినన్

నీమంబందియు జూడలేము విధిగా నిత్యంబు శ్రీమంత! నీ

నామంబున్ స్మరియింతు సన్నుతమతిన్ నాకిమ్ము సీతాపతీ!         5.

 

 

 

"రా"యంచాడుట లాత్మసంస్థితములౌ రక్షోనిభాఘంబులన్

కాయాస్థానము వీడి రమ్మనుట తర్కంబేల, యోచించినన్

న్యాయాధార! కవాటమౌచు నిలుపు న్వానిన్ కారంబు తా

మైయత్నించిన దూరనీయనను ధ్యేయంబొప్ప సీతాపతీ!             6.

 

నీపాదాబ్జరజంబు సోకిన తరిన్ నిక్కమ్ముగా కాంతయై

యాపాషాణము నిల్చె నీమహిమ లా యబ్జాసనాదుల్ సురల్

కోపానుగ్రహసంయమీంద్రతతు లీ క్షోణిన్ గ్రహించంగ లే

రాపద్బ్బాంధవ! నాకు సాధ్యమగునా? యత్నించ సీతాపతీ!          7.

 

భద్రాద్రిన్ గరుణాసుధారసమిటన్ బంచంగ నున్నాడ వో

చిద్రూపా! భవదీయ దర్శనమునన్ క్షేమాదిసంపత్తి హే

భద్రాకార! లభించు భక్తతతికిన్ బ్రాప్తించు హర్షమ్ము దీ

వ్యద్రాజీవశుభాననా! వరగుణా! భవ్యాత్మ! సీతాపతీ!                   8.

 

నాపై పద్యశతమ్ము బల్కుటకునై నవ్యానురాగమ్మిటన్

నీపై జూపెద శక్తిగూర్చెద మహన్నిష్ఠాయుతిన్ నీవు నీ

తాపంబుల్ నశియించ బూనుకొనుమా! ధన్యత్వముం గాంచుమా

యీపృథ్విన్ సుఖమందు మంటివి ముదం బిప్డయ్యె సీతాపతీ!         9.

 

నీయాదేశమునంది పద్యరచనా నిష్ఠన్ సురార్యంతకా!

ధ్యేయంబంచు ధరించినాడ పదముల్ దీపిల్ల భావంబులన్

నాయత్నంబున నందజూతువు గదా నాలోని యజ్ఞానమున్

మాయాతీత!యణంగ జేసి దొసగుల్ మాన్పించి సీతాపతీ! 10.

 

ధీరోదాత్త! పరాత్పరా! రఘువరా! దీవ్యత్ప్రభాభాసురా!

వీరాగ్రేసర! ధర్మతత్పర! లసద్విస్తారభావోన్నతా!

కారుణ్యామృతసాగరా! శుభకరా! కంజాతనేత్రా! శుభా

కారా! కావుము భక్తకోటి ననుచున్ గాంక్షింతు సీతాపతీ!                 11

 

 

 

సాక్షాద్విష్ణుని తేజమౌచు భువి గౌసల్యా సుగర్భమ్మునన్

రక్షోనాశక ధర్మరక్షక జగత్త్రాణత్వ సత్కార్యముల్

దక్షత్వంబున జేయ బుట్టిన నినున్ దైన్యాపనోదక్రియా

దీక్షామగ్నుని గొల్చుచుందు దలపుల్ దీపిల్ల సీతాపతీ!                  12.

 

ఈజన్మంబున భోగలాలసుడనై యెన్నో కుకర్మంబులన్

రాజీవాక్ష! యొనర్చుచుంటి నిచటన్ రాజన్యమూర్ధన్య! యే

వ్యాజంబున్ బ్రకటించి శాశ్వతసుఖం బందింతువో దేవ! నా

ధీజాడ్యంబు నశింపజేసి తలపుల్ దీపిల్ల సీతాపతీ!                        13.

 

రామా!నీపదపంకజాతపదవీ రమ్యాంబుపానస్ఫురత్

క్షేమావిర్భవధైర్యభాగ్యజనితా శేషప్రభావోల్లసత్

ప్రేమావేశమహత్వదీప్తి నిట నేవేళన్ సమాజమ్మునం

దామోదంబున బంచుచుండెద ముదం బర్థించి సీతాపతీ!               14.

 

దేవేంద్రాదిసమస్తదేవగణముల్ ధీశక్తినిన్ గోరుచున్

భావంబందున నిల్పి గొల్చునవి యేపాదప్రసూనంబులో

తావిన్ జిమ్ముచు భక్తకోటి కిచటన్ ధన్యత్వముం గూర్చుచున్

బ్రోవం జేరెడు వాని నీపదములన్ బూజింతు సీతాపతీ!                 15.

------------------------------------------------------------------------------

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే||

------------------------------------------------------------------------------

శ్రీరామా! కరుణారసార్ద్రహృదయా! శ్రేయఃప్రదా! రావా!

ఘోరాఘాఖ్యమహాటవీజ్వలనమా!క్రూరాసురార్యంతకా!

వీరా! నీలపయోదదేహరుచిరా! వేదస్తుతా! శాశ్వతా!

పారావారమదాపహా! సతము నిన్ బ్రార్థింతు సీతాపతీ!                  16.

 

 

 

 

రావయ్యా! కరుణాకరా! శుభకరా! రమ్యప్రభాభాసురా!

ధీవైదుష్యము గూర్చుమా యనుచు నిన్ దేవా!మనంబందునన్

భావావేశము మీర గొల్తు నిచటన్ బ్రార్థింతు నెల్లప్పుడున్

సేవాసక్తిని నిన్ను జేరి నిలుతున్ జిద్రూప! సీతాపతీ!                      17.

 

న్నించం దగువాడు కాడనుచు నన్ మందున్ మహత్క్రూరునిన్

ఛిన్నాభిన్న మనస్కు జేయకుమయా! సేవించెదన్ నిన్ను నా

యన్నం జేరెడు భంగి జేరి సతమున్ హర్షాది సంపత్తి నా

కెన్నండున్ గలుగంగ జేయు వరమీ విప్పించు సీతాపతీ!               18.

 

రాముం డొక్కడె రక్షకుండు భువిలో రక్షః ప్రకోపంబులన్

సీమల్ దాటగ ద్రుంచి కాచె మఖముల్ క్షేమంబులం గూర్చె నా

ప్రేమాకారుడె మాకు దిక్కనుచు నో శ్రీరామ! నీయర్చనల్

నీమం బొప్పగ జేయసౌఖ్యమమరున్ నిత్యమ్ము సీతాపతీ! 19.

 

ద్యత్నంబిది నిన్ను గొల్చు విధమో మాన్యా! జగద్రక్షకా!

సద్యస్స్ఫూర్తిని గల్గజేసి పదముల్ సద్భావయుక్తంబులై

హృద్యంబౌగతి గూడుచుండు విధి నీ వీవేళ నందించి యీ

విద్యాహీనుని గావుమా యనుచు నా విజ్ఞప్తి సీతాపతీ!                    20.

 

రాణించున్ భవదీయసచ్చరితమున్ రమ్యంబుగా జెప్పుచున్

బ్రాణం బుండిన యంతదాక సతమున్ "రామా"యటంచున్ మదిన్

వాణీవైభవదీప్తితో మసలినన్ వాడీ జగంబందునన్

బాణిన్ నేర్పుమయా! త్వదర్చనకు నిన్ బ్రార్థింతు సీతాపతీ!          21.

 

మేరల్ మీరెను దౌష్ట్యమీ జగమునన్ మిథ్యాపటాటోపముల్

శూరత్వంబును జూపుచున్న వకటా! శుధ్ధాంతరంగమ్ము లా

ధారం బందక దాగియుండెను గదా ధైర్యమ్ము పాపమ్మునన్

దీరై చేరెను గావుమయ్య శుభముల్ దీపిల్ల సీతాపతీ!                     22.

 

తిర్యగ్జాడ్యము నామనస్స్థలమునన్ దీవ్రంబుగా నంటె నా

చర్యల్ గాంచి హసించబోక దయతో సన్మార్గముం జూపి స

ద్ధైర్యంబున్ సమకూర్చ వేడెదనయా ధర్మంబునన్ సాగ నో

యార్యా! దాశరథీ! నమస్కృతులు నీకందింతు సీతాపతీ! 23.

 

వ్యాదిగ్రహసంముల్ త్రిదశులున్ బ్రహ్మాదులున్ మౌనులున్

దివ్యానుగ్రహసాధకుల్ స్తుతమతుల్ ధీజాడ్యముం బాయగా

నవ్యాజప్రభుభక్తితోడ నెవనిన్ హర్షాన నర్చింతు రా

భవ్యప్రాభవదాయకున్ నిను సదా ప్రార్థింతు సీతాపతీ!                  24.

 

మేలైనట్టి విధాన శుద్ధమతితో మిథ్యాప్రపంచంబునం

దాలోచించెడి శక్తినిమ్ము శుభదేహా! శాశ్వతానందదా!

నీలీలల్ పఠియించెదన్ కలుషముల్ నిత్యమ్ము పోకార్చుచున్

నీలాభ్రాభ! జయమ్ము కూర్చుమనుచున్ నిన్ గొల్తు సీతాపతీ!        25.

 

రాజ్ఞత్వంబును గోరబోను, జగతిన్ రంజింపగాజేయు సత్

ప్రజ్ఞం గూర్చు మటంచు బల్కను, భవత్పాదాంబుజారాధనా

విజ్ఞానంబు ననుగ్రహించు మనుచున్ విజ్ఞప్తులయ్యా త్వదీ

యాజ్ఞాపాలకు నన్ను గావుమని నిన్నర్థింతు సీతాపతీ!                  26.

 

మేనం గల్గిన జాడ్యజాల ముడుగున్, మిన్నంటు కల్లోలముల్

దీనత్వంబును గాంచు, హర్షమమరున్, దేజంబు చేకూరు స

న్మానార్హంబగు సద్యశం బతుకు "రామా"యంచు నిష్ఠాయుతిన్

నీనామంబు స్మరింప నిత్య మిచటన్ నిక్కమ్ము సీతాపతీ!               27.

 

ర్యాదాలవమైన నేర్వని మహామందుండ నన్నెట్టు లే

దుర్యత్నంబుల మున్గకుండెడి గతిన్ ధూర్తత్వముం గూల్చి పూ

ర్వార్యోక్తంబగు సత్పథానుగమనప్రాశస్త్యమున్ నేర్పి స

త్కార్యాధీనుని జేయగల్గుదువొ మోదంబంద సీతాపతీ!                  28.

 

నోరారన్ శుభరామనామజపమున్ నూత్నానురాగమ్ముతో

తీరైనట్టి విధాన దీప్తమతియై ధీమంతుడై చేయు నా

వీరాగ్రేసరుడైన మారుతి జగద్విఖ్యాతినిన్ గాంచె నా

కారుణ్యాత్ముని త్రోవ నేను నడువన్ గాంక్షింతు సీతాపతీ!              29.

 

క్షోనాశక! రక్షితానుగగణా! రామాభిధా! రావా!

సాక్షాద్విష్ణ్వవతారశోభిత! లసచ్ఛౌర్యప్రకాశాయతా!

అక్షీణాహవశక్తిభూషిత! మునీంద్రానీకనిత్యస్తుతా!

మోక్షప్రాపక!కోసలేశ్వర! నినున్ బూజింతు సీతాపతీ!                    30.

 

మేధశ్శుద్ధిని గూర్చువాడ వగుటన్ మీనాది రూపంబులన్

క్రోధోన్మత్తుల ద్రుంచి ధారుణిపయిన్ గూర్మిన్ బ్రశాంతత్వమున్ 

బోధించంగ ధరించి దాశరథివై పూర్ణానురాగమ్ముతో

సాధుక్షేమము నిల్పు నిన్ను గనెదన్ సర్వత్ర సీతాపతీ!                  31.

 

త్వంబున్ గలిగించుమయ్య ప్రజకున్ సత్కార్యముల్ సేయ, దై

వత్వమ్మున్ గణియించనట్టి ఖలులన్ వారించి దండించ, సా

ధుత్వమ్మున్ విధమెంచి కావగ, బ్రభూ! దుఃఖార్తులన్ బ్రోవ రా

మా! త్వత్పాదజలమ్ము పొందు వరమున్ మాకిచ్చి సీతాపతీ!         32.

 

ర్షంబెప్పుడు నీముఖంబు పయి మాయాతీత! రామప్రభూ!

వర్షించున్ భవనంబులైన, నటవీప్రాంతంబులైనన్ సము

త్కర్షాస్థానములంచు నెంచెదవయా త్వత్పాద యుగ్మంబునన్

శీర్షంబుంచి నమస్కరించెద ప్రభూ! చిద్రూప! సీతాపతీ!                33.

 

స్రష్టన్ నేను సమస్తభూతలమునన్ సామర్ధ్యముంజూపి నా

కిష్టంబైన విధాన జీవనమునం దేదేనియున్ జేసి సం

తుష్టిన్ గాంచగలాడనంచు నరు డిందున్ జూడ నంధుండు దు

శ్చేష్టల్ సేయును శాశ్వతుం డననుచున్ శ్రీరామ! సీతాపతీ!           34.

 

నాయజ్ఞానము సైచి కావవలయున్ నాపై దయన్ జూపుచున్

శ్రేయోదాయక! రామచంద్ర! సుయశశ్శ్రీమంత! లోకమ్మునన్

స్వీయావేశము న్యాయమార్గ గమనశ్శ్రీలంద యోగ్యమ్ముగా

జేయం గోరెద గింకరుండ నిను నే సేవింతు సీతాపతీ!                    35.

 

చ్చిత్తంబున జేరియున్న కృమియౌ మాలిన్యమున్ ద్రుంచుమా

సచ్చారిత్రము నందగల్గు విధమున్ సద్భావసంపత్తియున్

నిచ్చల్ గాంచెడి భాగ్య మిమ్మని సదా నిన్గొల్తు నీకంటె నా

కిచ్చోటన్ హితులొక్క రొడ్లు గలరా  యెట్లైన సీతాపతీ!                 36.

 

ద్యత్నమ్ము సమస్తపాపహరమై తథ్యమ్ముగా లోకమం

దుద్యోగస్థిరశక్తి మానవునిలో నొప్పారగా నింపు నే

విద్యన్ మానవు డార్తరక్షకుడవై విశ్వంబునన్ నిండు నిన్

హృద్యంబౌగతి సన్నుతించ గడగున్ హేరామ! సీతాపతీ!              37.

 

తుష్టిం జెందడు మానవుండు ధన మస్తోకమ్ముగా గూర్చి యీ

సృష్టిం గల్గు నశేషవస్తు వితతుల్ చేనంది భూస్వామియై

యిష్టంబైన సుఖంబునంద గుణ రాహిత్యమ్మునన్ రేగి దు

శ్చేష్టల్ సేయును కూడబెట్టుటకునై చిత్రమ్ము సీతాపతీ!                  38.

 

"ల్యం"కారాదిని "బా"వసించు దశయున్, లావణ్యగర్వమ్ముతో

వంకల్ చూపెడి యౌవనంబు గడిచెన్ వ్యర్థంబుగా దేవ! నీ

వంకైనన్ గనలేక పోయితిని నా ప్రారబ్ధ మిట్లుండె నీ

శంకాపూర్ణుని గావుమయ్య ప్రణతుల్ సర్వేశ!(సర్వజ్ఞ) సీతాపతీ!      39.

 

రావేయీశ్వర! కావుమంచు బిలువన్ రక్షింపగా జేరి యం

దావేదండబలాంతకున్ మకరి నయ్యత్నంబునన్  ద్రుంచి నీ

కేవేళన్ శుభమందు నంచపుడు మత్తేభంబును న్నిల్పు నా

దైవం బీవ యటంచు గొల్చెద బ్రభూ! దండంబు సీతాపతీ!             40.

 

స్తిష్కమ్మున జేరె కల్మషమహామాంద్యమ్ము, భావమ్మునన్

విస్తారాతిఛలాంధకార మలమెన్ విజ్ఞప్తులయ్యా జగ

చ్ఛాస్తా! దాశరథీ! మదీయ మనమున్ సంస్కార యుక్తమ్ముగా

స్వస్తిప్రాపక! చేయుమా యిదె నమస్కారమ్ము సీతాపతీ!               41.

 

నావిజ్ఞప్తుల నంది కోసలవిభూ! నానా విధాధర్మముల్

ధీవైదుష్యము గూల్చు సంగతు లిటన్ దీపిల్లె సత్వస్థితిన్

నీవివ్వానిని నాపబూనుటకునై నిష్ఠాయుతిన్ నేడిటన్

కైవల్యప్రద! జన్మమందవలయున్ గంజాక్ష! సీతాపతీ!                  42.

 

ల్లెల్ మొల్లలు స్వాదుదివ్యఫలసన్మానార్హ సద్వస్తువుల్

ఫుల్లాబ్జానన! రామచంద్ర! నియతిన్ బూజించు భావమ్ము రా

జిల్లం దెచ్చితి నీపదాంబుజరజశ్శ్రీనంద నద్దాని సం

ధిల్లం జేయుము నీదుభక్తుడను సందేహంబె? సీతాపతీ!                 43.

 

త్సా!యంచును బ్రేమతోడ బిలుచున్ బల్మారు కౌసల్య నా

సత్సంతానమటంచు నమ్ముచు నినున్ సాకంగ యత్నించుచున్

వాత్సల్యమ్మును జూపుచుండు జగతిన్ బాలించు నీపైని నే

తత్సౌభాగ్యము కల్గ నెన్నివ్రతముల్ దాజేసె సీతాపతీ!                   44.

 

రామా! నీవు విధంబు నేర్పిన ధరాప్రాంతమ్ము దౌష్ట్యమ్ములన్

నీమం బింతయు లేని వర్తనములన్ నిత్యప్రమాదమ్ములన్

సీమల్ దాటిన కల్మషార్ణవములన్ క్షేమంబు గోల్పోయె నో

శ్రీమంతా! దయజూడుమా! శుభగుణశ్రీలంద సీతాపతీ!              45.

 

వ్యంబైన బహుప్రమాదసరణు ల్నానాప్రకారంబుగా

దీవ్యద్భావసుధాప్రవాహములతో దీపిల్లు ధర్మస్థలిన్

భవ్యోదంచిత భారతావని నిటన్ వ్యాపించె నవ్వానికిన్

కావ్యారాధిత! నాశనమ్ము పలుకంగా జెల్లు సీతాపతీ!                    46.

 

నేదంపూర్వవిధాన భారతమునన్ నిర్మాయికత్వమ్ముతో

మోదం బెల్లరియందు గోరు జనులన్ మూర్ఖాగ్రగుల్ క్రూరులున్

వేదారాధ్య! మదాతిరేకయుతులై భీతిల్లగా జేయుచున్

ఖేదంబున్ సృజియింత్రు వారి దునుమన్ గీర్తింతు సీతాపతీ!           47.

------------------------------------------------------------------------------

మారీచాది దురాత్మదైత్యగణముల్ మత్తుల్ మహామౌని యా

గారంభంబున విఘ్నకారకులుగా నవ్వేళనుం జేర న

వ్వారిన్ స్వీయశరోరగప్రతతికిన్ ప్రహ్లాద మందించు స

త్కారంబున్ గొనజేయవే రఘువరా! దండంబు సీతాపతీ!              48.

 

విశ్వామిత్రగురూత్తమానుచరులై విద్యార్థులై దీక్షతో

శశ్వత్పృచ్ఛకకార్యలగ్నహృదులై సచ్ఛాత్రులై సోదరుల్

విశ్వవ్యాపక! మీరలేగు నెడలన్ వేధించు నత్తాటకన్

విశ్వక్షేమముగోరి గూల్చితివి యుర్వీనాథ! సీతాపతీ!                    49.

 

కల్యాణోత్తమభావజాలభరితా! కంజాక్ష! కైవల్యదా!

కల్యాపద్వినివారకా! నయశా! కారుణ్యరత్నాకరా!

తుల్యం బొక్కటి  లేదు నీయభిధకున్ దుఃఖాపహంబౌచు వా

త్సల్యంబున్ గురిపించి బ్రోచు నదియే సత్యమ్ము సీతాపతీ!          50.

---------------------------------------------------------------------------

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే

ఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

-----------------------------------------------------------------------------

రాశీభూతమహాసంహరణకార్యంబందు యోచించ స

ర్వాశాసంములందు "రామ"పద మత్యంతప్రభావాఢ్యమై

ధీశక్తిన్ సమకూర్చు మానవునకున్ దీప్తిన్ బ్రసాదించు నౌ

లేశం బైనను సందియంబు వినుమా! లేదిందు సీతాపతీ!                51.

 

 

 

మాన్యుల్, పండితవర్యు, లార్యులు, కవుల్, మర్యాదతో నల్గడన్

ధన్యతమ్మును గాంచగా దిరుగు నాధర్మాత్ములున్, మౌనులున్

దైన్యఘ్నా! నిను జేరు సద్గతులకై త్వన్నామసంకీర్తనం

బన్యం బెంచక చేయుచుందురు సదా! హర్షాన సీతాపతీ!               52.

 

జ్ఞంబుల్, బహుళార్థసాధకమహద్యత్నంబులున్, దానముల్

ప్రజ్ఞం జూపి వచించు వాక్యగతులున్, భవ్యవ్రతంబుల్, మహ

ద్విజ్ఞానార్జనముల్ ధరాస్థలమునన్ వేయేల నిన్ జేర స

ర్వజ్ఞా! సాధు విధానముల్ హృదయముల్ రంజిల్ల సీతాపతీ!           53.

 

రాజీవాక్షుని రామచంద్ర విభునిన్, రాజ్యాది భాగ్యంబులన్

మోజింతైనను జూపకుండ విలసన్మోదంబునన్ వీడు స

త్తేజఃప్రాభవపూర్ణునిన్ గొలిచినన్ దీపిల్లు చిత్తంబు మా

కీ జన్మంబున నండ్రు భక్తతతి సౌహిత్యాన సీతాపతీ!                     54.

 

ర్యాదాపురుషోత్తముండ వగుచున్ మాన్యత్వముం గాంచు స

త్కార్యంబందు జరించు పాలకుడవై ధర్మాకృతిన్ దాల్చు నీ

వార్యాళిన్ ఖలులీ ప్రపంచమున ధ్యేయం బంది పీడించ నా

చర్యల్ గాంచుచునుంట న్యాయమె ప్రభూ! సర్వజ్ఞ! సీతాపతీ!        55.

 

క్తుల్ నీపదసేవ చేయగల సద్భాగ్యంబునుం గాంచి య

వ్యక్తానందమహాబ్ధిమగ్ను లగుచున్ బల్మారు నీనామమున్

త్యక్తోగ్రామయులై జపింతు రిచటన్ ధన్యుల్ గనన్ వార లో

ముక్తిప్రాపక! యీజనంబుల కగున్ మోదంబు సీతాపతీ!                56.

 

ద్రాక్షేక్షూదకముల్ మరందరసముల్ దైవ్యామృతంబుల్ భవ

ద్దీక్షన్ మున్గి త్వదీయనామసుధలన్ దీపిల్లగా ద్రాగుచున్

సాక్షాత్తావకతుల్యులై మనెడి యా సద్భక్త సుశ్రేణికిన్

కుక్షిన్నింపవు తృప్తి నీయవు గదా కొంతైన సీతాపతీ!                    57.

 

త్నం బెంతయు జేయుచుండుట లిటన్ యజ్ఞాది సత్కర్మలన్

బత్నీయుక్తునిగా నొనర్చుటలు సద్భావమ్ము జూపించుటల్

రత్నంబుల్ ధనరాశి బంచుటలు  నో రామా! త్వదీయార్చనా

నూత్నోత్సాహము తోడ సాటి యగునా? నూరైన సీతాపతీ!            58.

 

రాజన్యుల్ బహుభాగ్యరాశులు సదా రక్షించుచున్ గూర్చినన్

దేజోదీప్తి మహత్ప్రభావయుతయై ధీజాడ్యమున్ మాన్చినన్

భూజాహర్షద! నీపదాబ్జములనే పూజించు సద్భక్తులన్

రాజిల్లంగను జేరగల్గు సుఖముల్  రాబోవు సీతాపతీ!                    59.

 

స్తిష్క్తంబును శుద్ధి చేయు మనుచున్ మాన్యా! యయోధ్యాప్రభూ!

స్వస్తిప్రాపక! వేడుచుంటిని మహజ్జాడ్యంబునన్ జూడగన్

నిస్తేజంబుగ మారిపోయినదయా! నీవాడ సద్భక్తహృ

ద్వాస్తవ్యా! శరణంటి కావగదగున్ దండంబు సీతాపతీ!                  60.

 

చండాశుండు సమస్తతారక లికన్ జంద్రుండు భూతాదు లీ

దండన్ నిత్యము సాక్ష్యముండిన కటా! తానెవ్వరుం జూడ న

ట్లుండన్ బోవదు విఘ్నమంచు ఖలుడై యుర్విన్ బ్రవర్తించు నీ

తం డయ్యా! మనుజుండు చేరు మిటకున్ దండించ సీతాపతీ!         61.

 

ద్రాక్షామాధురి, యిక్షుపాక మకరందప్రాప్త మాధుర్య మీ

కుక్షిం జేరవు రామనామ జపమున్ కోర్కిన్ సదా చేసి ప్ర

త్యక్షానందమునందు భక్తున కిటన్ దథ్యంబు నా కట్టి ని

త్యక్షేమంకర యోగ్యతన్ దెలుపుమం చర్థింతు సీతాపతీ!                62.

 

త్యారాధన ధర్మమార్గగమనాద్యంశంబు లీ పృథ్విపై

సత్యం బో రఘురామ! మృగ్య మగుచున్ సర్వత్ర దౌష్ట్యంబులే

నిత్యం బయ్యెను శాంతభావ మణగెన్  నీవీ స్థితిన్ మార్చగా

సత్యస్థాపక! యుద్భవించ వలయున్ జాగేల? సీతాపతీ!               63.

 

వేదప్రోక్తములైన ధర్మగతులన్ విశ్వంబునన్ నింపి దృ

గ్భేదంబున్ బరిమార్చి స్వాంతములకున్ బ్రేమన్ బ్రసాదించి యా

మోదావిష్కృతపాలనంబు నకునై ముఖ్యత్వముం గూర్చి స

మ్మోదంబున్ గలిగించి గాచుట యగున్ ముఖ్యంబు సీతాపతీ!        64.

 

న్యత్వంబును గాంచ నీచరితమున్ ధర్మానురూపంబుగా

మాన్యత్వమ్ము టింపజేయునదిగా మచ్చిత్తభాగంబునం

దన్యంబున్ జొరనీక నిర్మలపథం బందించు దీపమ్ముగా

దైన్యంబున్ సమయించు తారకముగా ధ్యానింతు సీతాపతీ!            65.

 

సేవాదృష్టి యనాథ మానవులకై,  చిత్తామలత్వంబు, నా

నావిద్వద్గురుపూజ్యభావము వదాన్యత్వమ్ము నాకియ్యెడన్

దేవా! యిమ్మని కోరుచుంటిని  ప్రభూ! ధీజాడ్యమున్ మాన్పి నిన్

సేవింతు న్సతతంబు నీయనుగుడన్ జేజేలు సీతాపతీ!                  66.

 

మ్యంబైన విధాన నీదుచరితన్ రామాయణాఖ్యంబుగా

సమ్యగ్దర్శి భవిష్యవేత్త లిఖియించన్ మౌని, భక్తావళుల్

కామ్యంబుల్ సమకూర్చు సాధనముగా గాటంపు సద్భక్తితో  

సౌమ్యత్వంబును గాంచ గొల్తురు గదా సర్వత్ర సీతాపతీ!               67.

 

ఘుమ్మంచున్ సతతంబు వ్యాప్తమగుచున్ క్షోణిన్ సమస్తంబునన్

సమ్మోదంబును గూర్చుచుండును గదా సత్కీర్తి, నీనామమున్

ముమ్మారైనను బల్కువారికి బ్రభూ! మ్రొక్కన్ మహాటంకముల్

గ్రమ్మం జూడవు నీవె త్రాతవగుటన్ గైమోడ్తు సీతాపతీ!                 68.

 

నాకంబందున జేరు భాగ్యము ప్రభూ నాకుం బ్రసాదించుమా

ప్రాకారావృత వేశ్మముల్ ధనములున్ బహ్వైచ్ఛికానందముల్

నాకీజీవనమందు గూర్చు మనుచున్ నానావిధస్తోత్రముల్

నీకుం జేయను భావశుద్ధికొరకై నిన్ గొల్తు సీతాపతీ!                      69

 

ధారాశుద్ధి, సుశబ్దరాజి, వివిధార్థప్రజ్ఞ, సద్భావముల్

చేరం జూడుము పద్యపుష్పముల నిన్ సేవించగా జేర నా

కోరామా! దశకంఠసంహర! ఋషీంద్రోద్ధారకా! రావా!

నీరేజాతనిభాననా! శుభగుణా! నిన్ గొల్తు సీతాపతీ!                     70.

 

"స్యారాధనయా సమస్తకలుషాహంకారసంక్షతి

స్తస్యాహం శరణం వ్రజామి" యనుచున్ ధన్యత్వముం గోరి నీ

దాస్యంబున్ ముదమంద జేయుటకునై ధర్మాత్మ! నిన్ జేరు నా

యాస్యంబందున హర్షముం నిలుపుమం చర్థింతు సీతాపతీ!            71.

 

నానామంత్రగతార్చనావిధములున్ నానామహత్ స్తోత్రముల్

నేనొక్కింతయు నేర్వకుంటిని గదా నిన్నెట్లు పూజించుటో

దీనారాధ్య! క్షమించు మీ యవగుణున్ దేవా! నినున్  నిచ్చలున్

ధ్యానించందగు సత్వముం గరపుమా దండంబు సీతాపతీ!             72.

 

ధాన్యంబుల్ ధనముల్ గృహాదికము లీధాత్రిన్ బ్రజారాశికిన్

నాన్యుల్ గూర్చగలట్టివారు ప్రభువై నవ్యానురాగమ్ముతో

మాన్యత్వమ్ము టింపజేసితి విటన్ మన్నించి విజ్ఞప్తి రా

జన్యా! చేకొనుమయ్య రక్షకుడవై జన్మంబు సీతాపతీ!                   73.

 

న్త్రాధారితమయ్యె జీవన మిటన్  హా! యంతరంగమ్ము దు

స్తన్త్రమ్మంది నశించుచున్న దిక వేదప్రోక్తమైనట్టి స

న్మన్త్రైతిహ్యము మందగించినది దుర్మార్గానుగవ్యాప్తి ని

స్తన్త్రమ్మైనది నీవు రావలెనయా! దండించ సీతాపతీ!                    74.

దుస్తన్త్రము          =          కపటోపాయం.

ఐతిహ్యము          =          పారంపర్యోపదేశము

నిస్తన్త్రము            =          సులభము

 

 

 

సీమల్లేవు దురాగతంబులకిటన్, క్షేమంబు ప్రశ్నాళికిన్

ధామంబయ్యెను, శక్తిహీనత గనెన్ ధర్మంబు, న్యాయంబునన్

క్షామం బేర్పడె, లోకమం దనిశమున్ గష్టప్రవాహమ్ము హే

రామా! నాట్యము చేయుచున్నది కనన్ రావయ్య సీతాపతీ!.          75.

 

తానే సర్వ మటన్నభావము మదిన్ దాల్చున్ నరుం డీయెడన్

జ్ఞానాద్యంశము లాత్మసృష్టి యనుచున్ సంధించు గర్వమ్మహో

వీనిన్ జేరవు యోగ్యతావిభవముల్ విస్తారసద్భావ మీ

వైనంబున్   గమనించ గోరుచు నినున్ బ్రార్థింతు సీతాపతీ!            76.

 

యామంబైన గతించబోవదు గదా యందిం దసత్యంబులన్

బ్రేమన్ బల్కక, జీవనంబునకిటన్ వేయేల యాధారమై

వ్యామోహంబు జనింపజేయు మృషకున్ స్వాధీన మయ్యెంగదా

భూమిన్ మానవకోటి ప్రార్థనలయా! బ్రోవంగ సీతాపతీ!                77.

 

ర్యాప్తంబగు వస్తువాహనచయప్రాముఖ్యతల్ గాంచియున్

దుర్యత్నంబులు చేయుచుండును గదా తోరంబులౌ సంపదల్

నిర్యాణస్థితి దాపురించిన గొనన్ నిక్కమ్ముగా మానవుం

డార్యా! మార్చగ లేవె యీస్థితిని నీ వాశించ సీతాపతీ!                   78.

 

ర్కంబేల? త్వదర్చనైకసుకృతిన్ దప్పన్ సదా రావా!

యర్కారాధక! దీప్తిమంత! హృదయాహంకారమున్ గూల్చి నన్

మార్కండేయుని శంకరుండు పగిదిన్ మన్నించి దోషంబులన్  

కోర్కెం దీర్చుము సత్పథానుగతి నాకున్ జూపి సీతాపతీ!             79.

 

యేసర్వార్థశుభప్రదాః సురవరాః యే నిత్యసంతోషదాః

తే సామ్యం న కదాపి యాంతి భవతా ధీఃపూర్ణ! యంచున్ సదా

నీసాన్నిధ్యము గోరువారి యెడలన్ నిష్ఠన్ బ్రదర్శించుచున్

ధ్యాస న్నిల్పుదు పాపముల్ దునుముమా దండంబు సీతాపతీ!       80.

 

 

న్నున్ బామరునిన్, మహాసహితున్, నానాదురాలోచనా

సన్నున్, మూర్ఖుని జేరదీసి యిచటన్ సౌఖ్యంబు లందించ నా

పన్నానీకశుభప్రదా! సతతమున్ త్వన్నామసంకీర్తనం

బన్నింటన్ దగ జేయ జూపితివయా! హర్షమ్ము సీతాపతీ!              81.

 

గ్నం బయ్యెను మానసం బమునన్ మర్యాద దౌష్ట్యంబునన్

భగ్నం బయ్యెను, శాంతిసౌమ్యతల సోపానంబు జూడంగ గ్రో

ధాగ్నిన్ గూలెను, దేశభద్రతకు దా నంటెన్ దరిద్రత్వ ము

ద్విగ్నంబయ్యె సమాజ మేమికతమో విశ్వాన సీతాపతీ!                  82.

------------------------------------------------------------------------------

 

కౌసల్యాసుత! రామచంద్ర!యనఘా!కారుణ్యరత్నాకరా!

హేసత్యవ్రత! దైత్యనాశక! విభూ! హేయాగసంరక్షకా!

హేసత్త్వాఢ్య! మహత్ప్రభావసహితా! హేమారుతీసేవితా!

నాసర్వస్వము నీవె యంచు గొలుతు న్దండంబు  సీతాపతీ!            83.

 

సార్వవిభక్తికము

నీవేతండ్రివి, నిన్నెనమ్మితినయా!, నీచేతనే హర్షముల్

భావింతున్, మదిలోన నీకొరకునై భక్తిన్ బ్రదర్శించెదన్,

నీవల్లన్ సుఖమందు, నీకు బ్రణతుల్, నీయందె నాప్రార్థనల్

దేవా! సన్నుతులందుమయ్య!మమతల్ దీపిల్ల సీతాపతీ!               84.

 

కౌసల్యాయనివై యయోధ్యను మహత్ కల్యాణ సద్భావముల్

భాసిల్లంగను దల్లిదండ్రుల మదిన్ బ్రహ్లాదము న్నింపుచున్

వాసిం గూర్చెడి వర్తనంబున మహద్భాగ్యంబు చేకూర్చు ని

న్నోసౌజన్యగుణాకరా! నునిగా నూహింతు సీతాపతీ!                 85.

 

మౌనీంద్రుండగు గాధిసూనుని జగన్మాన్యున్ వినమ్రుండవై

జ్ఞానంబందగ జేరి దానవులకున్ నాశంబునున్ జూపి స

ర్వానందంబున యాగమున్ జరుపగా నందించి నిర్విఘ్నతన్

నానావిద్యలు నేర్చు నిన్ను గొలుతు న్సద్భక్తి సీతాపతీ!                86.

 

ఆమౌనీంద్రునిపత్ని శాపమున దా నశ్మత్వముం బొందగా

నామెన్ పాదరజంబుచేత నట శుభ్రాకారగాజేసి సత్

క్షేమంబున్ సమకూర్చియుండిన నినున్ జిద్రూపునిన్ శాశ్వతున్

శ్రీమంతున్ దశకంఠదైత్యహరునిన్ సేవింతు సీతాపతీ!                  87.

 

శ్రీకంఠోగ్రశరాసనంబు మిథిలన్ శ్రీరామ! వైదేహికై

లోకం బచ్చెరువంద ద్రుంచి త్రిజగచ్ఛ్లోకా! ధరాపుత్రియౌ

నాకల్యాణిని జేతబట్టిన నినున్ హర్షోన్నతున్ మ్రొక్కెదన్

శ్రీకారుణ్యపయోనిధీ! నిలుపుమా క్షేమంబు సీతాపతీ!                   88.

 

ధర్మాత్ముండవు గాన తండ్రి వరమున్ దన్వంగి యందంగ నా

ధర్మంబౌను సమాదరింప ననుచున్ దద్రాజభోగంబులన్

మర్మం బెంచక వీడి కానలకునై మన్నించి భూజాతతో

గూర్మిన్ జేరిన నిన్ను గొల్తును మహత్కోదండ!సీతాపతీ!               89.

 

నీదే రాజ్యము స్వీకరింపు మనుచున్ నీభ్రాత కైకాత్మజుం

డోదేవా! భరతుండు గోరగ వ్రతం బొప్పారగా దెల్పి స

మ్మోదం బందగ పాదరక్ష లిడుచున్ బోజూపి చిత్తంబునన్

ఖేదం బొందగనీక గాచిన నినున్ గీర్తింతు సీతాపతీ!                      90.

 

నానాదైత్యగణంబులన్ దునుముచున్ నవ్యానురాగమ్ముతో

మౌనీంద్రాళిని జేరి సర్వగతులన్ మర్యాదతో గొల్చుచున్

జ్ఞానాద్యద్భుతశక్తులన్ గొనుచు సన్మానంబులన్ గాంచుచున్

కానల్ గాచిన నీకు సత్ప్రణతులన్ గావింతు సీతాపతీ!                  91.

 

ఆడన్ దండక నామకాటవిని యోగ్యంబంచు భావించుచున్

వేడన్ జానకి పైడిజింకను గొనన్ వేగంబుగా నేగు నిన్

జూడన్ స్పష్టము గాదె సీత యెడలన్ శుద్ధానురాగమ్ము నీ

కేడన్ దుల్యుడు లేడు దండములయా యిచ్చోట సీతాపతీ! 92.

 

 

మాయన్ హేమమృగంబు తానయిన య మ్మారీచునిన్ దైత్యునిన్

హేయంబైన తదీయ దుష్కృతికినై హీనాంతముం జూడగా

జేయన్ దీవ్రశరాహతిన్ దునుము హే శ్రీరామ! నీశక్తికిన్

"జే"యంచున్ బ్రణుతింతు నిల్పు మిచటన్ క్షేమంబు సీతాపతీ!       93.

 

క్రూరాత్ముండు దశాననుం డవనిజన్ గొంపోవ మాయావియై

ఘోరారణ్యములన్, గుహాంతరములన్, గోత్రాదులన్ జూచుచున్

జేరన్ వచ్చిన సూర్యనందనునకున్ శీఘ్రంబు సన్మిత్రతా

సారంబున్ జవిజూపు నీకిదె నమస్కారమ్ము సీతాపతీ!                  94.

 

వాలిం జంపి, వనేచరప్రకరమున్ బాలించ సుగ్రీవునిన్

జాలం బేల యటంచు నిల్పి, కపిరాజ్యంబందు సంతోషముల్

వాలాయంబు టింపజేసిన నినున్ భావంబునన్ నిల్పి యే

కాలంబున్ స్తుతియించుచుండెదనయా! కైమోడ్పు సీతాపతీ!          95.

 

పారావారము దాటి దైత్యపురిలో బహ్వార్తయై యావనిన్

దోరంబైన భయంబునన్ మునిగి నాథున్ దల్చు వైదేహినిన్

జేరంబోయి శుభంబు దెల్పి దనుజశ్రీ నేర్చి నిన్ దెల్పు సా

మీరిన్ మెచ్చిన నీకు జేసెద నతుల్ మేలంచు సీతాపతీ!                  96.

 

లంకన్ జేరగ గోరు వేళ నచటన్ లక్ష్యంబునన్ వార్ధి యా

టంకంబై గనిపించ దానిపయినన్ డంబంబునుం మాపగా

జంకొక్కింతయు లేని వానరులతో సమ్యగ్విధిన్ సేతు వా

వంకన్ నిల్పగ జేయు నిన్ను సతమున్ బ్రార్థింతు సీతాపతీ!           97.

 

సౌమిత్ర్యంగదవాయుపుత్రు లలఘుల్ సాయంబుగా నిల్వ నా

భూమీజాతను గాసిపెట్టిన ఖలున్ పూర్ణాపరాధిన్ మహ

త్కామాసక్తుని రావణాసురుని రౌద్రంబొప్పగా గూల్చి యీ

భూమిన్ ధర్మము నిల్పియుండిన నినున్ బూజింతు సీతాపతీ!        98.

 

 

 

సీతాన్వేషణమందు, సంగరమునన్ జేయూతయై నిల్చి నీ

చేతంబున్ గెలువంగ జాలిన హితశ్రీమంతమౌ వానర

వ్రాతంబున్ బలుమారు మెచ్చిన నినున్ భవ్యానురాగాఢ్యునిన్

నాతండ్రీ! దయజూపుమా కొలిచెదన్ నాపైని సీతాపతీ!                  99.

 

దైత్యస్వామి!విభీషణా! ప్రజనిటన్ ధర్మానురక్తుండవై

యత్యంతాదరభావసంయుతుడవై హర్షాతిరేకమ్ముతో

నిత్యోత్సాహముజూపి కావు మనుచున్ నేతృత్వపీఠంబునన్

సత్యాకార! మనంగ నిల్పవె నమస్కారమ్ము సీతాపతీ!                100.

 

వైదేహిం గొని దైత్యనాశనలసద్భవ్యాధ్వరాన్తమ్మునన్

మోదం బందగజేయ కోసలమునన్ బ్రోవంగ దేశప్రజన్

శ్రీదా! చేరి యయోధ్యకున్ జననులన్ సేవించు హేరావా!

నీదాక్షిణ్యము కోరుకొందును ప్రభూ! నిత్యమ్ము సీతాపతీ!             101.

 

పౌరానీకము స్వీయసంతతి గతిన్ బ్రహ్మాండ సౌఖ్యంబు ల

వ్వారిన్ క్షేమము జేరజూడగలుగున్ భాగ్యంబదే యంచు స

ర్వారాధ్యత్వమునంది పాలకునిగా ప్రహ్లాదముంగూర్చు నీ

కేరీ తుల్యులు మూడుకాలములలో నెందేని సీతాపతీ!                   102.

 

ఆర్యుల్ మెచ్చెడిరీతి జీవనమునం దత్యుత్తమంబౌ గతిన్

మర్యాదన్ బ్రకటించు నిన్ను గన డీ మందుం డహంకారియై

దుర్యత్నంబున దల్లిదండ్రుల నిలన్ దుఃఖాబ్ధికిన్ ద్రోయు దు

శ్చర్యల్ సేయును మానవుండు  కను మీచందంబు సీతాపతీ!          103.

 

నీచారిత్ర ముదాత్త మన్నిగతులన్ నీరూప మానందదం

బోచాతుర్యమృదూక్తిశోభిత!వరీయోదార! నీచేష్టలున్

బ్రాచీనాద్యతనావనీజుల కిటన్ భాగ్యంబు చేకూర్చు సం

కోచంబించుక లేదు కావుమని నిన్ గొల్వంగ సీతాపతీ!                  104.

 

 

 

నిన్ను న్గొల్చుచు నీపదాబ్జములపై నిత్యాభిషేకమ్ములన్

నన్నోరావ! కావుమంచు సలుపన్ నాపాప కార్యంబు లిం

దెన్నం జూచుచు దూరమేగుమన నే నెచ్చోటకున్  బోదునో

మన్నించం దగు గొల్చుచుండెదను నీమంబొప్ప సీతాపతీ!           105.

 

నీకున్ మ్రొక్కెద రామచంద్ర! సుఖముల్ నిత్యమ్ము ప్రేమమ్మునన్

బ్రాకం జేయుము రక్షకుండ వగుటన్ బ్రాణాంతకంబై ప్రజా

నీకంబున్ బరిమార్చు రుగ్మత నిటన్వేధించ బోనీక యీ

లోకంబందున క్షేమదీప్తికొర కాలోకించు సీతాపతీ!                       106.

 

నీదాస్యంబును జేయుచుండిన నిటన్ నిత్యోత్సవానీకముల్

మోదంబుల్ లభియించినన్, గడిదియే ముఖ్యంబుగా గల్గినన్

ఖేదంబందిన నేమియైన నదియే కీర్తి ప్రసారంబుగా

నేదంపూర్వ విభూతిగా దలచెదన్ నిక్కమ్ము సీతాపతీ!                  107.

 

ధన్యుండన్ భవదీయసచ్చరితమున్ త్వన్నామ సంకీర్తనం

బన్యంబున్ గొనకుండ పద్యశతమం దత్యుత్సవం బట్టు లో

మాన్యా! పల్కగ జేసినావు నసమ్మానమ్ము నాకయ్యె నీ

కన్యంబీయగ శక్తి లేదు నతులి ప్డర్పింతు సీతాపతీ!                      108.

 

జేజే రామమహీపతీ! కలుషహా! జేజే జగన్నాయకా!

జేజే దాశరథీ!దురాత్మగణ దుశ్శీలాసురాళ్యంతకా!

జేజే పావననామ! సాధుచరితా!జేజే కృపాసాగరా!

జేజే భక్తజనావనా! రఘువరా! జేజేలు సీతాపతీ!                           109.

 

 

 

 

 

 

 

అష్టార చక్ర బంధము

రామా!  నీ దయ జూపి నన్ను సతమున్ రక్షించగా గోరెదన్

క్షేమంబుల్ గలిగించి పాపసమితిన్ క్షీణింపగా  జేసి నీ

నామంబున్ స్మరియించ నాకసదృశానందంబు నందించి యీ

భూమిన్  సద్యశ మంద జూపు  సదయా! భోదేవ!  సీతాపతీ!         110.





*******

 


 

No comments:

Post a Comment