Friday 2 October 2020

నాన్న

 

నాన్న

శా.

నారూపంబున దన్ను గాంచు కొరకై నా కీస్వరూపం బిటన్

ధీరోదాత్తు డొసంగె నా జనకు డా తేజోమయున్ ధీనిధిన్

గారుణ్యాత్ముని బుత్రవత్సలుని  సత్కారార్హునిన్  సద్గుణున్

బౌరోహిత్యమహత్వశోభితు నిటన్ బూజింతు  నెల్లప్పుడున్.                    1.

శా.

వ్రేలందించి ధరిత్రిపై నడచుటన్ బ్రేమప్రపూర్ణాత్ముడై

వాలాయం బెరుగంగ జూపి చదువుల్ ప్రజ్ఞానసంసిద్ధికై

మేలైనట్టి విధాన నేర్వదగు బల్మిన్ నింపి స్వాంతమ్మునన్

నాలోనున్న జడత్వ మెప్డణచు మా నాన్నన్ బ్రశంసించెదన్.                   2.

మ.

తనయుల్ పుత్రిక లెల్లరున్ సుఖములన్ దారంద యోగ్యమ్ములౌ

నసన్మార్గములన్ వచించె శుభసత్కార్యమ్ములన్ నిత్య జీ

వనయానంబున జేయగా దెలుపుచున్ భాగ్యోదయార్హంబులై

వినుతిం గూర్చెడి పద్ధతుల్ గరపె నా విజ్ఞున్ సదా కొల్చెదన్.                    3.

మ.

నను నీరీతిని భవ్యబోధనలచే నైజప్రభావమ్ముతో

దెనుగున్ సుందరభాషనున్ జదువగా ధీశక్తి నందించి నా

కనునిత్యోరుముదంబు లందగల భాగ్యంబందు సామర్ధ్యమున్

నవాత్సల్యముతోడ జూపు జనకున్ గైమోడ్చి యర్చించెదన్.               4.

మ.

తనసంతోషము నిచ్ఛసేయకయె  సంతానంబె యానంద జీ

వనసౌఖ్యంబులు గాంచ దా ననిశమున్ వాంఛించి తత్కార్యమం

దనఘాత్ముండయి సంచరించి సురలోకావాసముం గాంచు నా

జనకున్ జిత్తములో స్మరించెదను సచ్చారిత్రసంపద్యుతున్.                    5.

 

హ.వేం.స.నా.మూర్తి

22.9.20.

No comments:

Post a Comment